నేనూ, నాతోపాటు నావొంటరి తనము మిగిలాము.
గుండెల్లో నొప్పి తిరిగి సన్నగా మొదలైంది. దాంతో నా ఆలోచనలు నా జీవితంవైపుకి మర్లాయి. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను. ఆ విషయం డాక్టర్లు చెప్పలేదు. బహుశా నాలుగైదు నెలలేమో ఈ కొద్ది సమయంలో ప్రమద్వర భవిష్యత్తు ఎలా ఒకదారిలో పెట్టగలను? దేనికైనా డబ్బుకావాలి.
ఏ సమస్యని ఎక్కడనుంచి తీసుకున్నా అది డబ్బు దగ్గరికి వచ్చి ఆగిపోవటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చివరికి ప్రేమకూడా డబ్బుతోనే ముడిపడి పోయింది.
గుండెల్లో నొప్పి మరింత ఎక్కువైంది. మంచినీళ్ళు తాగుదామని లేస్తూ స్పృహ తప్పిపోయాను.
....
మళ్ళీ నాకు స్పృహ వచ్చేసరికి డాక్టర్ నన్ను పరీక్షిస్తున్నాడు. పక్కనే ప్రమద్వర వుంది. నేను కనులు విప్పటం చూసి, డాక్టర్ "ఎలా వుంది?" అని అడిగాడు.
"ఇప్పుడు ఫర్వాలేదు. అకస్మాత్తుగా నొప్పి వచ్చింది. తరువాత ఏం జరిగిందీ తెలియదు" అన్నాను.
"వ్రాయటానికి మందులు ఏమీలేవు. ఆపరేషన్ చేయాలి అంతే" అన్నాడు డాక్టరు.
"వచ్చి చూసినందుకు చాలా థాంక్స్" అన్నాను. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఇద్దరు గణితశాస్త్ర నిపుణులు మాట్లాడుకున్నట్టు చాలా క్లుప్తంగా జరిగింది మా సంభాషణ.
"ఎంతసేపయింది నువ్వొచ్చి" అడిగాను- డాక్టరు వెళ్ళిపోయాక.
"అరగంట... నేనొచ్చేసరికి మీరు పడిపోయి వున్నారు ఇప్పుడెలా వుంది?"
"బాగానే వుంది. మళ్ళీ వెంటనే వచ్చావేం? ఏమిటి సంగతి?"
ఆమె వెంటనే సమాధానం చెప్పకుండా కొంచం ఆగి, నెమ్మదిగా అంది- "ఇప్పుడే తరళా వాళ్ళ నాన్నగారు నన్ను కలుసుకున్నారు".
నేను దిగ్భ్రమ చెందాను. ఆయన గొప్ప వ్యాపారవేత్త అని తెలుసు కానీ, మరీ ఇంత తొందరగా పావులని కదుపుతాడని తెలీదు. "ఏమిటట విషయం?" అన్నాను. "ఎలాగైనా తన కూతురికి ఈ సంబంధం కుదిరేలా చెయ్యమని నిన్ను వేడుకుని వుంటాడు. ణ అవూహ కరెక్టయితే ఇప్పుడు నువ్వా విషయం మాట్లాడటానికే వచ్చి వుంటావు. అవునా-"
"అవును" అంది ఆమె తలదించుకుని.
"ప్రేమ త్యాగాన్ని కోరుతుందనీ, ప్రేమకి అర్ధం విడిపోవటమే అనీ, స్వచ్చమైన ప్రేమకి వివాహం పరాకాష్ట కాదనీ, నన్ను మర్చిపొమ్మనీ, తరళని చేసుకొమ్మనీ అడగటానికి వచ్చావు. అస్తమిస్తున్న సూర్యుడివైపు వెళ్ళిపోవటానికి, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకున్నావు. అంతేనా?"
ఆమె తల అడ్డంగా వూపుతూ, "కాదు" అంది.
ఆశ్చర్యంగా, "మరి" అన్నాను. "ఆయనొక మంచి బేరం పెట్టారు. నిన్ను తరళతో వివాహానికి ఒప్పిస్తే, నాకు పట్నంలో మంచి ఉద్యోగం వేయిస్తారట. అంతేకాదు, నా వివాహానికి ఏభైవేపు బ్యాంకులో కూడా వేస్తారట. పైగా మా ఇంటి వాళ్ళు నావైపు కన్నెత్తి చూడటానికి కూడా వీల్లేకుండా ఏర్పాట్లు చేయిస్తారట".
నేను బిగ్గరగా నవ్వి "అసాధ్యుడిలా ఉన్నాడే ఆ ముసలాడు. ఇంతకీ నువ్వేమన్నావ్?" అడిగాను.
"ఈ పద్దతి బాగానే వుంది ప్రయత్నిస్తానన్నాను".
