"ఒక సి.ఐ. ఇద్దరు కానిస్టేబుల్సూ, మాప్టీలో రైల్వేస్టేషన్ దగ్గిర వుంటారు. మరో సి.ఐ. అరడజనుమంది కానిస్టేబుల్సూ పట్నంనుంచి బయటికి వెళ్ళే రోడ్లమీద మాటేసివున్నారు. ఊళ్ళో వున్న లాడ్జీలదగ్గర కూడా మావాళ్ళున్నారు. కొడుకులు! ఇంకెక్కడికి పోతారు? అష్టదిగ్భంధం చేశాను. "మీసం దువ్వుకుంటూ కళ్ళు మెరిపించాడు విల్సన్ రావు.
ఉదయ్ చంద్రకూ, జయంత్ కూ ముఖాలు తేటబడ్డాయి.
విల్సన్ రావు సామాన్యుడు కాడనిపించింది. అతడిమీద నమ్మకం కుదిరింది. హాయిగా గాలి పీల్చుకున్నారు. విల్సన్ రావుకేసి మెప్పుకోలుగా చూశారు.
డియస్ పీ. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై పోయి మాధవిని సమీపించి "చూడమ్మా నీ కొచ్చిన భయమేమీలేదు. నీప్రాణానికి ణా ప్రాణం అడ్డం. నువ్వు ఓపికపట్టి నేను చెప్పినట్టు చెయ్యాలి. నీవెనకే మేమందరం వుంటాం! ఏమంటావ్?" సూటిగా ముఖంలోకి చూస్తూ అడిగాడు.
మౌనంగా ఓసారి ఉదయ్ చంద్రను చూసి "అలాగే" అంటూ తల ఊపింది మాధవి.
"అయితే జాగ్రత్తగా విను. నీవెంట మేమున్నామని పసికట్టారోవాళ్ళు పారిపోతారు. జాగ్రత్తగా వుండాలి. వాళ్ళు నిన్ను వెంటాడినప్పుడు ఏ స్థితిలో వున్నావో అలాగే వుండాలి. ఆ ఖంగారూ, భయం నీలో కన్పించాలి. రిక్షాలో బస్ స్టాండుకు వెళ్ళు. అక్కడ ఏదోబస్ ఎక్కి వెళ్ళటానికి వచ్చినట్టుగా వుండాలి. ఓ గంట బస్ స్టాండులో వైత చెయ్యి . వాళ్ళు కన్పించక పోతే రిక్షా మాట్లాడుకొని రైల్వేస్టేషన్ కు వెళ్ళు. స్టేషన్ లో వైటింగ్ హల్లో ఓ మూల నిలబడి కొంతసేపు చూడు. బస్ స్టాండులోగానీ, స్టేషన్ లో గానీ వాళ్ళు తారసపడ్తారు. లేకపోతే తోవలోనైనా వాళ్ళు తగలొచ్చు. ఊళ్ళోవున్న లాడ్జీలన్నీ ఆ రోడ్డుమీదే ఉన్నాయి. తెల్లవారేదాకా నువ్వు బస్సుస్టాండులోగానీ, రైల్వేస్టేషన్ లోగానీ ఉండాలి. అర్థమయిందా? ఇంకోసంగతి? నీకు కొంతదూరంలో మేము తిరుగుతుంటాము. నువ్వు మావంక చూడకూడదు. అది వాళ్ళు చూశారంటే మన ఆపరేషన్ అమావాస్య అంతా వ్యర్థం అయిపోతుంది. జాగ్రత్త! మరి ఇక బయలుదేరు. ఈ నర్సింగ్ హొమ్ నుంచి బయటకు వెళ్ళాక మేమెవరమో నీకు తెలియనట్టే వుండాలి. రిక్షా నువ్వే మాట్లాడుకొని వెళ్ళాలి. వాళ్ళు సాధారణంగా రిక్షావాళ్ళనుంచి కూపీలు తీస్తారు. 'ఓ ఆడకూతురు రిక్షాలోవెళ్ళిందా' అని. అందుకే రిక్షావాళ్ళకుకూడా నీ వెనుక మేమున్నట్టు అనుమానం రాకూడదు తెలిసిందా?"
"అలాగే సార్!" మాధవి సంసిద్ధమైంది.
"ఇప్పుడే బయలుదేరమంటారా?"
"పదినిముషాలాగండి. భోజనంవస్తుంది. భోజనం చేసివెళ్ళండి" అన్నాడు జయంత్.
"ఓ.కే." అన్నాడు విల్సన్ రావు.
మాధవి మౌనంగా డాక్టర్ ఉదయ్ చంద్రను చూసింది.
