"మీరు చాలా బాగా ఆడారు. మా డాడీకూడా కాసేపు మాచ్ చూసి వెళ్ళారు. మిమ్మల్ని రేపు ఈవెనింగ్ టీకి ఇన్ వైట్ చేయమని చెప్పారు. తప్పకుండా వస్తారు కదూ?"
"సారీ! రేపు కుదరదు. మరోసారి వస్తాలెండి" బెట్టుసరిగా అన్నాడు తను.
ఆమె మొఖం చిన్నబోయింది. తలవంచుకొని వెళ్ళిపోయింది అక్కడినుంచీ. స్నేహితులు అందరూ తనవంక ఈర్ష్యగా, ఆశ్చర్యంగా చూడటం ఇంకా గుర్తుంది తరువాత వారం రోజులవరకూ ఆమె కనిపిస్తూనే ఉందిగాని మాట్లాడ్డానికి ప్రయత్నించలేదు. పోలీస్ టీమ్ కీ, కాలేజీ టీమ్ కీ జరిగిన ఎగ్జిబిషన్ మాచ్ లో తను సెంచురీ కొట్టాడు. అందులో ఏడు సిక్సర్ లు. జానకి గొంతు తనకి వినబడుతోనే ఉంది. ఆట ముగిశాక సైకిల్ మీద ఇంటికి బయల్దేరాడు తను. చీకటిపడుతోంది అప్పుడే. కాలేజ్ గేటుదాటి మెయిన్ రోడ్ దగ్గరకొచ్చేసరికి "మిష్టర్ చలం..." అన్న గొంతు వినిపించింది.
సడెన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూశాడు ఎవరా అని. రోడ్డు పక్కనే ఆగి ఉన్న కార్లోంచి దిగుతూ, జానకీ, ఆమె తండ్రి కనిపించారు.
దగ్గరగా వచ్చాడాయన.
"మార్వలెస్ ప్లే! శోభనాచలం- బాటింగ్ అండ్ బౌలింగ్ ఎక్సలెంట్! చాలా అద్భుతంగా ఆడారు - కంగ్రాచ్యులేషన్స్-"
"థాంక్యూసర్-"
"అయ్ లైక్ క్రికెట్ సోమచ్! కాలేజ్ డేస్ లో క్రికెట్టంటే పడి చచ్చేవాణ్ని- కాని ఆ రోజుల్లో జనం ఫుట్ బాలంటే ప్రాణాలిచ్చే సేవాళ్ళు. నేను క్రికెట్ మానేసి ఫుట్ బాల్ నేర్చుకున్నాను. అప్పటికి జనం క్రికెట్ అంటే వెర్రెత్తిపోడం మొదలెట్టారు- సో- ఇహిహి-" అంటూ నవ్వాడాయన.
తనూ నవ్వాడు శోభనాచలం.
"రేపు కాలేజ్ కెలాగూ శెలవుకదా, మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రండి. అమ్మాయి చెప్పింది. మా యింటి దగ్గర్లోనే నటగా మీ ఇల్లు కూడా-'
కాదనలేకపోయాడు శోభనాచలం.
"మీకెందుకంత శ్రమ?" నవ్వుతూ జానకి వంక చూసి అన్నాడు.
"నో - నో - ఇటీజ్ ప్లెజర్! ప్లీజ్!" అంది జానకి సిగ్గుపడుతూ.
మర్నాడు మధ్యాహ్నం పదకొండింటికల్లా వాళ్ళింటి కెళ్లాడు తను. జానకి తనకోసం ఎదుర్చూస్తోంది వసారాలో.
"రండి! నాన్నగారు ఇంకో అరగంటలో వస్తానని ఫోన్ చేశారు. అంతవరకూ మేడమీద కూర్చుందాం...."
మేడమీద గదిలో కూర్చున్నాడు శోభనాచలం.
"ఇది నా గది..." అంది నవ్వుతూ.
గదంతా కలియజూశాడు. శోభనాచలం. చాలా ముచ్చటగా ఉంది. ఓ పక్క గోడంతా వరుసగా అందమయిన ఫ్రేమ్స్ తో ఫోటోలు తగిలించి ఉన్నయ్. అన్ని కాలేజ్ బాడ్మింటన్ టీమ్ లే. అన్నింట్లోనూ జానకి స్పోర్ట్ డ్రస్ లో రాకెట్ పట్టుకుని నిలబడి ఉంది.
"అవన్నీ హైస్కూల్ వి! కంటిన్యువస్ గా రెండేళ్ళు ఛాంపియన్ షిప్ కొట్టాం" అంది జానకి తన పక్కకొచ్చి నిలబడుతూ.
అప్పటికీ ఇప్పటికీ ఆమెలోని మార్పు చూసి ఆశ్చర్యపోయాడు శోభనాచలం. ఆమె టేబుల్ మీదున్న ఫోటో ఫ్రేమ్ లో ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్ తోపాటు దిగిన ఆమె ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు.
"వాళ్ళు తెలుసుగా మీకు! రెండేళ్ళ క్రితం రంజీట్రోఫీలో ఆడారు - వైజార్ కాలేజ్ లో" చాలా ఎగ్జయిట్ మెంట్ తో చెప్పింది.
"క్రికెట్ అంటే పంచ ప్రాణాలనుకుంటాను మీకు" నవ్వుతూ అన్నాడు.
"ఆఫ్ కోర్స్! కానీ మీరంటే పంచప్రాణాలు మాత్రమేకాదు! మొత్తం ప్రాణాలన్నీ! బైదివే- మనిద్దరం కలిసి ఫోటో దిగాలి! ఎప్పుడు పర్మిషనిస్తారు?" ఆమె నవ్వుతోన్న భంగిమ తన హృదయంలో ముద్రించుకుపోయింది.
