Previous Page Next Page 
వివాహం పేజి 29

   
    "అటు చూస్తే, రైలు రవ్వలు కళ్ళలో పడతాయి" అన్నాడు.
    ధైర్యం చేసి, రవణ రవ్వలు కళ్ళలో పడేసుకునేందుకే రయిలులో ఎక్కినట్టు వాటివేపే చూస్తోంది. ఇంక కొత్త వుపాయాలేమీ తోచక వూరుకున్నాడు అప్పటికి.

    రెండు చిన్న గుట్టల మధ్య వెడుతోంది రైలు. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు గుట్ట వెనకనించి పక్కలకి చిమ్ముతున్నాయి. చిన్న పల్లె వొచ్చింది. అరుస్తున్న గొర్రెల్ని పల్లెవేపు తోలుకుపోతున్నాడు గొల్లవాడు. సాయంకాలపు పొగలు పూరిగుడిసెల కప్పుల్లోంచి, గాలికి మెల్లిగా వంకర్లు తిరుగుతో లేస్తున్నాయి. తనూ రవణా ఆ చిన్న అరుగుల్లో ఒక దానిమీద కూచుని వుంటే ఎంత బావుంటుంది? రవమ వంక చూశాడు.

    రవిక కింద గుండ్రంగా ఆమె చెయ్యి కనపడుతోంది. చీకటి పడ్డ తరువాత ఆ చేతిని గట్టిగా పట్టుకుంటే అరుస్తుందా? ఆ వేళ రాత్రి అంత ప్రేమతో అన్నానికి లేవమని అడిగిందే!

    రైలాగింది. గోపాల్రావు ప్లాట్ ఫారం మీద షోకుగా నడవాలనే వుద్దేశంతో తలుపు తీశాడు.

    మంగమ్మ "ఎక్కడికి దిగుతున్నావు?" అంది.

    ఏం చెప్పాలో చప్పున తోచక, "డబ్బులు పడ్డాయి" అన్నాడు.

    ఇంక తిరగడ మేముంది? డబ్బులకోసం వెతికినట్టు వెతికి "దొరికాయి!" అని రైలెక్కాడు.

    రవణ నవ్వుతోంది.

    చీకటి పడ్డది. రవణ దగ్గిరగా జరిగాడు. అతనికి ఆకలి వేసింది. ఇల్లు జ్ఞాపకం వచ్చి, ప్రస్తుతం ఆ పీడ వదిలిపోయింది కదా అని గొప్ప సంతోషం చప్పున స్ఫురించింది. పంజరంలోంచి బయటపడ్డ పిట్టకు కలిగే సాహసం కలిగింది.

    "ఒసే" అన్నాడు.

    తలెత్తి చూసి తిప్పేసుకుంది రవణ. తన ధైర్యానికి తనే భయపడ్డాడు. తనతో రవణ మాట్లాడదని నిరాశ, తను లేనట్టే హాయిగా, నిశ్చలంగా వున్నదనే వుక్రోషం, వీటివల్ల ఆ సెకండు క్లాసులో సౌక్యమూ, సాయంత్రపు శాంతమైన గాలీ, మెత్తని వెలుతురూ అతను అనుభవించనేలేదు. కోపంతో రవణ నుదుటిమీద జుట్టు లాగాలనుకున్నాడు. ఇటు చూశాడు, అటు చూశాడు. చప్పున దీపం వెలిగింది. వెంకట్రావుగారు "స్విచ్చి" నొక్కారు. గోపాలరావు దూరంగా జరిగాడు.

    నల్లని చీకటి చీల్చుకుంటో రైలు పరిగెత్తుతోంది. పెట్టెల వెలుగులు పటాలవలె నేలమీద పరుగెత్తుతున్నాయి.

    పల్లెటూరి బాటమీద పటం వూరేగిస్తూ పోతున్నారు కుర్రాళ్ళు. మంగమ్మ కిటికీ దగ్గరికి వొచ్చి వెనక్కి చూస్తోంది.

    "చూశావా, ఆ మృదువైన ఆ భక్తి ఇంకా పల్లెటూళ్ళని విడువలేదు. ఈ నాగరికత ఎక్కువైన కొద్దీ నిర్లక్ష్య మెక్కువై "దేవుడన్నా దెయ్యమన్నా భయం లేకుండా తయారవుతారు" అని వెంకట్రావుగారు అన్నారు.

 Previous Page Next Page