మమత లేచి నిలబడి "కబుర్లు చాలు! లెటజ్ స్టార్ట్! గెటప్ మెన్ " అంది.
కిరసనాయిల్ స్టౌ మీద పాలపొడి పాలతో కలిపిన ఇన్ స్టంట్ కాఫీ తాగి అందరూ లేచారు. టిన్స్ అన్నీ చకచక బెగ్స్ లోకి సర్దేసారు - బెగ్స్ భుజాలకు తగిలించుకున్నారు. అన్నింటి కంటే బరువు టెంట్స్! అవి ఇద్ద్దరు కలిపి కావిడి లాగ పట్టుకున్నారు. ఉదయ్ దగ్గర మేప్ వుంది. అతడు మేప్ నూ, పరిసరాలనూ పరిశీలిస్తూ మార్గం నిర్దేశిస్తున్నాడు, బరువైన బేగ్ భుజానికి తగిలించుకొన్న మమత కొంచెం ముందుకు వంగి నడుస్తూ , ఈ మెప్ లు బ్రిటీష్ గవర్నమెంట్ కాలం నాటివన్నారు ప్రభాకర్ సార్! అప్పటికిం ఇప్పరికీ ఏమైనా మారిందేమో జాగ్రత్తగా చూడు! అంది.
ఉదయ్ నవ్వుతూ :మన ఇంటీరియర్ గిరిజన ప్రాంతాలు. బ్రిటిష్ గవర్నమెంట్ కాలం నుంచీ, ఈనాటి వరకూ ఆవగింజంతయినా మారలేదు. ఆ భయం నీకేం అక్కర్లేదు!" అన్నాడు.
"అయ్యయ్యో! అయితే మన ప్రభుత్వం వారి ప్రణాళికలు!"
"వాటికేం? అవి నిక్షేపంగానే ఉన్నాయి. కాగితాల మీద."
'అయితే ఈ ప్రణాళికలు అమలు జరపనందుకు ప్రణాళికలు సరిగ్గా పనిచేయనందుకు దానికి సంబంధించిన అధికారుల మీద ప్రభుత్వం ఏమి చర్య తీసుకోదా?"
"ఎందుకు తీసుకొదూ? ఆ వివరాలు పరిశీలింపమని కమిషన్లూ నియమిస్తుంది."
"ఆ తర్వాత....?"
ఆ కమీషన్ల నిర్వహణకు కోట్ల సంఖ్యలో డబ్బు ఖర్చవుతుంది!"
"ఆ తరువాత"...."
"ఆ కమిషన్లు విచారించిన అంశాలు ఏమి లేవు గనుక ఆ కమిషన్లు వ్యర్ధమని కమిషన్లు రద్దు చేసేస్తుంది"
అందరూ ఒక్కసారి విరగబడి నవ్వారు. భుజాల మీద బరువు- ఎండకు వళ్ళంతా పట్టిన చెమటలు కాలి నడకన ప్రయాణం చెయ్యటం వల్ల కలుగుతున్న శ్రమ. అన్నీ ఆ నవ్వులలో ఎగిరిపోయాయి.
