Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 32


    "అలాంటి ఆడవాళ్ళు సంఘానికి చీడపురుగులు. నీలాంటివాడినే వల్లో వేసుకోగల వీళ్ళు యింకేం చెయ్యరు? ఇలాంటివారు స్త్రీ జాతికే మాయని మచ్చలు - తీరని కళంకాలు!" ప్రసాదరావు కాలేజీ స్టూడెంట్సుకు లెక్చరిస్తున్న ధోరణిలో చెప్పుకుపోతున్నాడు.   

 

    "కొయ్యకు చేవ వున్నంతకాలం చీడపట్టదు. కొందరు స్త్రీలు మీరన్నట్లే సంఘానికి చీడపురుగుల్లా తయారుకావచ్చు. కాని దానికి బాధ్యులెవరు? కొయ్యలో బలహీనత వచ్చినప్పుడే చీడ పడుతుంది. అలాగే సంఘంలో బలహీనతే సంఘానికి చీడపురుగుల్ని తయారుచేస్తుంది. అది చూసి సంఘాన్ని శాసించే అంతస్థుగలవాళ్ళు సిగ్గుపడాలి."

 

    చంద్రం వుద్రేకంగా అన్న మాటలకు హేమకు వళ్ళు మండిపోయింది. చంద్రం ఆ బజారు పిల్లను సమర్థిస్తున్నాడని అసహ్యం వేసింది.

 

    "నువ్వు సమర్థించేవాళ్ళు అందమైన శరీరం మీద పుట్టే కురుపులాంటివారు. చీము, రక్తం కారుతూ చూసేవాళ్ళకు జుగుప్సను కలిగిస్తాయి కురుపులు. అందువల్ల ఆ అందమైన శరీరం అంతా కుళ్ళిపోయిందనీ, ఈ కురుపుకు కారణం అదేననీ నిందించం. అలాగే బరితెగించి, కొందరు ఆడవాళ్ళు వ్యభిచారిణులుగా తయారౌతూ నీతి నియమాలు లేకుండా ప్రవర్తిస్తూ సంఘానికి మానని జుగుప్సాకరమైన కురుపుల్లా తయారవుతున్నారంటే నువ్వు మొత్తం సంఘాన్నే ఎలా నిందిస్తావు?" అంది హేమ. అం ధోరణిలో ఉద్రేకంకంటే ఎక్కువగా ఉడుకుబోతుతనం ధ్వనించింది.

 

    చంద్రం నవ్వుతూ తాపీగా జవాబిచ్చాడు:

 

    "శరీరం అందంగా పైకి ఆరోగ్యంగా కనిపించవచ్చును. కాని శరీరం మీద అసలు కురుపు పుట్టటం అంటే ఆ శరీరం అంతా అనారోగ్యానికి గురి అయిందన్నమాట. రక్తంలో రోగక్రిములు ప్రవేశించి రక్తాన్నంతా కలుషితం చేస్తున్నాయన్నమాట. ఆ చచ్చిన క్రిములు కురుపు ద్వారా బయటపడకపోతే లోలోపలే కుళ్ళి, రక్తాన్నంతా విషతుల్యంగా మార్చవచ్చు. అంటే - ఒక విధంగా ఆ కురుపు ఆ శరీరాన్ని కాపాడుతుంది. అలాగే సంఘం పైకి చాలా అందంగా కనిపించవచ్చు. పెద్ద మనుషుల్లా సంస్కారపు ముసుగుల్లో నవ నాగరీకుల్లా, నీతిమంతుల్లా కనిపించే ఎందరు తమకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకోకుండా వుండకలుగుతున్నారు? అలాంటివారిలో బయలుదేరిన అనారోగ్యమే కొందరు అసహాయులు సంఘానికి కురుపుల్లా తయారుకావటానికి కారణం మనకు చరిత్ర ద్వారా తెలిసిన మొదటి వేశ్య మన దేశంలో అంబాపాలి. ఆమెతోనే అది ఒక వృత్తిగా తయారయినట్లు తెలుస్తుంది. తమ సామ్రాజ్యాన్ని సుస్థిరంగా వుంచాలంటే పెద్ద అధికారులంతా ఐకమత్యంగా వుండాలి. దాని కొరకు అందరికీ ఇష్టమైనదీ, అందరికీ సమానంగా వుపభోగ్యమయినదీ అయిన ఒక వస్తువుండాలని కొందరు రాజనీతజ్ఞులు అందమైన అంబాపాలీని వేశ్యగా మార్చారు."  

 

    "అంటే - నువ్వు అవినీతినీ, వ్యభిచారాన్నీ సమర్థిస్తున్నావన్నమాట" అన్నాడు ప్రసాదరావు దుడుకుగా.   

