నిర్లిప్తంగా లేచాను. నాతోపాటు మిగతావారంతా బయటికి వచ్చారు. జాన్ నిశ్శబ్దంగా వున్నాడు. ఇలా జరుగుతుందని బహుశా అతడు కూడా వూహించి వుండడు. మనసులోని బరువుని దింపుకోవటానికి మాటలెలా ఉపయోగపడతాయో, మౌనం కూడా కొన్నిసార్లు అలాగే ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా ఒకరి వెనుక ఒకరం మెట్లు దిగుతున్నాం. అలా మెట్లు దిగుతూంటే నాకు ఏదో అపశకునపు పోలిక తోచింది. వెనుకనుంచి నా కొడుకు నన్ను దాటి పరుగెత్తుకుపోతున్నాడు. త్వరగా గమ్యం చేరుకోవాలని.....! మృత్యువు అనేగమ్యాన్ని!!
ఎంత హృదయ విదారకమైన పోలిక!!!
ఇటువంటి ఆలోచనల్తో నేను మెట్లు దిగుతూంటే ఎదురుగా నవ్వు వినిపించింది. చూస్తే .... కృపానంద్.
నేనతని వైపు అభావంగా చూసి ముందుకు కదలబోయాను...... "ఆగు" అన్నాడు. అప్రయత్నంగా అందరం ఆగాం. అతడు మరింత వికటంగా నవ్వుతూ, "ఇది హెచ్చరిక మాత్రమే. ఇలా నీ బ్రతుకుతో చివరివరకూ ఆడుకుంటూనే వుంటాను" అంటూ, విరిగిన నా చేతివైపు చూస్తూ.....ఒక బూతుమాట అన్నాడు.
అప్పుడు జరిగిందది! దయ...... అతడి ముందుకి నడిచింది. అరక్షణంపాటు అతడి కళ్ళలోకి చూసి, వూహించని రీతిలో అతడి చెంపమీద సాచిపెట్టి బలంగా కొట్టింది. జాన్ డేవిడ్ వారించే లోపులోనే ఇది జరిగిపోయింది.
ఎప్పుడూ కామ్ గా, నవ్వుతూ వుండే "దయ"ని ఈ విధంగా చూడటం మొదటిసారి ......అది ఆమెకి అంకిత్ పట్ల వున్న ప్రేమో లేక కృపానంద్ ప్రవర్తనపట్ల ఏర్పడిన అసహ్యమో తెలీదుకానీ...... ఈ విధంగా బయటపడింది. అలా కొట్టి, ఆమె కారువైపు నడిచింది కృపానంద్ ఇంకా నిశ్చేష్టతనుంచి తేరుకోలేదు. మేము వెళ్ళి కారులో కూర్చున్నాం.
"ఇప్పుడిక ఏం చెయ్యాలి?" తనలో తానే అనుకుంటున్నట్టు స్వగతంగా అన్నాడు జాన్. కారు డోరు బలంగా వేస్తూ "అంకిత్ కి కావాల్సిన కిడ్నీ రేపు సంపాదించబోతున్నాను" అన్నాను దృఢనిశ్చయంతో.
జాన్ చట్టుక్కున తలతిప్పి నావైపు చూసాడు. దయకూడా అలాగే చూసింది ..... "ఎవరిది?" ఒకేసారి అడిగారు ఇద్దరూ.
"కృపానంద్ ది."
13
మారిన పరిస్థితుల్ని తమ కనుగుణంగా మార్చుకో గలిగే మనుష్యుల కోసం పరిస్థితులు వాటంతట అవేమారతాయి.
* * *
ఆ సాయంత్రం సుమద్యుతి నాకు ఫోన్ చేసింది. కంగారుగా "ఎలా వున్నావు" అని అడిగాను. కోర్టునుంచి ఇంటికెళ్ళాక ఆమెని కృపానంద్ ఏ విధంగా హింసించి వుంటాడా అని నేను ఇంతసేపూ భయపడుతూ వచ్చాను.
"ఏమీ అనలేదు" అంది.
"ఏమీ అనలేదా?"
