Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 30

    అదే చదువు ఆర్ధిక స్వాతంత్ర్యం లేని ఆడదయితే ఇంకెంత హీనమవుతుందో? అందుకేనేమో ఆడవాళ్ళు ఎన్ని బాధలుపడ్డా ఆ మొగుడు దగ్గిరే పడుంటారు అనుకుంది. ఈ సారేమన్నా అంటే వూరుకోకుండా జవాబివ్వాలి. "వదినగారూ..... నా గురించి నీకేం బాధవద్దు. నేను నీ నెత్తిన కూర్చుంటానని ఇప్పటి నుంచీ భయపడకు తల్లీ!" అని చెప్పాలి. ఆమె నోటికి మరీ హద్దు పద్దు లేకుండా వుంది. మొగుడి సంపాదన తనేదో తిని పోతున్నట్టు ఏడుస్తోంది ఎందుకో అనుకుంది కోపంగా.  
    దివ్యకి ఈసారి ఆడపిల్ల పుట్టింది. పురుడు పోసుకొచ్చాక నిర్మల ఈసారి కన్నెత్తి కూడా పిల్లని చూడలేదు. అసలు దివ్య పిల్లని కిందకి తీసుకొచ్చేది కాదు. దగ్గరికి తీసి అనుబంధం పెంచుకుని బాధపడటం కంటే దూరంగా ఉంటే ఏ ఎటాచ్ మెంట్ వుండదని నిర్మల పిల్లని వేలేసి కూడా తాకలేదు. శారదాంబ ఈసారి అంటీ ముట్టనట్టే ఉంది - ఇప్పటికీ బాబుని తల్చుకుని నిర్మల బాధపడ్తూనే ఉంది. వాడి నవ్వులు. ఆ పాల బుగ్గలు గుర్తువచ్చి ఆమెకి తెలియకుండానే కళ్ళు చెమరుస్తాయి.    
    డిసెంబర్ సెలవుల్లో కృష్ణ మళ్ళీ రమ్మని రాశాడు ఉత్తరం. "పోనీ, వెళ్ళిరా అమ్మా నాల్గురోజులు. కాస్త మార్పు ఉంటుంది నీకు" అన్నారు శివశంకరంగారు. 'వద్దు' అన్నట్టు తల ఆడించింది నిర్మల. నిర్మల మనసు ఎంత విరిగిందో, ఆమెలో విరక్తి నిర్లిప్తత ఎంత పెరిగాయో ఆయనకి అర్థమైంది.   
    "దాన్ని ఎందుకు అక్కడికి వెళ్ళమంటారు? వాళ్ళది కొత్తకాపురం. ఇదెందుకు అక్కడికి? దూరంగా వుంటేనయినా బంధుత్వాలు తిన్నగా ఉంటాయేమో - అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి ఇది బాధపడటమేగా జరిగేది?" అంది రాత్రి శారదాంబ. శివశంకరంగారు మౌనంగా వూరుకున్నారు.     
    రోజురోజుకీ నిర్మలని చూస్తుంటే ఆయన కడుపులో దేవసాగింది. ఎలాగైనా కూతురికి పెళ్ళిచెయ్యాలన్న కోరిక ఆయనలో పోలేదు. రాత్రింబవళ్ళు అదే ఆలోచన ఆయనకి - అల్లుడిని ఎలా లొంగదీసుకోవాలా అన్న ఆలోచనే అనుక్షణమూ ఆయన్ని దొలుస్తూంది. మరోసారి ఉత్తరం రాస్తే - లేదంటే ఏ పెద్దలనన్నా పంపితే అన్పించింది..... పోనీ డబ్బాశ చూపితే లొంగుతాడేమో! ఏ లక్షో రెండు లక్షలో ఇస్తానంటే కాగితం రాసి ఇస్తాడేమోనన్న ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నం చేసి చూడాలనుకున్నారు. లాయరుగా తన క్లయింట్ పునరివాహం చేసుకోదలచింది అని, దానికి అంగీకారం కోరుతూ, లక్షరూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీ అంగీకారం, ఖరీదు తెలపగలరు అని రాసి పడేశారు. రాసిన మర్నాటి నుంచి జవాబు కోసం చూడసాగారు.    
