కనీసం ఇంట్లో వుండే ఫ్రిజ్, టీవీ, వి.సి.ఆర్. లాంటి ఖరీదైన కేపిటల్ గూడ్స్ ని కూడా క్లీన్ చేసుకోరు.
పెళ్ళిళ్ళు, పేరంటాలు జరిగితే చాలు-
గంగిరెద్దుల్లా ఒంటినిండా నగలు దిగేసుకొని, పట్టుచీరలు కట్టి పెళ్ళికొచ్చారో-బులియన్ మార్కెట్ ప్రచారం కోసం వచ్చారో తెలీకుండా చేస్తారు.
ఎక్కువ నగలు కలిగి ఉండటం గొప్ప-
ప్రక్కావిడ పెట్టుకున్న నగని వారంలోపే తల్లిదండ్రుల్నో-భర్తనో వేధించి కొని పెట్టించుకోవటం అంతకంటే గొప్ప అదీకాదంటే అత్తారింటికీ వెళ్ళగానే మొగుడికెన్ని ఆస్థులున్నాయి? మరుదులు, బావలు తమది దోచుకుంటున్నారా? ఆడపడుచులు ఆస్థిలో వాటా అడుగుతారా? ఇలాంటి రాజకీయాలు మొదలెట్టి- మధ్య మధ్యలో పుట్టింటికి వర్తమానం పంపి-నేనిక్కడ చిచ్చుపెట్టాను తెలుసా! ఎంత తెలివికలదాన్నో అని చెప్పుకోవటం - ఛీ... ఛీ... ఎప్పటికి భారత స్త్రీ ఎదుగుతుంది? ఎప్పటికి తలెత్తుకోగలుగుతుంది?
రోజుకో ఇస్త్రీ చీర అది కట్టుకోడానికి గంట టైమ్ అది నలక్కుండా చూసుకోడానికి మరో ఏడెనిమిది గంటల కాలం.
కుండీలో మట్టి మార్చడానికి ఒళ్ళుబద్ధకం ఒక టేస్టు ఉండదు- అభిరుచి ఉండదు- హాబీ ఉండదు. ప్రక్రుతిని, పచ్చదనాన్ని అందాల్ని ప్రేమించటం అంతకంటే తెలీదు వీళ్ళు ఆడవాళ్ళు.
వీళ్ళంతా ఇందిరాగాంధీని, కిరణ్ బేడీని, పి.టి. ఉషను చూసి ఏమనుకుంటారో? వాళ్ళు ఆడాళ్ళు కధనుకుంటారేమో! రెడిక్యులస్.
మనింటికొచ్చే పనిమనిషి ఆడదే. ఆవిడకంటే ఆవిడతో పని చేయించుకుంటూ నడిమంచం మీద పద్మాసనం వేసుక్కూర్చునే వీళ్ళు గొప్ప వాళ్ళా? సిగ్గులేదు వీళ్ళకు.
వీళ్ళని మార్చాలి. కుటుంబానికి, సమాజనికి, దేశానికి పనికొచ్చేలా తయారుచెయ్యాలి.
ఆడది తలుచుకుంటే మగవాడ్ని ఏదయినా చేయగలదు. ఎంత ఎత్తుకయినా తీసుకెళ్ళగలదని రుజువు చేయాలి.
మానవ పరిశోధనా కేంద్రాల్లో శాస్త్రవేత్తలం మనం - శాస్త్రవేత్తలకు, పరిశోధకులకెప్పుడూ మొదట్లో అవహేళన, అవమానం తప్పదు. మనకూ తప్పదు. అయినా వెరవద్దు.
యంత్రాలు మారిపోతున్నాయి, యుద్దతంత్రాలు మారిపోతున్నాయి.
ఆర్ధిక వ్యవస్థలు మారిపోతున్నాయి.
దేశాలమధ్య ఎల్లలు చెదిరిపోతున్నాయి.
జర్మనీలు ఏకమయ్యాయి- కొరియాలు కాబోతున్నాయి.
సాంకేతిక ప్రభంజనం దేశదేశాల్లో వెల్లువయి ప్రవహిస్తోంది.
మన దేశంలోకి ఎన్నో మల్టీనేషన్ లో కంపెనీలు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద పెట్టుబడులతో ప్రవేశించబోతున్నాయి.
పోటీకి తట్టుకోలేని ఇండియన్ నాసిరకం కంపెనీలు కాలగర్భంలో కలిసిపోవటం ఖాయం. మనదేశ వినియోగదారులకు నాణ్యతగల వస్తువులు కొత్త కొత్త వస్తువులు అందుబాటులోకి రావడం ఖాయం.
మన్ మోహన్ సింగ్ మంత్రదండం దేశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళుతుంది. పీవీ పట్టుదల, మేధస్సు ప్రగతికి చక్రాల్ని అమర్చుతుంది.
ఇదే సమయం...మన దేశం ఇప్పుడు క్రాస్ రోడ్స్ మధ్యలో వుంది. అది ఎటు ప్రయాణించాలన్నది మన స్త్రీ జాతి చేతుల్లోనూ సగం బాధ్యతయి కూర్చుంది.
