Previous Page Next Page 
అంకితం పేజి 30


    "కానీ" అంటూ ఆమె ఏదో చెప్పబోయింది. నేను వారించాను. "ఒక కిడ్నీ తొలగించటం వలన ఆ పాప ప్రాణాలకి ఏ ప్రమాదమూ లేకపోవచ్చు. ఇక్కడ సమస్య అదికాదు. ఒక ఆరోగ్యవంతమైన  అమ్మాయి కిడ్నీఅయితే,  ఆమెకి చెప్పి, వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితో దాన్ని తొలగించటం వేరు. మనం చెప్పేది అర్థంకాని స్థితిలో, మనసికా వైకల్యంతో...... నువ్వన్నట్టు జీవచ్ఛవంలా బ్రతుకుతున్న నీ కూతురి కిడ్నీని తీసుకోవటం అంటే...... ఉహూ! నా మనసంగీకరించటం లేదు...... అంకిత్ మరణించినా సరే" చివరి మాటకి నా గొంతు వణికింది.

    ఆమె చాలాసేపు మాట్లాడలేదు. చివరికి "నేనొక నోర్నయానికి వచ్చాను" అంది లేచి నిలబడి....

    "ఏమిటది?"

    "అంకిత్ కి నేను కిడ్నీ ఇస్తాను."
   
    నేను నిస్పృహగా తల విదిలిస్తూ "కృపానంద్ వప్పుకోడు" అన్నాను.

    "అవసరం లేదు. నేను అతడికి తెలియకుండా ఇస్తాను."

    ఆశ్చర్యంగా "ఎలా?" అన్నాను.

    "నేనిప్పుడు ఒక ఇంటికి వెళ్ళను. ఇట్నుంచి ఇటే విశాఖపట్నం వచ్చేస్తాను. పది రోజుల తరువాత అతడికి తెలుస్తుంది. ఏం చేస్తాడు? కోపంతో ఎగిరెగిరిపడ్తాడా? పడనీ. అది నాకేం కొత్తకాదు. నా కొడుకుని రక్షించుకున్నానన్న తృప్తిముందు అతడి హింసని భరించటం కష్టమేమీ కాదు. అది కొత్త కాదు కూడా!"

    చాలాసేపటి వరకూ నేను మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా అన్నాను. "రిస్కు తీసుకుంటున్నావు సుమా. కృపానంద్ ఎంత సాడిస్టో...... విరిగిన నా చెయ్యే చెపుతోంది. అటువంటిది నువ్వు ఇంత పనిచేసావంటే అతడు నరహంతకుడైనా ఆశ్చర్యపోనవసరంలేదు."

    "అవడు" అంది సుమ బలవంతంగా నవ్వుతూ. నా మీద ప్రేమ! నా ఆస్థిమీద చాలా ప్రేమ! నన్ను వదులుకోడు! ప్రాణాల్తో వుంచి బాధిస్తాదంతే....."


                                               *    *    *


    వెంటనే ఏర్పాట్లు చకచకా పూర్తి చేసాను. జాన్ కి ఫోన్ చేసి విషయమంతా చెప్పాను.

    "గుడ్ అన్నాడు అంతా విని ....... "కథ సుఖాంతమవుతోందన్న మాట."

    "చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా వున్నాయి. సుమద్యుతిని జాగ్రత్తగా వైజాగ్ చేర్చాలి. కృపానంద్ రైల్వేస్టేషన్ లో కాపుగాచినా ఆశ్చర్య పోనవసరం లేదు."

    "ఆ విషయాలన్నీ నాకు వదిలిపెట్టి, నువ్వు డాక్టర్ మహారాదికి ఫోన్ చేసి ఆపరేషన్ కి ఏర్పాట్లు సిద్ధం చేయమను" అన్నాడు జాన్.

