"ఏమిటది? ఏమిటి- డాక్టర్ మీరంటున్నది?" గాద్గదికంగా అడిగింది. ఆయన బైటకి అడుగుపెడుతూ అన్నాడు.
"నాకు సిక్త్స్ సైన్స్ మీద నమ్మకం వుంది అనూహ్యా."
......
పరిస్థితి అంతవరకూ వచ్చాక యశ్వంత్ మామూలు కమాండర్ అయిపోయాడు. ఫిలిప్స్ చేస్తున్న పనిని తమ ముగ్గురిలో ఎవరో ఒకరు చెయ్యవలసిందే. లేకపోతే వాయుపుత్ర దక్కడు.
ఆలోచన వచ్చాక అతడు సూచన్లు ఇవ్వటం ప్రారంభించాడు. "డాక్టర్ , నేను చెప్పినట్లు చేయండి. స్పేస్ షిప్ ని పట్టుకుని సగంవరకు నడవండి. సోలార్ మిగ్ దగ్గర ఆగండి."
ఫిలిప్స్ అంతవరకు చేరుకున్నాడు.
"వాయుపుత్ర ఎంత దూరంలో వున్నాడు?"
"రెండు వందల గజాలు"
తయశ్వంత్ నౌకను మళ్ళీ కదిలించాడు.
"చాలు నేను అందుకోగలను" అన్నాడు ఫిలిప్స్.
తెరమీద అతడు వాయుపుత్రని చేరుకోవడం గమనించాక ఊపిరి పీల్చుకుంది అనూహ్య.
ఫిలిప్స్ వాయుపుత్ర నడుముకున్న బెల్ట్ పట్టుకున్నాడు. మెల్లిగా వెనక్కు ఈదడం ప్రారంభించాడు. స్పేస్ సూట్ బరువెక్కి నట్లనిపిస్తోంది. గుండెల్లో చిన్న మంట ప్రారంభమయిందతనికి. భారరహిత స్థితిలో అతని శరీరం అతడి సూచన్లకి ఎదురు తిరుగుతోంది. డాక్టరుగా ముప్ఫై సంవత్సరాల అనుభవం అతడిది. గుండె చెపుతున్నది తెలుసుకోగలడు.
వాయుపుత్రని ద్వారం దగ్గరకు చేర్చేసరికి అతడి గుండెల్లో భారం ఎక్కువయింది. తలుపు తెరుచుకునే బటన్ నొక్కాడు. వాయుపుత్రని మెల్లిగా లోపలకు తోశాడు. అతడి కళ్ళు నిశ్చింతంగా మూసుకున్నాయి. పెదవులమీద చిరునవ్వువెలిసింది. భూమి దిశగా చూశాడు. అక్కడేమీలేదు. నిరంతరం శూన్యం.
"డాక్టర్! మీరూ లోపలకు రండిక" అంటున్న యశ్వంత్ పిలుపు అతడికి వినిపించలేదు. నిర్జీవమైన అతడి శరీరం నెమ్మదిగా నౌకకి దూరమయింది. కనెక్షన్ ఎప్పుడో తీసేసేడు. భూలోకవాసులు ఏర్పాటుచేసిన శవపేటికల సంగతి బహుశ అతడికి తెలియక పోవచ్చు. ఎయిర్ లాక్ డోర్ క్లోజ్ చేశాడు యశ్వంత్.
"కమాన్! క్విక్ డాక్టర్! ఎం జరిగింది?" అనూహ్య అరుస్తోంది. ఆమె మనసంతా రెండుచేతుల్తో ఎవరో నొక్కి పెట్టినట్టుంది!! డాక్టర్ ఫిలిప్స్ శరీరం క్రమక్రమంగా నౌకనుంచి దూరమవుతూంది. నౌక వెనుకభాగంలో ఏం జరుగుతూ వున్నది యశ్వంత్ కి , నిఖిల్ కి తెలిసే అవకాశం లేదు. తెలియజెప్పే ప్రయత్నం కూడా ఆమె ఏమీ చెయ్యలేదు. అనవసరం కూడా!
ఆమె అలా చూస్తూనే వుంది. బృహస్పతి గ్రహపు అమ్మోనియం మేఘాల పొరల వెనుక డాక్టర్ ఫిలిప్స్ శరీరం అదృశ్యమైపోయింది. ఆమె దృష్టి నీటిపొరలు వెనుక మసకబారింది.
