Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 31


    మీరందరూ అలా బొత్తిగా క్రికెట్ వదిలేశారెందుకురా? నాకెంత కోపమొస్తోందో తెలుసా మీ మీద?" కోపంగానే అన్నాడు శోభనాచలం.

    "ఏమోరా; వెధవది ఇంట్రెస్ట్ ఉండటం లేదు..." నసిగాడు సుబ్రమణ్యం.

    "ఏరా బాబూరావ్ నీకేం రోగం రా! లక్షణమైన ఆట చేతిలో ఉంచుకొని..."

    "ఇంకెక్కడి ఆటలేరా! ఆడింది చాలుగాని, ఇంటికొచ్చి వ్యవసాయం చూచుకోమంటున్నాడు నాన్న. త్వరలోనే బిక్కవోలుకి మకాం ఎత్తేస్తున్నా కూడా" శోభనాచలానికి ఏం మాట్లాడ్డానికీ పాలుపోవడం లేదు. ఒక్క వెధవక్కూడా ఉత్సాహం లేకుండాపోయిందే?

    "వెధవ క్రికెట్ దేముంది కాని, నేనూ, ప్రసాదూ కలిసి ఈ ఊళ్లోనే ఫాన్సీ షాప్ పెట్టాలనుకొంటున్నాంరా! ఉద్యోగాలెలాగూ దొరికి చచ్చేట్లు లేవు- ఒకవేళ దొరికినా హైద్రాబాద్ లో పడి అఘోరించాల్సిందే-" ఇక అంధ్రాలో ఇండస్ట్రీలు పెట్టడమనేది జరుగదు. అందుకని..."

    ఏదో చెప్పుకుపోతున్నాడు రామచంద్రరావు.

    "ఇవాళ ఏదో క్రికెట్ మాచ్ ఉందట కదా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో - వెళ్ళి చూద్దామా? రామరాజు అనే అతను పొడిచేస్తున్నాట్ట-" అడిగాడు శోభనాచలం.

    "మాచ్ బోర్ రా బాబూ! మంచి సినిమా ఉంది మెజిస్టిక్ లో పోదాం పదండి దానికి-" అన్నాడు సుబ్రమణ్యం.  

    "అవును! పిక్చర్ కే పోదాం-" అన్నారు మిగతా వాళ్లంతా.

    కాదనలేక సినిమాకి బయల్దేరాడు శోభనాచలం వాళ్లందరితోనూ.

    దోవలో జగన్ కార్లో ఎదురొచ్చాడు. శోభనాచలాన్ని చూడగానే కారు ఆపేడు.

    "హలో చలం! ఎప్పుడొచ్చావ్?" కారు దిగకుండానే అడిగాడు.

    శోభనాచలానికి చిరాకు పుట్టుకొచ్చింది.

    అదివరకు తను మాట్లాడితేనే బంగారం అన్నట్లు వినయంగా, ప్రేమగా పలుకరించేవాడు. తనను కార్లో ఎక్కమని బ్రతిమాలి తిప్పేవాడు.

    "ఇందాకే వచ్చాను."

    "ఓకే- ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు- వస్తా" కారు వెళ్ళిపోయింది.

    అలవాటు ప్రకారం అందరూ హోటల్లో భోజనానికి వెళ్ళారు.

    హోటల్ ఓనర్ ఆదరంగా పలుకరించాడు. అతను కూడా క్రికెట్ ఫాన్!"

    "ఏమిటి సార్? చాలాకాలానికి వచ్చారు?"

    "ఇప్పుడిక్కడలేను కదా! ఉద్యోగానికి వెళ్ళిపోయాను."

    "ఓ అలాగా!"

    అందరూ స్పెషల్ రూమ్  లోకి నడవబోయారు.

    అప్పటికే అందులో కొంతమంది కూర్చుని ఉన్నారు.

    అదివరలో అయితే హోటల్ ఓనర్ స్పెషల్ రూమ్ ఖాళీ చేయించి తమ ప్లేర్స్ అందరికీ దగ్గరుండి సర్వ్ చేయించేవాడు.

    ఇప్పుడు తనకేం పట్టనట్లు ఊరుకున్నాడు.

    భోజనాలు ముగించి సినిమా హాల్ కి చేరుకున్నారు.

    సినిమా మొదలయిందిగాని శోభనాచలం మనసు సినిమా మీద లగ్నం కావటం లేదు. ఏదో అశాంతి! ఆందోళన.

    సినిమా ఎప్పుడు అయిపోయిందో కూడా తెలీదు.

    ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకు వెళ్ళిపోయారు.

    జానకి ఇంటి దగ్గరకు చేరుకున్నాక తెలిసింది. తనకు తెలీకుండానే అక్కడికి చేరుకున్నట్లు! అంటే తన మనసులో ఇంకా జానకి రూపం చెదరలేదు.

