"నేనూ విన్నానలాంటి వాటి గురించి."
హఠాత్తుగా ఇద్దరిమధ్యా కొద్దిక్షణాలు నిశ్శబ్దం అవహించింది.
ఆమె ముఖంలో దిగులు స్పష్టంగా కనబడుతోంది.
"ఏమిటి - సడన్ గా సైలెంటయిపోయాడు ?"
"మీరు వెళ్ళిపోతే నేనెలా ఉండగలనో తెలీటంలేదు. తల్చుకుంటేనే మనసంతా ఏదోలా అయిపోతోంది..."
శోభనాచలం హృదయంలో కూడా సన్నగా ఏదో బాధ.
తనకు తెలీకుండానే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
"జానకీ! నా పరిస్థితి కూడా అలానే ఉంది! ఉద్యోగం దొరికిందన్న సంతోషం కూడా లేదు. ప్రామిస్ చేస్తున్నాను- వీలయినంత త్వరలో నీకోసం మళ్ళీ వచ్చేస్తాను -"
ఆమె కళ్ళనిండుగా నీళ్ళు నిలవటం మసకగా కనిపించిందతనికి.
ట్రైనింగ్ లో ఉండగా తను ఒక్కరోజు శెలవుకోసం ఎంతో ప్రయత్నం చేశాడు - జానకిని చూడాలని! అతి కష్టంమీద ఒకరోజు దొరికింది కానీ - తీరా కాకినాడ వచ్చేసరికి జానకి ఎడ్యుకేషన్ టూర్ కెళ్ళిందని తెల్సింది. చాలా ఫీలయ్యాడు తను. ఒక్కరోజైనా జానకితో గడపాలన్న కోరికను బలవంతంగా అణిచేసుకోవాల్సి వచ్చింది.
ట్రైనింగ్ ఆ తరువాత ఆ ప్రెంటిన్ షిప్- ఆ తరువాత పోస్టింగ్ - సంవత్సరం అయిపోయింది.
మొదట్లో ఒకే ఒక్కసారి జానకికి ఉత్తరం రాశాడు. ఆమె వెంటనే జవాబు రాసింది. ఆ ఉత్తరంలో తనకోసం వేయి కళ్ళతో ఎదుర్చూస్తున్నానని రాసింది.
ఆ తరువాత ఉత్తరం రాయలేకపోయాడతను.
ఆమె తల్లిదండ్రులేమయినా ఆఫెండ్ అవుతారేమోననిపించింది.
త్వరత్వరగా రడీ అయి జానకి ఇంటివేపు నడిచాడు శోభనాచలం.
హృదయమంతా తీయని అనుభూతితో నిండిపోయింది.
సంవత్సరంపాటు అణచి ఉంచిన కోరిక కదలి స్వైరవిహారం చేస్తోంది.
డోర్ బెల్ మోగించిన కొద్ది క్షణాలకు తలుపు తెరచింది జానకి.
తనను చూసి ఆశ్చర్యపోయింది.
"మైగాడ్! మీరా! ఎప్పుడు రావటం?" అంది లోపలకు దారి తీస్తూ.
"ఇందాకే! ఇంటి దగ్గర సూట్ కేస్ పడేసి వెంటనే ఇక్కడి కొచ్చేశాను."
ఆమె అదివరక్కంటె మరింత అందంగా మరింత గ్లామరస్ గా కనిపించిందతనికి.
ఆమెను చూస్తూంటే మాటలు రావటం లేదు. అంత ఆనందంగా ఉంది.
"ఇద్దరూ సోఫాల్లో కూర్చున్నారు."
"ఎలా వుంది జాబ్?" అడిగిందామె చిరునవ్వుతో.
ఆ ప్రశ్న శోభనాచలానికి కొంచెం నిరుత్సాహం కలిగించింది.
తనూహించింది వేరు.
తనను చూడగానే ఆమె కళ్ళల్లో మెరుపు మెరుస్తుందనీ, తనను కౌగలించుకుంటుందనీ-
"మీకోసం ఎదురుచూసి చూసి విసిగిపోయాను తెలుసా?" అని అంటుందనీ-
"బాగానే ఉంది!" కాపోతే కొత్త "ప్లేసెస్" కావడం మూలాన ఎడ్జస్టవటానికి టైమ్ పట్టింది. ముఖ్యంగా బాంబే, ఢిల్లీ- చాలా ప్రాబ్లమ్ అయాయ్."
"అక్కడ క్రికెట్ ఆడుతున్నారా?" ఉత్సాహంగా అడిగింది.
"ఉహూ ట్రైనింగ్ కదా! ఆ సౌకర్యం లేదు. మా కంపెనీ టీమ్ ఉన్నా కూడా ఏదైనా క్రికెట్ క్లబ్ లో జాయినవాలనుకుంటున్నాను- అన్నట్లు మీరెక్కడికో వెళ్లబోతున్నట్లున్నారు?" ఆమె చేతిలోని బాగ్ చూస్తూ అన్నాడు.
