Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 30


    రాత్రి చీకటిని ఆధారంగా చేసుకున్న అరాచకశక్తులు ఈ లోపులో విజృంభించాయి. పోలీసు వాహనాల స్పీడు తగ్గిపోయింది. రోడ్లు దాదాపు నిర్మానుష్యం అయ్యాయి. అగ్రరాజ్యాలు అరేబియా దేశాల్నుంచి సరఫరా అయ్యే పెట్రోలియం మీద ఆంక్షలు విధించటం, ఎక్కువ రేటుకి కొనటం లాటి చర్యలు తీసుకోవటంలో బీదదేశాలు ఇబ్బందిలో పడ్డాయి.

    మూడో రోజుకి ప్రపంచమంతా కరెంటు లేదన్న వార్త దాదాపు అందరికీ తెలిసిపోయింది. పల్లెల్లో రకరకాల రూమర్లు వ్యాపించాయి. ప్రళయం వస్తుందని కొందరూ, ఇదేదో శక్తి చర్య అని కొందరూ ప్రచారం చేయసాగారు. పట్నాల్లోకన్నా పల్లెల్లోనే బ్రతుకు దుర్భరం అయింది. రోజువారీ చర్యలు దెబ్బతిన్నాయి. కరెంట్ మీద నీటిని పొందే రైతులు చాలా ఇబ్బందిలోపడ్డారు. ఇక ఎప్పటికీ కరెంట్ రాదన్న రూమరు అన్నిటికన్నా తొందరగా బలంగా వ్యాపించటంతో వ్యాపారస్తులు బియ్యం మొదలైన నిత్యావసర వస్తువుల్ని 'హోల్డ్' చేయసాగారు.

    నాలుగోరోజుకి దేశంలో వున్న బ్యాటరీలన్నీ దాదాపు అయిపోయాయి. దాంతో వార్తా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటు దినపత్రికలు గానీ, అటు రేడియోలు గానీ లేకపోవటంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. రాష్ట్ర ముఖ్యపట్టణాల్లోనూ, ప్రముఖ నగరాల్లోనూ మాత్రం సంచార వార్తా వాహనాలు ఏర్పాటు చేయబడ్డాయి.

    కరెంట్ శాశ్వతంగా పోవటంవల్ల లాభించింది అండర్ వరల్డ్ ఒక్కటే. వారి కార్యకలాపాలు మరింత దృఢంగా విజృంభించాయి. పోలీస్, సి.బి.ఐ., ఎ.సి.బి., టాస్క్ ఫోర్స్, బి.యస్.యఫ్., కస్టమ్స్, ఎక్సయిజ్ డిపార్టుమెంటులు ఎప్పుడయితే నిష్కార్యం అయిపోయాయో, అప్పుడు ఈ మాఫియా బలం పుంజుకుంది.

    వాహనాల ఇబ్బంది దృష్ట్యా అయితేనేం-కమ్యూనికేషన్స్ ఆగిపోవటంవల్ల అయితేనేం ఈ దొంగ రవాణాలని ఆపుచేసేవారే లేకపోయారు. నైట్ సర్వీసు విమానాలు ఆగిపోయాయి. కోల్డ్ స్టోరేజి ప్లాంట్లు పాడయ్యాయి. ఇదంతా రోజువారీ ఇబ్బందులకి సమాంతరంగా జరిగాయి.

    ఇక సామాన్య ప్రజల పరిస్థితిని సమీక్షిస్తే- ముందు స్కూళ్ళకి, తర్వాత కాలేజీలకి శలవులు ప్రకటించారు. వారం రోజులకి ప్రభుత్వ కార్యాలయాలకి శెలవు ప్రకటించవలసిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి ఏడవగానే చీకటి గుహల్లాంటి ఇళ్ళల్లో మనుష్యులు బితుక్కు, బితుక్కుమని గడపవలసి వచ్చేది. సినిమాలు లేవు. తిరగటానికి వాహన సౌకర్యం లేదు. బయట ప్రపంచంలో లింకులు తెగిపోయాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, అసలైన ప్రమాదం మరొక ఎత్తు. ఆ ప్రమాదం పేరు.... నీళ్ళు.