"ఓ గాడ్" అని కేకపెట్టి నడుస్తున్నది ఆగిపోయింది శాంత కిందకు భయంగా చూస్తూ. అందరూ ఆగిపోయారు. శాంత కాళ్ళ దగ్గిర పడి వున్న స్త్రీ శరీరాన్ని చూసారు. వాళ్ళలో ఉదయ్, ప్రతాప్ లిద్దరూ మెడిసిన్ విద్యార్ధులు. ప్రతాప్ ఫైనల్ లో ఉన్నాడు. ఉదయ మూడో సంవత్సరంలోకి వచ్చాడు. ఫస్ట్ అయిడి సరంజామా వాళ్ళ దగ్గర వుంది - ప్రతాప్ ఆ యువతిని పరీక్షించి - "ప్రాణాలతోనే వుంది" అన్నాడు - తరువాత ఏం చేయ్యాలన్నట్లు అందరూ నిస్సహాయంగా ప్రతాప్ నే చూసారు. -" సొమ్మసిల్లి పోయింది- ముందు ముఖం మీద నీళ్ళు చల్లాలి! ఆ తర్వాత ఏదైనా పట్టించాలి! తెరుకోవచ్చు" అన్నాడు - అందరూ ఒకరి ముఖాలోకరు చూసుకున్నారు. వాళ్ళ దగ్గిర రెండు మూడు వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వాటిలో నీళ్ళు ఇలా ఖర్చు చేస్తే మళ్ళీ నీటి సదుపాయం ఉన్న ప్రదేశం చేరుకునే వరకూ నీళ్ళు దొరకటం కష్టం -- దాహం వేసినా తాగటానికి నీళ్ళు వుండవు - వాళ్ళు తటపటాయించింది. కొన్ని క్షణాలు మాత్రమే - శాంత తన సంచిలోంచి వాటర్ బాటిల్ ప్రతాప్ కందించింది - తేజస్వి స్టౌ వెలిగించి చిన్న గిన్నెలో నీళ్ళు వడేసింది. పాలపొడి డబ్బా, ఇన్ స్టెంట్ కాఫీ డబ్బా, తీసింది - హేమంత్ రైఫిల్ చేత్తో పట్టుకుని చుట్టూ చూస్తూ ఓ కంట ప్రతాప్ ని తెలివి లేని యువతిని చూస్తూ తిరుగుతున్నాడు - ప్రతాప్ ఆ యువతి ముఖం మీద నీళ్ళు చల్లాడు. వాటర్ బాటిల్ ఖాళీ అయింది- కానీ , శ్రమకు ఫలితం దక్కింది - ఆ యువతి కళ్ళు తెరిచింది. వెంటనే తేజస్వి కాఫీ త్రాగించింది.
"ఓ గాడ్" ఈవిడ చాలా బలహీనంగా వుంది. ఈ స్టితిలో ఎందుకు బయలుదేరినట్లు? అందులో ఒంటరిగా ..." అన్నాడు ఉదయ్ ఆ యువతి స్థితి చూసి నివ్వెరపోతూ. మనోహరి, రీటా - ఆ యువతి పక్కనే ఉన్న సంచి చూసారు అందులో ఒక జత బట్టలు కొద్దిగా డబ్బు, ఒక పెద్ద కట్ట మెప్స్ వున్నాయి.
ఆ మెప్స్ చూడగానే అందరూ ఒక్కసారిగా ఈవిడ దగ్గిర ఇంటిరియల్ , విలేజెస్ కి మాప్స్ ఉన్నాయి!" అన్నారు ఆశ్చర్యంగా.
"కానీ ప్రభాకర్ సార్ అన్ని మెప్సూ ఒక్కళ్ళకే ఇయ్యరు! ఒంటరిగా అసలు పంపరు!" ఆలోచిస్తూ అంది శాంత. ఈలోగా ఆ అయుతికి కొంచెం శక్తి వచ్చింది. కొంతసేపు అయోమయంగా అందర్నీ చూసినా - త్వరలోనే కోలుకుని "థాంక్స్!" అంది -
"మీ రెక్కాడి నుంచి బయలుదేరారు? ఇక్కడి కేలా వచ్చారు? రూట్ ఎలా ఎలా తెలిసింది? ఈ మెప్స్ ఎలా వచ్చాయి మీ దగ్గరికి? రాత్రి ఎక్కడున్నారు? ఒంటరిగా ఎందుకు బయలుదేరారు?"
ఇలా ప్రశ్నల వర్ధం కురిసింది ఆ యువతి పైన నాలుగు వైపులా నుంచి...."
పాపం. ఆ యువతి వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. ఎలాగో ఓపిక తెచ్చుకుని "నాకు కూడా మీ గ్రూప్స్ లో చేరాలనిపించింది. ఇంట్లో ఒప్పుకోలేదు - అందుకని చెప్పకుండా వచ్చేసాను!"
నివ్వెరపోయారు అందరూ. కొంత చికాకు కూడా గలిగింది ఆమె మూర్ఖత్వానికి.
ప్రతాప్ కొంచెం తీక్షనంగానే "మీకు ఆరోగ్యం అంతగా బాగున్నట్లు లేదు కదూ" అన్నాడు.
"అవును!" ఒప్పుకుంది ఆ యువతి.
