Read more!
 Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 2

    పెదనాన్నగారికి గార్డినల్ అలవాటు, ప్రతి రాత్రీ కంపల్సరీగా ఒకమాత్ర వేసుకోవాల్సిందే. వెయ్యి మాత్రల స్టాకు అద్దాల అలమరలో భద్రంగా వుంది. తను చావకుండా వుండటానికి లక్ష జాగ్రత్తలు తీసుకున్న పెదనాన్నగారికి తెలియదు, చవదల్చుకుంటే అనంతకోటి వుపాయాలుంటాయని.

    పట్టుచీర గరగరలతో గోవర్ధనమ్మ గదిలో అడుగుపెట్టింది.

    నందితాదేవి మంచంమీదనుంచి లేచి కూర్చుంది.

    "నందితా! పూలజడ కుట్టడానికి తొమ్మిదింటికి సరిత మనుషులని తీసుకువస్తానంది. జడ కుట్టింతర్వాత పడుకుంటే పూలు నలుగుతాయి. ఇప్పుడే కాసేపు విశ్రాంతి తీసుకో. అన్నట్లు ఈ రాత్రి భోంచేయకూడదు. ఎనిమిదిన్నరకి నేనే ఫలహారం తెస్తాను. తిందువుగాని" గోవర్ధనమ్మ పరీక్షగా నందితని చూస్తూ అన్నది.

    "అలాగే పెద్దమ్మా" ముక్తసరిగా అంది నందితాదేవి.

    గోవర్ధనమ్మ ఎంత హడావిడిగా వచ్చిందో అంత హడావిడిగానూ గది వదిలి వెళ్ళింది.

    ఏదో వంకన ఎవరో ఒకరు గదిలోకి రావటం పలకరించి వెళ్లటం, ఇదో తంతుగా తనని కనిపెట్టి వుండటం. ఎనిమిదిన్నరకి ఫలహారం. ఈలోపల ఎనిమిదింటికే విష ఫలహారం తను చేయబోతున్నదే. రాజ్ తప్ప ఆ మృత్యు దేవతకూడా తన్ని చావునుంచి రక్షించలేదు. రాజ్ కి వార్త అందిందా?

    ఎనిమిది వరకూ చూస్తుంది. ఎనిమిది కొట్టగానే బాత్ రూమ్ లో దూరి గ్లాసెడు నీళ్ళలో వంద మాత్రలపొడి కలిపి తాగేస్తుంది. బస్ - ఈ లోకం నుంచి దూరంగా, బహుదూరంగా...

    "వేడిగా ఏమన్నా తాగుతావా వందనా" ఇందిరాదేవి గదిలోకి వచ్చి అడిగింది.

    "ఉదయం తిన్న భోజనమే అరగలేదు. ఇప్పుడెం వద్దు అత్తయ్యా" అంటూ అటు తిరిగి పడుకుంది నందితాదేవి.

    "సరేలే కాస్త రెస్టు తీసుకో. గంధం గిన్నె కనబడలేదు. ఈ గదిలో వుందేమో అని వచ్చాను" అంటూ ఇందిరా దేవి వెళ్లిపోయింది.
    "గంధం గిన్నెట గంధం గిన్నె, ఎన్ని అబద్ధాలో గిన్నె కోసం అయితే గదిలో వెతకలేదేం? ఎలా వచ్చింది అలా వెళ్ళింది. అయిదు నిమిషాల కొకరు వచ్చి వెళుతున్నారు ఏం మనుషులు.

    గడియారం ఏడుగంటలు కొట్టింది.

    నందితాదేవి వులిక్కిపడింది. "ఇంకా గంట మాత్రమే టైమువుంది" అనుకుంటూ జాకెట్లో వున్న పొట్లాన్ని తడుముకుంది.
    ఖరీదయిన బనారస్ చీర, వళ్ళంతా రాళ్ళ నగలతో మెరిసిపోతూ వకామె వచ్చింది. "పెళ్ళికూతురు ఈ గదిలోనేనా వుంది?" గుమ్మం దగ్గరున్న దాసీలను అడిగింది,

    "అవునమ్మా! మీరు..?" ఆగిపోయారు దాసీలు.

    "పెళ్ళికొడుకు మేనత్తని. పెళ్ళికి మేముండటం లేడు. వారు అవతల ఫారిన్ ప్రయాణం పెట్టుకున్నారు. మరో గంటకి బయలుదేరి వెళ్ళాలి. అమ్మాయిని చూసి ప్రెజెంటేషన్ నా చేతులమీదుగానే ఇచ్చి..." అంటూ ఆమె గదిలో ప్రవేశించింది.

    "పెళ్ళికొడుకు మేనత్త- పైగా మగ పెళ్ళివారి తరపు మనిషి. ఎంత పెద్ద ప్రెసెంటేషనో ఏమో అందంగా ప్యాక్ చేసిన పెద్ద పెట్టె తెచ్చింది" అనుకున్నారు దాసీలు. వినయంగా ఆమె వెనుకనే గదిలోకి వచ్చారు.

    నందితాదేవి లోపల విసుక్కుని అయిష్టంగానే లేచి మంచంమీద కూర్చుంది.

    ఆమె వచ్చి నందితాదేవిని పక్కనే కూర్చుంది. తనని పరిచయం చేసుకుంది. బంగారుతల్లిలా వున్నావ్ అంటూ బుగ్గలు నొక్కింది. ఆప్యాయంగా వళ్ళంతా నిమిరింది. ప్రెజెంటేషన్ చేతిలో పెట్టింది.

    వచ్చింది మగపెళ్ళివారి మనిషి. కూల్ డ్రింక్ తెస్తానని ఒక దాసీ కిందకి వెళ్ళింది.

    "కూల్ డ్రింక్ నాకు పడదు. వేడిగా కాఫీ తీసుకురా" అజ్ఞాపిస్తున్నట్లే అంది ఆమె.

 Previous Page Next Page