నా మొహంలో నవ్వు మాయమైంది. "ఏమిటీ?" అన్నాను రెట్టిస్తూ. "కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. భావాలూ... ఊహలూ....వాటికేం....అవెప్పుడూ బాగానే ఉంటాయి. సమస్యలు ఎలా తీరతాయా అన్నది ముఖ్యం. ఆయన ముందు చెప్పినప్పుడు నేనూ ఆవేశపడ్డాను. కానీ తీరిగ్గా ఆలోచిస్తే-ఇంతకన్నా మంచి పరిష్కారం ఏముంది అనిపించింది. ఈ విధంగా అయితే ముగ్గురి జీవితాలూ బాగుపడతాయి".
"చాలాపు" అని అరిచాను.
ఆమె ఏమీ తత్తరపడలేదు. లేచి నిలబడింది.
"ఆయన చెప్పినదాన్లో నాకేమీ తప్పు కనపడలేదు. నేను కళావంతుల కులానికి చెందినదాన్ని అవటంవల్ల బహుశా ఆ వ్యాపారగుణం నా రక్తంలో జీర్ణించుకుపోయి, ఆయన చెప్పిన దాన్లో 'వాస్తవాన్ని' తొందరగా గ్రహించేలా చేసిందేమో! మీరూ తీరిగ్గా ఆలోచించండి-" అని అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
నేను కట్రాటలా నిలబడిపోయాను, చుట్టూ వున్న వస్తువులు గిర్రున తిరుగుతున్నట్టు అనిపించసాగాయి.
జి.పి. రావు చెప్పిన కథ
తరళ నా ఒక్కగానొక్క కూతురు.
నా కూతురు కావాలంటే కొండమీద కోతైనాసరే దిగిరావల్సిందే- ఎందుకురాదు. కొండచుట్టూ పదిమంది మనుష్యుల్ని పెట్టి, చేతికి వలలిచ్చి ఒక క్రమపద్దతిలో నెమ్మదిగా పైకి ఎక్కిస్తే కోతి దొరక్క ఎక్కడికి పోతుంది? మనిషికి పదిరూపాయలు కూలీ అనుకున్నా- మొత్తం వంద అవుతుంది? అంటే....మనం ఎంతో ఆశ్చర్యంగా, అద్భుతంగా చెప్పుకునే "కొండమీది కోతి" ఖరీదు అంతా చేస్తే వంద రూపాయలన్నమాట! ఆలోచించండి. నామాటలో నిజం మీకు బోధపడుతుంది. నా థియరీ ఏమిటో మీకు అర్ధమవుతుంది.
మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి!
నా కూతురంటే నాకు వల్లమాలిన గారాబం ఉంటే ఉండొచ్చు కానీ, తను అడిగిన ప్రతిదీ తెచ్చి ఇవ్వటం మాత్రం కేవలం ఆ ఒక్క గారాబంవల్ల మాత్రంకాదు. నా అహం వల్ల!
తనెంత కష్టమైనది అడుగుతే దాన్ని సంపాదించి తెచ్చి పెట్టడంలో నా కంత సంతృప్తి లభిస్తుంది. చిన్నప్పుడు ఏనుగు బొమ్మ అడిగింది. ఏనుగు పిల్లను తెప్పించాను. ఆ రోజుల్లో రెండు వేలయింది.
"సరిగ్గా వినలేదమ్మా, ఏనుగు బొమ్మ అడిగావా? ఏనుగు పిల్లలా వినపడింది. పోన్లే తిరిగి పంపించేస్తాను" అన్నాను. పంపటానికి మూడొందలు ఖర్చయింది. రెండువేలూ తిరిగోచ్చాయి. రాకపోయినా పెద్ద పట్టించుకునే వాణ్ణి కాదు!
గోదారి రెండుగా చీలినచోట మధ్యలో దీవి మాది. ఆ రోజుల్లోనే పదివేలకి పైగా జనాభా వుండేది. మూడొందలు ఖర్చు పెట్టటం ద్వారా పదివేలమంది ప్రజలు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుని "కూతురు ఏనుగు బొమ్మ అడిగితే ఏనుగు పిల్లని తెప్పించాడట్రా మన గోపాలరావుగారు" అనుకునేలా చేయటం అంత సామాన్య విషయం కాదు. చాలాకాలం వరకూ దీన్ని కథలుగా చెప్పుకున్నారు మా పరిసర ప్రాంతాల్లో.... మూడొందల ఖర్చుతో.
ఇప్పుడు చెప్పండి నేను తెలివైన వాన్నో కాదో...
ఈనాటికి కూడా నేను ఈ పల్లెకి మకుటంలేని మహారాజుని ఈ పల్లెలో అందరికీ నేనంటే భయమూ, భక్తీ... ణ ఏనుగు థియరీ ఎప్పుడూ తప్పదు. ఈ అమాయక ప్రజల దృష్టిలో ఆ స్థానం ఎలా నిలబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు.
అలాంటి థియరీకి చిన్న దెబ్బ కొట్టింది. నా కూతురు-
ఆనందరావు అనే అనామకుణ్ణి ప్రేమించానని చెప్పి.