"మరి, ఈ అనారోగ్యస్థితిలో గ్రూప్స్ లో చేరి ఏం సాధిద్దామని వచ్చినట్లు! చికాగ్గా అన్నాడు - ఆ యువతి తల వంచుకోంది. తేజస్వి ప్రతాప్ ను సమాధాన పరుస్తూ ఆ యువతితో నిదానంగా "మీ దగ్గరికి ఆ మెప్స్ ఎలా వచ్చాయి? మీరు ఎక్కడికని బయలుదేరారు?" అంది.
"ఆ మెప్స్ నా స్నేహితురాలి దగ్గర సంపాదించాను. ప్రత్యేకించి ఒక చోటికని బయలుదేరలేదు. చేతి కందిన మేప్ తీసుకున్నాను- అందులో రాసిపెట్టిన ఊరికి టికెట్ కొనుక్కుని రాత్రి బయలుదేరి ఇవాళ ఉదయమే చేరుకున్నాను- ఆ తరువాత నడక ప్రారంభించాను."
"మై గుడ్ నెస్! ఒంటరిగా! మీకు రూట్ తెలుసా ఈ ప్రయాణంలో ఉండే ప్రమాదాలు తెలుసా!"
"ఏం తెలియదు - భగవంతుడ్ని ధ్యానిస్తూ నడక ప్రారంభించాను!"
గ్రూప్స్ లో కొందరు ఈ మాటలకు గట్టిగా నవ్వారు - తేజస్వి కనుసైగతో వారించి ఏమి అనుకోకండి. మాలో ఎవరమూ ఒక మూల కూచుని దేవుణ్ణి ధ్యానించటంలో నమ్మకం లేని వాళ్ళం - అంచేత అలా నవ్వారు" అంది -
"మీరు అదృష్ట వంతులు! మీకు ఒక మూల కూచుని ధ్యానం చెయ్యవలసిన అవసరమేముందీ . మీరు చేస్తున్నదీ చెయ్యబోయేదీ , అంతా తప్పస్సు కాక మరేమిటి? విశ్వరూపి అయిన భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రమైన తపస్సు!"
ఈసారి వాళ్ళలో ఎవ్వరూ నవ్వలేదు - ఆ యువతిని గౌరవంగా చూసారు.
"మీ పేరు?" అని అడిగింది మమత.
"మయూర!" అని సమాధానం చెప్పింది ఆ యువతి -
తలవని తలంపుగా ఆ గ్రూప్ అంతటికీ సమస్యగా తయారయింది మయూర - లేచి నిలబడలేని స్థితిలో వుంది. వదిలేసి వెళ్ళలేరు. ఆ ఎండలో - ఆ అడవి మధ్య - నీటి వసతి లేని చోట ఆగటానికి వీలులేదు.
గోచీ పెట్టుకుని భుజానికి ఒక పెద్ద గొనె సంచి మూట తగిలించుకొని , ఆ ఎర్రని ఎండలో అడవి దారిన నడిచి వస్తున్నాడు ఒక కొండ దొర. అడవి మధ్యలో నాగరిక జన సమూహాన్ని చూసి ఆగిపోయాడు. హేమంత్ కి ఇటీవలి సంచారాలతో ఈ అడవి జాతులతో ఎలా వ్యవహరించాలో అర్ధమయింది. అతడు సైగలతో మయూరను చూపించి జబ్బుగా వుందని చెప్పి నీళ్ళు వుంటే కావాలని సైగలతో అడిగాడు. అతడు హేమంత్ చేతిలో వున్న రైఫిల్ ని భయంగా చూసాడు - హేమంత్ మళ్ళీ అతడిని చంపనని సైగ చేసి. టిన్ లో వున్న చేపలను బహుమతిగా ఆశ చూపించాడు. అతడు జంకుతూనే దగ్గరగా వచ్చాడు. మయూరను చూసాడు. చెయ్య పట్టుకుని చూసాడు. కనుబొమ్మల మధ్య వేలుంచి చూసాడు. తన బాషలో ఏమేమో అన్నాడు. వీళ్ళకు సరిగా అర్ధం కాలేదు కాని, రవి విసుగ్గా "ఇతను ఈవిడకి దెయ్యం పట్టిందంటున్నాడు!" అన్నాడు. మిగిలినవాళ్ళు చిన్నగా నవ్వారు. అతడు అందరి చూసి రోషంతో తల అడ్డంగా తిప్పి ఒక చిన్న కొయ్య గిన్నెలో ఏదో వేరు రసం పోసి ఇచ్చాడు.