 

    "నేను అవినీతిని సమర్థించటం లేదు. అసలు ఏది అవినీతో తెలుసుకోమంటున్నాను. ఆ మాటకొస్తే అవినీతి అనేది దేశ కాలాలనుబట్టి మారుతూ ఉంటుంది. మనం దేనిని ఈనాడు నీతి అనుకుంటున్నామో అది కొన్నాళ్ళ తరువాత అవినీతిగా పరిగణించ బడవచ్చును."  

 

    "ఆ జనంతో చేరి వాళ్ళను వెనకేసుకొస్తున్నావన్నమాట" ప్రసాదరావు ఈసడింపుగా అన్నాడు.

 

    చంద్రం ఓ క్షణకాలం విస్తుపోయి ప్రసాదరావు ముఖంలోకి దీక్షగా చూసి మళ్ళీ ప్రారంభించాడు:

 

    "ఆర్థికంగా, సాంఘికంగా, తక్కువ స్థాయిలో వుండి చదువూ, నాగరికతా లేని వాళ్ళంతా నీతిలేని వాళ్ళనుకోవటం, ముఖ్యంగా, మీలాంటివారు అనుకోవటం - చాలా పొరపాటు. అన్నీ వుండీ అవినీతిగా ప్రవర్తిస్తూ కూడా సంఘంలో ప్రముఖ స్థానాలను ఆక్రమించుకొని పెద్ద మనుషుల్లా, గౌరవనీయుల్లా, చలామణీ అవుతున్నవాళ్ళు ఎందరు లేరు? ఉదాహరణకు, గౌరిని, అంటే ఆ రోజు మీరు చూసిన అమ్మాయిని తీసుకోండి. మీరు అనుకున్నట్లు ఇంకా ఆ అమ్మాయి ఎలాంటి అవినీతికరమైన జీవితానికీ పాలుపడలేదు. మీరు ఆ అమ్మాయిని గురించి ఊహించుకున్నదంతా భ్రమ మాత్రమే. చిన్నతనం నుంచీ ప్రపంచానికి దూరంగా అనాధ శరణాలయంలో చేరింది. చదువు సంధ్యలు లేకపోయినా, అమాయకురాలే అయినా, ఆమెలో అవినీతిని ఎదుర్కొనే స్వభావం ఉంది. అందుకే అవినీతిని ప్రోత్సహించే ఆ శరణాలయం నుంచి పారిపోయి వచ్చింది. ఆ పిల్లకి అదృష్టవశాత్తూ ప్రకాశం దగ్గిర ఆశ్రయం దొరికింది. లేకపోతే ఆ వయస్సులో వున్న ఆడపిల్ల అనాధగా బజారులో నిలిచిపోయినప్పుడు సంఘం ఆమెను నీతిగా బతకనిస్తుందా? ఒకవేళ ఆ పిల్లే చెడిపోయి వుంటే - దానికి బాధ్యులు ఎవరై ఉండేవారు?"   

 

    చంద్రం ఉద్రేకంతో మాటలు దొరక్క ఓ నిముషం మౌనం వహించాడు. మళ్ళీ అదే ధోరణిలో అందుకున్నాడు:

 

    "మానవుడు కొంతవరకే పరిస్థితులకు ఎదురు ఈదగలడు. చివరకు ప్రవాహ వేగానికి తలవంచక తప్పదు. ముఖ్యంగా గౌరిలాంటి అనాధల జీవితాలు, ఖాళీ అయిన తరవాత నీటిమీద పారవేసిన వార్నీసు డబ్బాల లాంటివి. నీటి ప్రవాహం మీద ఖాళీడబ్బా కొంతసేపు మునుగుతూ తేలుతూ ముందుకుపోతుంది. ఆ ప్రవాహం కొంతసేపు దానితో ఆడుకొని చివరకు పూర్తిగా ముంచివేస్తుంది. అలాగే వీరికోసం ఎలాంటి వసతులూ, సౌకర్యాలూ ఎవరూ కల్పించలేదు. పెద్దవారి అండా, రక్షణా, ప్రేమా ఉండదు. తెగిన గాలిపటాలలాంటి వారి బ్రతుకులు ఎటు పోతాయో, ఏ ముళ్ళ కంచెమీద పడి చిరిగిపోతాయో ఎవరికీ అక్కరలేదు. కాని, చివరకు దగాపడిన వారి జీవితాలను చూసి సంఘానికి చీడపురుగులంటూ ఏవగించుకుంటారు."   

 

    వింటున్న హేమ ముఖం కోపంతో కందగడ్డలా అయింది. ప్రసాదరావు చంద్రం మాటలకు అడ్డువస్తూ అన్నాడు:

 

    "నువ్వు సమర్థిస్తున్న ఆ పిల్ల ఏ పాప ఫలమో అయివుంటుంది. అందుకే అనాధశరణాలయానికి చేరవేయబడింది." ప్రసాదరావు స్వరంలో ఉద్రేకం కంటే కోపం ఎక్కువగా ధ్వనించింది.