    రిజర్వాయర్లలోకి నీటిని పంపే విభాగం జనరేటర్ల ద్వారా సాధ్యం కాకపోవటంతో, క్రమంగా నీటిసరఫరా తగ్గిపోయింది. ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో దీనికి అఫెక్టు బాగా కనిపించింది. ఒక స్టేజి వచ్చేసరికి పంపుల్లోంచి నీటిచుక్క రావటం గగనమై పోయింది. ప్రజల్లో అసంతృప్తికి ఏ క్షణమయినా గండిపడేటట్లు తోచింది. నగరం... రాష్ట్రం...దేశం...ప్రపంచం... వివిధ స్థాయిల్లో స్పందించింది. కుతకుతా ఉడుకుతూంది. మొట్టమొదటిరోజు చాలా మామూలుగా కనపడిన సమస్యలే నాలుగు రోజులు గడిచేసరికి భయంకర రూపం దాల్చేయి. మనిషి దేన్నైనా భరించగలడు గానీ, కమ్యూనికేషన్ లేకపోవటాన్ని మాత్రం అసలు భరించలేడు. పక్కగదిలో ఏమవుతుందో కూడా కావాలి. చండీగర్ లో హిందువుని చంపితే ఢిల్లీలోసిక్కుని చంపకపోతే గాని ఆవేశం తగ్గదు. అటువంటి 'మనిషి' కి పేపరు, రేడియో లేకపోతే ఎలా? మనిషిలోని ఈ అసంతృప్తిని ప్రతిపక్షాలు బాగా ఉపయోగించుకుంటున్నాయి. నీటి ప్రాబ్లెమ్ కి అధికారపక్షమే కారణం అనీ, కరెంట్ పోవటానికి ముఖ్యమంత్రి చెవిపోగే కారణమనీ ఊరేగింపులు లేవతీశాయి. సమస్య చాలా బలమైనది కావటంతో దీనికి చాలా బలం ఏర్పడింది. కంట్రోల్ రూమ్ వరకూ సజావుగా సాగిన ఊరేగింపు అక్కడ విడిపోయి అసెంబ్లీ భవనం మీద దాడి జరిగింది. ఇది రాజకీయ పరిణామం. మానసిక పరిస్థితిని గమనిస్తే - మనిషి మరింత తల్లడిల్లాడు. రాత్రయ్యేసరికి ఇంట్లో వుండటం కష్టమైంది. వీధిలో వాళ్ళంతా కలసి ఒకచోట చేరి కబుర్లు చెప్పుకోవటం సర్వసామాన్యమైపోయింది. శ్రీరామనవమి పందిర్లలాగే భజన కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. సమస్య వచ్చినప్పుడే కదా దేవుడు గుర్తొచ్చేది. భజన ఎస్కేపిజానికి ఒక అవుట్ లెట్. అది క్రమంగా ప్రాచుర్యం పొందింది. అందరిలోనూ ఒకటే ప్రశ్న. కరెంట్ ఎప్పుడొస్తుంది? అంతే! ఇది తప్ప మరొక ఆలోచనలేదు. ఫోన్లు లేవు. ఎయిర్ కండీషనర్లు లేవు. కార్లు లేవు. విలాసయాత్రల్లేవు. ఇవి ధనవంతుల ప్రాబ్లెమ్స్. తిండి లేదు. ధరలు అందుబాటులో లేవు. కూలిపని లేదు. ఇవి బీదల సమస్యలు.

