Previous Page Next Page 
అంకితం పేజి 33


    సరిగ్గా అప్పుడే ఫోన్ మ్రోగింది. అవతల చెప్పేది విని, నాకందిస్తూ అన్నాడు జాన్- "సుమ ....."

    ఆత్రుతగా అందుకున్నాను.

    "హలో....."

    "నేనండీ సుమని మాట్లాడుతున్నాను"

    "సుమా!" నాకెంత సంతోషం కలిగిందంటే, ఉప్నెనలో కొట్టుకుపోయేవాడికి ఏదో ఆధారం దొరికినపుడు కలిగే ఆనందం.

    "అవును! నేనే మాట్లాడుతున్నాను. మీరు చేసిన రెండు ప్రయత్నాలూ ఫెయిలయ్యాయి కదూ-"

    "అవును! కానీ ఇందతా నీకెలా తెలిసింది?"

    ఆమె చిన్నగా నవ్వింది. "మనసుంటే మార్గముంటుంది. కన్నబిడ్డ ఎక్కడున్నా సుఖంగా వుండాలని ప్రతి కోరుకుంటుంది. అందుకు నేనేమీ అతీతురాలీని కాదు."

    నిజమే! ఒక జైలులాంటి ఇంటి గదిలో బంధింపబడిన ఆమెలో మాతృత్వపు మమకారం ఎలా దూరమవుతుంది?

    "కానీ ఇక్కడి విషయం నీకెలా తెలిసింది? కృపానంద్ చెప్పాడా" ఆశ్చర్యంగా అడిగాను.

    "కాదు, కృపానంద్ తండ్రి చెప్పాడు."

    "ఆయనెవరు? మేమాయనాకెలా తెలుసు?" మరింత ఆశ్చర్యపోతూ అడిగాను.

    "ఆయన్ని మీరు రోజూ చూస్తూనే వుంటారు. డాక్టర్ మహారధి ఎవరోకాదు- కృపానంద్ తండ్రే."

    "వ్వాట్?" నేనెంత దిగ్భ్రమకి లోనయ్యానంటే అసలు నమ్మలేకపోయాను. ప్రపంచం ఎంత చిన్నది?

    "అవును! ఆ విషయం ఈ రోజే ఆయనకీ తెలిసిందట. కృపానంద్ తో ఎప్పటినుంచో మాటలు లేవాయనకి. కోర్టులో సాక్ష్యం చెప్పటానికి వచ్చాడనీ, దొరికిన అవకాశాన్ని చేజేతులా నాశనం చేశాడనీ చెప్పారు. అంకిత్ తన మనవడని తెలిసాక ఆయన ఎంత సంబరపడ్డారో, వాడి పరిస్థితి గుర్తుచేసుకుని అంతగా బాధపడ్డారు."

    "నేను నమ్మలేకపోతున్నాను."

    "కొన్ని కొన్ని నిజాలంతే! నమ్మలేము.  ఈ ప్రపంచం ఒక సాలీడు అల్లిన పెద్ద గూడులాంటిది. ఒకదారి మరోదారి నంటుకుని వున్నట్టు, బంధుత్వాలు కూడా ప్రారంభమైన చోటునుండీ అంతమయ్యేంతవరకూ కలిసిపోయే వుంటాయి. ఆయన నాకు ఫోన్ చేశారు. నన్నే ఏదయినా దారి చూడమని కూడా చెప్పారు."

    ఇన్నాళ్ళూ డాక్టర్ మహారధి ప్రయత్నాలపట్ల నా కేర్పడిన నిర్లిప్త భావమేదయితే వున్నదో అది ఆ క్షణాన దూరమైంది. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అందులో తన మనవడన్న స్వార్థంతో ఆయన ఆలోచించి వుండొచ్చు. కానీ ఆయన అనుకున్నంత మాత్రాన అంకిత్ అతని వాడయిపొడుగా?

