"చూడు ఇందులో నేను ఇన్ వాల్వ్ అయినట్టు అసలు తెలీనివ్వకు. పాపని బయటికి తీసుకువెళ్ళగానే ఎవరో నలుగురు వ్యక్తులు నామీదపడి పాపని లాక్కెళ్ళారని కృపానంద్ కి చెబుతాను. తరువాత ఉదయం ప్లైట్ కి వచ్చేస్తాను. ఆపాటికి నువ్వక్కడ వుండు. రాగానే వెంటనే మొదలు పెడతాను" అన్నాడు మహారధి.
"అలాగే అంకుల్. థాంక్యూ!" కృతజ్ఞతతో నా కళ్ళు మెరుస్తూండగా అన్నాను.
"భేష్!" మా వెనక వినిపించిన కంఠానికి ఉలిక్కిపడి వెనుదిరిగాం. ఎదురుగా కృపానంద్!
గుమ్మం పొడవునా నిలబడి వున్నాడు.
ఒక్కక్షణం నా గుండె ఆగి తిరిగి వేగంగా కొట్టుకోసాగింది.
"భలే నమ్మించాననుకున్నావ్ కదూ ఫాదర్?! నేను కట్టుకున్న పెళ్ళాన్నే నమ్మను. నిన్నెలా నమ్ముతాననుకున్నావ్?"
ఈ లోపులో మహారధి తేరుకున్నాడు. చూడు కృపా.....అక్కడ పోబోయేది నీ కొడుకు ప్రాణమే-"
"ఆపు నీ ఉద్భోధ. వాడు నాకు పుట్టాడన్న గ్యారంటీ ఏమిటి? అయినా వాడిలో నా పోలికలు కొద్దిగానైనా వున్నాయా?"
"అంత దారుణంగా మాట్లాడకు. సుమ చాలా మంచిపిల్ల. అంత మంచి అమ్మాయిని నువ్వలా అనటం సమంజసం కాదు" మందలిస్తున్నట్టు అన్నాడు మహారథి.
"షటప్? అరిచాడు కృపానంద్ ".......నా బిడ్డని కిడ్నాప్ చేశారని, మీ ఇద్దరి మీద కేసు పెడతాను" అంటూ ముందుకు రాబోయాడు శ్వేత నందుకోవటానికి. నేను అప్రయత్నంగా శ్వేతని ఎడంచేత్తో ఎత్తుకున్నాను. సరిగ్గా అప్పుడు జరిగిందది.
చాలా ఫోర్సుగా కదిలాడు మహారధి. కదులుతూన్న కృపానంద్ ని ఒడిసి పట్టుకున్నాడు.
తరువాత నా వైపు తిరిగి గట్టిగా అరిచాడు. "శ్వేత తీసుకుని పారిపో!"
అంతే! ఇక నేనాలస్యం చేయలేదు. లాగి విడిచిన బాణంలా రివ్వున బయటికి పరుగెత్తాను. గబగబా మెట్లుదిగేసి బయటికి చేరుకున్నాను. టాక్సీ స్టాండువేపు పరుగెత్తి ఓ టాక్సీని అందులో కూర్చున్నాను. అతనొక ముస్లిం డ్రైవర్.
"రైల్వేస్టేషన్!" టాక్సీ స్టార్ట్ కాగానే చెప్పాను.
అక్కడ మహారధి పరిస్థితి ఎలా వుందో ఆలోచించలేదు. నా నుదురంతా చెమట పట్టింది.
శ్వేత అమాయకంగా నావైపు చూసి నవ్వుతోంది.
అప్రయత్నంగా ఆ పాపని గుండెలకు హత్తుకున్నాను.
