Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 32


    ప్రపంచ అంతరిక్షయాన సంస్థ ప్రెసిడెంట్ ముఖం టీ.వీ. తెరమీద కనిపించగానే, మనవడిని నిద్రపుచ్చుతున్నది కాస్తా పరుగున వచ్చి టి.వి. దగ్గర కూర్చుంది శ్రీజ. ఎంతో ముఖ్యమైన విషయం అయితే తప్ప మొత్తం మూడువందల చానెల్స్ లో ఒకేసారి ఆయన ప్రసంగం అలా రిలే చెయ్యరు. ఆయన ముఖం చూస్తుంటే ఏదో వినకూడని వార్తే వినిపించేవాడిలా వుంది.

    "ఫ్రెండ్స్,

    మీతో తరచు ఇలా మాట్లాడవలసి వస్తుండటం ఇంతకాలం నాకు చాలా సంతోషంగా అనిపించేది. ఇంతకాలంగా మీకు చాలావరకు శుభవార్తలే చెబుతూ వచ్చాను. కాని ఈ రోజు చివరిసారిగా మీకు అతి విషాదకరమైన విషయం తెలియజేయవలసి వస్తోంది. కాంతివేగాన్ని అధిగమించాక సుహృద్భావ్ నించి మనకు సంభాషణ ఆగిపోయింది. అప్పటినుండీ కొన్ని సిగ్నల్స్ ద్వారా దాని ఉనికి గురించి తెలుసుకుంటున్నాం. దాన్ని గురించి తెలిసిన వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే వున్నాను. అలాగే ఈ రోజున కంప్యూటర్ ద్వారా అందుకున్న సిగ్నల్ ని బట్టి అర్థమయిన చివరి విషాదాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను.

    మన అంతరిక్ష వాహనం బ్లాక్ హొల్ కి బలయిపోయింది. ప్రమాదంలోకి వెళ్ళబోతూ ఆ మాత్రం మనకు తెలియచేయగలిగింది. ఒకసారి బ్లాక్ హొల్ లోకి వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడటం సాధ్యం కాదని మీకు తెలుసు. ఇక  ఇప్పట్లో మన  తదుపరి కార్యక్రమం అంటూ కూడా ఏమీ లేదు. ఇక నాకు ఈ పదవితో, మీకు నాతో ఎలాంటి అవసరంలేదు. ఐదుగురి ప్రాణాలు తీసే నిర్ణయం తీసుకున్న అధికారిగా మిమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ణా రాజీనామాని కూడా ఆమోదించమని అభ్యర్థిస్తున్నాను. భగవంతుడనే వాడుంటే  మానవజాతి భవిష్యత్తునీ, సూర్యుడినీ రక్షించమని అతడిని ప్రార్థిస్తూ శలవు తీసుకుంటున్నాను." టి.వి. నుంచి విషాద సంగీతం వినిపిస్తోంది. శ్రీజ అచేతనంగా కూర్చుండిపోయింది. ప్రక్కన పిల్లవాడు ఆడుకుంటున్నాడు. అన్ని రకాల జబ్బులను మనస్తాపాలను నయం చేసేది ఒకే మందు-కాలం.


                                        6

    వాయుపుత్ర కళ్ళు తెరిచాడు. చుట్టూ అంతా చీకటిగా వుందో లేక తనకళ్ళు పోయాయో అతడికి అర్థం కాలేదు. ఆ చీకటి అంత భయంకరంగా వుంది. రాత్రి చీకటికి కళ్ళు కొద్దిసేపట్లో అలవాటు పడతాయి. కానీ ఈ చీకటి అలా లేదు. భూమి లోపల వేల అడుగుల క్రింద సమాధి చేయబడ్డనిపిస్తోంది. చెయ్యి ప్రక్కకు జరిపి చూశాడు. కుర్చీ అంచు తగిలింది. అంటే తను సుహృద్భావ్ లోనే వున్నాడన్నమాట. అతడికి కొద్దికొద్దిగా గుర్తొస్తోంది.