    "ఏం చేద్దామనుకుంటున్నారు?" ఆమె ప్రశ్నతో స్పృహలోకి వచ్చాను.

    "ఏ దారీ లేదు" నిరాశగా అన్నాను.

    "అలా అనుకుంటే ఎలా? మరో దారి కూడా వుంది."

    "ఏంటది? ఠక్కున వచ్చిందా ప్రశ్న నా నోటినుండి.

    "మీరు వెంటనే  మిగతా ఏర్పాట్లు చూసుకోండి! అంకిత్ కిడ్నీ విషయం డాక్టర్ మహారాదికి వదిలెయ్యండి! ఫోన్ పెట్టేయండి".

    "నాకేమీ అర్థంకావటం లేదు....."

    "ఇంకొద్ది నిమిషాల్లో మీకు డాక్టర్ మహారధి ఫోన్ చేస్తారు....." క్లుప్తంగా అంది.

    ఇక ఆ విషయం రెట్టించటం ఇష్టంలేక ....... "ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు! కృపానంద్ నిన్ను బంధించి, ఫోన్ కట్ చేసాడు కదా- మరి ఈ ఫోన్ ఎక్కడ్నించి చేస్తున్నావు?" అనడిగాను.

    "సెల్యూలర్ కొన్నాను. అతడికి తెలీదు...... ఈ ప్రపంచంలో అతడొక్కడే తెలివయినవాడు కాదు...." అంటూ ఆఫ్ చేసింది. మొట్టమొదటిసారి నాకు అనిపించింది.......

    ఈ యుద్ధంలో నేను గెలవగలనని!

   
                         *    *    *

    "అవును! ఈ ఉదయమే తను ఫోన్ చేసి మాట్లాడింది. మనమిక త్వరపడక తప్పదు! ఆపరేషన్ కి మనం నిర్ణయించుకున్న గడుపు ఇంకా ఎనిమిదిరోజులే వుంది. అంతకుమించి మనం ఆలస్యం చేయకూడదు. ఇప్పటికే అంకిత్ పరిస్థితి మన చేయి దాటిపోయింది" అట్నుంచి డాక్టర్ మహారధి అన్నాడు.

    "నిజమే! కానీ మన చేతుల్లో ఏమీలేదు".

    "అలా చేతులెత్తేస్తే ప్రయోజనం లేదు".

    "ఏం చేద్దామంటారు?" నిరాసక్తంగా అడిగాను.

    "నేను హైద్రాబాద్ కి వస్తున్నాను రేపే ....."

    విస్మయంగా "వ్వాట్?" అన్నాను.

    "అవును! సుమ నాకో ప్లాన్ చెప్పింది. ఇక అది దాదాపు ఫెయిల్ అవదనే అనుకుంటున్నాను" మహారధి చెప్పాడు.

    "ఏం చెప్పింది?" ఆత్రుతగా అడిగాను.

    "శ్వేతని కిడ్నాప్ చేయటం."

    "వ్వాట్?" ఉలిక్కిపడ్డాను. "..........మరోసారి కిడ్నాప్ ప్రయత్నమా? అది సాధ్యమయ్యేదేనా?" ఉద్వేగంగా అన్నాను.

    "అవ్వాలి. ఎందుకంటే ఈసారి మీరు కాక తాతయ్యే కిడ్నాప్ చేస్తాడు కనక" నమ్మకంగా అన్నాడతను.

    "ఈ విషయంలో సుమ పాత్ర ఎంతవరకు?" అన్నాను.

    "ఇందులో తను కల్పించుకోదు."

    "మరెలా?"

    "కృపానంద్ ని దువ్వుతాను" నెమ్మదిగా చెప్పాడు.

    నమ్మలేనట్టు "ఎలా?" అన్నాను.

    "అవును! ఇంతకన్నా మరో మార్గంలేదు. అంకిత్ బ్రతకటం ముఖ్యం నా పట్టుదల కాదు. నేనెలాగూ ముసలి వాడినయిపోయాను. ఆ చిన్న కుర్రాడి బ్రతుకు మొగ్గలా రాలిపోకుండా ఆపటం కన్నా కావలసిందేముంది?"