డాక్టర్ ఫిలిప్స్!!!
ఇంట్రావర్ట్ కావటంతో అతడు యశ్వంత్ కి బాగా దగ్గిరయ్యాడు. నిఖిల్ ని పుత్రవాత్సల్యంతో చూసుకునేవాడు. తనువేపే జోకులకి మనసారా నవ్వే వ్యక్తిగా వాయుపుత్ర మెప్పుపొందాడు. అటువంటివాడు ఇకలేడు.
భూమికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో, కుతకుత ఉడికే భాస్వరపు మంటల్లో అతడి శరీరం దహనమైపోయింది. అతడి ఆత్మశాంతికోసం అనూహ్య అలాగే మౌనంగా నిలబడింది.
"ఏమైంది? ఏమైంది అనూహ్యా" మైక్ లో యశ్వంత్ కంఠం వినపడుతూనే వుంది.
5
"మీ నాన్ననీకు జాబిల్లిని తెచ్చిపెడతాడు. బువ్వతిను" శ్రీజ ఆరునెలల పాపకి గోరుముద్దలు తినిపిస్తోంది. ఆమె తల్లి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మొదట్లో సిల్లీగా అనిపించినా శ్రీజలో దైర్యం, పట్టుదల చూశాక వాళ్ళ మనసులు మారిపోయాయి. పాప వాళ్ళకి ఆప్తురాలయిపోయింది.
శ్రీజ ఒక్క నిమిషం ఊరికే కూర్చోదు. పగలంతా స్కూల్లో పాఠాలు చెపుతుంది. రాత్రిళ్ళు అనాధశ్రయాల్లో పిల్లల బాగోగులు చూస్తుంది. ఏ ఒక్కక్షణం తీరిక దొరికినా కూతురితో గడుపుతుంది. అంతరాంతరాల్లో ఎంత వ్యధననుభవిస్తుందో తెలియదుగాని పైకిమాత్రం ఆమె అంత ఉత్సాహవంతురాలు మరి లేదనిపిస్తుంది.
రోదసీలోకి వెళ్ళిన బృందంనించి వార్త వచ్చి నెలలు దాటి పోయింది. అయినా ఆమెలో నిరాశ కనిపించలేదు.
"ఇంతవరకు ఏ మానవమాత్రుడికి సాధ్యపడదనుకున్న కార్యం నిర్వర్తించడానికి వెళ్ళారు. వాళ్ళల్లో వున్న పట్టుదల కార్యదీక్షలో సగమైనా మనలో లేకపోతే ఎలా!" అనేది.
రోజులు నెలలయ్యాయి. అంతరిక్ష నౌక సౌరకుటుంబం పరిధిని దాటిపోయిందని మాత్రం తెలుసు. ఆ నౌక నుంచే వర్తమానం లేదు.
అంతరిక్ష నౌక ప్రయాణం చేస్తున్న వేగంతో పోల్చుకుంటే - దాన్నించి వార్తా పంపటం కోసం నిశ్చయంగా దాని వేగం తగ్గించాలి. భూమినుంచి ఎలాగూ దానికి వార్తలు చేరావు. (తరంగాల వేగం కంటే నౌక వేగం ఎక్కువ కాబట్టి)
ఇప్పుడు కేవలం భూమిమీదకు వార్త పంపటం కోసం నౌక వేగాన్ని తగ్గించి, తిరిగి పెంచటంకోసం సౌరశక్తిని వృధాచేయటం అనవసరమని యశ్వంత్ అభిప్రాయపడ్డాడు. ఎర్త్ కంట్రోలు వారు కూడా అలాగే భావించారు. ఎంతో ప్రాముఖ్యత వున్న విషయమైతే తప్ప. లేకపోతే వార్తలు పంపనవసరం లేదని సూచన్లిచ్చారు.
ఆ తరువాత నౌకనుంచి వార్తలు రావడం మానేసియ్!
ప్రజల్లో కూడా ముందున్నంత కుతూహలం, భయము యిప్పుడు లేవు. ప్రమాదం అంచునేపొంచి వుందని తెలుసు. కానీ దానిగురించి వాళ్ళు మర్చిపోయారు. జాతి లక్షణమే అంతకదా. అడవుల కొట్టివేత నుంచి, వాతావరణ కాలుష్యం వరకూ ప్రమాదం ముంచుకొస్తే తప్ప ఆలోచించరు.