    మనసంతా ఉద్విగ్నతతో నిండిపోగా, వైజాగ్ ఫోన్ చేసాను. డాక్టర్  మహారధి రిసీవు చేసుకున్నాడు. అంకిత్ తల్లి దొరికిన విషయం చెప్పాను. "కంగ్రాట్స్" అన్నాడు. అతడి కంఠంలో ధ్వనించిన సిన్సియారిటీ నేను గుర్తించగలిగాను. నాకు చాలా సంతోషంగా  అనిపించింది. ఆ డాక్టర్ దగ్గిర కూడా అంకిత్ తన "జీవితపు విలువ"ని గుర్తించేలా చేయగలిగాడన్నమాట!

    "ఆమెని కూడా పరీక్షించి, అంకిత్ ఆ కిడ్నీ సూట్ అవుతుందో లేదో చూడాలి కదా" అన్నాను.

    "కన్నతల్లి కదా. అవసరం వుండకపోవచ్చు. అవన్నీ ఇక్కడి కొచ్చాక చేసుకోవచ్చు కూడా. దానికన్నా ముఖ్యంగా మీరొక పనిచేయవలసి వుంటుంది."

    "ఏమిటది?"

    "కోర్టు అనుమతి తీసుకోవటం".

    ఊహించని ఈ పరిణామానికి నేను అదిరిపడి "మళ్ళీ అదేమిటి?" అన్నాను.

    "అంగాల మార్పిడి ఒకప్పుడు డాక్టర్ల చేతిలో వుండేది. ఇటీవలే ...... కొన్ని అరాచకాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఈ మార్పిడిని నిరోధించింది. అందువల్ల కోర్టు అనుమతి అవసరం. అయితే ఇందులో కంగారుపడవలసిన అవసరం ఏమీలేదు. కన్నతల్లే దాత కాబట్టి మేజిస్ట్రేటు కేవలం అరగంటలో అనుమతి ఇస్తాడు. డబ్బుపరమైన లావాదేవీ లుంటేనే కష్టం అక్కడ హైద్రాబాదులోనే మీరు అనుమతి కోసం అప్లయ్ చేయండి. రేపు సాయంత్రానికి అక్కడే బయల్దేరితే, ఎల్లుండి ఆపరేషన్ చేసెయొచ్చు...."

    ఆయన మాటలు నాలో నూతనోత్తెజాన్ని కలగచేసాయి. కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేసాను.

    వెంటనే నేనూ, జాన్ కలిసి లాయర్ని కలుసుకున్నాము. డాక్టర్ చెప్పిన మాట నిజమే. గంటలో కోర్టునుంచి అనుమతి లభిస్తుందనీ, పెద్ద కష్టమేమీ లేదని లాయర్ కూడా అన్నాడు.

    ఆ రోజు సుమద్యుతిని ఏ హొటల్ లో వుంచాడో నాక్కూడా చెప్పలేదు జాన్ డేవిడ్.


                         *    *    *


    కోర్టు హాలు నిశ్శబ్దంగా వుంది. మొట్టమొదటి కేసు మాదే.

    జాన్ డేవిడ్ సుమద్యుతిని తనకార్లో కోర్టుకి తీసుకొచ్చాడు. ఆమెని చూసిన తరువాత నా టెన్షన్ పూర్తిగా తగ్గిపోయింది. కృపానంద్ ఆమె కోసం విశాఖపట్నం వెళ్ళే రైళ్ళు, బస్సులు వెతుకుతూ వుంటాడు. బహుశా! భార్య ఇంట్లోంచి 'తప్పించు'కుందని తెలియగానే జేగురురంగుకి మారిన అతడి మొహాన్ని వూహించుకుంటూ కోర్టు హాల్లో కూర్చున్నాను. పక్కనే జాన్, దయ వున్నారు.

    కోర్టు హాలు నిశ్శబ్దంగా వుంది.

    ఎంత నిశ్శబ్దంగా అంటే...... తప్పుచేసిన దొంగ ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని భరించలేక విచారణ ప్రారంభం కాకముందే నిజం చెప్పే సేటంతగా!

