Previous Page Next Page 
వివాహం పేజి 30

   
    "అది భక్తి అంటారా? వాళ్ళది ఉత్త మూఢత్వం" అన్నాడు గోపాలరావు.

    "రెంటికీ భేద మాట్టే వుందా? ఒకలాగు చూస్తే భక్తి అంతా మూఢత్వమే!"

    "ఈయనతో మాటాడకోయ్, వున్నమతి పోతుంది" అంది మంగమ్మ.

    "మీరేమంటారు?" అని అడిగాడు వెంకట్రావుగారిని.

    "నే నేమంటేనేం?" నువ్వు యోచించు! చదువుకున్న వాడివి మీరు సొంతంగా యోచించరు. టీచర్ల దగ్గిరా, పుస్తకాల్లోనూ, చదివిందే నిజమనుకుంటారు. నువ్వేమంటావు?"

    గోపాలరావు మాట్లాడలేదు. రవణ నవ్వుతో మొహం తిప్పుకుంది. ఆమె నవ్వుని చూస్తూ గోపాలరావు వూరుకున్నాడు.

    వెంకట్రావుగారు నవ్వుతున్నారు. రైలాగింది. తెల్లని దీపాలు రైలుపక్కన మెరిశాయి. రాధామనోహరి వాసన గుప్పుమంది.

    "గోపాలం! కడుపులో దేవుడు గోల పెడుతున్నాడు. భోజనం తీసుకురావోయ్"

    గోపాలం దిగి వెడుతో వెనక్కి తిరిగి చూశాడు. రవణ చూపులు తన వెనక వొస్తున్నాయి. హృదయంలో వెలుగు వెలిగింది. వెళ్ళి వచ్చాడు.

    "ఇంకా రెండు విస్తళ్ళు అడిగి తీసుకురాకపోయినావా?" అంది మంగమ్మ రైలు పోతూవుండగా.

    "ఇవ్వనన్నారు"

    "ఏం చేస్తాం? నువ్వూ నేనూ ఓ దాంటో. రవణా గోపాలం ఓ దాంటో. వాళ్ళిద్దరికీ ఇది మొదటిమాటూ, మనకి ఆఖరుమాటూ...."

    "ఛీ, వూరుకోండి"

    "అదిగాదే. యీ భోజనంతో చస్తానని కాదు. ఎన్నాళ్ళు బ్రతికితే మాత్రం మళ్ళీ యిట్లా ప్రయామంచేస్తో ఒక విస్తట్లో తింటామా అంటున్నాను."

    కంటికొలికిలోంచి రవణని చూస్తున్నాడు గోపాలరావు. రవణ తల తిప్పి ట్రంకులవంక చూస్తోంది.

    "మొగుడిచేత పనిచేయించుకోడం మొదలా? రా వొడ్డించరాదూ?" అంది, మంగమ్మ నవ్వుతో.

    సిగ్గుపడుతూ రవణ వొచ్చి నుంచుంది.

    "అట్లా కూచో దగ్గిరగా, ఇంతలో మేమేం అనుకోములే"

    రవణని ముందు విస్తట్లో చేయి పెట్టేట్టు చెయ్యడం కష్టమయింది. ఒక్కొక్క ముద్దని గొంతుకలోంచి దింపడం కష్టసాధ్యమయింది రవణకి.

    "సరిగా తింటావా, గోపాలం కలిపి నోట్లో పెట్టాలా?"

    రవణ చప్పున తింటోంది. ఇద్దరి వేళ్ళూ విస్తట్లో కలియబడ్డాయి. చక్కిలిగింతల తీగెలు భుజాలపైకి పరిగెత్తుతున్నాయి.

 Previous Page Next Page