Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 32


    మొదట్లో అందరిలాగే ఈ ఆనందరావు అనేవాడిని ఎలా శంకరగిరి మాన్యాలు పట్టించాలా అని ఆలోచించాన్నేను. కాని నా కూతురు నాకన్నా రెండాకులు ఎక్కువ చదివింది. నేను ఆనందరావుని ఏదైనా చేసేలోపులో వెళ్ళి గోదాట్లో దూకి, నా కన్నా తన ప్రేమని ఊళ్ళో వాళ్ళందరికీ చాటింపేసింది. తెల్లారేసరికల్లా ఊరంతా ఈ విషయం భగ్గున తెలిసిపోయిందని నాకు తెలుసు. నా ముందు ఎవరూ మాట్లాడ్డానికి సాహసించలేక పోయినా-ఇప్పుడు ఆనందరావుకు ఎదిఅనా జరుగుతే అది నావల్లే అనుకుంటారు. ఇన్నాళ్ళు నేను కూడబెట్టిన ప్రిస్టేజంతా గోదాట్లో కలిసిపోతుంది.
    
    అమ్మ తరళమ్మ తల్లీ! నా కూతురివి అనిపించావు కదే- అనుకున్నాను. పైకి తేల్లేదు. అయినా తప్పు తరళది కాదు.
    
    వయసొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మధ్యాహ్నంపూట అదెక్కడికి వెళ్తూందో తెలుసుకోకపోవటం దాని తల్లి తప్పు. పట్నంలో అయితే ప్రయివేటు ప్లేసులుంటాయి. మా వూళ్ళో గోదారొడ్డే వీళ్ళకి ప్రయివేటు ప్లేసయిందని నాకు తరువాత తెలిసింది. వీళ్ళిద్దరి పక్కనా ప్రమద్వర అని ఇంకో అమ్మాయుందట. ప్రేమ పానకంలో ఈ అమ్మాయిని నా కూతురు పుడకలా వాడుకున్నదన్న మాట.
    
    ఈ ఆనందరావు అనే కుర్రాడిని చూడటానికి వెళ్ళాను. అందరు కుర్రాళ్ళల్లాగ "అవును మా ప్రేమ అచంచలమైంది. మేం లైలా మజ్నూలం" అని అనలేదు. మరికొంతమంది లాగా తలొంచుకుని "క్షమించండి, తప్పైపోయింది" అని వణికిపోలేదు. "మీ అమ్మాయి పొరపాటు పడుతూంది. తనమీద నాకు అటువంటి భావం ఏమీలేదు" అన్నాడు.
    
    నాకు మతిపోయింది.
    
    "నా కూతురూ నువ్వూ ప్రేమించుకోలేదా?" అన్నాను.
    
    "లేదు మేము మామూలు స్నేహితుల్లా కలుసుకునేవాళ్ళం. తనెప్పుడూ నా దగ్గిర ఈ ప్రసక్తి తీసుకురాలేదు" అన్నాడు. అతడు అబద్దం చెప్పటంలేదని తెలుస్తూనే వుంది.
    
    నాకు గర్వంగా అనిపించింది. నా కూతురు అందర్లాంటిది కాదు. తన ఇష్టాల సంగతి ఇంట్లో పెద్దలకే చెప్పాలన్న ఇంగితజ్ఞానం వున్నది. అప్పుడు చూశాను అతడిని పరిశీలనగా!
    
    అందంగానే వున్నాడు. కళ్ళల్లో అదోలాటి పట్టుదల కనపడుతూంది. దాన్నేమనాలి? పొగరు అనాలా? నాకు సరదాగా అతడితో ఆడుకోవాలనిపించింది. టెంప్ట్ చెయ్యాలని పించింది. "మరి నా కూతురిమీద నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాను.
    
    అతడు తలవంచుకుని సనుగుతాడనుకున్నాను. కానీ అటువంటిదేమీ చేయక, "మంచి అమ్మాయే, కానీ పొగరెక్కువ" అన్నాడు. నాకు వళ్ళు మండిపోయింది. "అది పొగరుకాదు, ఆత్మస్థయిర్యం" అన్నాను.
    
    "రెండిటికీ పెద్ద తేడాలేదు. తన మీద తనకి నమ్మకం అనేది వ్యక్తిత్వం వల్ల వస్తే దాన్ని ఆత్మస్థయిర్యం అంటారు. డబ్బువల్ల వస్తే దాన్ని 'పొగరు' అంటారు".
    
    లాగి పెట్టి కొట్టినట్టయింది. ఈ కుర్ర వాడెవడో తెలుగు బాగా చదువుకున్నట్లున్నాడు. కోతిని పట్టే థియరీ నాది. నవ్వి "నేనిప్పుడు ఎందుకు వచ్చాననుకున్నావ్?" అన్నాను.
    
    "డబ్బున్న ఆడపిల్ల తండ్రి ఎందుకొస్తాడు? నా కూతుర్ని మర్చిపో లేకపోతే కష్టాల్లో ఇరుక్కుంటావ్ అని హెచ్చరించటానికి వచ్చివుంటారు". కోతి కొండ ఎక్కుతోంది. ఎక్కేకొద్దీ పైర్పోయే ఛాన్సు తక్కువని పాపం దానికి తెలీదు. నాకు ముచ్చటేసింది. నవ్వుతూ అన్నాను-
    
    "అదేంకాదు నా కూతురు అడిగిందెప్పుడూ కాదన్లేదు నేను ఇప్పుడు కూడా అది అడుగుదామనే వచ్చాను" అన్నాను ఓరగా అతడిని చూస్తూ. ..."చెప్పు, నా కూతుర్ని చేసుకుంటావా?"
    