"మీ మీద చాలా గ్రాండ్ గా గెలిచానన్న సంతోషంతో వున్నాడు. ఆ ఆనందంలో "దయ" గారు కొట్టిన సంగతి కూడా మర్చిపోయినట్టు వదిలేసాడు."
"అతడి ఆనందం ఇంకెంతో కాలం నిలవదు."
"అదేమిటి?" ఆశ్చర్యంగా అంది సుమద్యుతి.
అతడిని కిడ్నాప్ చేసి ఏ విధంగా నేను నా కొడుకుని రక్షించుకోదల్చుకున్నానో చెప్పాను. ఆమె చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అది "డాక్టర్లు ఈ విధంగా ఆపరేట్ చేయటానికి వప్పుకోరు."
"వీపు వెనుక గుచ్చుకునే పిస్టల్ చివర కొన-వప్పిస్తుంది" నా నిశ్చయాన్ని ఎవరూ మార్చలేరన్నట్టు చెప్పాను. "కృపానంద్ కిడ్నీ ఇచ్చేట్టూ, డాక్టర్లు దాన్ని అంకిత్ కి అమర్చేట్టూ......పిస్టల్ చేస్తుంది. ఆ తరువాత నేను జైలుకి వెళ్ళినా ఫర్లేదు. అంకిత్ బ్రతుకుతాడు" అని ఆగి......."ఏం, కృపా నంద్ ని ఇలా కిడ్నాప్ చేసి, అట్నుంచి ......ఆమె కొంచెం సేపాగి "దీనికన్నా మంచి ఆలోచన ఒకటుంది" అంది.
"ఏమిటది?"
"నా కూతురు శ్వేతని కిడ్నాప్ చేయటం......"
నేను అయోమయంగా, "ఎందుకు? ఆ పాప కిడ్నీ......అంకిత్ కోసం ఉపయోగించనని ముందే చెప్పానుగా" అన్నాను.
"కిడ్నీ గురించి కాదు" అని ఆమె చెప్పటం ప్రారంభించింది ..... "కృపానంద్ కి నా ఆస్థిమీద తప్ప నా మీద ప్రేమలేదు. కేవలం సమాజం కోసం, నా కూతురు శ్వేతకోసం నేను అతడితో వుంటున్నానని అతడికి తెలుసు. అయితే క్రమక్రమంగా నాకు తెగింపు వస్తోందనీ, సమాజం గురించి భయపడటం మానేస్తున్నాననీ ఇటీవలి సంఘటనలు అతడికి నిరూపిస్తున్నాయి. ఇక మా ఇద్దరి లింకూ ఒక్కటే....శ్వేత! ఆమే నా ఆస్థికి వారసురాలు. నా అడ్డు తొలగించుకుంటే ఆస్థి అంతా ఆమెకు చెందుతుంది. ఆ పాప ఎలాగూ ఎక్కువకాలం బ్రతకదు. అతడే మిగుల్తాడు. అయితే ఇదంతా, నేను ధైర్యం తెచ్చుకుని అతన్నించి విడిపోయే లోపులో జరగాలి. ఆ విషయం కూడా అతడికి తెలుసు. ఒకప్పుడు నన్ను గదిలో వుంచి తాళం వేసేవాడు. ఇప్పుడు నేను కోర్టుకి వచ్చినా సహిస్తున్నాడు. ఇంకెంతో కాలం నేనిలా వుండనని కూడా అతడికి తెలుసు. ఈ సమయంలో మీరు శ్వేతని కిడ్నాప్ చేసి ఒక 'గడుపు' పెట్టారనుకోండి....."
"అర్థమైంది" అన్నాను చప్పున. "శ్వేతని నా అధీనంలో వుంచుకుంటే ఎటువంటి కాళ్ళబేరానికైనా వస్తాడు."
"అవును" అన్నదామె. "అదే నేను చెప్పదల్చుకున్నది. శ్వేతని మీరు కిడ్నాప్ చేసారని తెలియగానే, అతడు కంగారుపడతాడు. మరోవైపు నేను విడాకుల పేరిట బెదిరిస్తాను. ఇటు నన్నుచంపలేడు. అటు వదులుకోలేడు. నాదో, తనదో కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడతాడు."