జపాన్ లో ఫ్యాక్టరీలు, కార్ఖానాలు కట్టటానికి స్థలం లేదట- హైలీ డెన్స్ లీ పావులేటెడ్!
అందుకే జపాన్ లోని ప్రతి గృహం ఒక పెద్ద కంపెనీకి ఏన్సిలరీ యూనిట్ గా మారి ఏదో ఒక పరికరాన్ని తయారుచేసి సప్లై చేస్తోందట.
సోనీ కంపెనీ స్పేర్ పార్ట్స్ దాదాపు రెండువేల గృహాల్లో తయారయి కంపెనీ అసెంబ్లింగ్ యూనిట్ కి వస్తుంటాయట!
జపాన్ నేషనల్ కంపెనీ పార్ట్స్ దాదాపు వెయ్యి గృహాలలో తయారవుతుంటాయట. హిటాచీ ఎయిర్ కండిషన్డ్ మెషిన్స్ మొత్తం గృహాలలోనే తయారవుతాయట! చివరకు కంప్రెషర్స్ కూడా!
ఈ రోజు జపాన్ వెళ్లి చూస్తే కన్నుల పండుగ ప్రతి ఇల్లు ఒక కార్ఖానా! ప్రతి గృహిణి ఒక ఎంటర్ ప్రెన్సురే!
జపాన్ లో బయటికెళ్ళి ఏదో ఉద్యోగం చేసి సంపాదించే మగవాళ్ళ కన్నా-ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళు సంపాదించేదే 30 శాతం ఎక్కువట!
ఎప్పటికి మనమా స్థితికి చేసుకోగలం?
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీ అయిన సోనీ కంపెనీ అధినేత అకియో మోరింటా వ్యాపార నిమిత్తం ఎప్పుడూ దేశ విదేశాలు తిరుగుతుంటారట-మరి సోనీ కంపెనీ నిర్వహణ ఎవరో తెలుసా? ఆయన భార్య, కూతుర్లు, కోడళ్ళట!
ఎలక్ట్రానిక్ వాణిజ్య ప్రపంచాన్ని శాసిస్తున్న సోనీ కంపెనీ స్త్రీల చేతుల్లో వుంది. ఎంత గొప్ప విషయం! జపాన్ ని ప్రతి ఇళ్ళూ ఒక పూలవనం. ప్రతి ఇంటిముందు ఫ్లవర్ బోర్డర్స్, పచ్చటి చెట్లు-వాటిని పెంచేది మున్సిపాలిటీ కాదు-జపాన్ గృహిణులు.
చక్కని అభిరుచిలేని స్త్రీలలో పచ్చదన్నాన్ని ప్రకృతిని ప్రేమించలేని స్త్రీలలో-కృత్రిమ విలువ కోసం ప్రాకులాడే స్త్రీలలో మృదుత్వం - ప్రేమ- అభిమానం- సున్నితత్వం-లావణ్యం-లాలనా ఉంటాయా? గాజు బొమ్మతో సమానమైన ఆ స్త్రీలను మగవాడు ప్రేమించగలడా? ప్చ్! లేదు.
అందుకే మన దేశ స్త్రీల ఆలోచనా విధానం-జీవన విధానం మారి తీరవలసిన సమయం ఆసన్నమైంది.
సరిగ్గా ఆ సమయంలోనే మనమీ ప్రయోగం మొదలెట్టడం గొప్ప యాదృచ్చికం.
వెనుకడుగు వేయవద్దు.
పర్నేష్ రూపంలో నేటితరం స్త్రీలకు తమ అస్థిత్వం ఒక ప్రశ్న అయింది. ఆ ప్రశ్నకు మన ప్రయోగం సమాధానం చెప్పితీరాలి. ఆ తరువాత స్త్రీ హక్కుల గురించి, సమానత్వం గురించి పోరాడుదాం ముందు మనల్ని మనం ఫ్రూవ్ చేసుకుందాం.
ఇంకొక విషయం-
మన పార్ట్ నర్స్ విషయంలో మనకేమైనా డౌట్ వచ్చిందనుకోండి. అతను తన స్వార్ధానికి మనల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడనుకోండి. ఆ సమయంలో మనల్ని మనం సంప్రదించుకోవడం చాలా అవసరం అంత పరిస్థితి రాకుండా వుండాలంటే, ఎప్పటికపుడు మీ మీ పార్టనర్స్ ని బాగా, నిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకోండి. బాడీ లాంగ్వేజ్ ని అప్లయ్ చెయ్యండి. అర్ధమైందా" ముగ్ధ చెప్పడం ఆపింది.
నీలిమ, అలక, సురభి మౌనంగా తలూపారు.
నలుగురమ్మాయిలు పడకలెక్కారు.
రేపటినుంచి ప్రారంభమయ్యే జీవితం వేరు రేపటినుంచి ప్రార్రంభమయ్యే జీవిఒతంలో ఆశయం వేరు.
రేపటినుంచి ఒక మానవ మహాధ్యాయం ప్రారంభమౌతుంది.
దానిని-