Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 31


    అనూహ్య అనుమానంగా తలెత్తింది.

    "అతడే నీకు తగినవాడని నేననుకుంటున్నాను" అతడు ఒక క్షణం ఆగి అన్నాడు. "అనూహ్యా, నేను నిన్ను గాఢంగా ప్రేమించాను నిజమే. కానీ, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అతడి కళ్ళలో జీవం పోయడానికి ప్రాణాలన్నా ఇవ్వవచ్చుననుకునే వాళ్ళం నేను, నిఖిల్! దానికోసం ణా ప్రేమని వదులుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను. వెళ్ళు అనూహ్యా, అతడి కళ్ళల్లో వెలుగులు నింపు. ణా అంత సంతోషించేవాళ్ళు మరొకరుండరు" అతడామెని చూడలేక మొహం తిప్పుకున్నాడు.

    ప్లేబాయ్ లా జీవితాన్ని అతి తేలిగ్గా తీసుకునే అతడిలో ఎంతటి ఉదాత్తభావాలు! యశ్వంత్ పట్ల అతడికున్న భక్తికీ, గౌరవానికీ ఆమె చలించిపోయింది. లేచి వెళ్ళిపోయింది. యశ్వంత్ దగ్గరికికాదు. తన గదిలోకి.


                             *    *    *

    "అనూహ్యా! పిలిచావట"

    లాబరేటరీ బిజీగా అనూహ్య వెనక్కు తిరిగింది. అలసిపోయిన ముఖంనిండా పులుముకొంటున్న సంతోఛాయలతో అందంగా మెరుస్తోంది.

    "అవును యశ్వంత్, ణా పరిశోధన ఫలించింది. అది ముందుగా మీకే చెప్పాలని పిలిచాను."

    "కంగ్రాట్స్, ఏదీ చూపించు"

    కంటెయినర్ పచ్చరంగు ద్రవాన్ని అనూహ్య చూపించింది. "యాంటిబాక్టీరియల్, యాంటి వైరస్ సొల్యూషన్."

    "ఏ వైరస్, ఏ  బాక్టీరియాలకి!" అడిగాడు.

    "ఏదైనా సరే. సామాన్యమైన జలుబు నుంచి కాన్సర్, ఎయిడ్స్, టి.బి,ల వరకు అణుపరిణామంలో శరీరాన్ని ఆక్రమించుకునే అతి సూక్ష్మక్రిమిని చంపేస్తుంది అనుకుంటున్నాను. దీని వాక్సిన్ కూడా త్వరలో తయారుచేస్తాను. అప్పుడిక జబ్బులు అంతుకోవడం, పెరగడం వుండవు" ఆమె మాటలు పూర్తికాలేదు. యశ్వంత్ ఆమె చేతులు పట్టుకుని వూపేశాడు. అతడంత ఆనందంగా వుండే క్షణాలు అరుదు.

    "రియల్లీ! ఎంతటి శుభవార్త. ఈ వార్త వెంటనే భూమికి పంపిస్తాను. ఫార్ములా కూడా పంపుదాం. ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకయినా అందుతుంది. ఎనీ వే - అయామ్ వెరీ హాపీ - మిగతా ఇద్దరికీ చెబుతా వుండు ఈ శుభవార్త" అతడు వెళ్ళబోయాడు.

    "నేనీ ప్రయోగం చేస్తున్నట్టు వాయుపుత్రకి తెలుసు."

    "ఏమన్నాడు-"

    "గెలాక్సీ అంచు దాటవచ్చుగానీ, మనిషి జలుబు నయం చేయటం అసాధ్యం అన్నాడు. బాగా చలిలో నిలబడి జలుబు తెచ్చుకుంటాడట. తనమీద ప్రయోగం చేసి నయం చెయ్యమన్నాడు."

    "అతడంతే, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. నేను వెళ్ళి యీ వార్త చెబుతాను."

    ఆమె దాని గురించి అంత ఉత్సాహం చూపించలేదు.

    "యశ్వంత్" పిలిచింది సందేహంగా.

    "ఏమిటి?"

