Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 29

    మాట్లాడే ఓపికలేక శివశంకరంగారు అలా మౌనంగా పడుకున్నారు. ఇటు కూతురు మళ్ళీ ఏ అఘాయిత్యం చేస్తుందోనని ఒకవైపు కనిపెట్టుకు చూడ్డం, అటు భర్తకి సేవతో శారదాంబ నలిగిపోయింది. దివ్యని పిల్లాడుపోయాక పుట్టింటివారు తీసుకెళ్ళారు. అసలే మనసు బాగులేని శారదాంబ కూతురు చేసిన పనికి కోపం పట్టలేకపోయింది." ఈ అఘాయిత్యం పనులు చేసి మమ్మల్ని ఈ మాత్రం అయినా బతకనీయవా? నీవు చేసిన పనికే మీ నాన్న అలా అయ్యారు. నిజంగా నీకేదయినా జరిగితే ఆయన దక్కేవారా అసలు? నీకేదన్నా జరిగితే మీ నాన్న గుండెలు బద్దలవుతాయని తెలిసీ ఇంత సాహసం చేస్తావా? నా పసుపుకుంకాలు పొట్టన పెట్టుకుంటావా?" అంటూ కూతురి మీద ఎగిరిపడింది మర్నాడు. నిర్మల కళ్ళనీళ్ళు నింపుకుని  వుండిపోయింది.
    శివశంకరంగారు కాస్త తేరుకున్నారు. నెమ్మదిగా కూతురు గదిలోకి వచ్చారు. "నీరూ.... మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడన్నా చేస్తే నా శవమే మిగులుతుంది. మళ్ళీ ఇలాంటి ప్రయత్నం ఎన్నడూ చెయ్యనని మాట ఇవ్వకపోతే ఇప్పుడే నీ కళ్ళముందే నేను ఉరి వేసుకుంటాను" అని గంభీరంగా అన్నారు.   
    "పదండి, అందరం కట్టకట్టుకుని ఉరిపోసుకుందాం. అప్పటి కన్నా శని విరగడవుతుందేమో! తండ్రికి తగ్గ కూతురూ..... కూతురికి తగ్గ తండ్రి.... ఒకళ్ళ కోసం ఒకరు ఉరులుపోసుకోండి. మమ్మల్ని నట్టేటముంచి వెళ్ళండి ఇద్దరూ." పిచ్చి కోపంతో అరిచింది శారదాంబ.   
    కూతురు దగ్గర మాట తీసుకుని గాని ఆయన ఆ గదిలోంచి వెళ్ళలేదు. బాబు పోయాక ఇల్లంతా స్మశాన నిశ్శబ్దం అలుముకుంది. ఆ వాతావరణంలో ఎవరికి వారు బతక్క తప్పదన్నట్టు భారంగా రోజులు నిశ్శబ్దంగా గడుపుతున్నారు.
    ఆ ఏడాది కృష్ణ పెళ్ళి సందడితో  ఆ ఇంట్లో మళ్ళీ కాస్త సందడి, సంతోషం అలుముకుంది. దివ్య మళ్ళీ నెల తప్పింది. కృష్ణది ప్రేమ వివాహం. తనతోపాటు ఇంజనీరింగు చదివిన అమ్మాయిని రిజిష్టరు మ్యారేజి చేసుకుంటానన్నాడు. వాళ్ళు కన్నడులు, బ్రాహ్మణులే అమ్మాయి పొడుగ్గా మంచి స్మార్ట్ గా ఉంది. చదువుకున్న పిల్ల. తండ్రి మైసూర్ లోడి.ఎస్.పిగా ఉన్నాడు. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదన్న అభ్యంతరం తప్ప, ఇంకేం అడ్డు చెప్పడానికి ఏమీ కనపడలేదు. శారదాంబ బాధవేరు. "అలవాట్లు, ఆచారాలు వేరు.... ఎలా కుదురుతుంది?" అంటూ సణిగింది.      
    "ఇంకా ఈ రోజుల్లో ఇవన్నీ ఏమిటమ్మా! అయినా తెలుగువచ్చు కొద్దిగా. కన్నడం వాళ్ళ అలవాట్లు మనవి బాగా కలుస్తాయమ్మా!" అని వాదించాడు కృష్ణ.  
    భర్త దగ్గర గొణిగింది శారదాంబ. "వూరుకో..... ఇప్పుడు మనం వద్దన్నావాడు మానడు. మన పెద్దరికం నిలుపుకోవడం మంచిది. పెళ్ళయి వాడెలాగూ ఇక్కడుండేవాడు కాదు. వాడి పాట్లేవో వాడివి. మనం ఏదో చెప్పి అడ్డు చెప్పడం ఎందుకు?" అన్నాడు నిర్లిప్తంగా.     
    రిజిష్టర్ పెళ్ళికి మాత్రం ఒప్పుకోను అంది ఆవిడ. "వద్దు. రిజిష్టర్ పెళ్ళే మంచిదిలే..... అలా అయితే మళ్ళీ మన నీరూ అందరిలో వెల్తి పడకుండా వుంటుంది. ఓ పార్టీ ఇచ్చేద్దాం ఇక్కడ, సరిపోతుంది" అన్నారాయన.