శాస్త్రజ్ఞులు,ప్రమాదం యొక్క తీవ్రత తెలిసినవారు మాత్రం- ఆ అంతరిక్ష నౌక క్షేమంకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులో శ్రీజ ముఖ్యురాలు. నౌక బయల్దేరిన సంవత్సరం తరువాత ఒక వార్త వచ్చింది. చిన్న వార్త.
"మా సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఫిలిప్స్ మరణించారని తెలియజేయటానికి విచారిస్తున్నాము-"
* * *
అంతరిక్ష నౌక పాలపుంతవైపు సాగిపోతోంది, గ్రహాంతర వాసుల్ని పిలుస్తూ నౌకనుంచి తరంగాలు నిరంతరం వెల్వడుతూనే వున్నాయి. అవతలివైపునుంచి జవాబు మాత్రం లేదు.
ఆహార నిల్వల గురించిగానీ, ప్రయాణం గురించిగానీ విచారంలేదు. తమ జీవితాలు ఈ నౌకలోనే కడతేరిపోయినా ఫర్వాలేదు. వారి విచారమల్లా 'మయాస్' గురించే సూర్యుడికి వారు చేసే అపకారం వల్ల మానవజాతి ఏమవుతుందనే దిగులు. వీటన్నిటికన్నా భయంకరమైంది- మొనాటనీ! అంత చిన్న అంతరిక్ష నౌకలో కేవలం నలుగురే గంటలు.....రోజులు....నెలలు....న....లు....గు....రే!!
ఫిలిప్స్ మరణం తరువాత ప్రయాణంలో మునుపటి హుషారు తగ్గింది.
ప్రయాణం యాంత్రికమైంది. చుట్టూ దృశ్యాలు మాత్రం అద్భుతంగా వున్నాయి.పైకి అద్భుతంగా కనపడిన, అది అత్యంత ప్రమాదరకమైన జోన్ అని వారికి తెలుసు. కొన్ని వేల వందల డిగ్రీల హీటు. రేడియేషన్ ల మధ్యనుంచి ప్రయాణం....
అనూహ్యకి అకస్మాత్తుగా నిద్రనుంచి మెలకువ వచ్చింది. ఎదురుగా వాయుపుత్ర ఆమెనే చూస్తూ కూర్చుని వున్నాడు. ఆమె చప్పున అరవబోయింది, ఆమెని చేత్తో ఆపుచేస్తూ౦ "ఇక నేను ఆగదల్చుకోలేదు. ఈ రోజు ఈ విషయం తేలిపోవాలి-" అంటూ దగ్గరికి లాక్కొన్నాడు.
"వదులు, వదులు వాయూ" గింజుకుంది. ప్లీజ్..... రాక్షసుడివి అవకు-"
"మనిషిని రాక్షసుడ్ని చేసేది నీలాంటి ఆడవాళ్ళే. నీ మనసుని సరియైన మార్గంలో పెట్టాలంటే ఇదొక్కటే మార్గం-లేకపోతే అది ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. నన్ను ఆడిస్తుంది-"
"వద్దు, నన్ను బలవంతం చెయ్యకు. డోన్డ్ ఫోర్స్ మీ-" ఆమె అరిచింది. గదిలో బెల్ మ్రోగింది. స్పీకర్ లోంచి యశ్వంత్ కంఠం "ఎనీ ట్రబుల్?" అని వినిపించింది.
వాయుపుత్ర ఆవేశం క్షణాల్లో దిగిపోయింది.
"ఏమీ లేదు" జవాబు యిచ్చి స్పీకర్ ఆఫ్ చేసి ఆమె అతడి వైపు స్థిరంగా చూసింది. ఇక చెప్పెయ్యవలసిన సమయం వచ్చింది. ఈ తాడుని తెగేవరకూ లాగకూడదు.
"అలా కూర్చో వాయూ" అంది. ఆమె కంఠంలోని కమాండ్ కి అతడు అప్రయత్నంగా కూర్చున్నాడు.