    స్థానికంగా వున్న కష్టాలు ఇవి అయితే, అంతర్జాతీయ పరిణామాలు మరింత దారుణంగా రూపుదిద్దుకున్నాయి. బీద దేశాల్లో కరెంటు పోవటం ఎంత సామాన్యమో, సంపన్న దేశాల్లో అంత అరుదు. ఒక అమెరికన్ తన జీవితకాలంలో ఎప్పుడూ కరెంట్ పోవటం అనే పదాన్ని చూసివుండడు. ఇరవై నాలుగో అంతస్తునుంచి లిఫ్టులని జాగ్రత్తగా దింపటం అన్న విషయం నుంచి ప్రారంభమయిన సమస్య గంట తిరిగేసరికల్లా ఊహించనంత పెద్దదయింది. కేవలం మొదటి ఆరుగంటల్లో కనీసం వెయ్యిహత్యలు జరిగివుంటాయని అంచనా. అదృష్టవశాత్తు అనుదీప్ ఆ ప్రకటన చేసినప్పుడు సగందేశాల్లో అది పగలు. లాస్ వేగాస్ లో కరెంటు పోగానే- కాసినోలో జరిగిన దారుణాల్ని మిగతా ప్రపంచానికి చెప్పటం కోసం దురదృష్టవశాత్తు (అదృష్టవశాత్తు?) పేపర్లు లేవు, డబ్బు నైతిక విలువల్ని డామినేట్ చేసే దేశాల్లో ఈ కరెంటు సమస్య వెంటనే తన ప్రభావం చూపించింది. జీవితం స్థంభించిపోయింది. కంప్యూటర్ లు పనిచేయటం మానేశాయి. పెట్రోలు సమస్య మామూలే.... కరెంటు పొవటమనేది అక్కడి ప్రభుత్వం వూహించని సమస్య. దానికది ప్రిపేర్డుగా లేదు. చిక్కేమిటంటే అక్కడ ప్రతిదీ మెకానికల్. దాంతో వచ్చింది చిక్కు. సామాన్యమైన చిక్కు కాదది ప్రభుత్వం ఎదుర్కోలేని చిక్కు. కొత్త ప్రాతిపదికమీద దానిని ఎదుర్కొనే ప్రయత్నాలు చేపట్టింది. ప్రతిదీ ఇళ్ళల్లో "స్టోరు" చేసుకున్నారు. రిఫ్రిజరేటర్లని పునరుద్ధరించటం అయ్యే పనికాదు. సూపర్ మార్కెట్ల పరిస్థితి కూడా అదే. దానికితోడు రవాణా సమస్య. కరెంటు లేకపోయినా మనిషి జీవించగలడు అన్నది సగటు అమెరికన్ ఊహించలేని విషయం.

    ప్రభుత్వం దీనిగురించి తీవ్రంగా ఆలోచించింది. ఎలక్ట్రిసిటీని ఎలా పునరుద్ధరించాలో తెలియలేదు. సోలార్ ఎనర్జీని దానికి బదులుగా ఉపయోగించాలంటే- ఆ విధానాలు కనుక్కోవటానికి రాత్రింబగళ్ళు దేశంలోని ప్రతి సైంటిస్టూ కష్టపడినా కనీసం రెండు మూడు సంవత్సరాలు పట్టవచ్చు. అంతవరకూ ప్రజాజీవితం స్థంభించకుండా ఉండాలంటే ఎలా? దాదాపు ప్రతివీధికి ఒక జనరేటర్ (జైంట్) పెట్టాలి. ఈ దేశంలో కొన్ని లక్షల జనరేటర్లు ఈ విధంగా పనిచేయాలి. దాదాపు వెయ్యి మిలియనుల గాలన్ల పెట్రోలియం ప్రొడక్ట్సు దీనికి అవసరం అవుతాయి అంటే ఆయిల్ సరఫరాని సాగించే దేశాలన్నింటినీ కొనుగోలు చేస్తే తప్ప లాభంలేదు. ఇన్ని లెక్కలు వేసిన అమెరికన్ లు క్షణాలమీద ఈ చర్యకి నాందీవాక్యం పలికారు. అయితే ఇంత వేగంగానూ లెక్కలు కట్టే రష్యన్ల సంగతి వాళ్ళు మర్చిపోయారు, అప్పటికే వాళ్ళూ ఈ దేశాన్ని సంప్రదించారు. ఉన్నట్టుండి పెట్రోలియం ప్రొడక్టులకొచ్చిన డిమాండు ఈ ముస్లిం దేశాలని తబ్బిబ్బు చేసింది. కానీ అడిగేవాళ్ళు బలమయిన వాళ్ళు కావడంతో ఎటూ నిర్ణయించుకోలేకపోయాయి అవి. ఈ లోపులో వత్తిడి ఎక్కువయింది. 'అభ్యర్థన' 'బెదిరింపు' గా మారింది. మీరే నిర్ణయించుకోండి అన్నాయి ఆ దేశాలు. సంప్రదింపులకి మార్గంలేదు.

