నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి అంటాడేమిటి? ఇదేమైనా ఉప్మా తయారీనా? నీళ్ళు మరిగాక రవ్వ వేస్తే తయారవ్వటానికి.... అదే అతన్ని అడుగుతే, మరి ఈ కాలంలో ప్రేమ అలాగే తయారవుతుందికదా అంటాడు. నిజమే అవొచ్చు. కానీ అందరూ వేరు. తను వేరుకదా. ఆ విషయమే మళ్ళీ చెవుతే, ప్రతి ఒక్కరూ అలాగే "అందరూ వేరే. నేను వేరే" అనుకుంటారు అని నవ్వేస్తాడు. ఆ నవ్వు..... అది గుర్తొచ్చి ఆమె వెల్లకిలా తిరిగింది.
"రాత్రంతా నువ్వే గుర్తుకొచ్చావ్" అని చెప్పాలి. ఏడిపించటానికి ఏమంటాడు... "వెల్లకిలా పడుకున్నప్పుడు బోర్లా పడుకోవాలనిపించటమె ప్రేమ" అంటాడా! అనగల సమర్థుడే.
వెల్లకిలా పడుకున్న వాళ్ళని బోర్లా పడుకోబెట్టగలిగేది ప్రేమ ఒక్కటే కాదు దోమకూడా! అని అతడికి ఎలా నమ్మకం కలిగించటం? తామిద్దరూ రెండు ధృవాలు. మనసంతా ప్రేమ నింపుకున్న మనిషి అతను. ప్రేమ రాహిత్యంలో శిథిలమయ్యే శిల తను! ... ఆమెకి ఎవరో వ్రాసుకున్న గేయం గుర్తుకు వచ్చింది. వేటూరో - వీరేంద్రనాథో - తిలకో - గుర్తులేదు.
నేను ఉత్తరధృవం తలుపు తట్టినప్పుడు-
నువ్వు దక్షిణధృవాన పెంగ్విన్ పక్షుల్తో ఆడుకుంటున్నావు.
నేను హృదయాన్ని వెతుక్కునే చోట-
నీ జాకెట్ బటన్ మాత్రమే దొరికింది.
"ఆకేసుకుంటే నోరుపండు- వాటేసుకుంటే వలపుపండు" అన్నాడో కవి.
వలపు పండి ఫలమౌతుంది. విఫల మవుతోంది.
ఈ రకమైన ఆలోచనలతో ఎప్పుడు తెల్లవారిందో తెలీదు. ఆమె కళ్ళు నిద్రలేమివల్ల ఎర్రబడ్డాయి. అరగంటలో తయారైంది.
ఆ రోజు ఏదో అద్భుతం జరగబోతూందని ఆమెకి అనిపిస్తూంది. ప్రపంచం మొత్తంమీద కరెంటు లేదని తెలిసిన చాలా కొద్దిమందిలో తనూ ఒకరు! ఆమె కళ్ళముందు హడావుడిగా అడుగులు వేసుకుంటూ వెళుతున్న ధర్మారావు రూపమే కనబడుతుంది. ఏం జరుగుతూంది? బయటికి అధికారులు ఈ సమస్యని ఎలా ఎదుర్కోబోతున్నారు? తను మాత్రం చచ్చినా అనుదీప్ కి "యస్" అని చెప్పదు. మామూలుగా అడిగితే అది వేరే సంగతి. ఇలా బెదిరించి ఎవరూ తనతో పనులు చేయించుకోలేరు. చూద్దాం ఏం చేస్తాడో? పేపరు రాలేదు. పక్కింటివాళ్ళని అడిగితే బోయ్ వచ్చి, ఈ రోజు రాదని చెప్పాడని అన్నారు. కలకాస్త నిజమౌతూందన్నమాట. ఆమె షాపుకెళ్ళి, "వంద బ్యాటరీలు" అంది.
షాపువాడు ఆశ్చర్యంగా చూసి "ఎన్ని" అడిగాడు.
"వంద"
అతడు మాట్లాడకుండా ప్యాకెట్ కట్టి యిచ్చాడు. ఇంటికొచ్చి ట్రాన్సిస్టర్ లో పెట్టి ఆన్ చేసింది.
రేడియో రాలేదు. డెడ్ అయింది.
