Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 32

 

    "ఇలా ఏది పడితే అది తాగకూడదు!" అని అడ్డు పడబోయాడు ఉదయ్.
    "ఫరవాలేదు , నేను త్రాగుతాను" అని త్రాగేసింది మయూర. కొద్ది సేపట్లోనే మయూరకు నిస్త్రాణ తగ్గినట్లయింది. నీరసంగానే లేచి నిలబడి "నేను నడుస్తా" అంది.
    "లెటజ్ స్టార్ట్!" అన్నాడు ప్రతాప్.
    కొండ దొరకు చేపల టిన్ బహుమరిగా ఇచ్చేసారు . అందరూ నీరసంగా తూలుతూ అడుగులు వేస్తున్న మయూరతో సహా ముందుకు నడిచారు.


                                                           22

    "వచ్చేసాం!" అన్నాడు అందరికంటే ముందుగా నడుస్తున్న ప్రతాప్. అన్నీ కలిసి ఓ వంద గుడిసెలు కూడా లేని గ్రామం అది! కొండల మధ్య ఉంది. దూరంగా ఒక కొండ కొమ్ము మీద నుంచి జలపాతం లాగ దార నీళ్ళు పడుతున్నాయి అక్కడా ఇక్కడా చెదురు మదురుగా ఏవో పనిపాటలు చూసుకోంటున్న జనం కొత్తగా వచ్చిన నాగరికులను చూసి బెదిరిపోయారు అందరూ చేతుల్లో పనులు వదిలేసి ఒకరికొకరు దగ్గరగా గుమికూడారు గోచీలతో వున్న మొగవాళ్ళు అప్పుడే విల్లు ఎక్కు పెట్టసాగారు.
    "చచ్చాం ! వీళ్ళు మనమీద యుద్ధం ప్రకటిస్తున్నారు!" అన్నాడు ఉదయ్.
    "మేము మీకు శత్రువులం కాదు! స్నేహితులం!" అని గట్టిగ అరిచాడు ప్రతాప్.
    అంతలో తమ బాష వాళ్ళకు అర్ధం కాదని గ్రహించి సైగలతో తాము స్నేహం చేసుకోవడానికి వచ్చామన్న విషయాన్ని సూచించటానికి ప్రయత్నం చేయ్యసాగాడు. అక్కడితో ఎక్కుపెట్టిన విల్లు కిందకు దింపారు కాని ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు.
    "లాభం లేదు! మనం అడుగు ముందుకేస్తే చంపేస్తారు!" అన్నాడు హేమంత్!
    ఒక్కొక్కరు నెమ్మదిగా తమ బరువులు దింపుకున్నారు. ఆయాసపడుతూ నిలబడ్డారు. ఆ గుడారాలను సంచులనూ, టిన్స్లోని ఆహార పదార్ధలనూ వింతగా, ఆశగా కుతూహలంగా చూడసాగారు ఆ కొండ జాతి వారు. అంతలో నీరు కాని రంగులోకి మరీనా ధోవతి, కాస్త మాసిన చొక్కాతో, ఆకు చెప్పులు తొడుక్కుని అయిదు పదులు నిండిన మనిషి ఒక గుడిసేలోంఛి బయటికి వచ్చి "ఎవరు మీరు!' అని అడిగాడు. ఆ పరిసరాల్లో ఆ మాత్రం మట్టాడగలిగిన సభ్యతా సంస్కారాలున్న మనిషిని చూసేసరికి గ్రూప్స్ లో అందరికీ ప్రాణం లేచి వచ్చింది. అందరూ అతనికి నమస్కారం చేసారు. గ్రూప్ లీడర్ ప్రతాప్ ముందుకు వచ్చి తనకు తను పరిచయం చేసుకుని, తన గ్రూప్ పరిచయం చేసాడు.
