Previous Page Next Page 
థ్రిల్లర్ పేజి 29


    "విల్లు అంటే బాణం, బాణం వున్నచోట దారికూడా వుంటుందని దాని అర్థం".

    ఆమె మొహం ఎర్రబడింది. "ఛీ", నీలాటివాడిని ఆడమేక కూడా ప్రేమించదు. అంది కోపంగా.

    "నిజమా. అయితే ఈ ప్రపంచంలో ఆడమేకల కన్నా అధమస్థాయిలో ఆలోచించేవారు చాలామంది వున్నారన్నమాట. సరే- దానికేంగానీ, ఒక్క విషయం మాత్రం నన్ను నమ్ము విద్యాధరీ! ఏడు సంవత్సరాల నుంచీ నేను నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మిగతా వాళ్ళలాగా దాన్ని ప్రకటించకపోవడమే నా తప్పు అయితే నన్ను క్షమించు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు తరచు రాకపోవటం నా తప్పే. నువ్వు అపాయంలో పడటానికి కనీసం ఒక్కరోజు ముందు నన్ను ప్రేమించానని ఒకమాట అని వుంటే ...."

    "అని ఉంటే ఏం చేసి వుండేవాడివి? లాయర్ ని ఏర్పాటు చేసి వుండేవాడివా? జడ్జీమీద వత్తిడి తెచ్చి వుండేవాడివా?" వెటకారంగా అంది.

    "గాలిని స్థంభింపజేసి వుండేవాడిని. భూభ్రమణాన్ని ఆపుచేసి వుండేవాడిని. నిజమయిన ప్రేమ లక్షణం అంటే విద్యాధరీ! అవతలివారి సుఖసంతోషాల కోసం ఏదైనా చెయ్యటం. కనీసం చెయ్యాలనుకోవటం! ఆరోగ్యకరమైన బంధమున్న దంపతుల్లో చూడు- భార్యకి కాస్తంత నలత చేస్తే భర్త విలవిలాడుతాడు. భర్త క్యాంపుకి వెళితే భార్య అన్నం కూడా సరిగ్గా వండుకోదు. ఈ రకమైన సున్నితత్వం నుండి మనిషి సంక్లిష్టమైన సంచలనం వైపు వెళ్ళటమే బాధాకరం. నువ్వన్నావు చూడు- మనం ప్రేమికుల మయివుంటే నాకిలా జరిగినందుకు నువ్వేంచేసి వుండేవాడివి? అని. ప్రపంచాన్ని ఎదిరించయినా సరే నిన్ను బయటకు తీసుకురావటానికి ప్రయత్నించి ఉండేవాడిని. లేదా నిన్ను ఉరితీసిన మరుక్షణమే నేనూ మరణించి వుండేవాడిని".

    "నిజంగా పదహారేళ్ళ అమ్మాయి అయితే నీ మాటలకి ప్లాట్ గా పడిపోయి వుండేది".   

    "నేను చెప్పేదీ అదే! పదహారేళ్ళ అమ్మాయిని ప్లాట్ గా పడుకోబెట్టటం కోసం "ఇవే" మాటల్ని ప్రతీవాడూ వాడటం బాధాకరం".

    "నువ్వు చేస్తున్నదీ అదే".

    "కానీ వాళ్ళలా కాకుండా నేను ప్రాక్టికల్ గా చేసి చూపించాను".

    ఆమె తీవ్రంగా, "ఏమిటి నువ్వు చేసింది? ప్రేమ ముసుగు వేసుకుని అందర్నీ ఫూల్స్ ని చేయటమా! నీకు తెలిసిన క్షుద్రవిద్యలతో మనుషుల్ని కనికట్టుతో పడెయ్యటమా?"

    "నాకు ప్రేమించటం తప్ప ఏ కనికట్టూ తెలీదు. అయినా కనికట్టు అంటే ఏమిటి?"

    "చేతులు మొలిచినట్టు, శరీరంమీద ప్రేమలేఖలు వ్రాసినట్టు అవతలి మనిషిని భ్రమింప జెయ్యటం..."