    మా లాయర్ లేచి, మా అప్లికేషన్ ని కోర్టు గుమాస్తాకి అందించాడు. అతడు తన వంతు కర్తవ్యంగా దాన్ని మాజిస్ట్రేట్ కి అందజేసాడు.

    మాజిస్ట్రేట్ దాన్ని ఆసాంతం చదివాడు. తరువాత దరఖాస్తుదారుల్ని హాజరుపర్చమని అన్నాడు.

    సుమద్యుతి వెళ్ళి బోనులో నిలబడింది.

    "మీ పేరు?" అడిగాడు మాజిస్ట్రేటు.

    ఆమె చెప్పింది.

    "పేషెంట్ మీకేమతాడు?"

    "కొడుకు".

    "కన్నకొడుకేనా?"

    "అవును."

    "మీరు మనస్ఫూర్తిగా, ఏ వత్తిడికీ లోనుగాకుండా మీ కిడ్నీ ఇస్తున్నారా?"
   
    "ఇస్తున్నాను."

    "మీ భర్త తరపున ఏ వత్తిడీ లేదుకదా?"

    "లేదు."

    "అంకిత్ మీ కొడుకు అని చూపించే సాక్ష్యాధారాలున్నాయా?"

    మా లాయర్ లేచి ఫైల్లోంచి కొన్ని కాగితాలు తీసి అతడికి అందించాడు. అవన్నీ దొంగ సర్టిఫికెట్లు.

    ఆయన అవి చదివి, తన కళ్ళజోడు సర్దుకుంటూ, "ఇక మీరు వెళ్ళవచ్చు" అన్నాడు. ఆ తరువాత (మా కేసు అర్జెన్సీ ఆయనకి చెప్పాం కాబట్టి) తీర్పు వ్రాయటంలో మునిగిపోయాడు. తీర్పులంటే జడ్జిమెంట్ కాదు. నాలుగు వాక్యాల అనుమతి  పత్రం!

    ఆయన దాన్ని పూర్తి చేస్తుండగా అప్పుడు జరిగిందా సంఘటన!

    విజిటర్స్ మధ్యలోంచి ఒక వ్యక్తి లేచాడు. ఆ మనిషి లేచి నిలబడటం చూసాను కానీ పట్టించుకోలేదు. మా దృష్టంతా మేజిస్ట్రేట్ మీద వుంది.

    ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు, "యువర్ ఆనర్ తీర్పుకి ముందు నా వాదన కూడా మీరు వినాలి."

    తలతిప్పి అప్పుడు చూసాను అతన్ని.

    అంతే!!!

    భూమి బీటలు వారినట్టు నా గుండె కూడా బ్రద్ధలైపోయింది.

    అతడు కృపానంద్!!!

    "నువ్వు చెప్పదల్చుకున్నది ఏమిటి?" మేజిస్ట్రేట్ అడిగాడు.

    "అంకిత్ అనబడే  కుర్రవాడు. ఆమె (సుమద్యుతిని చూపిస్తూ) కొడుకు కాదు" అన్నాడు కృపానంద్.

    "నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమావుతుందా?"

    "అవుతుంది యువరానర్."

    "అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?"

    "ఈమె నా భార్య కాబట్టి."

    కోర్టంతా ఒక్కసారిగా నిశ్శబ్దమై పోయింది. మేజిస్ట్రేట్ అతడివేపు అయోమయంగా చూస్తూ "సుమద్యుతి అనే అర్జీదారు నీ భార్యా?" అని అడిగాడు.

    "అవును యువరానర్."

    "మరి అంకిత్?"