'నేనున్నాను. నీకేం భయంలేదు.' అన్నట్టుగా చూపులతోనే ధైర్యం చెప్పాడు ఉదయ్ చంద్ర.
"ఎంతివ్వమంటావ్?"
"మీదయ. రాత్రిపూట మీరేచూసి ఇవ్వండి." ఆమె రిక్షా ఎక్కడానికి వీలుగా పక్కకు జరిగి నిలబడ్డాడు.
మాధవి రిక్షా ఎక్కి కూర్చుంది.
రిక్షావాడు తువ్వాలు తలకు బిగించి, రిక్షాఎక్కి కూర్చునితొక్కుతూ బెల్ మోగించాడు.
"ఎందుకు బెల్ మోగిస్తావ్? రోడ్డంతా ఖాళీ. మనుషులే లేరుగా?" రిస్ఖాలో ముందుకు వంగి అన్నది మాధవి.
"అలవాటమ్మగారూ! అలవాటయిపోయింది." రిక్షావాడు సగం మెడ వెనక్కు తిప్పిచూస్తూ అన్నాడు.
బలంకొద్దీ రిక్షా తొక్కుతున్నాడు. రిక్షా వేగాన్ని అందుకున్నది.
"ఇంత పొద్దుపోయి వస్తున్నారు. ఆస్పత్రిలో మీవాళ్ళెవరైనా ఉన్నారా?"
వాడి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలా ఒక్కక్షణం తటపటా యించింది.
"నేను క్రాంతి నర్సింగ్ హొమ్ లో పనిచేస్తున్నాను."
"నర్సమ్మా?"
"ఆఁ ఆఁ ! నర్సుగా పనిచేస్తున్నాను. పదిగంటలకే డ్యూటీ అయిపోయింది. అర్జంటు కేసోకటి ఆపరేషన్ చెయ్యాల్సివచ్చింది. అందుకు ఆలస్యమైంది."
"కొత్తగా చేరారా?" రిక్షా స్పీడుతగ్గించి వెనక్కు తిరిగి చూస్తూ అడిగాడు.
మాధవి ఆ ప్రశ్నకు ఉలిక్కిపడింది. రిక్షావాడి ముఖంలోకి పరిశీలనగా చూసింది. "వీడు...వీడు...."
"ఏం ఎందుకలా అనుకుంటున్నావ్?"
"ఆఁ ఏం లేదమ్మగారూ! ఈ ఆస్పత్రిలో పనిచేసే నర్సమ్మ లందరూ తెలిసినోళ్ళే రిక్షాకడ్తూ వుంటాంగదా అమ్మగారూ! అందుకని అందరూ తెలిసిపోతారు." వెనక్కు తిరిగి చూడకుండా అన్నాడు ఈ సారి రిక్షావాడు.
తన తెలివితేటలు, నటనాచాతుర్యం, ఓక రిక్షావాడిముందు పనికి రాకుండా పోతున్నందుకు నొచ్చుకున్నది ఆసుపత్రిలో పనిచేస్తున్నానని చెప్పినందుకు పశ్చాత్తాప పడింది.
"అవును. నేను జాయిన్ అయి మూడురోజులే అయింది. బాగా కనిపెట్టాశావ్" అన్నది బింకంగా.
"మా రిక్షావాళ్ళకు అన్నీ తెలిసిపోతుంటాయ్. అమ్మాయిగారూ?" వాడి ముఖం కన్పించకపోయినా, వాడిలోవాడు నవ్వుకుంటున్నట్టు గ్రహించింది మాధవి.
అమ్మగారూ అని సంబోధిస్తూ ఒక్కసారిగా అమ్మాయిగారూలోకి దించేశాడు.
వీడి ఉద్దేశ్యం ఏమిటి? పైగా రిక్షావాళ్ళకు అన్నీ తెలిసిపోతుంటాయంటున్నాడు? నర్సు అనగానే వేడికికూడా లోకువైపోయినట్టుంది.
"శానామంది నర్సుపని చేస్తున్నానంటూ అబద్దాలు చెపుతుంటారు"
"ఎందుకూ చెప్పుకోవాలీ?" గాభరాను అణుచుకుంటూ అన్నది మాధవి.
"గిరాకీ పెరుగుద్దనీ?" ఇకిలించాడు రిక్షావాడు.
"అంటే?" మాధవికి మతిపోయినట్టు అయింది.
"అదేనమ్మాయ్! నీకు తెలియందేముంది? రేటుకోసం."
"ఓరి! రాస్కెల్ ! స్కౌండ్రల్!" మాధవి లోలోనే అనుకుంది వళ్ళుమండిపోతూంటే.