    "మాకు సంఘ విద్రోహక శక్తులతో కాని, ప్రభుత్వ వ్యతిరేకత శక్తులతో కాని, ఎలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేకించి ఏదో ఒక రాజకీయ పార్టీని ప్రచారం చేసే వుద్దేశ్యంతో కూడా రాలేదు. బాగా వెనుకబడిన ప్రాంతాలలోని ప్రజలలో చైతన్యం కలిగించటమే మా ధ్యేయం! తమ చుట్టూ పక్కల ఏం జరుగుతుందో వీళ్ళంతా తెలుసుకోవాలి! తమకు న్యాయంగా ఏం రావాలో తెలుసుకోవాలి. ఆ రావలసిన దానిని ఎలా పొందాలో నిర్ణయించుకోవాలి! వాళ్ళలో ఆలోచనలు కలిగించటం వరకే మేం చేస్తాం! మా నిర్ణయాలు వాళ్ళ మీద రుద్డం! ప్రభాకర రావు సార్ రూపొందించిన ప్రణాళిక. ఇది ఉత్సాహవంతులయిన విద్యార్ధులం గ్రూప్స్ గా ఏర్పడి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క విలేజికి వెళ్ళి మా లిటరేచర్ సాధ్యమైనంతగా జన సామాన్యంలోకి వ్యాపించే లాగ చూస్తాం!"
    అయన సంతోషించి "నేనిక్కడ టీచర్ని - నా పేరు నిత్యానందం! ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందుతుందని తెలుసుకోగలిగినందుకు చాలా సంతోషంగా వుంది" అన్నాడు. ఆ తరువాత వాళ్ళ సరంజామా చూసాడు. "చాలా ప్లాన్ గా వచ్చారన్న మాట! అన్నాడు నవ్వుతూ. అతను కొండజాతి వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ బాషలో ఏదో చెప్పాడు. వాళ్ళంతా నెమ్మది నెమ్మదిగా గ్రూప్ దగ్గరికి రాసాగారు. మొత్తం గ్రూప్ లో మయూర ఒక్కటే చీర కట్టుకుని వుంది. మిగిలిన అందరూ పెంట్స్ లోనే వున్నారు. ఆడవాళ్ళు మయూరనూ మిగిలిన వాళ్ళను కుతూహలంగా చూడసాగారు. మోకాళ్ళకు పైగాకట్టుకొన్న ముతక నేత చీరలు చిన్న పిల్లలకు తప్ప పెద్ద వాళ్ళకు ఎవరికీ రవికలు లేవు. తలలు రేగి వున్నాయి.
    మమత కాస్త చొరవగా ముందు కొచ్చింది. వాళ్ళతో మాట్లాడదామని పెంట్స్ వున్న మమతను జూసి, ఆడవాళ్ళు వెనక్కు తగ్గారు. వాళ్ళలో ఒక పెద్దావిడ గుండెల మీద చేతులుంచుకొని సైగ చేస్తూ "మీరూ ఆడవాళ్ళేనా?" అని అడిగింది సైగలతోనే! అంతా ఒకసారి నవ్వేశారు. ఆడవాళ్ళు పై కోట్లు విప్పెసారు. మళ్ళీ నవ్వులు. వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. "మేము స్నానాలు చేస్తాం!' అన్నారు ప్రతాప్, హేమంత్ లు, మాస్టారు కొండ కొమ్ము మీద నుంచి పడుతున్న నీటి ధార చూపించారు. యువతీ యువకులు ఉత్సాహంతో చిందులు వేసారు. వాళ్ళందరి దగ్గర రెండేసి జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. వీలైన చోటల్లా ఒక జత ఉతికి ఆరేసు కొంటారు. ఒకటి కట్టుకుంటారు.
