Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 32

 

    "నాకు తెలుసు ఇలాంటి ఇడియాటిక్ ప్రశ్న అడుగుతారని! ఇంట్లో తెలుస్తే ఇంకేమయినా ఉందా? మా పార్టీల సంగతి బయట పడిపోదూ?"
    "ఇదిగో! నన్నిలాంటి గొడవల్లో ఇరికించకండి ! నాకేం తెలీదు-- నేనేం విన్లేదు."
    అయితే ఈ న్యూస్ పేపర్ కటింగ్ డాడీకిస్తాను! మా పదివేలూ మాకు తెచ్చువ్వమని డాడీ అడిగారంటే నీ తిక్క వదిలిపోతుంది.' బాగ్ లో నుంచి న్యూస్ పేపర్ కటింగ్ తీసింది.
    "అంతపని చేయకు! నా లైఫ్ మిజరబుల్ చేసేస్తారు మీ డాడీ!"
    "అయితే మా సుష్మకు హెల్ప్ చేయాల్సిందే నువ్వు"
    కొద్దిసేపు ఆలోచించేసరికి సురేష్ బుర్ర వేడెక్కిపోయింది.
    "అల్ రైట్ రేపు మీ సుష్మను తీసుకురా! ఓసారి మాట్లాడతాను"
    "ఇప్పుడు వాళ్ళింట్లో ఎవరూ ఉండరు -- వెళ్దామా?"
    "వద్దు వద్దు " గాబరాగా అన్నాడు . రేపు నేనే మీ స్కూలు కొస్తాను.
    "స్కూలు కెందుకు ?"
    "మీ క్లాస్ టీచర్ తో ఓసారి మాట్లాడి అక్కడ ఇద్దరం కలిసి ఏం చేయాలా అనేది డిసైడ్ చేస్తాం "
    "ఓ.కే. రాకపోతే --- కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ ఫ్రాడ్------" బ్లాక్ మెయిల్.
    లిప్ట్ లో నిశ్శబ్దంగా టెర్రేస్ మీద కెళ్ళి పోవాలను కున్నాడు గానీ యధాప్రాకారం శ్రీదేవి ఆరో ఫ్లోర్ లో ఆపేసింది.
    "ఆఫీస్ కెళ్ళి వచ్చావా?"
    "వెళ్లానండి!"
    "మళ్ళీ ఆ రాజేశ్వరితో కాంటీన్ కొచ్చాడా?"
    "వచ్చాడండీ! కానీ నిన్న ఇంకో ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు --
    ఆమె అదిరిపడింది.
    "అంటే వాళ్ళిద్దరూ కూడా అదే బాపతా?"
    'చెప్పలేమండీ! వాళ్ళ మాటల్ని బట్టి చూస్తె అలాగే ఉంది కాని ఆ మాటలు బట్టి ఆలోచిస్తే ఏమీ అర్ధం కావటం లేదండీ!"
    ఆమెలో ఆత్రుత ఎక్కువయింది.
    "వాళ్ళు కూడా కోడ్ లాగ్వెంజ్ మాట్లాడారా?"
    "అనే అనుమానంగా వుందండీ!"
    "ఏం మాట్లడారు?"
    "దూరాదర్శన్ లో పాడి పంటల్లో మాట్లాడే లాంగ్వేజండీ! వాళ్ళందరికీ పొలాలు వున్నాయంటండీ! శెలవు పెట్టి మోహనరావు గారికి నాగలి పట్టమంటున్నారండీ! ఆయనేమో వాటిని తనకు కౌలుకిస్తే విత్తు నాటటం నుంచీ కంకి వేసే వరకూ కాంట్రాక్టు తీసుకుంటున్నారండీ."
    ఆమెకు అనుమానం కలిగేట్లూ , కలుగకుందానూ జాగ్రత్తపడి అన్నాడు.
    ఆమె దూరదర్శన్ లాంగ్వేజ్ గురించి కాసేపు ఆలోచించింది.
    వాళ్ళు తరచుగా 'వరి వంగడం '' అనే పదం గుర్తుకొచ్చిందామెకి.
    "నాకు మొదటి నుంచి 'వరి వంగడం ' అనే పదం మీద అనుమానంగా ఉంది. అది కూడా మోహన్రావ్ మాటల్లో ఏమయినా వచ్చిందా?"
    "ఆరుసార్లు వచ్చిందండీ!" అబద్దమాడేశాడతను.
    "అయితే అనుమానం లేదు. ఖచ్చితంగా వాళ్ళ మధ్యనేదో వుంది -"
    "బహుశా బట్టలనుకుంటానండీ"
    ఆమె కోపంగా చూసింది.
    "పిచ్చి వాగుడు వాగద్దని అడివరకో సారి చెప్పాను."
    "ఎప్పుడండీ?"
