"ఎందుకు మేడమ్!" అని అడిగాను.
"మిమ్మల్ని ఒక్కసారి చూసి అనుమతి ఇస్తారు. సంతకం పెట్టలేరని చెప్పాను కదా. అందుకు."
మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాక, థర్డ్ రూమ్ వేపు నడిచాను. అరచేతులు చెమటలు పడుతున్నాయి. ఒక దొంగలాగా వుంది నా పరిస్థితి. ఇంతవరకూ లౌక్యంగానే...... చాటు పనులు చేసి వుండొచ్చు. కానీ మొదటిసారి ఒక తప్పుడు పని చేస్తున్నాను. దానికి శ్వేత తల్లి ప్రోద్భలం వుండవచ్చుగాక అది వేరే విషయం. ఒక చిన్న పాపని బలవంతంగా ఎత్తుకువెళ్ళి శరీరంలోని ఒక అవయవాన్ని తీసుకోవడం ఎంత రాక్షసత్వమో నాకు బాగా తెలుసు.
కర్చీఫ్ తో నుదుటిమీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలి అడుగుపెట్టాను. నన్ను చూడగానే "ఎవరు కావాలి మీకు?" అనడిగాడు యం.డి.
"మీతో మాట్లాడాలి. మీ రిసెప్షనిస్టు పంపింది."
"చెప్పండి".
"నా......నా పేరు కృపానంద్!" గుండె దిటవు చేసుకుని చెప్పాను. "నా చేతికి ఆక్సిడెంట్ అయింది......" అని ఏదో అనబోతుంటే "కృపానంద్ అంటే శ్వేత ఫాదర్" అని పూర్తిచేస్తూ, ఆ పాపకోసం బెల్ కొట్టాడు.
బింకంగా అన్నాను "యస్".
కామ్ గా 'కూర్చోండి' అన్నాడు.
తర్వాత నా వంక పరిశీలనగా చూస్తూ "అంకిత్ ఎవరు?" అన్నాడు అంతే తాపీగా.
నేనెంత ఉలిక్కిపడ్డానంటే నా ప్రక్కన పిడుగుపడినా అంత ఉలిక్కిపడకపోయేవాడిని. అతని కళ్ళల్లో ఏదో గుర్తింపు. చిన నవ్వు. వెంటనే ఏదో బజ్జర్ నొక్కాడు.
అంతే! మొత్తం గది అంతా మార్మోగిపోయేలా పెద్ద సైరన్ లాంటి శబ్దం వినిపించసాగింది. నాకు ముచ్చెమటలు పోశాయి. చప్పున లేచి నిలుచున్నాను.
"కదలకు ...... ఎవరు నువ్వు- చెప్పు?"
"అంకిత్ తండ్రిని" స్థిరంగాచెప్పి, ఒక్కంగలో డోర్ దగ్గరికి చేరుకున్నాను.
అటెండర్ తలుపు మూసేయబోతున్నాడు. బలమంతా ఉపయోగించి తలుపును ఒక తనను తన్నాను. అది తగిలి తను ఎగిరి అంత దూరంలో పడ్డాడు. వెనుకనుండి యం.డి. అరుస్తున్నాడు.
అంతే! వింటినుంచి వెలువడిన బాణంలా కారిడార్ గుండా గబగబా మెట్లు దిగేసి హాల్లోకి వచ్చాను. అప్పటికే సెక్యూరిటీ స్టాఫ్ హాల్లోకి పరుగెత్తుకొచ్చారు.
చప్పున హాల్ ఎంట్రన్స్ మూసేసి, హాలుకీ, బిల్డింగ్ కీ మధ్య నున్న సందుగుండా లాన్ లోకి పరుగెత్తాను. అక్కడ పనిచేసే నౌఖర్లు నా వెంట పడ్డారు. అదే వేగంతో గేటువైపు పరుగెత్తాను. తాళంవేసి వుంది. జాన్ కోసం పరుగెత్తుతూనే అంతా వెదికాను. గేటవతల కారు పొజిషన్ లో పెట్టి రెడీగా వున్నాడు.