    వాహనం వేగంగా బ్లాక్ హొల్ లోపలికి చొచ్చుకుపోవడం, తమ ఆధీనంలోంచి తప్పిపోయి వేగంగా సుడులు తిరగడం..... ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయేమో అన్నట్టు వుంది. ఆ చీకటికి అర్థం యిప్పుడు తెలుస్తోంది. తనింకా బ్లాక్ హొల్ లోనే వున్నాడు. కాని ఏదో తేడా! వాహనం కదలకుండా నిలబడిపోయినట్లు వుంది. అంటే  బ్లాక్ హొల్ మధ్యలో ఆగిపోయుండాలి- అసంభవం. బ్లాక్ హొల్ "అంతం" అంటూ లేదు. ఏదో జరిగింది. ఏమిటది?

    వాయుపుత్ర చెయ్యి చాపి చూశాడు. మరో శరీరం చేతికి తగిలింది. నిఖిల్ అనుకుంటా అతడు లేవబోయాడు. శరీరం సహకరించలేదు. ఎక్కడనుంచో సంగీతం వినిపిస్తోంది లీలగా. అది సంగీతమా? కాదు తన భ్రమ.

    అంతలో ఎవరో చిన్నగా నవ్విన చప్పుడు. ఆ నవ్వు మామూలుగా లేదు. ఎవరో నవ్వినట్లు శబ్దం చేసినట్లుగా వుంది. ఏంటీ భ్రమ? నవ్వినట్లు శబ్దం చేయాల్సిన అవసరం ఏమిటి?

    "బ్రహ్మవిద్యా" పిలుస్తూ లేవబోయాడు. నడుముకి తగిలించిన బెల్టు అడ్డు పడింది. ఇదంతా కలకాదన్న నమ్మకం ఏర్పడింది. ఆ చీకటి దుర్భరంగా వుంది. భయం.....భయం....ఎక్కడున్నాడు తను? వైతరణీ గర్భంలోనా?

    "మీ  మానవులు ఏ లోకంలో వున్నా స్వర్గ నరకాల గురించే ఆలోచిస్తుంటారు. భలే  గమ్మత్తుగా వుంటుంది మీ ఆలోచన."

    "ఎవరు మాట్లాడేది?" గట్టిగా అడిగాడు. ఎవరో మాట్లాడుతున్నారు అంటే....తమ అంతరిక్ష ప్రయాణం అంతా కలేనా? గదిలో పడుకుని నిద్రలో కలగంటున్నాడా?

    "........ఎవరది?"

    "మీరు అంత గట్టిగా అరచి మాట్లాడవలసిన అవసరం లేదు. మాకు  సౌండ్ ఎలర్జీ. గట్టిగా మాట్లాడేవాళ్ళను సహించలేం."

    "మేము అంటే....అంటే ఎవరు? మనుష్యులు కారా?" అతడి మనసు పరిపరివిధాల పోతోంది.

    "అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకుంటావెందుకు? ఈ ఒక్కక్షణంలో నీ మనసులో వంద రకాల ప్రశ్నలు తలెత్తాయి. అవన్నీ అనవసరం కదా."

    "చెవులకి వినిపిస్తోంది కళ్ళెందుకు కనిపించడం లేదు?" మనసులోనే అనుకున్నాడు.

    "నీ  కళ్ళు వెలుతురిని చూడడానికే అలవాటు పడ్డాయి. మా కళ్ళు అలా కాదు. వెలుతురూ. చీకటి రెండూ ఒకటే మాకు."

    "అంటే పిల్లి కళ్ళన్నమాట" కసిగా అనుకున్నాడు.

    చిన్నగా నవ్విన శబ్దం "అంత చిన్న వాటితో పోల్చకు."

    "నాకు వెలుతురు కావాలి ప్లీజ్" అభ్యర్థనగా అడిగాడు వాయుపుత్ర.

    "క్షమించాలి. చాలాకాలంగా మీరు బ్లాక్ హోల్ లో వున్నారు. ఒక్కసారిగా వెలుగుచూస్తే మీ కళ్ళు పాడవుతాయి. అందుకే కొద్దికొద్దిగా వెలుతురు మెల్లగా వదులుతాం."

    "ఏమిటీ మాయ. నిజంగా జరుగుతున్నట్లే అనిపిస్తోందేమిటి? నా వాళ్ళంతా ఏమయ్యారు? బ్రహ్తికే వున్నారా?"