    సంక్రాంతి సెలవులకి కృష్ణ, లత వారం రోజులు సెలవు పెట్టి వచ్చారు. ఇల్లంతా కాస్త సందడిగా వుంది - లత నిర్మలతో చనువుగా మాట్లాడుతుంటే దివ్యకి ఉక్రోషంగా ఉంది. 'ఏడాదికి నాల్గు రోజులు వచ్చి పోతారు కనక పెద్ద అభిమానాలు వలకపోస్తుంది, ఆడపడుచు అంటే అభిమానం ఉన్నట్లు. రోజూ వుంటే తెలిసేది. తనూ వేరే వుంటే చూపించేది అభిమానాలు. 'అసూయగా అనుకుంది. అనుకున్నది మనసులో దాచుకోలేక, వాళ్ళిద్దరి స్నేహం చూడలేక అసూయ ఒకరోజు బయటకే వెళ్ళగక్కింది. "నీకేమమ్మా అదృష్టవంతురాలివి! హాయిగా బెంగళూరులో వుంటారు. మీ ఇల్లు, మీ కాపురం అంటూ నీకుంది" - అంది హాస్యంగా అన్నట్టు-
    "నీకేం లోటు అక్కయ్యా? చక్కగా ఏ బాదరబందీలులేవు. అన్నీ చూసుకోవడానికి అత్తగారున్నారు. మావగారున్నారు - మీ ఇద్దరూ ఫ్రీ బర్డ్స్ లా తిరగచ్చు. మాకు అక్కడ అన్నింటికీ ఇబ్బందే. ఇద్దరం చచ్చి చెడి ఉద్యోగాలు చేస్తున్నా ఇంత పెద్ద ఇల్లు, ఇంత దర్జా మాకు అక్కడెక్కడుంది? ఇంటికొచ్చి అన్ని పనులూ చూసుకోవాలి. హాయిగా ఇంట్లో చూడటానికి ఎవరన్నా పెద్దవాళ్ళుంటే ఎంత బాగుండును అన్పిస్తుంది. ఇంట్లో పెద్ద దిక్కుంటే ఎంత హాయిగా ఉంటుంది? నిజం చెప్పాలంటే పిల్లల్ని కనాలంటే భయంగా ఉంది - ఇద్దరం ఉద్యోగం చేస్తూ - పిల్లల్ని కంటే ఎవరు చూస్తారు అన్నది మా ప్రాబ్లం - నీకేం" ఇంట్లో అత్తయ్య, నిర్మల వున్నారు, నీవెక్కడికన్నా వెళ్ళినా పిల్లని చూడటానికి." లత అంది.     
    "ఆ..... చూస్తారులే. ఆ నిర్మల చేయిపడి నిక్షేపంలాంటి నా బాబు పోయాడు - మళ్ళీ పాపని ముట్టుకోనివ్వడం లేదు. అందుకే-" అంది కోపంగా.
    "ఛా.... అక్కయ్యా అలా మాట్లాడకు - పాపం నిర్మల విషయం తల్చుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. బాబు పోవడం అది అంతా ఆయన చెప్పారు - నీలాంటి చదువుకున్న వాళ్ళూ ఇలా మాట్లాడితే ఎలా అక్కయ్యా? నిర్మల కాపురం ఇలా అయినందుకు మనం సానుభూతి చూపాల్సింది పోయి ఇలా అంటే పాపం, ఆ అమ్మాయి ఏం అయిపోతుంది?"  
    "అవునమ్మా, నీకేం నాల్గురోజులు వచ్చిపోతావు కనక ఇలాగే అంటావు - ఇక్కడ వుంటే వాళ్ళకి తెలుస్తాయి బాధలు."    
    "నీకేం బాధ అక్కయ్యా.... తనని చూసుకోడానికి తల్లితండ్రి వున్నారు. ఎవరూ పెట్టి పోషించక్కరలేకుండా తనూ సంపాదిస్తూంది." దివ్య ధోరణి నచ్చక లత కాస్త నొచ్చుకుంటూ అంది.
    "బాధ అంటే డబ్బొక్కటేనా లతా! ఇంట్లో కాపురం వదిలేసిన ఆడపడుచు వుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ నీకర్థం కాదు. మేం ఇద్దరం సినిమాకి వెడితే చూడలేదు. సరదాగా ఉంటే చూడలేదు. ఆవిడికి తోడు మామగారు. ఆవిణ్ణి మాతో సినిమాలకీ, షికార్లకీ తీసుకెళ్ళమంటారు. నా మొగుడితో నాకు సరదాగా వెళ్ళాలని వుంటుంది కాని, మధ్య ఈవిడెందుకు నా వెంట? మామగారికయితే కూతురు అపురూపం అని అందరూ అలాగే చూడాలంటారు. ఆయనకి కూతురు అపురూపం అయితే మధ్య నాకెందుకుండాలి? ఆవిణ్ణి ఒక్కమాట అనడానికి లేదు.
    ఆవిడ నోట్లోంచి మాటవస్తే చాలు - జరగాలి. ఆవిడ కంట్లోంచి నీటి చుక్కరాలిందంటే భూప్రపంచాలు ఏకమయినంత హడావిడి. ఏం, ఆవిడ సంపాదిస్తే ఇంట్లో ఇస్తుందనుకుంటున్నావా? అంతా బ్యాంకులో దాచుకుంటుంది.    
    ఏం కావాలన్నా ఆయన కొనిస్తారు. మొగుడు, కాపురం లేకపోయినా ఆ చీరలు, ఆ వేషాలు చూడు...... పండగొస్తే పుట్టింటి కొచ్చిన కూతురికన్నా అంత మంచి చీర కొంటారో లేదో కాని. మామగారు మాత్రం ఆవిడ పుట్టినరోజులకి, పండగలకి ఎంతెంత తగలేసి కొంటారో తెలుసా? చూస్తుంటే వళ్ళుమండిపోతూంటుంది. ఇంకా ఈ కూతురు అందరిలా సవ్యంగా కాపురం చేసుకుంటే ఎంత అపురూపమయ్యేదో, ఇంకా ఎంత దోచి పెట్టేవారో మామగారు. ఆయనకి ఎంతసేపూ కూతురు తప్పకొడుకులున్నారూ, కోడళ్ళున్నారూ, మనవలు పుడ్తారు. వాళ్లకి ఆస్తి ఇవ్వాలి అన్న తాపత్రయమేలేదు. ఎంతసేపూ కూతురు, కూతురు!" దివ్య మనసులో వున్న అక్కసు అంతా వెళ్ళగక్కింది.

 Previous Page Next Page