    ఆమె సాయంత్రం తనను రమ్మని కోరిందంటే, తనమీద ఇంకా అదివరకటి ఆరాధన ఉండడం వల్లనేనేమో!

    బహుశా ఇప్పుడు మనసువిప్పి మాట్లాడుతుందేమో!

    "హల్లో! ఏమిటలా గేటు దగ్గరే నిలబడిపోయారు?" మేడమీద తన గది బాల్కనీలో నిలబడి ఆశ్చర్యంగా అంది జానకి.

    "అదే- మీరు మాచ్ నుంచి తిరిగి వచ్చారో - లేదో అని"

    "వచ్చి చాలాసేపయింది! లిమిటెడ్ ఓవర్స్ మాచ్ కదా! ముఫ్పెయ్ ఓవర్స్ కే క్లోజ్ చేశారు. రండి నా గదిలో కూర్చుందాం."

    మేడమీద ఆమె గదిలోకి చేరుకున్నాడు శోభనాచలం.

    గదిలో చాలా మార్పులొచ్చాయ్.

    ఇప్పుడు మరింత అందంగా ఉంది గది.

    జానకి మాట్లాడటం మొదలుపెట్టింది.

    "నిజంగా రామరాజు ఇవాళ ఎంత అద్భుతంగా ఆడాడో తెలుసా? అలాంటి ఆల్ రౌండర్ మన ఇండియాటీమ్ లోనే లేడు. అందరూ ఏమంటున్నారో విన్నారా? ఏదొకరోజు అతను ఇండియా టీమ్ ని లీడ్ చేస్తాడట ."

    ఆమె మాటలు పూర్తిగా కృంగదీసేస్తున్నాయ్.

    అంతవరకూ మిణుకు మిణుకుమంటూ వెలిగిన ఆశలు కూడా కొది గట్టేస్తున్నాయి.

    హఠాత్తుగా శోభనాచలం దృష్టి టేబుల్ మీదున్న అందమయిన ఫోటో ఫ్రేమ్ మీద  పడింది. ఒక్కసారిగా షాకయ్యాడు.

    అందులో అదివరకు తనూ జానకి దిగిన ఫోటో ఉండేది.

    ఇప్పుడు జానకి మరో యువకుడితో దిగిన ఫోటో.

    జానకి తనను గమనించింది.

    "ఫోటో ఫ్రేమ్ చూస్తున్నారా? రామరాజుతో మొన్నే దిగాను. మా గాళ్స్ అందరూ ఆ ఫోటో చూసి నామీద ఎంత జెలసీ ఫీలవుతున్నారో తెలుసా?" నవ్వుతూ ఆనందంగా చెప్తోంది.

    "మన ఫోటో ఏమయింది? ఎందుకు తీసేశారు?" అని అడగాలని పించింది.

    కాని అడగకముందే సమాధానం తనకు తెలిసిపోయింది.

    ఆ ఫోటో ఫ్రేమ్ లో కొత్త ఆటగాళ్ళకే స్థానం!

    పాత ఫోటో ఆల్బమ్ లో లేక చెత్త బుట్టలోకో వెళ్ళిపోతుంది.

    అంటే ఆమె మనసు కూడా ఆ ఫోటో ఫ్రేమ్ లాంటిదే! ఎప్పటికప్పుడు ఫోటో మారిపోతూంటుంది.

    అందుకే ఇప్పుడు ఆమె హృదయంలో ఇంతకాలంగా ఉన్న తన ఫోటో చెరిగిపోయి రామరాజు ఫోటో వచ్చింది.

    ఆమె మాటలు ఏమాత్రం వినిపించటం లేదు శోభనాచలానికి.

    మనసు అల్లకల్లోలమయిపోయింది. ఆమె ఇచ్చిన షాక్ ని తట్టుకోలేకపోతున్నాడు. జ్వరం వచ్చేసినట్లయింది కొద్దిక్షణాల్లోనే-

    ఆమె టైమ్ చూసుకుంది.

    "మైగాడ్ అప్పుడే ఎనిమిదయిపోయిందా? అయితే ఇంకో అరగంటలో రామరాజు వచ్చేస్తాడు."

    "రామరాజు వస్తున్నాడా!"

    "అవును! ఇవాళ డిన్నర్ కి ఇన్ వైట్ చేశాను. అడగ్గానే ఓకే అన్నాడు. ఎంత థ్రిల్ ఫీలవుతున్నానో తెలుసా?"

    శోభనాచలం లేచి నిలబడ్డాడు.

    "ఓకే నేను వెళ్తాను."

    "అదేంటి? మీరు కూడా డిన్నర్ కుండండి. రామరాజుతో పరిచయమవుతుంది కదా!"

    "సారీ! పనుంది."

    "హైదరాబాద్ వెళ్ళేలోపల మళ్ళీ వస్తాను కదూ?"   

 Previous Page Next Page