అరిచి రిక్షా ఆపి, వాడ్ని డి. యస్. పి. విల్సన్ రావుకు అప్పగించాలనిపించింది. 'ఆపరేషన్ అమావాస్య ' ప్లాన్ విఫలమైపోతుందనే భయంతో కోపాన్ని దిగమింగుకున్నది.
"మౌనం అంగీకారం?" అన్న సామెత ఆమెకంటే ఆ రిక్షావాడికే బాగాతెలుసు.
"బస్ స్టాండు దగ్గరున్న సావిత్రి లాడ్జికేనా?"
"సావిత్రి లాడ్జీయా?" అప్రయత్నంగానే మాధవి గొంతుదాటి పెదవుల్ని తోసుకొని వచ్చింది!
"క్లాసు, సావిత్రిలాడ్జికి మీలాంటి క్లాసు పిల్లలే వస్తారు. పెద్దపెద్దోళ్ళు కార్లేసుకొని కూడా వస్తారు."
"ఏయ్ నోరుమూసుకుని పద. పిచ్చి పిచ్చిగా వాగావంటే మక్కెలిరగతన్నించి లాకప్ లో వేయిస్తా! ఎవరనుకొంటున్నావో. వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు." మాధవి వళ్ళు తెలియని కోపంలో అనేసింది.
రిక్షావాడు స్పీడు తగ్గించాడు.
నడుంతిప్పి చూస్తూ "అమ్మగారూ! చమించాలి బుద్ది తక్కువైపోయింది. చెప్పుచ్చుక్కొట్టండి తప్పయిపోయింది. ఈ బస్తీలో వున్న ఆస్పత్రిల్లో పెద్దపెద్ద కుంటుబాలోళ్ళు కూడా జబ్బు లోంకెట్టుకొని గదులు తీసుకొంటారు. రాత్రయేసరికి ఇట్లా లాడ్జీలకు వెళతా ఉంటారమ్మా. అందుకే తమరు ఇంతరాత్రి ఆస్పత్రినుంచి తమరు ఒంటరిగా వచ్చి బస్ స్టాండ్ కెళ్ళాలంటే పొరపాటుపడ్డాను. కొత్తగా వచ్చే వాళ్ళకయితే, మంచి మంచి లాబసాటి బెరాల్ని లాడ్జీలకు మేమే చూసి పెడ్తావుంటాంకూడ. మాకు కమీషన్ రెండేపులనుంచీ దొరుకుద్దీ. అందుకని బుద్దితక్కువైపోనాది...."
"సరే నోరుమూసుకుని తొరగా పోనియ్." కసిరింది మాధవి.
రిక్షావాడు చెమటలు కక్కుతూ, అటూ ఇటూ ఊగుతూ తొక్కసాగాడు.
ఆ వేగానికి రిక్షా బోల్తాపడుతుందమో ననిపించింది మాధవికి.
రిక్షా రోడ్డు మలుపుతిరిగి . ఎదురుగా ఓవర్ బ్రిడ్జీ, కిందనుంచి రైలుమార్గమూ, ఆ పక్కగా డొంక ఆ డొంకచుట్టూ గుబురు పొదలూ.... చుట్టూ గాఢంధకారంగా వుంది.
రిస్ఖా సర్రు రోడ్డుదిగి, పట్టేబాటగుండా పల్లంలోకి శరవేగంగా దూసుకుపోతూంది.
మాధవి రిస్ఖా కమ్ములు గట్టిగా పట్టుకొని కిందదూకే ప్రయత్నం చేసింది. కాని సాధ్యంకాలేదు. మరి కొద్దిక్షణాల్లో పూర్తిగా రోడ్డుదిగి పోయి, రైలుకట్టకు పక్కగావున్న చీకటి డొంకలోకి పరుగుతీసి పక్క సారిగా ఆగిపోయింది.
మాధవి తెప్పరిల్లుకొని రిక్షాలోనుంచి బయటికి దూకి బిగ్గరగా అరిచే ప్రయత్నంలో ఉండగా బలమైన చెయ్యొకటి ఆమెనోరు నొక్కేసింది. రెండో చెయ్యి ఆమె నడుంచుట్టూ కొండచిలువలా పెనవేసుకుపోయింది. ఆ చెయ్యి ఎవరిదో తెలుసుకొనేలోపునే, రెండోవాడు డొంకలో ఆగివున్న కార్ డోర్ తెరిచాడు.
19
సావిత్రిలాడ్జీ ముందు రిక్షా ఆగింది.
అల్లంత దూరంలో సందులో గోడవారగా నిలబడివున్న విల్సన్ రావు, పక్కనేవున్న డాక్టర్ జయంత్ భుజంతట్టి ప్రశ్నార్థకంగా చెయ్యి ఊపాడు.