    జనం మధ్యలో వున్న నన్ను చూపిస్తూ కృపానంద్ ....... "అదిగో అతడి కొడుకు" అన్నాడు. కోర్టు హాల్లో వున్న తలలన్నీ నా వైపు తిరిగాయి. నా మొహం రక్తం లేనట్టు పాలిపోయింది. కృపానంద్ చెప్పాడు..... "నా  భార్య అతడి ప్రియురాలు. తన ప్రేమ నిరూపించుకోవడం కోసం అతని కొడుక్కి తన కిడ్నీ ఇవ్వాలనుకుంటోంది. ఇదంతా నాకు తెలియకుండా జరుగుతోంది. నాకు న్యాయం జరిపించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను......"

    "మరి ఈ సర్టిఫికెట్లలో అంకిత్ తల్లి పేరు సుమద్యుతి అనీ, అతడు వైజాగ్ లో చదువు నిమిత్తం వుంచబడ్డాడనీ వున్నదే."

    "అవి దొంగ సర్టిఫికెట్లు మైలార్డ్" అంటూ మళ్ళీ నన్ను చూపించి "తన కొడుకు కోసం అతడు కృత్రిమంగా సృష్టించినవి" అన్నాడు.

    మేజిస్ట్రేట్ నా వైపు కౄరంగా చూస్తూ "నిజమేనా?" అన్నాడు. తల వూపటానికి కూడా నాలో శక్తి లేనట్టు అచేతనంగా వుండిపోయాను.

    పడి నిముషాల్లో తీర్పు వెలువడింది. ఒకర్ని ప్రేమించి, మరొకర్ని వివాహం చేసుకుని, ఆ తరువాత పాత ప్రియుడితో సంబంధం కొనసాగిస్తూ, చివరికి భార్తక్కూడా తెలియకుండా దొంగ సర్టిఫికేట్లతో కోర్టుని మోసం చేయటానికి సిద్ధపడ్డ సుమద్యుతిని అభిశంసిస్తూ మేజిస్ట్రేటు, భారతదేశపు స్త్రీ ఔన్నత్యాన్ని గుర్తు చేసాడు. ఇప్పటికయినా తన ప్రవర్తన మార్చుకొమ్మని ఆమెకి సలహా ఇచ్చాడు. నన్నొక క్రిమినల్ గా చిత్రీకరిస్తూ, ప్రధమ తప్పిదం క్రింద వదిలిపెట్టాడు.

    అది కూడా మా లాయర్ ఎంతో బ్రతిమాలాక!

    కొడుకు చావు బ్రతుకుల మధ్య వుండగా, ఎటూ తోచని పరిస్థితుల్లో నేను ఆ విధంగా చేయవలసి వచ్చిందని లాయర్ మేజిస్ట్రేట్ తో విన్నవించుకున్నాడు. ఆ లాయర్ తెలివైనవాడే! సుమద్యుతి మేజరు కాబట్టి, ఆమె కిడ్నీ ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం ఆమెదే అనీ, దీనికీ కృపానంద్ కీ సంబంధం లేడనీ వాదించాడు. అయితే మేజిస్ట్రేట్ వప్పుకోలేదు. అప్పటికే ఆయనకి నా మీదా, సుమద్యుతి మీద చాలా హీనమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. ఎక్కువగా వాదిస్తే, దొంగ సర్టిఫికెట్ల విషయంలో తీవ్రమయిన శిక్ష వేయాల్సి వస్తుందని హెచ్చరించి వదిలిపెట్టాడు.

    తీర్పు విన్నాక నేను నిర్వేదంగా మారిపోతున్నాట్టు స్పష్టంగా అర్థమవసాగింది. ఒక చిన్న ప్రాణాన్ని కాపాడటానికి నేను చేస్తున్న ప్రయత్నంలో ఇన్ని అడ్డంకులు వుంటాయని అసలు వూహించలేదు. నేను ఈ డాక్టర్లు, ఈ చట్టాలూ, ఈ ద్వేషాలూ ....... అన్నీ కలిసి అంకిత్ అంతుతేల్చడానికి కంకణం కట్టుకున్నట్టున్నాయి.   

 Previous Page Next Page