 

    చంద్రం ముఖంలో ఉద్రేకం స్థానాన్ని చిరునవ్వు ఆక్రమించుకుంది. తాపీగా ప్రసాదరావు ముఖంలో ఓ క్షణం చూసి అన్నాడు:

 

    "కావచ్చు. కాని, అది ఆ అమ్మాయి చేసిన తప్పు కాదుగా! ఏ అవివాహితో లేక వితంతువో దగాపడి వుంటుంది. జీవితంలో మోసగింపబడి వుంటుంది. ఫలితంగా మోసగించి పారిపోయిన వాడికి సంఘంలో యధాస్థానం ఉంటుంది. కానీ మోసగింపబడిన ఆ అమాయకురాల్ని సంఘం బహిష్కరిస్తుంది. కన్న తల్లిదండ్రులు కూడా క్షమించరు. అలాంటప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఈ సందర్భంలో ఎక్కడో చదివిన వాక్కులు గుర్తొస్తున్నాయి..... 'ఒక స్త్రీ తన మెడలోని ముత్యాల హారాన్ని ఏం చేసినా సంఘం పట్టించుకోదు. పదిమంది చూస్తుండగా ఆమె దాన్ని నదిలో పారేసినా ఆమెను శిక్షించదు. కాని తమ శరీరంలోని భాగమైన గర్భాన్ని గాయపరచుకుంటే ఆమెను న్యాయశాస్త్రం శిక్షిస్తుంది. అలాంటి స్త్రీలు రహస్యంగా ఇల్లు విడిచి పారిపోయి ఆ పుట్టిన బిడ్డల్ని ఏ శరణాలయాల్లోనో పారేస్తున్నారు! దానికి బాధ్యులు ఎవరంటారు? నిజంగా చెప్పాలంటే - ఇలాంటివాటికి సంఘంలోని ప్రతి ఒక్కరూ బాధ్యులే!"  

 

    ప్రసాదరావు ముఖం వాడిపోయింది. హేమ అతిబలవంతంమీద ఉద్రేకాన్ని అణచుకుంటున్నది.

 

    చంద్రం ఇదేమీ పట్టించుకోకుండా చెప్పుకుపోసాగాడు:

 

    "ఇలాంటిదే ఒక సంఘటన చెబుతాను. అంతా విని, దానికి బాధ్యులు ఎవరో చెప్పండి. నేను బొంబాయిలో వున్నప్పుడు నాకు ఒక ఆంధ్రుడు ఆశ్రయం ఇచ్చాడు. ఆయన చాలా మంచివాడు. ఉదారత్వం అనేది ఎలా వుంటుందో ఆయన దగ్గిర చూడవచ్చును. ఆయనకు దాదాపు ఏభయ్ ఐదు ఏళ్ళు వుంటాయి. ఏదో కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. ఆంధ్రులంటే ఆయనకు మహా అభిమానం అతని భార్యకు మతి స్థిమితం లేదు. వారికి ఒకే కుమార్తె ఉండేదట. వారి మంచితనమే వాళ్ళ కొంపకూల్చింది. మనవైపు నుంచి ఎవరో యువకుడు బొంబాయిలో ఆరునెలల ట్రైనింగ్ కోసం  వెళ్ళాడట. తెలిసినవాళ్ళెవరో ఆయనకు బొంబాయిలోవున్న ఆ పెద్దమనిషి అడ్రసు ఇచ్చి పంపారట. ఆ ఆరునెలలూ వాళ్ళు ఆ అబ్బాయిని బలవంతంగా తమ ఇంటిలోనే ఉంచుకొని బిడ్డలా చూశారట. ఆ సమయంలోనే అతనికి ఎలాగో వారి అమ్మాయితో సాన్నిహిత్యం ఏర్పడింది. అతని ట్రయినింగు పూర్తికాగానే వెళ్ళిపోయాడు. ఆ తరవాత రెండు నెలలకు ఆ అమ్మాయి అర్ధరాత్రి యిల్లు విడిచి పారిపోయింది. కారణం వేరుగా చెప్పనక్కరలేదు. ఆమె రాసి పెట్టిన ఉత్తరం చూసుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమైవుంటుందో ఊహించుకోవచ్చును. మాటవరసకు ఈ గౌరి ఆ అమ్మాయికి పుట్టిన పాపఫలమే ననుకోండి.... అలాంటప్పుడు..."  

 

    "నీకు పుణ్యం వుంటుంది చంద్రం! ఇక మాట్లాడకు!" అరిచాడు ప్రసాదరావు. చంద్రం, హేమ ఆశ్చర్యంగా ప్రసాదరావు ముఖంలోకి చూశారు. అప్పటికే ఆయనవళ్ళంతా చెమటపట్టి వుంది. లేచి వెళ్ళబోయి తూలిన ప్రసాదరావును చంద్రం, హేమా పట్టుకొని ఆయన గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు.

 Previous Page Next Page