గేటుకి తాళం వేసిన సెక్యూరిటీ గార్డు నన్ను అడ్డుకోవడానికి ఎదురుగా పరుగెత్తుకు రాసాగాడు. తలత్రిప్పి వెనక్కీ చూశాను. దూరంగా హాల్లోనుండి సూపర్ వేజర్ తో సహా నలుగురు స్టాఫ్ వేగంగా అటుకేసే దూసుకు వస్తున్నారు. నా వెనకాల నౌఖర్లు ఇద్దరు...... పరుగు మరింత వేగం పెంచి ఎదురుగా పరిగెత్తుకువచ్చే గార్డుకు ఫోర్స్ గా గుద్దుకున్నాను. అలాగే ఎడంచేత్తో అతన్ని వెనక్కి నెట్టుకుంటూ.....దాదాపు నేలమీద జారిపోయిన అతన్ని గేటువరకూ లాక్కెళ్ళాను.
గేటవతల జాన్ 'క్విక్' అంటూ అరుస్తున్నాడు.
వెనకాల పరిగెత్తుకు వస్తున్న వారు మరింత దగ్గరయ్యారు. ఇక నేనాలస్యం చేయదలచుకోలేదు. నేను లాక్కువచ్చిన గార్డు జేబులోంచి కీస్ తీసి ఎడంచేత్తో తాళం తీయబోయాను.
తొందరలో వేరే కీ పెట్టాను. తెరచుకోలేదు. ఇంతలో క్రిందపడ్డవాడు. పైకి లేచాడు. నా మెడకు వేలాడుతున్న తాడు తొలగించి వాడి మొహాన సిమెంట్ పట్టీతో కొట్టాను. వికృతంగా అరుస్తూ వాడు మొహాన్ని చేతులతో కప్పుకుని క్రింద కూలిపోయాడు. నా ఎముక కలుక్కుమంది. కానీ ఆ బాధని పట్టించుకోలేదు. అప్పటికే .......నా వెనక పరిగెత్తుకు వచ్చే వాళ్ళు నాకయిదు గజాల దూరానికి వచ్చేశారు. లాభంలేదు. అదే ఎడం చేత్తో క్రిందపడ్డ గార్డును సెక్యూరిటీ రూమ్ వరకూ లాక్కువెళ్ళి కిటికీ దగ్గర మూటలా కూలేశాను. తర్వాత వాడిమీదో కాలుపెట్టి ఆ గది కిటికీ మీద మరో కాలుపెట్టి గ్రిల్ అందుకున్నాను. అక్కడినుండి కాంపౌండ్ వాల్ మూడు ఫీట్ల దూరమే వుంది. దానిమీదికి జంప్ చేయబోతుండగా సూపర్ వేజర్ నన్ను సమీపించేశాడు.
నా వంట్లో వున్న శక్తినంతా క్రేంద్రీకరించి అతని గుండెలమీద ఒక్క తన్ను తన్నాను. అతను వెల్లకిలా పడిపోయాడు. అదే ఫోర్స్ తో కాంపౌండ్ వాల్ మీద ఎక్కి, అక్కడ్నుంచి క్రిందికి దూకేశారు. కారు వేగంగా వచ్చి నా ముందు ఆగగా. డోర్ తెరచుకుని నేను ఎక్కడం కారు వేగాన్ని పుంజుకోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
వెనకాల గేటునూపుతూ పిచ్చి కోపంతో అరుస్తున్న వారి కేకలు గాల్లో కలిసిపోయాయి.
* * *
"వాళ్ళెలా గుర్తుపట్టారు నిన్ను?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు జాన్.
మేమిద్దరం అతనింట్లో ఎదురెదురుగా కూర్చుని వున్నాం. ఇంటికి చేరుకున్నాక గంట తర్వాత గానీ మా టెన్షన్ తగ్గలేదు. కాస్త తేరుకున్నాక అప్పుడడిగాడు.
"కృపానంద్ ఫోన్ చేసి చెప్పేసి వుంటాడు. దీన్ని బట్టి నాకు అర్థమయిందేమిటంటే అతనొక తెలివిగల శాడిస్ట్ అని" ఇంగ్లీషు లో అన్నాను.
"నిజమే. అతను అంతదూరం ఆలోచించగలిగాడంటే నిజంగా తెలివైనవాడే ......చావు తెలివి" కోపంగా అన్నాడు.