    "ఎవర్ని చేశాను అలా?"

    "నన్నూ, పోలీసుల్నీ!! అనుదీప్- నువ్వు కనికట్టు విద్యలతో కొంతకాలం, కొంతమందిని మాత్రమే మోసం చెయ్యగలవు. అందర్నీ ఎల్లకాలం చెయ్యలేవు".

    "చేస్తే నమ్ముతావా పోనీ-"

    "ఏం చేస్తావు?"

    "మొత్తం ప్రపంచంలో అందరూ శాశ్వతంగా నమ్మేటట్లు చేస్తాను. నా ప్రేమపట్ల మొత్తం ప్రపంచానికీ, ముఖ్యంగా నీకూ నమ్మకం కుదిరేకే కరెంటు వస్తుంది".

    ఆమె అదిరిపడింది "ఏమిటి?" అంది.

    అతడు తాపీగా అన్నాడు. "నాది నిజంగా మెస్మరిజమే అయితే అది కొంతకాలంపాటు కొంతమందికి మాత్రమే నమ్మకం కుదిరేలా చేస్తుంది. నాది నిజమైన ప్రేమే అయితే ఈ ప్రపంచం మొత్తానికే శాశ్వతంగా కరెంటు పోతుంది" అతడి మాటలు పూర్తి కాకుండానే ఫ్యూజ్ పోయినట్టు చిన్న శబ్దంతో కరెంటు పోయింది. ఆమె భీతావహురాలై 'ఏమిటిది? ఏం జరిగింది" అంటూ కీచుమన్న కంఠంతో అరిచింది. ఆ చీకట్లో అనుదీప్ స్వరం స్థిరంగా వినిపించింది. "నువ్వు నన్ను చాలా హర్ట్ చేశావు విద్యాధరీ! ఇద్దరిమధ్య ఉత్పన్నమయ్యే ప్రేమకి 'నిజాయితీ' కన్న 'మాటలూ చేతలే' ముఖ్యమని నువ్వుకూడా నిరూపించావు. నేను నిన్ను అందర్లాగే మామూలుగా అప్రోచ్ అయివుంటే ఈపాటికి నువ్వూ తలమునకలయ్యే ప్రేమలో వుండేదానివి. నేను నిన్ను పెళ్ళాడతానని లంచం పెట్టివుంటే, నా భార్యగా నన్ను ప్రేమిస్తూ వుండేదానివి. ఏ స్వార్థమూ లేకుండా ప్రేమించటమే నా తప్పు. నీ శరీరాన్ని కాంక్షించకపోవటమే నా బలహీనత. నా సహనానికి పరీక్ష పెట్టావు. చివరికి ఇప్పుడు నన్నో గారడీవాడిగా కూడా చిత్రీకరించావు. నామీద నీకున్న అపోహలు పోవటానికి, మొత్తం ప్రపంచానికే నా ప్రేమశక్తిని నిరూపించదల్చుకున్నాను. శలవు" అతడు వెళ్ళిపోయినట్టు చీకట్లో అడుగుల చప్పుడు దూరమైంది.

                                          *    *    *

    ఆమె అలాగే ఆ గదిలో నిలబడిపోయింది.

    ఆమెకేం చెయ్యాలో తోచలేదు.

    చుట్టూ వున్న చీకటి ఆమెని పరిహసిస్తున్నట్టు అనిపించింది. ఆమె అలా ఎంతసేపు వుందో తెలీదు. చప్పున స్పృహలోకి వచ్చినట్టు ఆమె బయటికి పరుగెత్తుకు వచ్చింది.

    బయట రోడ్డుమీద వీధిదీపాలు లేవు. అంతా గాఢాంధకారం. ఇళ్ళలో కూడా లైట్లు వెలగటంలేదు. అంతా నిర్మానుష్యంగా వుంది. అంతా నిశ్శబ్దమే.

    ఆమె వెన్ను చలితో ఒక్కసారి జలదరించింది. భయం వళ్ళంతా పాకింది.

