Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 33

 

    మొగపిల్లలు క్షణాలలో రెండు గుడారాలు సిద్దం చేసేసారు! అక్కడున్న గుడిసెల కంటే బాగున్నాయి ఆ గుడారాలు! నేలమీదకు కూడా గుడ్డ పరచుకుని క్రిమికీటకాలు బారి నుంచి రక్షణ ఏర్పాటు వుంది ఆ గుడారాలలో. రెండు గుడారాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మొగపిల్లలంతా ఒకదానిలో, ఆడపిల్లలంతా మరొకదానిలో ఉంటారని అనుకుంది మయూర. కానీ, వాళ్ళంతా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఒక చోట చేరడం చూసి "ఛీ! ఛీ! నాకే అన్నీ సంకుచిత భావాలు! చదువుకున్న అమ్మలక్కల మధ్య నుంచి వచ్చి కాంతివంతమయిన , ఈ నూతన జగత్తును హాయిగా చూడలేక పోతున్నాను. చదువుతో పాటు సంస్కారం వున్న వ్యక్తులు వీళ్ళు. శరీరాలతో పాటు మనసులు కూడా ఎదిగిన వ్యక్తులు వీళ్ళు!
    స్త్రీ పురుష సంబంధాలకు మించిన ఎంతో అందమైన జీవితం వుందని అర్ధం చేసుకొని ఆచరణలో చూపుతున్న ఈ తరం వ్యక్తులు వీళ్ళు" అనుకొంది. మాష్టారు వచ్చి బయట నిలబడి "మీ గుడారాలలో నేను ప్రవేశించలేను , బయటకు రండి. "అన్నారు - అందరూ వంగి బయటకు వచ్చారు. చెట్టు క్రింద వున్న సిమెంట్ అరుగును చూపిస్తూ "అదే నా బడి . అక్కడ కూర్చుందాం రండి." అన్నారు మాష్టారు - అంతా అక్కడ చేరారు. వింత వింత అడవి వాసనలతో చల్లగా వీస్తోంది గాలి!
    "ఇదా బడి!" అన్నాడు ఉదయ్.
    "పోవోయ్! కొత్తగా అడుగుతున్నావ్! ఇవన్నీ మనకి పాత కధలేగా!" అన్నాడు హేమంత్ విసుగ్గా.
    "కొత్త కధ అసలు మొదలు కదా అని" కష్టంగా అన్నాడు ప్రతాప్.
    మాష్టారు నవ్వి "మీరు వచ్చారుగా కొత్త కధ మొదలు పెట్టండి?" అన్నారు. తరువాత "మీరు తెచ్చిన లిటరేచర్ చూసాను. చాలా బాగుంది. అలంటి బుక్స్ తయారుచేయటానికి మీ ప్రభాకర్ సార్ చాలా శ్రమ పడి వుండాలి! పైకి చిన్న పిల్లలకూ, చదువురాని వాళ్ళకు బోధించే వాచక పుస్తకాలలాగా వుంటూనే దాంట్లో విలువైన సమాచారం ఎంతో పొందు పరిచారు. ఇలాంటి మారుమూల గ్రామాలలో వున్న జనాలకు ప్రస్తుత సాంఘిక, రాజకీయ సమగ్ర స్వరూపం అర్ధం కావటానికి ఎంతో ఉపయోగపడతాయి ఆ పుస్తకాలు. కానీ మీ క్యాంప్ ఒక నెల రోజులంటున్నారు నెలలో మీరెంత వరకూ చెప్పగలరు?" అన్నాడు.
    మాస్టారి మాటలతో యువక బృందానికి వుత్సాహం వచ్చింది. మాస్టారిలాంటి వ్యక్తుల సహకారం అన్ని గ్రామమలోనూ లభించదు. అనేక గ్రామాలలో బడి వుంటే మాస్టారుండడు, మాస్టారుంటే బడి వుండదు. మాస్టారూ బడి ఉన్నా చదువుకునే వాళ్ళు అసలు వుండరు. అంచేత మాస్టారి వ్యక్తిత్వమూ, అయన మాటలూ వాళ్ళకు మరింత వుత్సాహాన్ని కలిగించింది.
    ఉదయ్ తమ ప్రణాళిక వివరించాడు.