"మనమిప్పుడు శత్రువు తెలివితేటలు అంచనావేస్తూ కూర్చుంటే అవతల ఆపరేషన్ డేట్ దగ్గరపడుతోంది. ఏదయినా చేయాలి. ఇంతకన్నా రిస్కుతో కూడుకున్నదయినా ఫరవాలేదు. కానీ అదేదో తెలియాలి" సాలోచనగా అన్నాను.
"మనం తిరిగి మళ్ళీ సుమని కలుసుకోవటం తప్పించి ఏమీ చేయలేము. మన చేతుల్లో ఏమీలేదు. ఏదో చేయగలిగినా ఆమె మాత్రమే చేయగలదు. కానీ, ఈ సంఘటన గురించి తెలిస్తే ఆమె అసలు బరతికివుందన్న విషయమే తెలియకుండా జాగ్రత్త పడతాడతను."
"నేను అదే ఆలోచిస్తున్నాను" గుమ్మంలో అలికిడయితే చప్పున అటు తిరిగి చూశాము. అక్కడ వున్న వ్యక్తిని చూడగానే అప్రయత్నంగా ఉలిక్కిపడి సోఫాలోంచి లేచాను.
అక్కడ వున్నది కృపానంద్!
చాలా కామ్ గా నాకభిముఖంగా వచ్చాడు. తర్వాత నా ముఖంలోకి గంభీరంగా చూస్తూ అన్నాడు, "చూడూ నేను చాలా క్రూరమైన వాడిని. ఇంతకుముందే నీకు మర్యాదగా చెప్పాను. కానీ నువ్వు మరో ప్రయత్నం చేశావు. తెలిసి తెలిసి పాము పుట్టలో వేలు పెడుతున్నావు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో నీకు చెప్పనవసరంలేదనుకుంటా-"
"చూడు కృపానంద్..... నిజమే ..... నేను తప్పుచేశాను. కానీ అది నా స్వార్థం కోసం కాదు. నీ రక్తం పంచుకుపుట్టిన బిడ్డని బ్రతికించుకోవటం కోసమే" నా మాటలు పూర్తికాలేదు. విసుగూ, హేళనా మిళితమైన స్వరంతో- "నా కొడుకు- నాకొడుకు అంటూ చెబుతున్నావు. ఒకవేళ నా భార్య కిడ్నీ ఇచ్చి వాడు బ్రతికితే తిరిగి మాకిచ్చేస్తావా? చెప్పు! మా కొడుకుని మాకిచ్చే పక్షంలో నేనే ఆ కిడ్నీ ఇస్తాను" రెట్టిస్తూ అన్నాడు.
నేనేమీ సమాధానం చెప్పలేకపోయాను. ఏం చెప్పగలను? వాడిని బ్రతికించుకోడానికి ఇన్ని కష్టాలు పడుతున్నవాడిని- తిరిగి వారికే అప్పగించే పనయితే, ఇన్ని బాధలెందుకు పడతాను? ఆపరేషన్ చేయించకుండా ఇంట్లోనే ఓ మూల పడేస్తే వీడి దగ్గిరకన్నా దేవుడి దగ్గర క్షమంగా వుంటాడు.
"చెప్పవేం. మా కొడుకుని మాకప్పగిస్తావా?" తిరిగి అడిగాడు.
జాన్ కల్పించుకున్నాడు. "జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నాళ్ళు పెంచిన ప్రేమ వదులుకుని ఎవరు మాత్రం తిరిగి ఇవ్వగలరు. మిమ్మల్ని మేము యాచిస్తున్నామనుకోండి- మరేమైనా అనుకోండి. దయచేసి అంకిత్ కి కిడ్నీ ఇవ్వండి. మీరు ఇవ్వకపోయినా ఫరవాలేదు. సుమని పంపించండి" సావధానంగా చెప్పాడు.
"షటప్! నా భార్యని మీతో పంపాల్రా? ఒకసారి నీ భార్యని నాతో పంపు, రెండు రోజులు వాడుకుని పంపిస్తాను."