కనీసం జనరేటర్ లోనయినా పునరుద్ధరణ జరిగి వుండాలే.
కరెంటు శాశ్వతంగా పోయిందని అధికారులు రేడియోస్టేషన్ వాళ్ళకి చెప్పలేదా? ఆమె అన్ని స్టేషనులూ ప్రయత్నించింది. రాలేదు. కేవలం చెక్క పెట్టెలా మాత్రమే వుంది అది.
ఏదో తెలియని భయం ఆమెలో ప్రవేశించింది.
మళ్ళీ బయటకు వచ్చింది.
"పంపులో నీళ్ళు రావడం లేదమ్మా" అంటున్నారు ఎవరో. ఆమె ఒక క్షణం ఆలోచించింది. కరెంటు లేకపోవటానికి, పంపులో నీళ్ళు రాకపోవటానికి ఏం సంబంధం వుందా అని....
ఆమెకి తెలియలేదు. ఆమె మనసంతా ఉద్విగ్నతతో నిండిపోయింది. ఏం జరుగుతూందో తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఎక్కువయింది. చెప్పులేసుకుని బయటికొచ్చింది. మెయిన్ రోడ్డు మీదికి రాగానే షాక్ తగిలినట్టు నిలబడిపోయింది.
ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయి, ఎవరో చిత్రకారుడు వేసిన నిశ్శబ్ద చిత్రంలా వుంది. రోడ్డు జనం. గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు.
ఆమె ఫిజిక్స్ స్టూడెంటుకాదు. కానీ అంత చిన్న విషయం అర్థమవటానికి ఫిజిక్స్ లో మాస్టర్ అయివుండనవసరం లేదు. ప్లగ్ లో స్పార్క్ రావటానికి ఎలక్ట్రిసిటీ కావాలి. అది లేకపోతే వాహనాలు కదలవు. అందుకే కార్లు, లారీలు, స్కూటర్లు ఆగిపోయాయి. అందుకే రేడియోలు పనిచేయటంలేదు.
అంటే ఆయిల్ తో నడిచే జనరేటర్లు కూడా పనిచేయవు.
అందుకే పంపులో నీళ్ళు రా..లే..దు!!
...తను మూర్ఖురాలై వంద బ్యాటరీలు కొన్నది.
డీజిల్ కానీ, పెట్రోలు గానీ నిరర్థకం! అసలు కరెంటు ప్రవాహమే లేకపోతే ఇక ఇవన్నీ ఎందుకు?
ఆమె వణికి పోయింది.
తన కలలో పదిహేను రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ఇక రాబోయే పదిహేను గంటల్లో జరుగుతాయి. ప్రధానమంత్రి పార్లమెంటుకి గుర్రపు బగ్గీలో వెళ్ళాలి. ముఖ్యమంత్రి సైకిల్ మీద వెళతారేమో...కానీ ...ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అంతకన్నా మహా దారుణమైన సంఘటన అతి త్వరలో...
ఆమె నడక వేగం హెచ్చించింది.
ధర్మారావు ఇంటిలోనే వున్నారు. కానీ ఇల్లంతా నేల ఈనినట్టు పోలీసు అధికారులు. ఏం చెయ్యాలో తోచనట్టు శిలాప్రతిమల్లా వున్నారు అందరూ.
బైట ప్రపంచపు నిశ్శబ్దానికి ప్రతీకగా వుందాగది. విస్ఫోటనానికి ముందు స్థబ్దంగా వుండే అగ్నిపర్వతంలా వుందా గది.
ఊరుకీ- ఊరుకీ మధ్య, నగరానికీ -నగరానికీ మధ్య లింకులు తెగిపోయాయి. దేశానికీ దేశానికీ కమ్యూనికేషన్స్ లేవు. కొన్ని ప్రదేశాల్లో నీళ్ళు వస్తూ వుండవచ్చు! కానీ అదికూడా మరో రెండు రోజులు మాత్రమే. అంతమంది మధ్యలో వున్న ధర్మారావుని పలకరించే ధైర్యం ఆమె చేయలేకపోయింది. లోపలకి వెళ్ళబోయింది. వరండాలో రవిశాస్త్రి కనిపించాడు. ఒక తెలిసిన వ్యక్తి కనపడగానే ఆమెకి సంతోషం వేసింది.