    ఎగిరిగంతేసే ప్రయత్నమేమీ చెయ్యలేదు అతడు. 'సారీ' అన్నాడు క్లుప్తంగా ఇంతటి అవమనం నేనెప్పుడూ పొందలేదు. ఇంకెవర్నయినా ఆ పరిస్థితిలో అయితే అంతకు అంతా ప్రతీకారం తీర్చుకునేవాడినే కానీ అతడిని నిర్మొహమాటత్వం (బహుశ అది నాకూతుర్ని రక్షిస్తూంది కాబట్టి) నాకు నచ్చింది. డబ్బుని వద్దనే వాళ్ళు, అరటిపండుని వద్దనే కోతులూ చాలా తక్కువ వుంటాయి. కోతిని కొండమీదనుంచి దింపే ప్రయత్నమేమీ చెయ్యకుండా వచ్చేశాను.
    
    తరళ నా కోసం ఎదురుచూస్తూంది. ఆనందరావు అన్న మాటలు దానితో చెపితే గుండె ఆగిపోతుంది. అవతలి కుర్రాడు తనని ప్రేమిస్తున్నాడా లేదా అనికూడా తెలుసుకోకుండా తండ్రిని రాయబారానికి పంపించేటంత అమాయకురాలు నా కూతురు ఆనంద్ ఏమన్నాడో చెపితే భరించలేదు. ఈ టాపిక్ వాళ్ళమధ్య ఎలాగూ వస్తుందని నాకు తెలుసు. ఆనంద్ తనని ప్ర్రేమించటం లేదన్న సంగతి నేనెందుకు చెప్పటం? అతనే చెప్పనీ-
    
    నేను వూహించినట్టే ఆనంద్ తరళకి ఆ విషయం చెప్పినట్టున్నాడు. అయితే ఆ తరువాత నేను వూహించని విషయం జరిగింది.
    
    తరళ గోదాట్లో దూకింది. నా పరువు పోయింది.
    
    చాలా చిన్న విషయం అనుకున్నది చూస్తూవుండగా పెద్దదయింది. ఇప్పుడు ఆనంద్ గానీ నా కూతుర్ని చేసుకోనంటే-సరదాగా తీసుకొచ్చిన ఏనుగు తోటంతా తొక్కినంత పని అవుతుంది.
    
    ఆనంద్ నాకల్లుడవటం నాకేమీ అభ్యంతరంలేదు. తరళని చేసుకునే వాడెవడైనా నా ఆస్తి చూసే వస్తాడని నాకు తెలుసు. అటువంటిది డబ్బు అంటే అసలు లక్ష్యంలేని ఆనంద్ లాటివాడు అల్లుడైతె అభ్యంతరం ఏముంటుంది-ఇది మొదటి కారణం! నా కూతురు ప్రేమించింది- అది రెండో కారణం!! అన్నిటికన్నా ముఖ్యమైన మూడో కారణం ఇంకొకటుంది-
    
    ఆనంద్ లాంటి బీదవాడికి కూతుర్నిచ్చి చేయటం-
    
    ఈ వివాహం జరగ్గానే, పల్లెలో నా కీర్తి వాడవాడలా పెరిగి పోతుంది!!!
    
    కీర్తికోసం నేనేమైనా చేస్తానని మీకు తెలుసు. అలాగే కూతురికోసం కూడా! అయితే వెంటనే నేను ఆనంద్ దగ్గిరకి  మళ్ళీ వెళ్ళలేదు. ఈ కుర్రవాడి పొగరు విషయం మొదటే అనుభవముంది. ఇప్పుడే వెళ్తే చెట్టెక్కి కూర్చుంటాడు. అతడినే నా దగ్గిరకి రప్పించాలి.
    
    వచ్చాక- కాబోయే మామగారు కూడా తనంత తెలివైనవాడే అన్న విషయం ఆ కుర్రవాడికి తెలియాలి ఎలా?
    
    నేనీ విధంగా ఆలోచిస్తూ వుండగా-    

 

    అదే సమయానికి ఆనంద్ ఏదో రొమ్ముల్లో నొప్పితో ఆస్పత్రికొచ్చినట్టు తెలిసింది. అప్పుడే నాకో ఆల్కహన స్ఫురించింది.
    
    చిన్న చిలిపి ఆలోచన-
    
    డాక్టర్ మావాడే నేనేం చెప్పమంటే అది చెపుతాడు.
    
    "ఆనంద్ ఆస్పత్రికి ఎందుకొచ్చాడు?"
    
    "ఏదో నొప్పి అని వచ్చాడు" జవాబు ఇచ్చాడు డాక్టరు.
    
    "ఏం చెప్పావ్?" తనేం చెప్పాడో డాక్టరు చెప్పాడు. తనేం చెప్పాలో నేను చెప్పింది విని తెల్లమొహం వేశాడు. తరువాత ఇబ్బందిగా నవ్వేడు. నవ్వకేం చేస్తాడు?

 Previous Page Next Page