    ఉన్నదొకటే వస్తువు. ఇద్దరికీ కావాలి.

    బలమే దాన్ని నిర్ణయిస్తుంది.

    ప్రపంచం మొత్తం మీద కరెంటు పోయిన పదిహేనురోజులకి ఆ విధంగా మూడో ప్రపంచయుద్ధం మొదలైంది.

                                      *    *    *

    మొట్టమొదటి న్యూక్లియర్ బాంబ్ సౌదీ అరేబియా మీద పడింది. ప్రతీకారంగా రెండోది ఇజ్రాయెల్ మీద. ఇరాన్, ఇరాక్ సమిధలయ్యాయి.

    నాకు దక్కనిది నీకూ దక్కకూడదు అన్నదొక్కటే అక్కడ చలామణి అయ్యే న్యాయం! రెండురోజులకి రెండు దేశాలు ముసుగులోంచి బయటకొచ్చాయి. కరెంటు లేకపోతే రష్యన్స్ కొంతకాలం బ్రతగ్గలరేమో గానీ అమెరికన్స్ అసలు బ్రతకలేరు. రెండు రాజ్యాలకీ జరగబోయే పరిణామాలు తెలుసు. ఎవరు ముందు ఈ నూనెగనులమీద ఆధిపత్యం సంపాదిస్తే వాళ్ళు మనుగడ కొనసాగించగలరు. మిగతా ప్రపంచంలో అరాచకం తప్పదు. ఏ విప్లవమూ రాకపోతే 90 శాతం జనాభా క్రమంగా నశిస్తుంది.

    ఈ కారణాలవల్ల మూడో ప్రపంచయుద్ధం తప్పనిసరి అయింది. అమెరికన్ మిస్సైల్స్ ని రష్యా అంతరిక్షంలోనే ఎదుర్కొంది. స్టార్ వార్స్ ప్రారంభమయిన రెండుగంటలా పదిహేను నిముషాలకి రష్యా ప్రయోగించిన ఐ.సి.టి. 240 బాంబ్ అమెరికన్ నగరాలమీద, అదే సమయానికి అమెరికన్ NEPA లెనిన్ గ్రాడ్ నుంచి సైబీరియా ఎడారుల వరకూ ఒకేసారి విస్ఫోటనం చెందాయి.

    భూమి ఒక్కసారిగా కదిలిపోయింది.

    రక్తాన్ని మరిగించేటంత వేడెక్కిన వాతావరణపు ప్రభావానికి జనావళి నల్లుల్లా మాడిపోయింది.

    ఆమెకి మెలకువ వచ్చింది.

    గదికూడా ఆమె కలలో భూమిలాగే కుతకుతా ఉడుకుతోంది. కొంచెంసేపు ఆమెకి జరిగిందేమిటో అర్థంకాలేదు. ఆమె నైటీ చమటతో తడిసిపోయింది. దోమలు చెవులదగ్గిర శబ్దం చేస్తున్నాయి. ఎక్కడనుంచి కల ప్రారంభమయిందో తెలియలేదు. కరెంటు మాత్రం లేదు. అంతవరకూ నిజం. ఫాన్ తిరగటంలేదు.

    టైమ్ చూసింది.

    రెండున్నర కావస్తూంది.

    టేప్ రికార్డర్, అందులో క్యాసెట్ అలాగే వున్నాయి. అనుదీప్ వచ్చి శాపం పెట్టి వెళ్ళటం, కరెంటు వెంటనే పోవటం.... అంతవరకూ నిజమేనన్నమాట. ఈ రాత్రే అంతా జరిగింది. మిగతాది తన కల. కల కాబట్టే పరిణామాలన్నీ ఒక వరుస క్రమంలో గాక, అస్తవ్యస్తంగా వచ్చాయి. ఆమెకి నవ్వొచ్చింది.