    ఆమె బయటికి రావటం చూసి "ఏమ్మా, క్రొవ్వొత్తి కావాలా?" అని అడిగాడు- ఎప్పుడూ ఆమె గదిమీద దృష్టి వుంచే ఇంటిగలాయన. "అక్కర్లేదు" అనేసి లోపలికి వచ్చింది.

    చాలాసేపు అలానే కుర్చీలో కూర్చుండిపోయింది.

    ఆమె మనసంతా ఏదో ఉద్వేగం. నమ్మశక్యం కాని ఈ నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలో తెలియటం లేదామెకి. మొత్తం ప్రపంచమంతా కరెంట్ పోయిందా? లేక ఈ వీధిలోనే పోయిందా? ఇది యాదృచ్చికమా లేక అతడే దానికి కారణమా? కేవలం తనకే కరెంట్ పోయినట్టు ఈ కనికట్టు ప్రభావంవల్ల అనిపిస్తూందా?

    లేదనటానికి ఉదాహరణ ఇంటిగలాయనే. ఆయన ఇంట్లో కూడా కరెంట్ పోయింది.

    ఆమె రేడియో పెట్టటానికి ప్రయత్నించింది. అందులోంచి ఏ శబ్దమూ రాలేదు. పోలీసులకి ఈ విషయం చెపుదామనుకుంది. ఒకవేళ తన మాటలు అబద్దమవుతే నవ్వుతారు.

    మరో పది నిముషాలు అలాగే ఆలోచనలతో గడిపింది. మరిక టెన్షన్ భరించలేకపోయింది. గదికి తాళం వేసి ధర్మారావు ఇంటికి వచ్చింది. ఆయన లేరు. కొడుకులూ, కూతురూ వున్నారు.

    అక్కడ కూడా కరెంట్ లేదు.

    "ఎంతసేపయింది కరెంట్ పోయి" అని అడిగింది.

    "అరగంటయింది" రెండో క్రొవ్వొత్తి వెలిగిస్తూ చెప్పింది ఆయన భార్య.

    ఆమె విషయాన్ని చెప్పాలా వద్దా అన్నట్టు చాలాసేపు మధనపడింది. చీకట్లో ఆ ఇంటి నిశ్శబ్దం - భవిష్యత్ ప్రపంచపు శూన్యతకి ప్రతీకగా ఆమెని భయపెడుతూంది.

    గదిలో ఎవరూ లేరు. పక్కనే ఫోన్ కనపడింది. ఆమె కాస్త తటపటాయించి దాన్ని అందుకుని హైదరాబాద్ డయల్ చేసింది. చేతికి వచ్చిన నెంబర్లు ...0...8...4...2...5...5...0...0...3...1...2...

    "మెడికల్ కాలేజి హాస్టల్...." అట్నుంచి అమ్మాయి స్వరం వినిపించింది.

    "అక్కడ కరెంటు పోయిందా?"

    "వ్వాట్-?"

    "మీ హాస్టల్ కరెంట్ వుందా?"

    "లేదు, మీరెవరు?"

    ఆమె సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది. ఆమె నుదుట చెమట పట్టింది. గాలి స్థంభించినట్టుంది. అనుదీప్ మాటలు నిజంగా నిజమవుతే ఇక ప్రపంచంలో ఫానులు తిరగవు.

    లోపల్నుంచి ధర్మారావు కూతురు విసుక్కోవటం వినిపిస్తుంది. "రేపు ప్రొద్దున్నే పెరేడ్ వుంది. డ్రెస్ ఇస్త్రీకి కరెంటు ఎప్పుడొస్తుందో ఏమో-" అంటూ వుంది.

    "మైగాడ్ పదిన్నరకి టి.వి.లో టెన్నిస్ వుందే" కొడుకు అంటున్నాడు.

    విద్యాధరికి అనుదీప్ మాటలు- మొహం గుర్తొస్తున్నాయి.

    "నిజంగా జరిగిందా ఇది?"

    ఆమెకు నమ్మశక్యం కావటంలేదు.