"రిక్షా లాడ్జిలోకి వెళ్ళింది అసలు మాధవేనా?" అనుమానాన్ని వెలిబుచ్చాడు డాక్టర్ జయంత్.
"ఇంకెవరు బ్రదర్? ఆ రిక్షాని మనం నర్సింగ్ హొంనుంచి ఫాలో అవుతూనే వున్నాంగదా? బస్ స్టాండులో ఆగాల్సిన ఆమె రిక్షా సందులోపడి ఈ సావిత్రిలాడ్జికి ఎందుకొచ్చినట్టూ? క్రీనీడల్లోకూడా విల్సన్ రావు కళ్ళల్లో మండుతున్న ఎర్రజీరల్ని గుర్తించాడు జయంత్. నిస్సహాయంగా తమ వెనకే నిలబడ్డ డాక్టర్ ఉదయ్ ను చూశాడు జయంత్ రావు.
"ఇంతకీ రిక్షాలోనుంచి దిగింది మాధవేనంటారా? మనం సరిగా చూడలేదు. మన ఎక్కడో గొందిమలుపు తిరుగుతున్నప్పుడే ఆమె రిక్షా దిగి లాడ్జిలోకి వెళ్ళింది." సందేహాన్ని వెలిబుచ్చాడు డాక్టర్ ఉదయ్ .
"అవును విల్సన్ ! మనం కారు బస్ స్టాండు బయట నిలిపి నడుచుకొంటూ ఈ సందులోకి వచ్చాంగదా? మనం ఫాలో అవుతున్న రిక్షా మాత్రం అదే కావొచ్చు. కాని అందులోనుంచి దిగి వెళ్ళింది మాధవికాకపోవచ్చు." అన్నాడు జయంత్ విల్సన్ రావు ముఖంలోకి చూస్తూ.
"ఏం డాక్టర్ ! మీకేమైనా మతిపోయిందా ఏమిటి? రిక్షా అదేనం టాప్ కాని రిక్షాలో ఉన్న మనిషి మారిపోయిందంటావ్. ఆమె ఏమైనా పరకాయ ప్రవేశం చేసిందా? వానిష్ వాయిందా? లేక ఇదంతా ఆ మేజిక్కుల రాంబాబు చేస్తున్న కనికట్టువిద్యా, మీరేమనుకొంటున్నారో నాకు అర్థంకావడంలేదు. మనం సెంటర్ నుంచి ఫాలో అవుతున్నాం రిక్షాని."
"మనం ఫాలో అవుతున్న రిక్షా మాధవి ఎక్కినా రిక్షా అనేనమ్మకం ఏమిటి?" ఉదయ్ తనలోతనే అనుకొన్నట్టు మెల్లగా అన్నాడు.
"ఆఁ!డాక్టర్ సాబ్ మమ్మల్ని మరీ అంత పూల్స్ కింద జమసేస్తున్నావేమిటి?" విల్సన్ రావు గుర్రుగా అన్నాడు.
"ఇందులో మనం ఒకళ్ళ నొకళ్ళు, పూల్స్ ను చ్సుకొనే ప్రశ్నలేదు డి.యస్. పి గారూ? మనల్ని అవతలవాళ్ళు పూల్స్ ను చెయ్యొచ్చు. లేక కో ఇన్సిడెంటల్ గా మనమే పొరపాటుపడి వుండొచ్చు. ఫర్ ఇన్ స్పెక్టర్....మాధవి నర్సింగ్ హొమ్ నుంచి బయటికి వచ్చినప్పుడు మనం నర్సింగ్ కాంపౌండులోనుంచే చూశాం. చౌరాస్తాలో రెండురిక్షాలున్నాయ్. మనం అక్కడికొచ్చేసరికి ఒక్క రిక్షాకూడా రాలేదు. మనం కారు లైట్సుతీసేసి చిన్నగా బయలుదేరాం. మనకు ముందు కన్పిస్తున్న రిక్షాను దూరంనుంచి మెల్లమెల్లగా ఫాలో అవుతూ పచ్చాంగదా? మనం ఫాలో అయింది మాధవి ఎక్కినా రిక్షా కాకపోవచ్చు కాని మన మనసులో మాధవి గురించిన ఆలోచనలే ఉండటంవల్ల రిక్షా మాధవి ఎక్కినా రిక్షాగా అనుకోవడం సహజం. ఇప్పుడు గుర్తుచేసుకుంటే అన్పిస్తోంది. అది మాధవి ఎక్కినా రిక్షా కాదేమోనని" ఉదయ్ చంద్ర, విల్సన్ రావు అఫెండ్ కాకుండా చాలా ఓపిగ్గా చెప్పాడు.