    "మీ వాళ్ళకేం ప్రమాదం లేదు. ఇంకా స్పృహలోకి రాలేదంతే."

    "మీరు ఎవరు?" ఇదే లోకం. నేను మనసులో అనుకుంటున్నాదంతా మీకెలా తెలుస్తుంది?"

    "దీన్ని ప్లానెట్ 'వేగా' అంటారు. మీ భాషలో చెప్పాలంటే మిల్కీవే గాలక్సీ- చివరి అంచున 'ప్లోరా' అనబడే సూర్యుడి గ్రహం యిది."

    "అంటే ప్లానెట్ ఆల్ఫా యిక్కడేనా?" ఆదుర్దాగా అడిగాడు వాయుపుత్ర.

    "అవును. అది 'మా' సౌరకుటుంబంలో మరో గ్రహం. మొత్తం అయిదు గ్రహాలున్నాయి, మీ మనసులో మాట తెలుసుకోవడం గురించి అడిగావు. మీ కిదివరకే అనుభవం అయింది కదా! మీరు మనసులో అనుకున్నదంతా మాకు తెలుస్తుంది. మీరు ఆ విద్యకు టెలీపతి అని పేరు పెట్టుకున్నారు. ఆల్ఫాగ్రహవాసుల సందేశం అంది, మీరు బయలుదేరి వచ్చారు. దార్లో బ్లాక్ హోల్ లో చిక్కుకుపోయారు. మా రాడార్ ఆ విషయం మాకు వెంటనే  తెలియచేసింది. వచ్చి మిమ్మల్ని కాపాడగాలిగాం. అక్కడి నుంచి మా గ్రహానికి తీసుకొచ్చాం....."

    "బ్లాక్ హోల్ నించి కాపాడడమా? ఇంపాజిబుల్."

    "మాకు సాధ్యం కానిదేమీ లేదు. ఒకప్పుడు ఆకాశంలో పక్షిలా ఎగరడం అసాధ్యమనుకున్న మీ మనుష్యులు విమానాన్ని సృష్టించారు. అదే సిద్దాంతం ఇక్కడ అన్వయించాలి. బ్లాక్ హోల్ ఆకర్షణ శక్తికి మీ నౌక తట్టుకోలేకపోయింది. కాని మేము అందులోకి ప్రవేశించి మీ వాహనాన్ని యివతలకు లాక్కురాగాలిగాం. అంటే మేము సాధించిన ప్రగతి మీకు అర్థం అవుతుందనుకుంటాను."

    "అలాగే మా భాష కూడా నేర్చుకున్నారన్నమాట."

    "నేర్చుకునే అవసరం మాకు లేదు వాయుపుత్రా. సూర్యుడు, రాడార్ లాటి పదాలు, నీ పేరు, నీ మనసు  చివరికి మీ భూమి మీద మాట్లాడే  భాషలన్నీ మీరు మాట్లాడుతూవుండగానే మా భాషలోకి అనువదించి దానికి సమాధానాన్ని కూడా తయారుచేసే బ్రెయిన్ కంప్యూటర్ మా అందరిలోనూ వుంది. మా ప్రగతి మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. ప్రస్తుతం మీరు విశ్రాంతి తీసుకోండి. తర్వాత వచ్చి కలుస్తాం-"

    అతి నెమ్మదిగా ఎవరో కదులుతున్న చప్పుడు. "ఒక్క నిముషం" అన్నాడు. చప్పున ఆ ఆకారం ఆగింది.

    "మీరు.....మీ పేరు నేను తెలుసుకోవచ్చా? మీకు పేర్లు వుంటాయా?"

    "ఉంటాయి. కాని మీలాంటి పేర్లు కాదు. మావన్నీ నెంబర్లతో కూడిన  పేర్లు. నన్ను వేగా బి సెవెన్ అని పిలవండి చాలు. వేగా  అన్నది  మా ఇంటిపేరు అనుకోండి. మా గ్రహవాసులందరికీ  ఒకటే యింటి పేరు. మీలా ఇంటింటికీ ఓ పేరుండరు. మీలా  వివిధ కులాకు, భాషలు లేవు. కేవలం సౌలభ్యం కోసం గ్రహాల పేర్లు విడగొట్టామంతే."