    "కొద్దిరోజులుగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను."

    "ఏమిటి? వాయుపుత్ర విషయమేనా?"

    "అంటే..... అంటే..... మీకు తెలిసిపోయిందా?"

    "నువ్వు ఉత్తరంలో వ్రాశావుగా?"

    ఆమె స్థబ్దురాలైంది. ఆమె దాన్ని వూహించలేదు. "ఆ.....ఆ ఉత్తరం మీకు అందిందా?" అంది తడారిన గొంతుతో.

    "అందింది" అన్నాడు క్లుప్తంగా. ఆమెకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ గదిలో నిశ్భబ్ధం  ఆమెని భయపెట్టింది. అంతలో అతను ఆమె దగ్గిరగా  వచ్చాడు-" అనవసరంగా నీ జీవితంలోకి తిరిగి ప్రవేశించానేమోనని బాధపడ్డాను. నన్ను నమ్ము అనూహ్యా! ఆ రోజు చంద్రుడి మీదకు జారిపోతూ ణా జీవితానికి చివరి క్షణాలే అనుకున్నాను. అందుకే నీతో ఆఖరిసారి మాట్లాడాలని కోరుకున్నాను. అది నీకెంత మనస్తాసం కలిగించిందో మొన్ననే అర్థమయింది. నేనే మీ  యిద్దరితో ఈ విషయం గురించి ప్రస్తావించాలనుకున్నాను. కాని అంతలోనే మన యాక్సిడెంటు, ఫిలిప్స్ మరణం.....సరే అదంతా వదిలేయ్. ఈ రోజే వాయుపుత్రతో మాట్లాడతాను."

    "నేను మాట్లాడాను యశ్వంత్. ఆ విషయం సెటిల్ చేసుకున్నను. అతడు కూడా ణా విషయం అర్థం చేసుకున్నాడు."

    "అంటే?"

    "నాకు మీ మీద ప్రేమ చచ్చిపోలేదని, అంతరాంతరాల్లో నేను యింకా మిమ్మల్నే కోరుకుంటున్నానని అతడంటాడు."

    "పొరపాటు పడుతున్నాడు. నీకు ణా పట్ల వున్నది గౌరవం మాత్రమే. ఎన్ని జన్మలెత్తినా మనం అరమరికలు లేకుండా దగ్గరకాలేం. మనకు ఒకరిపట్ల ఒకరికున్నది ప్రేమకాదు. భక్తి. అది కాదు కావలసినది. మీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోండి. తర్వాత ఎలాంటి సమస్యలూ వుండవు."

    ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. శక్తులన్నీ కూడగట్టుకున్నది. "నేను చెప్పాలనుకున్నది అదికాదు 'మీ ముందు' నేను ధైర్యంగా ఏదీ చెప్పలేను. అందుకే తడబడి ఒకదానికొకటి చెపుతుంటాను. కాని  యిప్పుడు నా మనసు నిశ్చలమైంది. నాకు కావలసిందేమిటో ఫిలిప్స్ మరణంతో తెలిసింది. ఆయన గురించి మీకు బాగా తెలీదు. నన్ను కూతురిలా చూసుకునేవాడు. మేము ఎన్నో మాట్లాడుకునే వాళ్ళం. అతడు చిన్ననాటి నుంచి ఎవరి ఆప్యాయతను నోచుకోలేకపోయాడు. అమ్మా, నాన్నా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడూ, ఎలాంటి అనుబంధాలు లేవు. ఎవర్నీ ప్రేమించలేదు. కాని ఎప్పుడూ ఏమాత సంతోషంగా వుండేవాడు! ఇప్పుడు  నేను కనుక్కున్నా ఈ యాంటీ వైరస్ పరిశోధనల్లో అతడికీ భాగం వుంది యశ్వంత్! సర్వమానవాళికీ అతడు ఆత్మీయుడే! వాళ్ళకోసం యాభై సంవత్సరాలుగా కృషి చేశాడు. వాళ్ళకోసమే  ఆహుతి అయిపోయాడు. పైకి అసలు కనపడడు కదూ. నిజమైన గొప్పతనం అంటే అది! నన్ను చూడండి! ఇద్దరి మగవాళ్ళ ప్రేమలో ఎవర్ని ఎన్నుకోవాలో అన్న సందేహంలో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను నేను. ఎంత అల్పమైంది నా సమస్య! నాకిప్పుడు తెరిపిగా వుంది. నాకు మీరూ కావాలి, వాయుపుత్రా కావాలి. కేవలం మంచి స్నేహితులుగా! మనిషిగా పుట్టినందుకు నా జాతికోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. బ్రతికి బయటపడి భూమికి వెళ్ళినా నా పరిశోధనలకు ప్రాణం పోస్తాను. నా ఈ నిర్ణయం చెప్పాలనే మిమ్మల్ని ఆగమంది" చెప్పేసి ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అగ్నిపర్వతాలు పేలలేదు. భూకంపాలు రాలేదు.