స్టేషన్ ఇంకో కిలోమీటర్ దూరం వుందనగా జరిగింది. మలుపు తిరుగుతూ వేగంగా సిటీ బస్ ఒకటి వచ్చింది. దాన్ని తప్పించుకోవడం కోసం టాక్సీని ప్రక్కకు కోసాడు డ్రైవర్. ఆ వేగంలో ప్రక్కకి తిప్పగానే అది ఫుట్ పాత్ ఎక్కేసి అక్కడున్న గోడకి గుద్దుకుంది.
విసురుగా డోర్ తెరుచుకుని దిగాడు డ్రైవర్. ఆ బస్ డ్రైవర్ కూడా క్రిందికి దిగాడు. ఇద్దరూ వాదులాడుకోసాగారు. అయిదూ ....... పదీ ...... పదిహేను నిమిషాలయింది. తెగేటట్టు లేదు. విసుగ్గా డోర్ తెరుచుకుని ఆటోని పిలిచి ఎక్కాను. స్టేషన్ కి వెళ్ళేసరికి పదిహేను నిమిషాలు అయింది.
గేటు దగ్గరే నా కోసం ఎదురు చూస్తున్నాడు జాన్. నన్ను చూడగానే ఎదురొచ్చేసి. 'రా క్విక్' అంటూ నేను ప్రశ్నించేలోపే నా చెయ్యిపట్టి తన కారువేపు లాక్కెళ్ళాడు. డోర్ తెరిచి దాదాపు నన్నందులో తోసేసి, సీట్లో కూర్చుని వేగంగా బయటికి తీసుకువచ్చాడు.
నాకేమీ అర్థంకాలేదు. అంత సవ్యంగా జరుగుతుందనుకున్న చివరి క్షణంలో ఇలా ప్రవర్తిస్తున్నాడేమిటి?
"ఏమైంది నీకు?" కోపంగా అడిగాను.
"నాకేమీ కాలేదు. నీకే అయ్యేది. కృపానంద్ గురించి చాలా తక్కువ అంచనా వేశాం మనం. అతను వెంటనే పోలీస్ స్టేషన్ లకీ, రైల్వేస్టేషన్ లకీ, బస్ స్టాండ్ లకీ ఇన్ ఫర్ మేషన్ పంపేసాడు. ఎయిర్ పోర్టులో కూడా గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి."
"ఇదంతా నీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాను.
"నువ్వు బయటికి పరుగెత్తగానే మహారధిని బంధించి, ఆయన ముందే అన్ని చోట్లకీ ఫోన్ చేసి చెప్పాడట. ఆ తరువాత తండ్రినక్కడే వదిలి బయటినుండి తాళం వేసుకు వెళ్ళాట్ట. మహారధి ఎలాగో నాకు ఫోన్ చేసి చెప్పాడు. కృపానంద్ కి తెలిసిపోయింది కాబట్టి తనిక్కడ వుండటం వృధా అనీ, వైజాగ్ వెళ్ళి ఆపరేషన్ కి అన్నీ సిద్ధంచేసి రెడీగా వుంటాననీ చెప్పాడు."
"అది సరే, ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళటమెలా?"
"దాని గురించి ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దాం. అంతవరకూ ఓపికపట్టు. ఏమీ ఆలోచించకు."
"కానీ, మీ ఇంట్లో వుంటే మరింత ప్రమాదం కదా?"
"ఏమీ అవదు. వాడిని నేనింట్లోకి రానివ్వను. ఒకవేళ వచ్చినా నువ్వు మా ఇంటి వెనక వున్న దారివెంట ప్రక్కింట్లోకి వెళ్ళిపో".
"సరే!" చిన్నగా నిట్టూర్చి అన్నాను.
* * *
ఇంటికి వెళ్ళేసరికి ఏడుం పావయింది. తలుపు వేసేసి కిటికీలన్నీ మూసి హాల్లో కూర్చున్నాము. దయ పాపని తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు త్రాగిస్తోంది.
నేను లోపలికి వెళ్ళి, బట్టలు మార్చుకుని టవల్ చుట్టుకున్నాను. తరువాత బాత్ రూమ్ లోకి వెళ్ళి షవర్ తిప్పాను.