    అంతలో ధర్మారావు వచ్చాడు. ఆయన మొహంలో విద్యాధరిని చూడగానే సంతోషం కనిపించింది. "నీ కోసమే కబురు చేద్దామనుకుంటున్నాను అమ్మాయ్. రేపు నేను హైద్రాబాద్ వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆ గది ఖాళీ చేసి వచ్చి మా ఇంట్లోనే వుండు".

    ఆ ఆహ్వానానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా - "అంకుల్. మీతో ఒక విషయం చెప్పాలి" అంది.

    "ఏమిటి?"   

    ఆమె తనకీ - అనుదీప్ కీ మధ్య జరిగిన సంభాషణం చెప్పింది. చెప్తున్నంతసేపూ ఆయన మొహంలో భావాలు మారసాగాయి. అంతా విని "ఇంపాజిబుల్" అన్నాడు.

    ఆమె సమాధానం చెప్పలేదు.

    ఆయన ఫోన్ దగ్గరికి తీసుకుని ఫోన్ చెయ్యటం ప్రారంభించాడు. ముందు ఢిల్లీ....ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కి వాలేడు. విద్యాధరి ఆయనవైపే ఆతృతగా చూస్తుంది. ఆయన కళ్ళుమూసుకుని మాట్లాడకుండా రెండు నిముషాలు వున్నాడు. తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్టు ముందుకు వంగి హైద్రాబాద్ ద్వారా వరుసగా ఫోనులు చేశాడు లండన్. ఫారిన్-టోక్యో - కోలాలంపూర్ - అరగంట తరువాత ఆయన బలంగా విశ్వసిస్తూ... "మొత్తం ప్రపంచమంతా కరెంట్ లేదు" అన్నాడు ప్రకటిస్తున్నట్టు.

    అందరూ మొహామొహాలు చూసుకున్నారు. పెద్దకొడుకు లేచి "ఇంపాజిబుల్" అన్నాడు. ఆయన ఆ మాటలు విన్నట్టులేదు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయటకు నడిచాడు.

                                                              *    *    *

    ఇది జరిగిన పదిహేను రోజులకి రష్యా, అమెరికా ప్రధానపాత్రలుగా మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది.

    అసలు ప్రారంభమే ఒక విస్ఫోటనంలా ప్రజ్వరిల్లింది.

    ఎలక్ట్రాసిటీ పోవటమనేదే తెలియని అమెరికా లాంటిదేశంలో ఈ 'కరెంట్ బ్లాక్ అవుట్' సంచలనాన్ని సృష్టించింది. బీద దేశాలయిన ఆప్రో- ఆసియన్ దేశాల్లో పెద్దగా ప్రభావం లేదు. మొదటిరోజు క్రొవొత్తుల ధర, రెండోరోజు కిరోసిన్ బ్లాక్ మార్కెట్ ధర పెరగటం మాత్రం జరిగింది.

    పేపర్ రాలేదు. ప్రింటింగ్ మిషన్లు పనిచేయక పోవటం వల్ల జరిగిన ప్రభావం ఇది. టి.వి., రేడియోల్లో వార్తలు కూడా చాలా మంది వినలేదు. కేవలం బ్యాటరీ రేడియోలున్నవారు మాత్రమే, మొత్తం ప్రపంచమంతా కరెంట్ లేదన్న విషయం తెలుసుకున్నారు. వారినుంచి ఈ వార్త మిగతావారికి పాకటానికి రెండ్రోజులు పట్టింది.

    ఈ లోపులో పెట్రోలుని భూమినుంచి కాకుండా డైరెక్టుగా పైనుంచే వాహనాల్లోకి సరఫరా చేసే ఏర్పాట్లు చేయబడ్డాయి. కానీ ఆ పద్ధతి కేవలం వారంరోజులపాటే సజావుగా సాగింది. బొంబాయి నుంచిగానీ, దిగుమతుల వల్లగానీ లభించే పెట్రోలు సరఫరా, ఈ కరెంట్ ఇబ్బందివల్ల - పూర్తిగా ఆగిపోయింది.

 Previous Page Next Page