    "ఈ పుస్తకాలు కేవలం గైడ్ లైన్స్ గా మాత్రమే వుంచుకొంటాము. సాధ్యమయినంత వరకు చదువులాగ కాక బొమ్మలు చూపిస్తూ కధలు చెపుతున్నట్లు విషయం వివరించటానికి ప్రయత్నిస్తాము. మా ప్రధానోద్దేశం మేం చెప్పదలచుకున్న విషయాలు , అందరికీ అర్ధం కావలి! చదువు చెప్పటం ప్రధానం కాదు. విషయం తెలియటం ప్రధానం. ఒక్కొక్క చోట నెలకంటే ఎక్కువ ఉంటే ఏం చెయ్యగలం సార్? మేం ప్రారంభించింది మీ బోటివాళ్ళు మరింత పెంపోందించాలి?" గడుసుగా అన్నాడు ప్రతాప్.
    మాష్టారు నవ్వారు. మాస్టారిని చూసి నిర్భయంగా కొండజనులు కూడా- ముఖ్యంగా మొగవాళ్ళు చాలా మంది వచ్చి చేరారు. వాళ్ళలో కొందరికి యాసగా తెలుగు మాట్లాడటం వచ్చు. మాస్టారు అటు వాళ్ళకీ, ఇటు యువక బృందానికి మధ్య బాసీగా వ్యవహరించారు.
    నవనాగరీకంగా వున్న ఆ యువతీ యువకులు తమ మధ్యకు ఎందుకు వచ్చారో మాస్టారి ద్వారా తెలుసుకున్నాక కొండజనులకు ఆ యువక బృందం పట్ల అదర భావమే కలిగింది.
    మాష్టారు "పాపం, వీళ్ళు మిమ్మల్ని చూసి బెదిరి పోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఇంతవరకూ, వీళ్ళ అనుభవాలన్నీ అలాంటివే మరి? బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ భూములు లాక్కుని వీళ్ళను బానిసలుగా వుపయోగించుకుని ఏడిపించిన వాళ్ళే తప్ప స్నేహితులుగా వచ్చేవాళ్ళు చాలా అరుదై పోయారు. అంచేతనే వీళ్ళు ఎవరినీ నమ్మలేక పోతున్నారు" అన్నారు.
    యువక బృందం తమ భుజాలపై వేసుకొన్న కార్యభారం రెండు విధాలుగా వుంది.
    ఒకటి : అక్కడి వారిని ప్రభాకర్ రావు సార్ రూపొందించిన లిటరేచర్ సహాయంతో చైతన్యవంతం చేయటం - రెండు అక్కడే జనుల జీవిత విధానాన్ని గురించి వారి ఆలోచనా సరళి గురించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రిపోర్టు తయారు చేసి ప్రభాకరరావు సార్ కియ్యటం.
    ఆ రోజే పాఠం ప్రారంభించారు. అందమైన చార్ట్స్ తయారుచేసి , అవి చూపిస్తూ కధలలాగా విషయాలు వివరిస్తోంటే చాలా మంది వచ్చి కూర్చున్నారు. మాస్టారి కృషి వల్ల అంతకుముందే అక్కడి వారిలో చదువు పట్ల కొంత ఆసక్తి కలిగిందని అర్ధం చేసుకున్నారు యువక బృందం.