"స్ స్....." సన్నగా శబ్దం చేస్తూ వాన చినుకుల్లా మొదలై వేగంగా పడసాగాయి నీళ్ళు. తలమీంచి సన్న సన్నగా వంటిమీదికి జారి శరీరాన్నంతా తడపసాగాయి.
పది నిమిషాలు అలాగే వున్నాను. తలలోని భారంతోపాటు టెన్షన్ కూడా తగ్గిపొయిందనుకున్నాక, షవర్ ఆఫ్ చేసి తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చేసరికి ఏడూ ముప్పై అయిదయింది. టి.వి.లో వార్తలు ప్రారంభమై అప్పటికే అయిదు నిముషాలు దాటింది.
"........ఇప్పుడే అందిన వార్త. నాంపల్లికి సమీపంలో ఒక ఆర్టీసి డ్రైవర్ టాక్సీ డ్రైవర్ మీద చేయి చేసుకోవడంతో ముస్లిమ్ మతస్థులు కొందరు కనబడిన ఆర్టీసి బస్సులమీద రాళ్ళు రువ్వటం ప్రారంభించారు. ఫలితంగా ఆ ఏరియాలలో కర్ఫ్యూ విధించబడింది." అంటూ కర్ఫ్యూ విధించిన కొన్నిస్థలాల పేర్లు చెప్పింది.
నేనూ జాన్ మొహమొహాలు చూసుకున్నాం. కర్ఫ్యూ విధించిన స్థలాల్లో జాన్ ఇల్లు వున్న కాలనీ కూడా రావడం అందుకు కారణం.
ఒక భయంకరమైన నిశ్శబ్దం మా ఇద్దరి మధ్యా వ్యాపించింది. దయ కూడా నివ్వెరపోయి చూస్తోంది. చాలాసేపు మేమలాగే వుండిపోయాం.
విష్ణువుని చూడటానికి కొందరు మునులు వైకుంఠానికి వెళ్ళారట. అందరూ ఏడు ద్వారా సులభంగా దాటారట. కానీ ఒక మునీశ్వరుడు మాత్రం ఏడో ద్వారం దాటబోగానే అది మూసుకుపోయిందట. ఆ వైభవాన్ని చూసి చలించినందుకు అతనికి వైకుంఠ ప్రవేశం దొరకలేదట. ద్వారం ఇవతల నిలబడి విచారిస్తున్న ఆ ముని బాధ నాకు తెలుసు. కానీ నా పరిస్థితి మాత్రం అలాగే వుంది. శ్వేత దొరికింది. కానీ, దారే దొరకలేదు!
నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జాన్ అన్నాడు, "నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తోంది."
నేను నిర్లిప్తంగా అన్నాను, "నన్ను చూసుకుంటే నాకూ అలాగే అనిపిస్తుంది."
అరగంట వరకూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళం అలాగే కూర్చున్నాం. శ్వేత ఎప్పుడో నిద్రపోయింది. దయ కూడా మా ఎదురుగా స్వెట్టర్ అల్లుతూ కూర్చుని వుంది.
ఇంట్లోంచి బయటకు రావడానికి లేదు. అప్పటికే కర్ఫ్యూ పెట్టినట్లు జీప్ లో అనౌన్స్ చేస్తూ వెళ్ళారు. బయట ఏ మాత్రం అలికిడి లేదు. ఒక వేళ ఏదో విధంగా బయటపడి స్టేషన్ కి చేరుకున్నా అక్కడ పోలీసుల కాపలా..... కృపానంద్ మాటువేసిన పులిలాంటివాడు. అతన్ని నమ్మడానికి లేదు.
నేను ఆలోచనల్లో వుండగా ఫోన్ మ్రోగింది. ఉలిక్కిపడి రిసీవర్ ఎత్తాను.