    "ఎంత చక్కటి సాంప్రదాయం అది. వసుదైన కుటుంబం అని మేము కలలు కనటమేగాని ఆ పైకి ఎదగలేకపోతున్నాం."

    "అందుకే అలా నాశనమవుతున్నారు" వెళ్ళిపోయిన ధ్వని వాయుపుత్రకి మత్తుగా వినిపించింది. మళ్లీ నిద్రలోకి జారిపోయాడు. ఆ చివరి మాటలు అతడి మనసులో యింకా ప్రతిధ్వనిస్తూనే వున్నాయి.

    వాయూ, వాయూ" పిలుస్తున్నారెవరో. "ఎవరది? అనూహ్య స్వరంలా వుందే ఎక్కడున్నాడు తను?' అనుకున్నాడు తల భారంగా అనిపిస్తుంది.

    ముఖంమీద చల్లటి బట్టతో తుడుస్తున్నారెవరో. వాయుపుత్ర నిద్ర వదిలిపోయింది. లేచి కూర్చున్నాడు. ఎదురుగా ముగ్గురూ కంగారుగా చూస్తున్నారు. సన్నటి వెలుగురేఖ ఒక్కటే కనిపిస్తుంది గదిలో, "ఏముంది. ఎక్కడున్నాం మనం?" అడిగాడు.

    "అదే తెలియడం లేదనుకుంటే, నువ్వేమో నిద్రలో ఏదో కలవరిస్తూన్నావు. వేగా బి సెవెన్ అని పిలుస్తున్నావు."

    "అవును నేను వాళ్ళతో మాట్లాడాను. నిజంగా మనం వేగా గ్రహంమీదే వున్నామన్నమాట" లేచి కూర్చున్నాడు. మిగతా ముగ్గురూ అతడిని మతిపోయినవాడిలా చూశారు. "అవును మనం ఎక్కువ వెలుతురుని చూడకూడదని చెప్పాడతడు. అందుకే అతి కొద్దిగా వెలుతురునే రానిచ్చారు."

    "ఎవరితో మాట్లాడావు? కలగనలేదుకదా?" అడిగాడు యశ్వంత్. వాయుపుత్ర చెపుతున్నది కథలా వుంది. ఆగిపోయిన అంతరిక్ష నౌక అతడిది కలకాదు- అని నిరూపిస్తూంది.

    "కాదు" వాయుపుత్ర తమ సంభాషణ అంతా విడమరచి చెపుతుంటే అంతా నిశ్భబ్దంగా విన్నారు. అందరి మనసుల్లోనూ ఒక రకమైన టెన్షన్ తో కూడిన తృప్తి. ఆనందం! అనుకున్నది సాధించగలిగామన్న ఆనందం. మళ్ళీ ఏదో భయం.

    "ఏం జరుగుతున్నదిప్పుడు?" అన్నాడు నిఖిల్.

    "ఏమి జరగదు. మిమ్మల్ని ఇంటర్ ప్లానెటరీ సొసైటీకీ పంపుతాం. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయంపై మీ భవిష్యత్తు ఆధారపడి వుంటుంది" అని వినిపించింది.

    అందరూ ఆ స్వరం వినిపించినవైపు  తిరిగి చూశారు. అంతగా వెలుతురు లేదక్కడ. కానీ ఆ నీడలోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు ఆకారాలు. ఆ నలుగురి శరీరాలు ఒక్కసారిగా జలదరించాయి. మొదటిసారిగా మరొక గ్రహవాసుల్ని చూస్తున్న ఉద్వేగం!! ఉన్నారో లేదో తెలియక పోయినా, వందల సంవత్సరాలుగా వారికోసం 'తపస్సు' చేస్తూ, వాళ్ళు ప్రత్యక్షమవగానే ఏం మాట్లాడాలో తోచని ఉద్విగ్నత అది.

    సన్నగా పొడవుగా వున్నారు వాళ్ళు. శరీరమంతా కవచం లాంటిది కప్పి వుంది. కళ్ళ ప్రాంతంలో మటుకు రెండు వజ్రాలు బిగించి వున్నాయా అన్నట్లు మెరుపు.

 Previous Page Next Page