    అ కార్యక్రమం పూర్తయ్యాక స్టౌ వెలిగించ బోతుంటే మాస్టారు అడ్డుపడి మిరిక్కడి వచ్చి మీ యిన్ స్టెంట్ కాఫీలు, టిన్స్ ఫుడ్స్ తినటం కాదు, వీళ్ళతో కలిసి వీళ్ళెం తింటారో అది తినండి. అప్పుడు కాని వీళ్ళ జీవితం ఏమిటో మీకు పూర్తిగా అర్ధం కాదు" అన్నారు. యువతీ యువకులు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు. వాళ్ళకు చివరకు విచారం కలిగించింది ఒకటే అంశం . ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబానికి అతిధి కావలసి వచ్చింది. ఆ కారణం చేత అందరూ కలిసి అల్లరి చేసుకుంటూ సరదాగా భోజనం చేసే అవకాశం తప్పిపోయింది. కానీ వారి ఆచార వ్యవహారాలు మరింత సన్నిహితంగా పరిశీలించే అవకాశం వచ్చింది కదా అని సంతృప్తి పడ్డారు. మయూర ఇల్లు కొంత శుభ్రంగానే వుంది. ఆవిరి గడ్డితో నేసిన గుడిసె. ఈతాకుల చాపలు చుట్టలు చుట్టి వున్నాయి. గదులుగా విభజన ఏమి లేదు. అక్కడే ఒక వారగా వండి అక్కడే తింటారు. అక్కడే పాడుకుంటారు. లేకపోతే ఆరుబయట పాడుకుంటారు. వంటపాత్రలు చాలా వరకు కుండలే! కొన్ని అల్యూమినియం గిన్నె లున్నాయి. అల్యూమినియం కంచాలున్నాయి . అక్కడ ఆహారం తీసుకోవాలంటే, అనుకోకుండా మనసులో ఏదో కంపరం కలిగింది. అంతలోనే తన సంకుచిత్వానికి తానె సిగ్గుపడి , సాధ్యమైనంత వరకూ ఆ కుటుంబంలో ఒక వ్యక్తీ లాగా కలిసి పోవడానికి సిద్దపడింది. వంటి మీద బట్టలు లేకుండా ఆడుతున్న చిన్నపిల్లలను దగ్గరకు తీసి వాళ్ళకు బట్టలు తోడగాలని చూసింది! అసలు బట్టలే లేవని తెలుసుకుని నిర్ఘాంత పోయింది.
    ఆ ఇంటి గృహిణి ఒక తామరాకులో ఏదో పిండితో చేసిన రొట్టె, అల్యూమినియం గిన్నెలో పులుసు పెట్టింది. ఆ పదార్ధాలను తినలేకపోయింది మయూర. రుచీ పచీ లేదు. ఏదో ఆహారం అంతే! ఆ ఇల్లాలు మాత్రం సంకోచమనేది లేకుండా ఏడాది నిండిన బిడ్డకు స్తన్యమిస్తూ ఎదురుగా కూచుని నవ్వుతోంది!
    మయూరకు మనసంతా కలచినట్లయింది. ఇంతవరకూ తానేదో కష్టపడ్డాననుకొంది. అసలు కష్టమంటే ఏమిటి? పసిబిడ్డకు తొడగడానికి బట్టలైనా లేకుండా ఇలాంటి తిండి తింటూ సంతృప్తిగా నవ్వుతోంది ఆ ఇల్లాలు! అంత హాయిగా నవ్వుతోన్న ఆ అమాయకురాలికి తన అనుభవంలోకి రాని జీవితం ఎంత ఉందొ తెలుసునా?
    అతి ప్రయత్నం మీద ఆ పులుసుతో రొట్టె తిని బయట పడింది మయూర. అప్పటికే మిత్ర బృందమంతా ఒక చోట గుమిగూడారు . మయూర వాళ్ళ మధ్యకు వచ్చి కూచుంది.
    "ఎక్సెలెంట్ ఫుడ్. న్యూట్రిషస్ డెలిషస్.....చాలా బాగుంది !" బొజ్జ నిమురుకుంటూ అంటున్నాడు హేమంత్.
    "అవునవును! ఇంకా ఆ రుచి గొంతులోనే వుంది."
    "హయ్ ! హయ్! మరో ఇరవై తొమ్మిది రోజులు మనకి మహా భాగ్యం!"
    ఒకరితో ఒకరు పోటీలు పడుతూ తాము తిన్న ఆహారాన్ని పొగుడు కుంటున్న ఆ యువతీ యువకులను చూసి తెల్లబోయింది మయూర. "మీరు తిన్న చోట ఆహారం బాగుందా? నేను తిన్న చోట ఏం బాగాలేదు. ఎలాగో తిన్నాను" అంది.
    మయూర మాటలకూ వాళ్ళంతా మయూర ముఖంలోకి హేళనగా చూశారు. తరువాత ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. ఒక్కసారిగా విరగబడి నవ్వేశారు. మయూరకు అర్ధమయింది. సిగ్గుతో ముఖం ఎర్రబడగా తల దించుకుంది. "అలా తల దిన్చుకోవటం కాదు. ఇప్పుడు చెప్పండి మీరు తిన్న తిండి ఎలా ఉందొ!" నవ్వుతూనే అన్నాడు ఉదయ్.
    మయూర తల ఎత్తి "చాలా బాగుంది!" అంది.
    అందరూ మరోసారి నవ్వుకున్నారు.

 Previous Page Next Page