"నేను మగ పెళ్ళివారి మనిషిని కాదు. రాజ్ పంపించాడు.ఏం చెయ్యాలో ఈ లెటర్లో వుంది... చాటుగా చదివి..." దాసీది రావటంచూసి లెటర్ ని వందనాదేవి కాలికింద తోసింది.
"మరో ఏడాది పడుతుందేమో మేము ఫారెన్ నుంచి రావటానికి" అంటూ మాట మార్చింది ఆమె.
రాజ్ పంపించాడు. వందనాదేవి చెవిలో అమృతం కురిసిందా మాట. తన కబురు అతనికందింది. తన రాజూ ఎంత తెలివికలవాడు!
"ఇదిగోనమ్మా కూల్ డ్రింక్" అన్న దాసీ మాటలకి అడ్డువచ్చింది. కాఫీ కప్పుతో వచ్చిన మరో దాసీ. "వారు కాఫీ తాగుతానన్నారు తెచ్చాను" అంటూ కాఫీ కప్పు అందించింది.
"మాత్ర వేసుకునే టైము అయింది. అరగంటకో మాత్ర పడకపోతే ఈ పాడుదేహం మాట వినదమ్మా! తుమ్మితే ఊడిపోయే ముక్కనుకో నా ఆరోగ్యం"
అంటూ ఆమె చిన్న పర్స్ తీసింది. ఏదో మాత్ర వేసుకుని కాఫీ తాగింది. "నా మతి మండిపోనూ, నిన్న వ్రతం చేయించాను. చిన్నస్వామి ప్రసాదం ఇది. చెయ్యి పట్టు" అని పంచదార లాంటి ప్రసాదం నందనాదేవి చేతిలో అరస్పూన్ వేసింది. తినొద్దు అన్నట్లు కళ్ళతో సౌంజ్ఞ చేసింది. అదే చేత్తో దాసీలిద్దరికీ ప్రసాదం పెట్టింది.
"ఇప్పటికే ఆలస్యం అయింది. ఇంక వెళ్ళివస్తాన"ని ఆమె లేచింది. కింద అందరినీ పలకరించి వెళతానని చెప్పి గదిలోంచి బయటపడింది.
దాసీలు మళ్ళీ వెళ్ళి గుమ్మంలో కూర్చున్నారు.
నందితాదేవి మంచంమీద అటు తిరిగి పడుకుని నెమ్మదిగా ఆ చిన్న లెటర్ ని విప్పింది. ఎవరయినా గదిలోకి వస్తే దిండు కిందకి లెటర్ తోయటానికి వీలుగా దిండు అడ్డం పెట్టుకుని చదవటం ప్రారంభించింది. లెటర్ పెన్సిల్ ముక్కతో గెలికినట్లు వుంది.
రాణీ!
సమయం లేడు. ఈ చిన్న లెటర్ ద్వారానే అంతా అర్ధం చేసుకో. నీకు ప్రెజెంటేషన్ రూపంతో పెట్టెలో బురఖా వుంది. అది వేసుకొని బయటకు వచ్చెయ్. వీధి మూల మలుపులో అటో వుంటుంది. అది నడిపేది నా ప్రియమిత్రుడు ముస్లిం సోదరుడు. మరో ఆటోలో ఎక్కకుండా గుర్తు- "భాయ్! అటో పాతదిలాగుంది" అను. "బహెన్ అవసరానికి ఆఘమేఘాలమీద పరిగెత్తుతుంది" అంటాడు. వెంటనే ఆటో ఎక్కెయ్యి. పూలబజారులో ఆటో ఆగుతుంది. పచ్చరంగు చిన్నకారు పక్కనే. ఇది దిగి అది ఎక్కు! కారు నడిపే భాయ్ నా దగ్గరకు చేరుస్తాడు. గమ్యం చేరుకున్నదాకా మనం మాట్లాడుకోకపోవడం మంచిది. అవసరమైతే కాస్త కంఠం మార్చి మాట్లాడు. ఇది నీకూ నాకూ జీవన్మరణ సమస్య. జాగ్రత్తగా మెలుగు. నేనొస్తే గల్లంతు అవుతుందని నా ప్రాణమిత్రుల సాయం తీసుకున్నాను. మీ వాళ్ళు పెట్టిన పెళ్ళి ముహూర్తం సమయంకి మనం రైల్లో ప్రయాణం చేస్తూ చాలా దూరం... చాలా దూరం వెళ్ళిపోతాం. ఇంక నీదే ఆలస్యం. నీకోసం చూస్తూ...
నీ
రాజ్
నందితాదేవి లెటర్ చదవటం పూర్తి చేసింది.
"ఓహ్ రాజ్! నన్ను రక్షించటానికి వచ్చావా? పృధ్వీరాజ్ పేరు నిలబెట్టుకున్నావ్!" అనుకొని మృదువుగా లెటర్ ని ముద్దుపెట్టుకుంది. మడిచి జాకెట్ లో దోపుకుని మంచంమీంచి లేచింది. దాసీలు ఏం చేస్తున్నారో అని గుమ్మం దగ్గరకొచ్చింది.
దాసీలిద్దరి కళ్ళూ అరమూతలు పడుతున్నాయి. ఊరికే ఆవులిస్తూ తల విదిలిస్తున్నారు మాటిమాటికి.