"రవణమ్మా! అట్లా కూచుంటే విసుగు పుట్టడంలేదూ? నువ్వూ ఒకసారి దిగు! స్టేషన్ చూసిరా" అన్నారు వెంకట్రావుగారు.
గోపాలం ఆశతో ఆగాడు ప్లాట్ ఫారం కంకరని పరీక్షిస్తూ.
"అట్లా నుంచున్నావేం? తీసికెళ్లు."
"రా" అని చెయ్యి జాచాడు.
రవణ బండిదిగి నడిచింది అతనికి అందకుండా. స్టేషన్ దగ్గిరికి వెళ్ళారు. "వెయిటింగ్ రూమ్" అనే యింగ్లీషు అక్షరాలు చదవమన్నాడు. చదివింది, ఆమె మాటలు వినపడితేనే గొప్పగా మధురంగా వుంది. నీళ్ళ కుళాయికేసి తీసికెళ్ళాడు. నీళ్లు పడుతో అనుకున్నాడు; ఆ చీకట్లో రవణ భుజంమీద చెయ్యివేస్తే? తనకి అందకముందే, వుద్దేశం గ్రహించి వెనక్కు జరిగిందా నామర్దాగా వుంటుందిగాని యిప్పుడు గాకపోతే? ఆమెని చూశాడు. కుచ్చెళ్లు మీద జీరాడుతో-చీకట్లో చెట్టుకింద తెల్లగా ఆ పమిట-ఆ బుజాలు-
"చెంబు పుచ్చుకో, నిండింది"
"గ్లాసుతే.... రైల్లో నా దగ్గిరిగా కూచోవేం? అసహ్యమా? మాట్లాడుమరి. చెప్పు-ఐతే-నేను వెళ్ళిపోతాను." "ఎక్కడికి వెడతాడు? వీడి మొహం. అని అనుకుంటుందేమో" అని ఆలోచన వొచ్చి ఆగాడు.
"ఇంక మాట్లాడను నీతో- నాకు కోపమొస్తుంది...... మాట్లాడు- అసహ్యమా? కోపమా?