"నేను సుమను".
నా గుండెకేదో అడ్డుపడినట్టు మాట రాలేదు. మూసుకుపోయే దార్లన్నీ సుగమం చేస్తున్నా దేవత ఆమె. ఇప్పుడు కూడా ఆమె ఏదో ఒక దారి చూపిస్తుందేమోనన్న ఆశ కలిగింది.
"శ్వేత అందిందిగా?"
"ఆ" ఏమనాలో తెలీలేదు.
"ఎలా వుంది? ఏడుస్తోందా?"
"లేదు. ఇందాకే దయ అన్నం తినిపించి పడుకోబెట్టింది."
"నాకెందుకో భయంగా వుంది. కృపానంద్ చాలా పట్టుదలమీద వున్నాడు. ఎలాగైనా మీ అంతు చూస్తానని వెళ్ళాడు. బహుశ మీ కోసం వెదుకుతూనే వుంటాడేమో? మీరు జాగ్రత్తగా వుండండి."
"నీకు నేను చాలా బుణపడి వున్నాను. మా కింత సహాయం చేస్తున్నా నీకు ప్రత్యుపకారంగా ఏం చేయగలను?" అన్నాను.
"నాకు ఒకే ఒక కోరిక వుంది" అంది.
"ఏమిటది?" ఆత్రుతగా అడిగాను. ఆమె కోరిక ఏదయినా సరే తీర్చాలని ఆ క్షణానే నిర్ణయించుకున్నాను.
"అంకిత్ ని ణా కొక్కసారి చూపించగలరా?"
ఒక్క క్షణం నిశ్శబ్దం తరువాత అన్నాను. "తప్పకుండా."
"మీకు బాధ కలిగిందా?"
"ఛ.....లేదు. నేను నిన్ను అర్థం చేసుకోగలను."
"థాంక్స్" చిన్నగా అంది.
నేను మౌనంగా ఆమె మాటల కోసం అలాగే రిసీవర్ పట్టుకుని కూర్చున్నాను. అటుప్రక్క ఆమె కూడా కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. నేనే చివరికి అన్నాను.
"ఇక్కడ కర్ఫ్యూ వుంది తెలుసా?"
"అవును.టి.వి.లో చెప్పారు. మరి శ్వేతని ఎలా తీసుకు వెళదామను కుంటున్నారు?"
"అదే అర్థం కావటంలేదు."
"ఉదయం వరకూ చూడండీ. అప్పటికీ కర్ఫ్యూ సదలించకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా ఆపరేషన్ కి ఎన్ని రోజులు టైముంది?"
"రెండు రోజులు మాత్రమే."
"చాలు. మనకీ సమయం సరిపోతుంది. మీరు కృపానంద్ కి దొరకకుండా వున్న పక్షంలో."
"అవునూ, కృపానంద్ ఎక్కడికి వెళ్ళుంటాడు? అసలీపాటికి ఈ ఇంటికి వచ్చి వెదికి వుండాల్సింది. అతనింకా రాలేదంటే నాకు ఆశ్చర్యంగా వుంది" అన్నాను.
"నేనూ అదే ఆలోచిస్తున్నాను. అతనేదో భయంకరమైన ఉచ్చు బిగిస్తున్నాడన్న ఆలోచన కలుగుతోంది. మీరూ, జాన్ ఫ్యామిలీ చాలా కేర్ పుల్ గా ఉండాలి. అతను దుర్మార్గుడు, ఏమయినా చేయగలడు."
నేను చిన్నగా నవ్వాను. "ఇతరుల క్షేమం కోసం ఇంతగా పాటు పడే నీకా సుమా ఇన్ని బాధలు?" అన్నాను సానుభూతిగా.
ఆమె మౌనంగా మారిపోయింది. నేను నొచ్చుకుంటూ "గుర్తుచేసి బాధపెట్టానా?" అన్నాను.