ఇంత అందం ఉందా ఈ అమ్మాయిలో?
అంతవరకూ ఎలా గమనించలేకపోయాడు తను?
"మీ ఇష్టం! ఎప్పుడంటే అప్పుడే."
మరో గోడంతా అందమయిన ఫోటో సీనరీతో నిండిపోయింది.
సముద్రం కెరటాలు, తీరం వెంబడి ఉన్న పచ్చని అడవి - సముద్రంలోకి చొచ్చుకొచ్చిన కొండ చరియ - అది ఫోటోలా లేదు. నిజంగా సముద్రతీరాన నిలబడి చూస్తున్నట్లే ఉంది.
"చాలా మంచి టేస్ట్ ఉంది మీకు" అన్నాడు శోభనాచలం.
"థాంక్యూ-" కొంచెంగా సిగ్గుపడుతూ అంది.
ఆమె అల్మారాలోని ఫారిన్ మాగ్ జైన్స్, అడియో కాసెట్స్, వీడియో కాసెట్స్ చూస్తూ వాటి గురించి ఆమె అనర్గళంగా మాట్లాడుతూంటే వింటూండిపోయాడు చాలాసేపు.
సమయం గడుస్తున్న కొద్దీ ఆమె మీద ఆకర్షణ పెరుగుతూనే ఉంది. మరి కాసేపటికి ఆమె తండ్రి వచ్చేశాడు.
అంతా సరదాగా, క్రికెట్ గురించి కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు.
సీకేనాయుడు కాలంలో క్రికెట్ కీ ఈ రోజుల్లో క్రికెట్ కి ఎంత తేడా వచ్చిందో అతను చెప్తూంటే ఆశ్చర్యంగా విన్నాడు శోభనాచలం!
ఆ తరువాత చాలాసార్లు జానకి కోరిక మీద వాళ్లింటికెళ్ళాడు.
ఆ తరువాత తనకే వెళ్ళాలనిపించి వెళ్ళటం ప్రారంభించాడు.
ఒకరోజు తనకూ జానకిని ఒక రీలు ఫోటోలు తీశాడు ఆమె తండ్రి.
ఫోటోలు తీసిన రెండోరోజు ఓ ఆశ్చర్యమయిన సంఘటన జరిగింది.
ఆమె టేబుల్ మీద ఫోటో ఫ్రేమ్ లో అంతకుముందు ఆమె రంజీ ట్రోపీ ప్లేర్స్ తో కలిసి దిగిన ఫోటో మాయమయి, దాని స్థానంలో తనూ జానకీ దిగిన ఫోటో వెలసింది.
"అదేంటి? ఆ ఫోటో తీసేశారేం?" అడిగాడు శోభనాచలం.
"మీరిప్పటి క్రికెట్ హీరో కదా! అందుకని మన ఫోటోయే అక్కడుండాలనిపించింది! అందుకని అది తీసేసి ఆల్బమ్ లో పెట్టాను-" అందామె తన కళ్ళల్లోకి చూస్తూ.
తను త్రిల్ అయిపోయాడు.
మరికొద్ది రోజుల్లో తనకు అర్థమయిపోయింది. ఆమె తనను ప్రేమిస్తోంది, ఆరాధిస్తోంది. కేవలం తను చూపాల్సిన చొరవ కోసం ఎదురుచూస్తోంది.
తను ఏ టోర్న మెంట్ లో ఆడినా అక్కడికి వచ్చేయటం, తను ఒకరోజు కనిపించకపోతే రెండోరోజు ఇంటికి వచ్చేయటం- ఇద్దరూ కలసి సాయంత్రాల్లో కబుర్లు చెప్పుకుంటూ స్టేడియమ్ లో కూర్చోవటం-
తన ఫ్రెండ్సందరికీ తనమీద ఈర్ష్య కూడా కలిగింది.
"అంత అందమయిన ఫాన్ దొరకటం అదృష్టంరా! విష్ యూ బెస్టాఫ్ లక్" అనటం మొదలెట్టారు ఓపెన్ గా.
హఠాత్తుగా తనకు ఉద్యోగం రావటంతో తనతోపాటు జానకి కూడా ఎంతో ఆనందంతో పొంగిపోయింది.
"మైగాడ్! చాలా మంచి కంపెనీ అది! ఎప్పుడూ టాప్ క్రికెట్ ప్లేర్స్ నే అపాయింట్ చేసుకుంటుంది! యూ డిజర్విట్-"
చాలాసేపు ఇద్దరూ ఆ ఉద్యోగం గురించీ, హైద్రాబాద్ గురించీ, అక్కడ క్రికెట్కున్న అవకాశాల గురించీ, సౌకర్యాల గురించీ మాట్లాడుకుంటూ గడిపారు.
"అక్కడ ఉంటే మీరూ ఇండియా లెవెన్ కి సెలక్టయే ఛాన్సుంటుంది కదూ?" అడిగిందామె.
"ఉండొచ్చు! సెలక్షన్ కమిటీ దృష్టిలో పడాలంటే కేవలం మంచి ఆటగాడై ఉంటే చాలదు! కాస్ట్ ఫీలింగ్ లు, రిజీయన్ ఫీలింగ్స్, నార్త్ సౌత్ పార్షియాలిటీస్ - మైనారిటీ కమ్యూనిటీ కోటాలు ఎన్నో ఫాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది" నవ్వుతూ అన్నాడతను.