"అవును! ఇవాళ క్రికెట్ మాచ్ జరుగుతోంది. మెడికల్ కాలేజ్ వర్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్ - మామెడికల్ కాలేజ్ లో రామరాజు ఎంత లవ్ లీగా ఆడుతున్నాడో తెలుసా?
"హీ ఈజ్ ఇన్ సూపర్బ్ ఫామ్! మొన్న రంజీ ట్రోఫీలో కూడా ఆడాడు. మీరు చూళ్ళేదూ?"
"యా! అతని పేరు తెలుసు-"
"మా డాడీ కూడా త్రిల్ అయిపోయారు అతని మాచ్ చూసి - స్క్వేర్ డ్రైవ్ ఎంత బాగా చేస్తాడో చూసి తీరాల్సిందే! అబ్బ! ఆయామ్ రియల్లీ మాడ్ ఆఫ్టర్ హిమ్!"
శోభనాచలం ఉత్సాహం పూర్తిగా చల్లారిపోయింది.
ఆమె తామిద్దరి గురించీ, ఇంతకాలం తామనుభవించిన ఒంటరితనం గురించీ, విరాహం గురించీ మాట్లాడుతుందనుకున్నాడు.
పోనీ క్రికెట్ గురించి మాట్లాడినా తను చేసిన బౌలింగ్ గురించీ, బాటింగ్ గురించీ మాట్లాడుతుందనుకున్నాడు.
ఒకప్పుడు తనను మించిన ఆటగాడే లేడని అని ఇవాళ రామరాజుని మించిన ఆటగాడు లేడంటోంది.
"హల్లో శోభనాచలం? ఎప్పుడు రావటం?" ఆమె తండ్రి లోపల్నుంచి వస్తూ పలుకరించాడు.
"ఇంతకుముందేనండీ?"
ఇద్దరూ కరచాలనం చేశారు.
"ఇప్పుడెక్కడ ఉండటం?"
"హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఇచ్చారు"
"వెరీగుడ్! లాటాఫ్ స్కోప్ ఫర్ క్రికెట్ కదూ?"
"యస్సర్."
"నేనూ జానకీ క్రికెట్ మాచ్ కెళ్తున్నాం! మెడికల్ కాలేజ్ టీమ్ చాలా బాగా ఆడుతున్నార్లే! ఆల్ రెడీ రామరాజు రంజీట్రోఫీలో ఆడాడు తెలుసా? ఎక్స్ లెంట్ ప్లేర్ అనుకో! డెఫినెట్ గా ఇండియా లెవెన్ కి ఆడతాడు-"
శోభనాచలానికి మనసు చివుక్కుమంది.
"చలం! మీరు కూడా మాతో మాచ్ కి రాకూడదూ? వుయ్ కెన్ రియల్లీ ఎంజాయ్ రామరాజూస్ ప్లే!" అంది జానకి.
"ఇప్పుడే కదా వచ్చింది- ఫ్రెండ్స్ ని కలుసుకోవాలి! మీరు వెళ్ళి రండి!"
"ఆల్ రైట్! అయితే ఈవెనింగ్ రండి. కాసేపు మాట్లాడుకోవచ్చు."
ఆమె మాటల్లో మళ్ళీ ఆశ కనబడుతోంది.
"ఓకే- వస్తాను."
తను బయటికొచ్చేశాడు.
ఇంటిముందు అరడజను సైకిళ్ళాగి ఉన్నయ్. హాల్లో కేకలూ నవ్వులూ వినబడుతున్నాయి. తన బాచి వచ్చేశారన్నమాట. ఆనందంగా లోపలికడుగు బెట్టాడు శోభనాచలం. సుబ్రమణ్యం, రామచంద్రరావు, బాబూరావ్, రామన్న, రమణ, ప్రసాద్- అందరూ కూర్చుని ఉన్నారు. అరగంటసేపు అందరూ ఒకరి విషయాలొకరు తెలుసుకొన్నారు నవ్వుతూ జోకులు వేసుకొంటూ.
"పదరా! అలా మెయిన్ రోడ్ మీదకు పోదాం..." అన్నాడు బాబూరావ్.
అందరూ సైకిళ్ళమీద బయల్దేరారు.
అదివరకటి రోజులు గుర్తుకొచ్చినయ్ శోభనాచలానికి. అప్పుడు తన వెంబడి పాతికమంది కుర్రాళ్ళకు తక్కువుండేవారు కాదు. తన హీరో ఆ రోజుల్లో. తనతో మాట్లాడితేనే గొప్పగా భావించే జూనియర్స్ అనేకమందప్పుడు.
ఓల్గా దగ్గర సైకిళ్ళు పెట్టేసి నదరూ బిలబిలమని లోపలికెళ్ళి ఓ టేబుల్ చుట్టూ కూర్చున్నారు.