    "చాలా మంచి నిర్ణయం అనూహ్యా. గుడ్ లక్" యశ్వంత్ నవ్వి వెళ్ళిపోయాడు.

    సమస్యని వెంటనే అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇద్దరే. మేధావులు.....కంప్యూటర్లు......

   
                                                             *    *    *

    "రేపట్నుంచి మరో బిడ్డను మొయ్యాలి నేను" అంది బ్రహ్మవిద్య.

    "అదేం పాపం. ఇప్పటికి ఎంతమందిని మోస్తున్నావేంటి?" అడిగాడు నిఖిల్.

    "మీ అందరి పిల్లల్నీ మోస్తున్నాను. ప్రతివాళ్ళూ ఏదో  ఒక పరిశోధన చేయడం అది నా కడుపునా పడెయ్యడం అలవాటయి పోయింది. నిన్నటిదాకా అనూహ్య మందులూ మాకులూ నూరి పోసింది. రేపట్నించి యశ్వంత్ పాటలూ, పద్యాలూ నింపుతాడట."

    "అదేమిటి యశ్వంత్! మీరు కవి, గాయకుడూ అని నాకు తెలియదే" ఆశ్చర్యంగా అన్నాడు వాయుపుత్ర. యశ్వంత్ నవ్వి "సహజ అయస్కాంత శక్తికి అతీతంగా శూన్యంలో ఆల్ట్రాసానిక్ శబ్దాల ఉత్పత్తి కనుకున్నాను. ఎందుకైనా పనికొస్తుందని కంప్యూటర్ లో భద్రపరిచాను" అన్నాడు. అని, చివర్లో మళ్ళీ తనే- "మనుషుల్ని పిచ్చెక్కించటానికి తప్ప  అవి మరెందుకూ పనికి రావనుకోండి ఆఫ్ కోర్స్!" అన్నాడు.

    "మేము భూలోకం చేరినా చేరకపోయినా నువ్వు చేరగలవని మా ఆశ. అప్పుడు మా పరిశోధనలన్నీ అందరికీ ఉపయోగపడతాయని ఓ ధైర్యం. అందుకే నిన్ను 'ఫీడ్' చేస్తున్నాం" అంది అనూహ్య.

    "మీరు లేకుండా నేనెలా వెళతాను మానవ లోకానికి-అసంభవం."

    "ఎందుకు సంభవం కాదు? మాకు వయసు పైబడుతోంది. ఎన్నాళ్ళుంటామో తెలియదు. నీ విషయం వేరు" అన్నాడు యశ్వంత్.

    బ్రహ్మవిద్య మాట్లాడలేదు.

    "ఏం కోపం వచ్చిందా? అలిగావా?"

    "నాతో కాస్సేపు మాట్లాడకండి."

    "అబ్బో నిజంగానే కోపం వచ్చింది?"

    "ఉండండి. అది కోపం కాదు, నన్ను మాటల్లో పెట్టేశారు. మనకేదో....." మాటలు పూర్తికాలేదు.

    ప్రమాదాన్ని సూచిస్తూ కంట్రోలు రూం ఎర్రటి వెలుగుతో నిండిపోయింది.

