Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 32


    అతను మాట్లాడలేదు.

    "తప్పకుండా రండి! ఈసారి మిమ్మల్ని రాజరాజుకి ఇంట్రడ్యూస్ చేస్తాను."

    అతను బయటికొచ్చేశాడు.

    వారం రోజులు కాకినాడలోనే ఉన్నా ఆ తరువాత ఇల్లు వదలి బయటకు రాలేదతను.

    ఆరోజు రాత్రి తిరిగి హైదరాబాద్ కి బయల్దేరుతూంటే బాబూరావ్ బస్ స్టాండ్ కొచ్చాడు.

    బస్ బయల్దేరబోతుండగా మిగతా విషయాలు మాట్లాడటం ఆపాడు బాబూరావు.

    "ఒరే చలం! నీకో విషయం చెప్తాను! ఏమి అనుకోవుకదా?" అడిగాడు సీరియస్ గా.

    "ఛ! అనుకోవటమేమిట్రా?"

    "వచ్చిన దగ్గర్నుంచీ నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా! నువ్వు ఇంకా లైఫ్ గురించి తెలుసుకోలేదు రా! యస్! మనం క్రికెట్ ప్లేర్స్ మే! కానీ క్రికెట్టే మన జీవితం కాదురా! లైఫ్ వేరు- క్రికెట్ వేరు- క్రికెట్ అనేది మన జీవితంలో అతి సూక్ష్మమయిన భాగం. మనలాగే ఫుట్ బాల్, వాలీబాల్, హాకీ ఇలా తొంభై రకాల ఆటగాళ్ళున్నారు. అందరూ మంచి ఆటగాళ్ళే! అందరికీ ఫాన్స్ ఉంటారు. ఆడుతూన్నప్పుడు మనని చూసి విపరీతమైన అభిమానం పెంచేసుకొంటారు చాలామంది ఆరాధిస్తారు. ఆ సమయంలో వాళ్లకి మననిమించిన దేముడు లేడు. మనం వాళ్ళదృష్టిలో హీరోలం. అవునా! అంత వేగంగా ముక్కూమెఖం తెలీని వాళ్లకోసం కేవలం ఆటచూసి పెంచేసుకొన్న అభిమానం ఎంతసేపుంటుందంటావ్? ఆ ఆట ఆడినంతసేపే. ఆ తరువాత మహా అయితే మరికొంతసేపు- లేదా మరికొన్ని రోజులూ-!

    అంతే అక్కడితో ఆ ప్రభావం నెమ్మదిగా దిగటం ప్రారంభిస్తుంది. మనం జీవితమంతా ఆడుతూనే ఉంటే శాశ్వతంగా వాళ్ళనాకట్టుకోవచ్చు. కానీ అది మనవల్ల కాదు కదా! మనలో ఎవ్వడూ కోటీశ్వర్లులేరు. ఉద్యోగం చేయకుండా ఆడుతూ పడుతూ జీవితం గడపడానికి! ఒకప్పుడు గవాస్కర్ కున్న అభిమానులు - ఇప్పుడేరి? గవాస్కర్ అంటే ఎవరని అడుగుతారు - న్యూ జెనరేషన్! ప్రతి ఒక్కడూ కూడా పొట్టకోసం ఏదో ఒక పని చేయాల్సిందే! అలాంటప్పుడు ఖచ్చితంగా ఆటకు అడ్డు ఏర్పడుతుంది. పైగా మనకున్న భాధ్యతలు కూడా తక్కువేం కావు. ఇల్లు చూసుకోవాలి. పెళ్ళి పేరంటం, పిల్లాపీచు, కష్టసుఖాలూ, వీటి మాటేమిటి? ఆడినంత ఉత్సాహం వయసు పెరిగినకొద్దీ అడనూలేము, కానీ జనానికి కావాల్సింది నువ్వుకాడు, వాళ్ళక్కావలసింది ఆట! నిన్న శోభనాచలం, ఇవాళ రామరాజు, రేపు లక్ష్మీపతి ఇంతే వాళ్ళిలా చూసుకొంటూ ముందుకు ప్రయాణిస్తూనే ఉంటారు. మనం అక్కడే ఆగిపోతే ఒంటరి వాళ్ళం అవుతాం. అంచేత మనం కూడా వాళ్లతోబాటు ప్రయాణం చేయాలి. నిన్నటి నీ సంగతి వాళ్ళతోబాటు నువ్వు మర్చిపో! అప్పుడు నీకిక బాధ ఉండదు..."

    బస్ ఇంజన్ స్టార్ట్ చేశాడు డ్రైవర్...

    బస్ కదిలింది.

    శోభనాచలం కళ్ళనిండుగా నీళ్ళు నిలిచినాయి.

    ఔను తాము అవుటైపోయిన ఆటగాళ్ళు. అందరూ ఆడుతున్న వాళ్ళను చూస్తారుగానీ - అవుటైపోయిన వాళ్ళను చూడరు గదా!

    జానకి గుర్తుకొచ్చింది శోభనాచలానికి.

    ఆమె దృష్టిలో తను అవుటైపోయాడు. తనను అదివరల అభిమానించటం లేదని తను ఆమె మీద కోపం తెచ్చుకుంటున్నాడు.

    నవ్వు వచ్చింది శోభనాచలానికి.

    ఇక లాభం లేదు.

    తను అవుటైపోయాడు- అవుట్!

    ఈసారి ఆ నవ్వులో జీవితం కనిపించింది.

                                         * * * * *

 Previous Page Next Page