    "కానీ కృపానంద్ అంగీకరించడు."

    "వాడికి చెబితే కదా అంగీకరించటానికీ! చాలా రోజుల తర్వాత కొడుకునీ కోడలనీ చూసుకోవాలని వచ్చానని చెబుతాను. కనీసం నా కోసం కాకపోయినా నా ద్వారా సంక్రమించబోయే ఆస్థికోసమైనా తిరిగి మాట్లాడుతాడు. నా మనవరాల్ని చూసుకోవాలని వుందని చెబుతాను. శ్వేత నా చేతుల్లోకి వచ్చిందంటే.... ఇక తరువాత కథ నడిపించవలసిన వాడివి నువ్వే. నేను ఏమీ తెలీనట్టుండి పోతాను."

    "థాంక్స్ డాక్టర్-"

    "నో. సే అంకుల్!" నవ్వాడు డాక్టర్ మహారధి.

   
                        *    *    *

    నేను కూడా జాన్ ఇంటినుంచి ఒక చిన్న హొటల్ కి మారిపోయాను.

    ఎందుకంటే జాన్ ఇల్లు కృపానంద్ కి తెలుసు. శ్వేతని కిడ్నాప్  చేసామన్న విషయం అర్థంకాగానే ముందతను అక్కడికే వస్తాడు.

    ఇదంతా ఆలోచించే నేనూ మహారధి ఆ హొటల్లో దిగాల్సి వచ్చింది. జాన్  మాతో వచ్చాడు. మహారధి తన కొడుకు దగ్గరికి బయలుదేరాడు.

    మహారధి వెళ్ళింతర్వాత మేమిద్దరం కూర్చుని చాలాసేపు చర్చించుకున్నాం. "మహారధి తీసుకురాగానే, నేను వెంటనే ఆ పాపని తీసుకుని ట్రైన్ ఎక్కేస్తాను. నువ్వు మాత్రం మీ యింట్లోనే ఫోన్ దగ్గర వుండు కృపానంద్ ప్రతీ కదలిక సుమమనకి ఫోన్ ద్వారా తెలియజేస్తూంటుంది" అన్నాను.

    "మరి మహారధి వైజాగ్ ఎప్పుడు వస్తాడు? ఆపరేషన్ అదీ ఎప్పుడు చేస్తాడు?"

    "నేను ఉదయానికల్లా అక్కడికి చేరుకుంటాను. అతను రాత్రి వుండి, ఎర్లీమార్నింగ్ ప్లైట్ లో వస్తాడు. ఇద్దరం ఒకే సమయానికి హాస్పిటల్ కి చేరుకుంటాం. తర్వాత ఆపరేషన్ జరుగుతుంది."

    "ఒకవేళ కృపానంద్ మనమీద కేసు పెడితే?"

    "ఆ విషయంలో సుమ మనకి సహాయం చేస్తుంది. తన పర్మిషన్ తోనే ఈ ట్రాన్స్ ప్లాంట్ జరిగిందని సాక్ష్యం చెబుతుంది."

    "అంతా బాగానే వుంది. కానీ సుమ కిడ్నీ ఇవ్వకూడదని కోర్టు తీర్పునిచ్చిందిగా? ఇప్పుడు ఈ శ్వేత చిన్నపిల్ల. ఆ పాపని కిడ్నాప్ చేసి కిడ్నీ తీసుకున్నామంటే - అదీ మెంటల్ పేషెంట్ నుండి తీసుకున్నమంటే కేసు దారుణంగా వుంటుందేమో ఆలోచించావా?"