    యశ్వంత్ గాభరాగా అన్ని ఛానెల్స్ పరీక్షించాడు. ఎక్కడా ఎలాంటి క్లూ కనిపించడంలేదు. టెలిస్కోపిక్ ప్యూయర్ తెరమీద ఫోకస్ చేశాడు. దూరంగా సన్నటి మబ్బుతెర కనిపిస్తోంది.

    "అదేమిటి బ్లాక్ హూలా?" అడిగింది అనూహ్య.

    "కాదు బ్లాక్ హోల్ కనిపించదసలు" అంటూ యశ్వంత్ నౌకను మరో పక్కకి తిప్పాడు. ఏం జరిగిందో చెప్పటానికి కంప్యూటర్ మొండికేస్తోంది. కేవలం మబ్బుని చూసి ప్రమాద హెచ్చరిక ఎందుకు వచ్చిందో ఆ నలుగురికీ అర్థంకావటం లేదు.

    "ప్రమాదం ఎటు వుందో...." అని అతడుండగానే అజ్ఞాతమైన వాయుగుండం సుహృద్భవ్ దరిదాపుల్లోకి వచ్చేసింది. క్షణాల్లో అది నౌకని దాటి వెళ్ళిపోయింది. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. వారి ఆనందం ఎక్కువసేపు మిగల్లేదు.

    కంప్యూటర్ నౌక దారి మారుస్తోంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అనంతమైన అయస్కాంత శక్తి నోరు తెరిచి నౌకని లోపలకు లాక్కుపోయింది.

    మరుక్షణం కంప్యూటర్ నిర్జీవంగా అయిపోయింది, ఏ కంట్రోలు వాళ్ళ అధీనంలో లేదు, సమయం ఆగిపోయింది. గడియారాలు పనిచేయడం లేదు. బ్రహ్మవిద్య మూగబోయింది.

    వాళ్ళ మెదడు తప్ప అన్ని పరికరాలు ఆ ఆకర్షణ శక్తికి లొంగిపోయాయి.

    "బ్లాక్ హోల్-" అరిచారెవరో. నౌక వేగం నాలుగురెట్లు అయింది. గిర్రున తిరుగుతూంది. "ఇక ఎంత సమయముంది? కొద్ది క్షణాల్లో...... నిముషాల్లో" అనుకున్నాడు యశ్వంత్. నౌక అగాధంలోకి జారిపోతూ వుంది. జా....రి...పో....తూ....నే  వుంది.

    అందులోంచి బయట పడడమన్నది అసంభవం. యశ్వంత్ నిస్సహాయుడుగా వెనక్కు వాలిపోయాడు. మిగతా ముగ్గురు కుర్చీలకు అతుక్కుపోయారు.

    అదృష్టవశాత్తు నౌక తాలూకు ఆర్గిఫిషియల్ గ్రావిటీ ఆ శక్తికింకా లొంగలేదు. అదే జరిగిందంటే తామంతా ఆ నౌకలోనే సుడులు తిరుగుతూ ఈ పాటికి మాంసపు ముద్దలై పోయేవారు. యశ్వంత్ కి మునుపటి అనుభవం గుర్తొచ్చి శరీరం జలదరించింది. భయంగా కళ్ళు మూసుకున్నాడు. కరెంట్ లేదు. క్షణాలు, నిముషాలు, గంటలు దొర్లిపోతున్నాయి. ఆకలి, దాహం మర్చిపోయాడు. భయం నిర్లిప్తతగా మారి ఆలోచనలను కూడా చంపేసింది. అది నిరంతరం పయనం. ఇక  ఆగదు. "అంతా అయిపోయింది" యశ్వంత్ అన్నాడు. జవాబు లేదు. అతడి కళ్ళు చీకటిలో వెతికాయి. ఆ ముగ్గురు అచేతనులై స్పృహతప్పి పడిపోయారు. ఎక్కడా కదలికలేదు. అతడి కళ్ళూ మూతలు పడ్డాయి. సుహృద్భావ్ అనంతమయిన వాయుగుండంలో సుడులు తిరుగుతూ పరుగిడుతోంది.

 Previous Page Next Page