    పెద్ద పెద్ద లుంగీలు చుట్టుకుని అందరూ నీటి ధారల క్రిందకు పరుగుతీసారు సామానంతా మాస్టారి యింట్లో పడేసి. మయూర మాత్రమే అలా పరుగు తీయలేకపోయింది. కానీ, అంతలో తన సంకోచానికి తన మీద తనకే చికాకు కలిగింది. ఎంత స్వచ్చంగా ఉన్నారు ఆ యువతీ యువకులు. ఒక్కరి ముఖంలో నయినా వంకర చుపులున్నాయా? ఒక్కరయినా, మరొకరి వైపు దొంగచూపులు చూస్తున్నారా? అప్పుడే ప్రకృతి ఒళ్ళో తెరిచినా పసిబిడ్డల్లా ఉన్నారు వాళ్ళంతా.....ఛీ తన కెందుకీ సంకోచం? కట్టుకున్న చీరతోనే తనూ నీటి ధారల కిందకు నడిచింది మయూర. మయూర అంతకు ముందు రాలేదని అని కాని , అప్పుడు వచ్చిందని కాని ఎవరూ పట్టించుకోలేదు.
    ఎండలో నడిచి నడిచి వచ్చి ఎలాగో సాయంత్రానికి గమ్యం చేరుకున్న అలసటతో వారంతా ఆ నీటి చల్లదన్నాన్ని హాయిగా అనుభవిస్తున్నారు. మగపిల్లలంతా ఒక వైపుకీ.....ఆడపిల్లలంతా మరో వైపుకి చేరి స్నానాలు చేస్తున్నారు. ఆ నీటి ధారలు తల మీద పడి చల్లగా తలను తడుపుతుంటే, తన ఆరోగ్యమూ, అలసట మాయమైనట్లు అనిపించింది మయూరకు. పడమట దూరంగా ఏ కొండ చాటుకో సూర్యడస్తమిస్తున్నాడు. ఆ అరుణ రాగాలు ప్రకృతి అంతటా అలముకొంటూ ప్రకృతికే గిలిగింతలు పెడుతున్నాయి. తీవ్రమైన ఎండ తరువాత ఆ చల్లదనం ప్రక్రుతి సమన్నయానికి ప్రత్యక్ష సాక్ష్యంలా చాలా హాయిగా వుంది. ఏ కుత్సితాలు లేకుండా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కర్తవ్య దీక్షతో ముందడుగు వేస్తున్న ఆ యువతీ యువకులు ప్రకృతి సంతానంలగా వున్నారు. ఆ చన్నీటి ధారలలో హాయిగా తడుస్తూనే ఆ యువతీ యువకులను చూడసాగింది మయూర. వాళ్ళు స్నానాలు చేస్తూనే గోలగోలగా తమ కార్యక్రమం ఎలా అమలు పరచాలో చర్చించుకో సాగారు. ఎంత అందమైన జీవితం చూస్తోంది తను! అంతకు ముందు తను తిండి, నిద్రా కూడా మానేసి ఏంటో ఆసక్తితో చదివిన నవలలూ, వాటిలో జీవితమో గుర్తుకొచ్చాయి. అబ్బాయీ- అమ్మాయీ ప్రేమించుకోవడమూ,  పెళ్ళయ్యాకనో, కాక ముందో అపార్ధాలు రావటం - భర్త భార్యను అనుమానించటం - భార్య తాను నిర్దిషినని నిరూపించుకోవటం - అటు తిరిగి ఇటు తిరిగి కొద్ది భేదాలతో ఇలాంటి నవలలే చదివింది అన్నీ . ఎంతో ఆసక్తితో చదివింది. కానీ విసృతంగా పరచుకొన్న ఈనాటి జీవితానికీ, ఆ నవలలకూ ఏమైనా సంబంధముందా? ఇంత అందమయిన, ఇంత స్వచ్చమైన జీవితం ఏ నవలలో నైనా తాను చూడగలిగిందా? ఈ యువతీ యువకులంతా ముందు అడుగులేస్తూ నడుస్తోన్న నవతరం మనుష్యులు! రచయిత్రులూ, రచయితలూ అందరూ ఈ కాలంలోనే వున్నా మానసికంగా ఓ శతాబ్దం వెనుక జీవిస్తున్నా వారు! అందుకే ఆ నవలలు నిండా రూళ్ళ కర్ర సిద్దాంతాలు! యాంత్రికమైన నీతి సూత్రాలు! అర్ధరహితమైన పలికి మాలిన త్యాగాలు!
    స్నానాలు ముగించుకొని మిగిలిన వాళ్ళందరూ ధారల క్రింద నుంచి బయటికి వచ్చాక తనూ వచ్చింది మయూర. ఒళ్ళు తుచుకోనక్కర్లేకుండానే ఉదృతంగా వీచే అడవి గాలికి ఆరిపోయింది శరీరం.

 Previous Page Next Page