"కొన్నాళ్ళు క్రితమే నేను నీతో ఆ విషయం ప్రస్తావించాలనుకున్నాను వాయూ. డాక్టర్ ఫిలిప్స్ నాకెంతో ధైర్యం చెప్పాడు. కాని అనుకోకుండా అయిపోయింది."
"నీ మనసులో మాట నాతో చెప్పటానికి సందేహించావా? డాక్టర్ ఫిలిప్స్ ఎందుకు మధ్యలో?"
"నీకు తెలియదు వాయూ, మానసికంగా చాలా కృంగిపోయాన్నేను. ఇప్పటికీ నా మనసు నా చెప్పుచేతల్లో వుండనంటోంది. అతడినుండి నేను విడివడ లేకుండా వున్నాను."
"నువ్వతడినింకా మర్చిపోలేక పోతున్నావా అనూహ్యా! అతడి నుంచి విడిపోయి ఎన్నాళ్ళోదాటింది. లక్షల కోట్ల మైళ్ళ దూరంలో వున్నాడు. అయినా......"
"అతడంత దూరంలో లేడు వాయూ- మన మధ్యనే వున్నాడు."
"మన మధ్యన అంటే యూ మీన్.......?" వాయుపుత్ర షాక్ తిన్నాడు. మాట పూర్తి చేయలేకపోయాడు.
"అవును. యశ్వంతే."
దూరంగా రెండు ఆస్టరాయిడ్స్ ఢీ కొన్నట్టు కంపనం. మనసులో పరస్పర విరుద్ధ భావాలు. విస్ఫోటనం. వాయుపుత్ర స్థాణువై నిలబడిపోయాడు. అతడి జీవితంలో ఇలాంటి షాక్ ఎప్పుడూ తగల్లేదు. యశ్వంత్....యశ్వంత్.... అతడు తప్ప వేరే ఎవరైనా కేరేపిన్ అనేవాడు అతడు. కానీ..... కానీ..... తన ప్రియురాలి మాజీ భర్త.
"అతడే వాయూ. అతడిని ప్రేమిస్తావు. పూజిస్తావు. అతడంటే నీక్కూడా ఎంతో భక్తి. నీకే అలా వుంటే మరి భర్తగా నా మనసులో ఎలాంటి భావం కలుగుతుందో అర్థం చేసుకోలేవా? అతడికి సంతోషాన్నివ్వకపోగా అతడి ఎదుటే మరొకరితో చనువుగా మెలగడం......ఉహు నాకు సాధ్యంకాదు. ఈ ఘర్ణణతో నలిగిపోతున్నాను" అనూహ్య రెండు చేతులతో ముఖం కప్పుకుంది. అతడు ఇంకా తేరుకోలేదు.
యశ్వంత్ వ్యక్తిత్వం తనకు తెలుసు. మేరుపర్వతం అది. అలాంటి వ్యక్తి మనసులో ఇంకా అనూహ్య పట్ల ప్రేమ వుంటే......అతడి ఎదురుగా తను ఆమెతో సరసాలాడగలడా, కనీసం నవ్వుతూ మాట్లాడగలడా?
మనసులోనూ బయటా భయంకరమైన శూన్యం చాలా సేపటికి తేరుకున్నాడు. నెమ్మదిగా "అనూహ్యా" అని పిలిచాడు. అనూహ్యా తలెత్తి చూసింది.
నీ భర్త యశ్వంత్ అని తెలియనప్పుడు యిన్నేళ్ళయినా నీకు నీ భర్తపట్ల తరగని అభిమానం చూసి ఆశ్చర్యపోయే వాడిని. అతడెవరో తెలిశాక నీ బాధను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాను. నిన్ను భార్యగా పొందిన అతడెంత అదృష్టవంతుడో అనుకునేవాణ్ణి. కాని అతన్ని భర్తగా పొందిన నువ్వెంత అదృష్టవంతురాలివో ఇప్పుడు అర్థం అవుతోంది. అతడిపట్ల నీకింకా గౌరవం వుంది. ప్రేమ వుంది. అందుకే నీలో ఈ ఘర్షణ. అది నేను అర్థం చేసుకోగలను. అతడి కళ్ళలో నీలి నీడలకు అర్థం కూడా ఇప్పుడే తెలిసింది. కాబట్టి........" అతడు ఆ గాడు.