కృపానంద్ మాట ఇంకా పూర్తికాలేదు. నేను కొట్టిన దెబ్బకు సోఫామీంచి అవతలపడ్డాడు. నేనిక ఆలస్యం చేయలేదు. ఇన్నాళ్ళ కసి ఆ విధంగా బయట పెడుతూ నా బలమంతా కేంద్రీకరించి కృపానంద్ మొహాన్ని పచ్చడి క్రింద నలగ్గొట్టాను. ఇంకా అలా కొడుతూనే వున్నాను. జాన్ చప్పున నన్ను ప్రక్కకు లాగాడు.
"నన్నాపకు! దయని అంతమాటంటాడా వీడు?" పట్టునుంచి విడిపించుకుని మళ్ళీ కృపానంద్ మీద కలబడ్డాను. నాలో ఆవేశం- కోపం- కసి నిన్సహాయత ఎంతగా అంతవరకూ అణగద్రొక్కబడి వున్నాయో అవన్నీ పూర్తిగా పోయేవరకూ కొడుతూనే వున్నాను.
"చచ్చిపోతాడు వదిలేయ్" జాన్ అరుస్తున్నాడు. దయ కూడా పైనించి పరిగెత్తుకుని వచ్చింది. ఇద్దరూ కలిసి నన్ను బలవంతంగా అతని నుంచి వేరుచేశారు.
అప్పుడుగానీ నా ఆవేశం చల్లారలేదు. అప్పుడు చూసుకున్నాను నా కుడిచేతివంక. సిమెంట్ ప్లాస్టర్ ముక్కలు ముక్కలైంది.
లోపల అతుక్కోబోయే ఎముక మళ్ళీ విరిగి ఉండొచ్చు. గో టూ హెల్! కృపానంద్ కి తగిన శాస్త్రి చేశాను. ఆ ఆవేశంలో నాకు నొప్పి కూడా తెలీలేదు.
క్రిందపడ్డ కృపానంద్ మెల్లగా లేచాడు.
"నీ అంతు చూస్తాను" శపధం చేస్తూ బయటికి వెళ్ళిపోయాడు.
అప్పుడు ప్రారంభమయింది నొప్పి. విరిగిన ఎముక దగ్గిరనుండీ చేయి మొత్తం ప్రాకింది. నిస్పృహగా సోఫాలో కూలబడ్డాను.
దయ ఆదుర్దాగా పరుగెత్తుకువెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ప్రక్కన కూర్చుని అభిమానంగా చూస్తూ- "ఎందుకంత ఆవేశపడ్డావు? వాడొక మూర్ఖుడు! ఏదో వాగాడని మనమూ ఆవేశపడితే ఎలా?" అంది.
నేనేమీ సమాధానం చెప్పలేదు. మెల్లమెల్లగా నాలో నొప్పిచోటు చేసుకున్నట్టే దానికి తోడు పశ్చాత్తాపం కలగటం ప్రారంభించింది. అది కృపానంద్ ని కొట్టినందుకు కాదు. సుమ భర్తని కొట్టినందుకు. ఆ అమాయకురాలి భర్తమీద చేయిచేసుకున్నందుకు!
నా చేతిని జాన్ అప్పుడు గమనించినట్టున్నాడు- "అరె! బ్యాండేజ్ వేయటానికి కావలసిన పరికరాలతో వచ్చాడు.
చెయ్యి శుభ్రంచేసి తిరిగి కట్టుకట్టాడు. అతనెళ్ళాక అన్నాడు...... "జాగ్రత్త! మళ్ళీ ఎముకలో ఏ చిన్న క్రాక్ వచ్చిన సెట్ అవటానికి చాలా రోజులు పడుతుంది. స్టీల్ రాడ్ వేయాల్సి వస్తుంది."
భయం భయంగా చూస్తూ- "వాడు దుర్మార్గుడిలా వున్నాడు. ఈ విషయం మర్చిపోకుండా మళ్ళీ ఏదయినా చేస్తే-? మొన్ననే ప్రాణాలు తీసేంతగా తెగించాడు" అంది.
"ఏడిశాడు! మరోసారి ఎటాక్ చేయటమంటూ జరిగితే ఇక వాడికి మూడినట్టే! నేనొక్కడిని చాలు వాడి కాళ్ళు రెండూ తీసేయటానికి. జైలుకి పోయినా ఫర్వాలేదు" ఆవేశంగా అన్నాడు- జాన్.
అభిమానంగా అతనివంక చూసి భుజం మీద చెయ్యేసాను.