నా హృదయం వికలమైంది. అది పూర్తిగా విషాదం కూడా కాదు. ఆర్ద్రతతో కూడిన వేదన! ఒక కొడుకు కోసం ఒక కూతుర్ని త్రాసులో వెయ్యాల్సిన స్థితి ఏ తల్లికయినా వస్తుందా"?
"ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావ్ సుమా" ఆర్ద్రంగా అడిగాను.
"అంకిత్ కోసం" ఆలోచించకుండా చెప్పిందామె. "నా కొడుకు అని కాదు. అంత మంచి అబ్బాయి ...... కేవలం ఒక కిడ్నీ దొరక్క మనల్ని వదిలిపోకూడదు అని."
"థాంక్స్ అన్నది చాలా చాలా చిన్న పదం" ఆర్ద్రంగా అడిగాను.
"అంకిత్ కోసం" ఆలోచించకుండా చెప్పిందామె. "నా కొడుకు అని కాదు. అంత మంచి అబ్బాయి .....కేవలం ఒక కిడ్నీ దొరక్క మనల్ని వదిలిపోకూడదు అని."
"థాంక్స్ అన్నది చాలా చాలా చిన్న పదం" ఆర్ద్రంగా అన్నాను.
"ఆమే దాన్ని పట్టించుకోకుండా, ఒకవేళ మనం అనుకున్నట్టు కృపానంద్ దిగి రాకపోతే శ్వేత కిడ్నీ తీసుకోండి. ఒక బిడ్డని రక్షించుకోవడానికి మరో బిడ్డలోని ఓ భాగాన్ని తీసివ్వడంలో నాకేమీ తప్పు కనిపించటం లేదు. శ్వేతని కిడ్నాప్ చేసి ఆపరేషన్ జరిపించండి. ఇంకెంతో గడుపులేదు మనకు" నెమ్మదిగా పలుకుతున్న ఆమె కంఠస్వరం నా మనసును ఎంత ఉత్తేజపరుస్తూందో చెప్పలేను. కదిలిపోయాను. పూర్తిగా కరిగిపోయాను. ఎలా ఆమెకు అభినందించాలో తెలీక "చాలా సహాయం చేస్తున్నావు" అన్నాను.
ఆమె చిన్నగా నవ్వి "నేనేమీ చేయడం లేదు. కేవలం సలహా మాత్రమే ఇస్తున్నానంతే. మిగిలినదంతా చేయాల్సింది మీరే. నేను బయటికి రాలేను....." నిస్సహాయంగా అంది.
"చాలు. ఆ సలహానే అంకిత్ ప్రాణాన్ని నిలబెట్టబోతోంది. ఇక నిన్నేమీ ఇబ్బంది పెట్టను" అన్నాను. తరువాత ఆమె శ్వేత ఉండే స్కూల్ అడ్రస్ చెప్పింది. అక్కడ శ్వేతని గుర్తుపట్టడం ఎలాగో చెప్పింది. కానీ వచ్చిన చిక్కంతా కేవలం తల్లిదండ్రులకు మాత్రమే ప్రవేశముందనటం.
మరి అప్పుడేం చేయటం?
"అక్కడే మీ తెలివి ఉపయోగించండి. ఎలాగయినా మీరే కృపానంద్ నని నమ్మించగలిగితే పాపని ఈజీగా బయటికి తీసుకురావచ్చు." అంటూ అన్ని జాగ్రత్తలూ చెప్పి ఫోన్ పెట్టేసింది.
నేను వెంటనే జాన్ కి ఫోన్ చేశాను.