    "ఎప్పుడో ఒకప్పుడు .....అది సరే గానీ ఇంత మందిలో ఆయనతో ఎవరికి నిజంగా సంబంధం వుందీ ఎలా తెలుసుకోవటం ?'
    "చాలా కష్టమండీ!"
    "కష్టమయినా సరే! ఏదొక ప్లాన్ వేసి ఆ విషయం తేల్చుకోవాల్సిందే!"
    'అవునండీ! తేల్చుకోవటమే మంచిది"
    "ఆ ప్లానేదో నువ్వే ఆలోచించు .....ఓ వారం లోగా తేలికపొతే నువ్వీ ప్లాట్స్ లో ఉంటానికి వీల్లేదు."
    సురేష్ అదిరిపడ్డాడు.
    "అదేమిటండీ! అక్క పెళ్ళయితే చెల్లెలు మురిసిపోయిందనీ .....మధ్యలో నన్ను గెంటుతానంటారేమిటి?"
    "అదంతా నా కానవసరం! ఆ సీతాకోకచిలుకల సంగతి తేలాల్సిందే -- అంతవరకూ నీ మొఖం నాకు చూపించకు ."
    సురేష్ చటుక్కున లైట్ స్విచ్ ఆఫ్ చేసేశాడు.
    ఒక్కసారిగా గదంతా చీకటి అలుముకుంది.
    శ్రీదేవి గాబరా పడి దూరంగా జరగబోయి కాలికి టీపాయ్ తగిలి 'అబ్బా' అంటూ కూర్చుండిపోయింది.
    "అరె! ఏం జరిగిందండీ" అంటూ ముందుకి అడుగేసి ఆమె కాలు తగిలి మీద పడ్డాడు.
    అతన్ని ఒక్క తోపు తోసి లైట్ స్విచ్ వేసింది కోపంగా.
    "లైట్ ఎందుకు తీసేశావ్ ' అంది మండిపడుతూ.
    "మీరేకదండీ.....నా మొఖం చూపించవద్దన్నారు"
    "మొఖం చూపించవద్దంటే లైట్ తీసేయమనా?"
    "మరి చీకట్లోనే కదండీ ........కనబడకుండా ఉండేది ?"
    "చాల్చాల్లే వెళ్లిక ..... చేసిన నిర్వాకం చాలు ."
    సురేష్ బ్రతుకు జీవుడా అని మెట్లెక్కి టెర్రేస్ మీద కొచ్చాడు.
    వాటర్ టాంక్ కింద దూరి బట్టలు మార్చు కుంటుండగా అవతలి వేపు కనిపించింది చీరకట్టు దాని వెనుక ఒక జత కాళ్ళు.
    ఆత్రుతగా బయటకు జరిగి చూశాడు.
    కుమిదిని వెన్నెల దేవతలాగా నిలబడి వుంది. వెన్నెల్లో పిట్టగోడ నానుకుని ....అటు వేపు తిరిగి -
    "హలో" అన్నాడు దగ్గర కెళ్ళి వెనుక నుండి ఆమె కళ్ళు మూస్తూ.....
    ఆమె అతని రాకను గమనించకపోవడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. చేతికి ఆమె కన్నీరు వెచ్చగా తగిలింది.
    "నువ్వా?" అంది చప్పున కన్నీరు తుడిచేసుకుని దూరంగా జరుగుతూ.
    సురేష్ ఆశ్చర్యపోయాడు.
    "కుముదిని ! ఏడుస్తున్నావా?"
    "కొంచెం " నవ్వు తెచ్చుకుంటూ అంది.
    "ఎందుకు ?"
    "సరదాకి!"
    "ఏయ్ ! నిజం చెప్పు ! ఏం జరిగింది ?"
    "ఏమీ జరగలేదు.
    "ఏమీ జరక్కుండా ఎవరయినా కన్నీళ్లు పెట్టుకుంటారా?"
    "మనసు బావుండలేదు "
    "పనిమనుషులకు  మనసుంటుందా?"
    ఆమె కోపంగా చూసింది.
    "వాళ్ళు మనుషులుకాదా?"
    "తన ఫ్రెండ్ వహీద్ చెప్పిన లెసన్ నెంబర్ -- టూ గుర్తు కొచ్చింది.
    "ఆడపిల్లతో వలపింప జేసుకోవాలంటే ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు కౌగలించుకో " అన్నాడు.
    ఆమె భుజం చుట్టూ చేతులు వేసి గుండెల మీదకు లాక్కున్నాడు.
    "నాక్కూడా అబద్దం చెపుతున్నావా?"
    ఆమె తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ గువ్వలా కౌగిలి లో వదిగిపోతోంది.
    మెత్తని స్పర్శ అగ్నిలా రాజుకుంటోంది వళ్ళంతా.

 Previous Page Next Page