    ఆ రాత్రి ఇక ఆమెకి నిద్రపట్టలేదు.

    తెల్లవారేవరకూ పక్కమీద అటూ ఇటూ దొర్లుతూ గడిపింది. ఆమె మనసులో ఎక్కడో చిన్నభావం... తను ప్రేమించటం గురించి అనుదీప్ చెప్పింది నిజమేనేమో అన్న వాస్తవం ఆమెని నిలదీస్తోంది. తనని చూసిన మొదటి క్షణంలోనే అతడు ఏదో విధంగా మాటలు కలిపి స్నేహం పెంచుకుని వుంటే ఆ తరువాత తనూ ప్రేమించి పెళ్ళాడటానికి అడ్డు చెప్పేదికాదేమో అనుదీప్ (ఎంత కాదనుకున్నా) స్మార్ట్. అతడి నవ్వులోనే సీరియస్ నెస్ తో కూడిన చిలిపితనం వుంది. చాలామంది ఆడ పిల్లలు ఇష్టపడే అరుదైన క్వాలిటీ.

    ఆమె పక్కకి తిరిగి పడుకుంది.

    అసలు అతడు ఇన్ని అబద్ధాలు చెప్పకుండా వుంటే ఈపాటికి ఈ పరిచయం మరింత అభివృద్ధి చెంది వుండేదేమో. ఇంటిగలాయన, ఆయన కొడుకు, చక్రధర్ - వీళ్ళలో లేని విజ్ఞానం అతని అలసిన కళ్ళల్లో వుంది. ఆ ముగ్గురూ మరోరకంగా తనని బుట్టలో వేసుకోవటానికి ప్రయత్నించారు. ఈ మాయల్తో విసిగిపోయిన మనసు తొందరగా మరో మొగవాడిని అంగీకరించటానికి ఒప్పుకోవటం లేదు. అచ్చంగా అతడు తన మనసులోకి తొంగిచూసినట్టు ఆ విషయాలన్నీ చెప్పగానే తన అహం దెబ్బతిన్నది. ఆ తరువాత అతడు చేసిన ట్రిక్కులన్నీ మరింత కోపం తెప్పించి అతడిని దూరం చేశాయి. ప్రేమికులపై అతడు చేస్తున్న అనాలిసిస్, ప్రేమపట్ల తనకి భయాన్ని కలిగించింది. అంత వాస్తవాన్ని భరించలేకపోయింది మనసు.

    ...దోమచేసే శబ్దానికి, ఆమె చెంపమీద చేత్తో కొట్టుకొని బోర్లా పడుకుంది. ....నిర్లక్ష్యంగా పెరిగిన గెడ్డం, భుజానికి చేతిసంచి, బెంగాలీ లాల్చీ...అనుదీప్ మళ్ళీ గుర్తొచ్చాడు.

    ఏడు సంవత్సరాలపాటు అతడు ఏమయ్యాడన్నది అనవసరంగానీ అప్పుడే కలిసివుంటే తను కాదనేదా? ...ఏమో, కాదనటానికి అతడిలో లేనిది ఏదీలేదు. ఆ మాటే అతడికి చెప్తే "అందంగా కనపడిన కుర్రాడు ఏదైనా అడిగితే వెంటనే "యస్" అనేస్తావా? అదేనా ప్రేమంటే?" అని మరో చర్చలేవదీస్తాడు. అతడికి ప్రేమకన్నా ప్రేమపట్ల చర్చే ఎక్కువ ఇష్టంలా వుంది. చక్రధర్ బారినుంచి తనని కాపాడిన మొదటిరోజే వింధ్య పర్వతాల తాలూకు కట్టుకథ చెప్పకుండా చేతిలోకి చెయ్యి తీసుకుని వుంటే తాను కాదనేదా? ఆమె తిరిగి పక్కకి తిరిగింది.

 Previous Page Next Page