"మొత్తం ప్రపంచమంతా పోయింది కరెంటు. కారణం తెలియటం లేదు" అన్నాడు రవిశాస్త్రి.
"ఇంకో రెండురోజుల్లో అంతా అల్లకల్లోలం అయిపోతుందనుకుంటాను" అంది. "రెండురోజులు కూడా అవసరం లేదనుకుంటాను" అంటూ అందుకు గల కారణాలు వివరించాడు.
ఆమెకి కొద్దిగా అర్థమయింది, కొద్దిగా కాలేదు. మనిషి జీవితం ఎంత గాజుసీసాలాంటిదో, కృత్రిమమయిన విధానాలమీద అతడి జీవితం ఎంతగా ఆధారపడిందో మాత్రం అర్థమయింది. ఎలక్ట్రిసిటీ అనేది నాలుగ్గంటలు లేకపోతే అరాచకం వస్తుంది. ప్రళయం వస్తుంది...
జరగబోయే పరిణామాలు ఆమెని భయపెట్టాయి. మొత్తం మానవాళి యొక్క మనుగడ అంతా తనమీద ఆధారపడి వుంది! తన ప్రేమ ప్రపంచాన్ని రక్షిస్తుంది!
మరి ప్రేమ ప్రేమించగలదా?
తన అహాన్ని తీసి పక్కన పెట్టగలదా?
పట్టుదలతో చివరివరకూ అంతం చూస్తుందా?
అంతా చెప్పి ఆమె శాస్త్రివైపు తిరిగి, "మనం అర్జెంటుగా అనుదీప్ దగ్గరికి వెళ్ళాలి. మీకు ఇల్లు తెలుసా?" అని అడిగింది.
"తెలుసు" అన్నాడు శాస్త్రి.
ఇద్దరూ అనుదీప్ ఇంటికి వెళ్ళారు. అతడు ఇంట్లో లేడు. ఆమెకి టెన్షన్ ఎక్కువైంది. ఎలా దీన్ని ఆపటం?
వాళ్ళ దగ్గరే ఒక కాగితం అడిగి తీసుకుని "అనుదీప్! ఐ లవ్యూ!! ఇంకే వాదనలూ వద్దు! ఐ లవ్యూ" అని రాసి ఇచ్చింది, "మీ అబ్బాయి వస్తే ఈ కాగితం ఇవ్వండి" అంటూ.
ఇద్దరూ తిరిగి రోడ్ మీదకు వచ్చారు. మెయిన్ రోడ్లుమీద వాహనాలు తిరుగుతున్నాయి. షాపుల్లో లైట్లు వెలుగుతున్నాయి.
అయితే - ఎప్పట్నుంచి?
తను "ఐ లవ్యూ" అని రాసినప్పటినుంచీనా?
కేవలం అతడి తృప్తికోసం - తాను రాసిన ఆ మూడు అక్షరాలకీ అంత విలువ వుందా? ఆమెకెందుకో ఆనందం కలగలేదు. ఆమె శాస్త్రివైపు చూసింది. అతడు మరింత గంభీరంగా వున్నాడు. తన ఆలోచనల్లో తను మునిగి వున్నాడు.
"హల్లో"
ఎదురుగా అనుదీప్! అతడివైపు నిరాసక్తంగా చూసింది. "నువ్వే గెల్చావ్" అంది పేలవంగా నవ్వుతూ.
అతడు తెల్లబోయి "నేను గెలవటమేమిటి?" అన్నాడు.
"మీ ఇంట్లో వ్రాసి వచ్చాను. నీకు కావలసిన విధంగా -"
"నిజమా! నాకా విషయం తెలీదు".
"మరి కరెంట్ ఎలా వచ్చింది?"
"ప్రపంచం ఎంత బాధపడుతూందో చూశాను. నా ప్రేమని నిరూపించటం కోసం మొత్తం ప్రపంచాన్నే బాధపెట్టటం స్వార్థం అనిపించింది. అందుకే దేవుణ్ణి తిరిగి ప్రార్థించాను. అంతా మామూలుగానే చేసెయ్యమని". మామూలు పరిస్థితుల్లో అయితే ఆమె వెటకారం ధ్వనించేట్టూ ఏదో ఒకమాట అనేదే కానీ- కళ్ళముందు నుంచి తప్పిపోయిన ప్రపంచ ప్రళయం ఆమెనింకా ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకునేలా చేయలేదు.