    "మీకెంతసేపూ కూతురు ఆలోచనే. ఓ ముద్దూ ముచ్చటా లేకుండా ఏం పెళ్ళి?" అని గొణిగింది ఆవిడ.
    మరోనెలలో కృష్ణ పెళ్ళి జరిగింది. ఊర్లో అందరికీ పార్టీ ఇచ్చారు. కోడలు చేత గృహప్రవేశం చేయించింది శారదాంబ. కొత్త దంపతులు ఇద్దరూ అక్కడ నాలుగురోజులున్నారు. ఆ నాల్గురోజులూ లత సరదాగానే ఉంది. నిర్మల గురించి కృష్ణ చెప్పాడు. లతకి నిర్మల పట్ల సానుభూతి కలిగింది. ఆమెతో సరదాగా మాట్లాడింది. అయినా నిర్మల ఏం అంటే ఏం ప్రమాదమో, పెద్ద వదినగారిలా ఈవిడా తయారవుతుందేమో, అనవసరంగా ఎందుకు పూసుకు తిరగటం అన్నట్టు అంటీ ముట్టనట్టే వుండిపోయింది - లత మాట్లాడుతున్నా.     
    "నీరు..... మేం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాక ఈ డిసెంబర్ సెలవుల్లో నీవు బెంగళూరు రావాలి" అన్నాడు వెళ్లే ముందు కృష్ణ. లత కూడా మరీ మరీ చెప్పింది ఆప్యాయంగా చెయ్యినొక్కి.
    "మీ కృష్ణ, లత అదృష్టవంతులు. చక్కగా జాం అని పెళ్ళి చేసుకుని చిలకా గోరింకల్లా ఎగిరిపోయారు వేరింటి కాపురానికి" అంది ఆ రాత్రి దివ్య, రఘుతో - మనకే ఈ బాదరబందీలు, గోలనూ" అంది కినుకుగా.
    "ఏం..... నీకేం బాదరబందీలున్నాయి హాయిగా ఏ రెస్పాన్స్ బులిటీస్ లేకుండా వున్నావు ఇంట్లో. అమ్మ అన్నీ చూసుకుంటూంటే" అన్నాడు రఘు.   
    "ఎంతయితే మాత్రం మనింట్లో మనం వున్న స్వేచ్చ ఎక్కడుంటుంది? అన్నింటికీ అత్తగారి, మామగారి ఇష్టాఇష్టాలకి లొంగి వుండాలి. నాదేం వుంది ఇంట్లో? పెత్తనం అంతా మీ అమ్మగారిదే. అదే నా యిల్లు అయితే నా ఇష్టం వచ్చినట్లు డెకరేట్ చేసుకుంటాను. రకరకాల వంటలు నేర్చుకునేదాన్ని, ఇక్కడ ఏం చేయాలన్నా పెద్ద ప్రాబ్లమ్. ఇక్కడుండబట్టి తరువాత మీ చెల్లెలు రెస్పాన్సిబులిటీ అదీ మనదవుతుంది. మీ అమ్మా నాన్న పోయాక ఆవిడ మన నెత్తినే వుండాలి. హాయిగా మీరూ ఈ 'లా' కాకుండా ఇంకేదన్నా చదివి వుంటే మనమూ ఉద్యోగం పేరుతో ఇక్కడ్నుంచి పోయేవారం."
    అన్నా, వదినా నెమ్మదిగా ఏం మాట్లాడుకోవడం లేదు. మేడ మీద బాల్కనీలో కూర్చున్న నిర్మలకి ఆ మాటలు వినబడ్డాయి. ఎంత పట్టించుకోకూడదనుకున్నా ఇలాంటి మాటలు వింటే మనసు చివుక్కుమంటుంది. అప్పుడే వదినగారు ఎంత దూరం ఆలోచిస్తూంది! అమ్మా నాన్న తరువాత వాళ్ళ నెత్తిన తన పీడ పడ్తుందని ఆలోచిస్తూంది. నిజమే. తను ఆమెకి ఏమవుతుంది? తల్లితండ్రి అంటే..... కన్నారు గనక తనని ఆదరిస్తున్నారు. రేపు వాళ్ళు లేని రోజు..... ఇన్నాళ్ళు ఆలోచనే రాని నిర్మల ఆ ఆలోచన తట్టగానే గతుక్కుమంది. నిజమే..... ఇప్పుడు తను అన్నల దయాధర్మం మీద ఆధారపడాలా? ఎంత మాత్రం కాదు. తనకి ఉద్యోగం ఉంది. తన బతుకు తను బతగ్గలదు. ఇప్పుడంటే తల్లి తండ్రి కోసం ఇక్కడుండి ఈ అవమానాలు సహిస్తుంది. అప్పుడింక తనకి ఎవరు లెక్క? దేవుడి దయవల్ల తనకి చదువుంది..... ఉద్యోగముంది. ఎవరికీ భారం కానక్కరలేదు. అయినా ఇంత ఈసడింపుగా మాట్లాడుతున్నారు.

 Previous Page Next Page