    నేను గట్టిగా నిశ్వసించి అన్నాను. "అన్నీ ఆలోచించాను. ఫోనీ అది తప్పని ఒకవేళ కోర్టు తీర్పునిస్తే సంతోషంగా జైలుకు వెళతాను. అంకిత్ బ్రతకటం ముఖ్యం. కానీ అలా జరగదనే అనుకుంటున్నాను. శ్వేత అంకిత్  చెల్లెలే కదా? అదీగాక స్వయంగా ఆ పిల్లల్ని కన్నతల్లే ఒప్పుకుంది. మరో విషయం..... ఆమె ముందే లాయర్ ని సంప్రదించి కృపానంద్  నుండి విడాకులు తీసుకోబోతుంది. అప్పుడు ఆ బిడ్డపట్ల సర్వహక్కులూ మేజర్ అయ్యేవరకూ ఆమెకే వుంటాయి."

    "సరే, అయితే నేను వెళతాను. అక్కడికీ సుమ ఫోన్ చేస్తుందేమో!"

    "ఆమె ఏం చెబుతుందో అది వెంటనే నాకు నువ్వు తెలియపరుస్తూ వుండు" చెప్పాను.

    "అలాగే" అని వెళ్ళిపోయాడు.

    నేనొక్కడినే మిగిలిపోయాను. ఏం చేయాలో పాలుపోని స్థితి. టెన్షన్ బాగా పెరగసాగింది. అంతా సవ్యంగా జరగాలని మనసులోనే భగవంతుడ్ని ప్రార్థించసాగాను.

    దాదాపు నాలుగ్గంటల తరువాత నా గదిలో ఫోన్ మ్రోగింది. ఆత్రుతగా రిసీవర్ ఎత్తి "హలో" అన్నాను.

    "నేను సుమని మాట్లాడుతున్నాను."

    "ఈ నంబర్ నీకెలా తెలుసు?"

    "జాన్ చెప్పారు."

    "మహారధి వచ్చారా?"

    "వచ్చారు. దాదాపు కిడ్నాప్ లో మొదటిభాగం పూర్తయిపోయినట్టే...."

    "అంటే కృపానంద్ తన తండ్రితో సుముఖంగా ఉన్నట్లేనా?"

    "ఆఁ! ఉండకేం చేస్తాడు. ఆయన వెనక చాలా ఆస్థి వుంది కదా?"

    "అయితే ఇద్దరూ శ్వేతని చూడటానికి వెళ్ళారా?"

    "అవును. ఇందాకే వెళ్ళారు. వెళ్ళేముందు మహారధిగారు చెప్పారు. శ్వేతని ఇంటికి తీసుకు వచ్చాక, కొడుకుని నమ్మించి బయటికి తీసుకువెళతాననీ, తరువాత మీ కప్పగిస్తాననీ అన్నాడు."

    "ఒక పని చెయ్. ఆయన వచ్చేముందు శ్వేత కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ నీ అంగీకారం ప్రకారమే జరిగిందని ఒక పత్రంమీద వ్రాసి సంతకం చెయ్. అది ఆయనకిస్తే  శ్వేతతోపాటు తీసుకువస్తాడు."

    "అలాగే. నేను వెంటవెంటనే మీకు ఫోన్ చేస్తాను" ఫోన్ పెట్టేసింది.

    నాకు కొద్దిగా రిలీఫ్ గా  అనిపించింది. ఒక పర్వం ముగిసింది. ఇక అసలైనవి మరో రెండు పర్వాలున్నాయి.

    ఒకటి కిడ్నాప్! రెండోది ట్రాన్స్ ప్లాంట్!!



                          *    *    *

    సాయంత్రం ఆరుగంటలకి వచ్చాడు మహారధి శ్వేతని ఎత్తుకుని.

    పాప చాలా అందంగా వుంది. కానీ ఎక్కడో చూస్తోంది. తనలో తనే నవ్వుకుంటోంది. మనసు చివుక్కుమంది. ఒక పసిపిల్లని యజ్ఞానికి సుమిధలా వాడుకోబోతున్నందుకు.

 Previous Page Next Page