* * *
మరునాడూ ఉదయం శ్వేత స్కూల్ కి బయలుదేరాము. నిజానికి అది స్కూల్ కూడా కాదు. మానసిక వికలాంగుల కోసం స్థాపించిన ఒక సంస్థ . సుమచెప్పిందాన్నిబట్టి అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా అమలుపరుస్తారు. గేటు బయటే సెక్యూరిటీ స్టాఫ్ కారాపమన్నారు. చేసేదేమీ లేక దిగిపోయి, గేటు లోపలికి అడుగుపెట్టాం. సెక్యూరిటీ సూపర్ వైజర్ యక్షప్రశ్నలు వేశాడు. అన్నిటికీ తడుముకోకుండా సమాధానం చెప్పాను. చివరికి ఆ సంస్థ అధికారిని కలపడానికి స్లిప్ రాసిచ్చాడు. కానీ ఒక్కరికి మాత్రమే ప్రవేశం. జాన్ ఆగిపోతానన్నాడు.
నేనా స్లిప్ తీసుకుని లోపలికి వెళ్ళబోతూ, "ఎందుకివన్నీ ఫార్మాలిటీస్? మా పిల్లల్ని కలుసుకోవడానికి ఇంత తతంగమా?" అన్నాను కాస్త దర్పంగా.
"సారీ మిస్టర్ కృపానంద్........ఇంతకుముందు మీలాగే వచ్చిన పెద్దమనిషి ఒకతను మినిష్టర్ గారి కూతురిని కిడ్నాప్ చేశాడు. అలాంటి రాజకీయాలు ఇక్కడ చోటు చేసుకోగూడదని అప్పటినుంచి స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తున్నాము" చెప్పాడతను.
నా కళ్ళల్లో కలవరపాటును కనిపించకుండా జాగ్రత్తపడుతూ "థాంక్ యూ" అని చెప్పి, విశాలమైన లాన్ మధ్యగల సిమెంట్ రోడ్ మీదుగా లోపలికి నడిచాను.
అక్కడో రిసెప్షని స్ట్ కూర్చుని వుంది. చాలా పెద్ద హాలు అది. డానికి అవతల మరో పెద్ద బిల్డింగ్ ని ఆ హాల్ కలుపుతూ ముఖద్వారం వుంది. బహుశా ఆ బిల్డింగ్ లోనే పిల్లలంతా వుండేదనుకుంటా.
ఎదురుగా వెళ్ళగానే "వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సర్!" చిరునవ్వుతో ప్రశ్నించింది.
"నా పేరు కృపానంద్. మా పాప శ్వేత ఇక్కడే వుంది. రేపు మా అబ్బాయి పుట్టినరోజు. తీసుకువెళ్ళడానికి వచ్చాను."
అయితే మీకు "మా యం.డి. పర్మిషన్ కావాలి" అంటూ ఫోన్ ఎత్తి యం.డి.తో మాట్లాడింది.
తరువాత నా దగ్గర విజిటర్ స్లిప్ ని ఫైల్ చేసింది. రిజిష్టర్ నా ముందుకు త్రోసి "సంతకం చేయండి" అంది.
బ్యాండేజి వేసిన నా చేతిని చూపిస్తూ "సారీ" అంటూ చిన్నగా నవ్వాను.
ఆమె కూడా ఇబ్బందిగా నవ్వుతూ, "కానీ సంతకం కంపల్సరీ సర్. మీ పాపని మీరు అడ్మిషన్ చేయించినప్పటి సంతకంతో పోల్చి చూసుకున్నాకే ఎలో చేస్తాము" నమ్రతగా చెప్పినా ఖచ్చితంగా చెప్పింది.
"అరే ఇప్పుడెలా" ఆలోచిస్తున్నట్టు చూశాను. ఆమె ఏమనుకుందో ఏమో ఫోనెత్తి "ఒక నిమిషం వుండండి సర్. మా యం.డి.ని అడుగుతాను" అంటూ రింగ్ చేసి విషయం చెప్పింది.
అతని పేరడిగినట్టున్నాడు.
"కృపానంద్ సర్. శ్వేత వాళ్ళ ఫాదర్ ట"
తరువాత అవతల చెప్పింది విని "అలాగా సర్" అంటూ ఫోన్ పెట్టేస్తూ, "మీరు మా యం.డి.ని కలుసుకోండి" అంది.
నా గుండె క్షణకాలం కొట్టుకోవడం మానేసింది. వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుంటూ పెదవుల మీదికి నవ్వు తెచ్చుకున్నాను.