అతడు ఇంకా ఏమైనా మాట్లాడతాడేమో అని చూసింది. కానీ తలవంచుకుని అతడు అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. తను వ్రాసి అతడి ఇంటిలో యిచ్చిన కాగితంమీద అతడు ఏమైనా కామెంట్ చేస్తాడేమో అనుకుంది. కానీ అతడు ఆ ప్రస్తావన తేలేదు. శాస్త్రి అతడితో విడిగా ఏదో రెండు నిమిషాలు మాట్లాడాక అతడు వెళ్ళిపోయాడు. ఇద్దరూ ధర్మారావు ఇంటికి వచ్చారు. కరెంటు వచ్చాక కూడా అక్కడ ఇంకా హడావుడిగా వుంది. అసలెంత నష్టం జరిగిందో - పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోవలసి వస్తుందో అన్నది చర్చించటంలో అందరూ నిమగ్నమై వున్నారు. అయినా సరే- ధర్మారావు ఆమెను చూడగానే పక్కరూమ్ లోకి తీసుకెళ్ళాడు.
"అసలేం జరిగిందో తెలుసా?" అన్నాడు ఉద్వేగం, ఇరిటేషన్ అణుచుకుంటూ... "ఒక కొత్త జనరేషన్ కంప్యూటర్ కనుక్కోబడింది. దాని ప్రభావంవల్ల ఎలక్ట్రాన్ ల ప్రవాహం ఆగిపోయింది. అది తెలుసుకోవటానికి శాస్త్రజ్ఞులకి ఇన్ని గంటలు పట్టింది. ఇక ప్రపంచానికి ఏ ప్రమాదమూ లేదు". *
ఆమెకి అతడు చెప్పినదానిలో కాస్త అర్థమైంది. కాస్త కాలేదు. ఎలక్ట్రాన్ ల ప్రవాహం ఆగిపోతే కరెంటుపోతుంది అని తెలుసు. కానీ ఒక కొత్త వస్తువు కనుక్కోబడటానికి, ప్రవాహం ఆగిపోవటానికి సంబంధం ఏమిటో అర్థంకాలేదు. అయితే ఆమె దాని గురించి ఆలోచించలేదు. అనుదీప్ గురించి ఆలోచిస్తూంది. ఆమె మనసులోని భావాలకి బలం కలిగిస్తున్నట్లుగా ధర్మారావు అన్నాడు.
"ఆ బాస్టర్డ్ కి ఈ విషయం ముందే తెలిసినట్టుంది. సరిగ్గా దాన్ని అన్వయించుకుని నీ దగ్గిర ఈ నాటకం ఆడాడు".
విద్యాధరి మొహం ఎర్రబడింది. ఇంత ఫూలిష్ గా తను ఎలా ప్రవర్తించ గలిగింది? అతడేదో అనెయ్యగానే అంత మధనపడి "ఐ లవ్యూ" అని ఎలా పేపర్ మీద వ్రాసి ఇచ్చెయ్యగలిగింది? అతడు ప్రతిసారీ తనని ఫూల్ ని చేస్తూనే వున్నాడు. ఈసారి మరింత థ్రిల్లింగ్ గా చేశాడు.
"ఒక కంప్లెయింట్ రాసివ్వు-"
"ఏమని?" ఆలోచనలనుంచి తేరుకుంటూ అడిగింది.
_________________________________________________________________
* ఎవరు వ్రాశారో జ్ఞాపకం లేదు. క్లార్కో... అసిమోవో...
ఒక స్టేజ్ లో మొత్తం ప్రపంచంలో టెలిఫోన్ లన్నీ "డెడ్" అయిపోతాయి. దానికి కారణం - సూపర్ కంప్యూటర్ అని సైంటిఫిక్ గా రీజనింగ్ ఇచ్చారు ఆ రచయిత. ఆ భావం ఇక్కడ కూడా ఉపయోగించబడింది తప్ప- ఇది పూర్తిగా అభూత కల్పన కాదు.
- రచయిత