"మిమ్మల్నే అడిగింది. సంబడం"...అంది వెంకుమాంబ. ఆమె తరచూ ఊతపదాలు రకరకాలవి మాటల్లో ఉపయోగిస్తుంది. సంబడం, అయ్యోరాత, బాగుంది వరస లాంటి మాటలు అవి. సందులో సందు సామెతలు కూడా.
"సరి సరి అడిగింది నన్నా! చూడు నాయనా! నిక్షేపంగా అక్కడా కూర్చోవచ్చు. కూర్చునే ముందు దుమ్ము దులిపి కూర్చున్నావనుకో. ఎస్. ఆర్. కి న్యాయం చేసినవాడివి అవుతావు" అన్నాడు కోదండరామయ్య.
అతను కూర్చుంటూ అడిగాడు ఎస్. ఆర్. అంటే?"
"దుమ్ము, ధూళి అని మాత్రం కాదు. ఎస్. ఆర్ అంటే సదరన్ రైల్వే అని_"
అతను నవ్వాడు. "భలే తమాషాగా చెప్పారు మాష్టారూ!" అన్నాడు కర్చీఫ్ జేబులో పెట్టుకుంటూ. ఆ తర్వాత పేరు అడిగాడు.
"కోదండరామయ్య నీపేరేమిటి బాబూ?" తన పేరు చెప్పి పేరు అడిగాడు కోదండరామయ్య.
"ఏకపాదం" అతను తన పేరు చెప్పాడు.
"ఏసుపాదమా?" తను వినటం పొరపాటేమో అనుకుని తిరిగి అడిగాడు కోదండరామయ్య.
"ఏసుపాదం కాదండి. ఏ....క....పా....ద.....o....."
"ఏకపాదం?"
"ఎస్."
"ఈ పేరు నేను ఎక్కడా వినలేదు."
"అవునండి. ఎవరికీ, ఎక్కడా వున్నట్లు నేను వినలేదు. అప్పుడప్పుడు నా పేరుని తలుచుకుని నేనె ఆశ్చర్యపడుతుంటాను" అతను వినయంగా చెప్పాడు.
"కొన్ని పేర్లు, కొన్ని పరిస్థితులలో పెట్టుకోవాల్సి వస్తుంది. మా రాజన్నయ్య కొడుకు పేరు కాంతారావు. నాకీ పేరు ఎందుకు పెట్టారు, అందరూ నవ్వుతున్నారని వాడు ఒకటే గోల. విషయమేమిటంటే మా తాతగారు మనవడు పుడితే తన పేరు పెట్టాల్సిందని మరీ మరీ చెప్పి స్వర్గాస్తులయ్యారు మనవడు పుట్టాడు. శాస్త్రిగారు వాడి జాతకచక్రం వేసి ఈ పిల్లవాడిజాతకం ప్రకారం అయిదక్షరాల పేరు పెడితే అరిష్టం. నాలుగక్షరాల పేరు పెట్టండి అన్నాడు. ఇటు శాస్త్రిగారి మాటా మాకు ముఖ్యమే. తాతగారికిచ్చిన మాటా ముఖ్యమే. కొందరు సున్నా అక్షరం ఎలా అవుతుంది అన్నారు. సున్నా అక్షరం కాకపోయినా అక్షరం పక్కన పెడితే అదో కొత్త అక్షరం అవుతుంది కదా, కనుక సున్నా కూడా అక్షరమే అన్నారు మరికొందరు. చివరికి బారసాల నాడు కాంతారావు పేరులోంచి సున్నా తొలగించి కాతారావు అని పెట్టారు. విచిత్రమైన పేర్లువుండొచ్చు అందులో వింతఏముంది" అంతవరకూ మాట్లాడకుండా వున్న వెంకుమాంబ పేరు గురించి మినీకథ వినిపించింది.
"అయిందా!" అన్నాడు కోదండరామయ్య.
"అయింది!" అంది వెంకుమాంబ ముఖం చిట్లిస్తూ.
అయిందని ఆమె చెప్పడం. అయిందా అని ఆయన అడగడం దాని అర్ధం ఏకపాదానికి అర్ధం కాలేదు అయినా అతగాడు అట్లాంటిదేమీ పట్టించుకోక "నా పేరుకీ ఓ పెద్దకధ వుంది మాష్టారూ!" అన్నాడు.
"వుందా?" అన్నాడు కోదండరామయ్య.
"వుందనేగా అతను చెప్పేది" అంది వెంకుమాంబ.
ఏకపాదం కథ మొదలుపెట్టాడు.
"మా అమ్మ కాపురానికి వచ్చిం తరువాత పదేళ్ళదాకా పిల్లలు పుట్టలేదు. మా నాన్నగారు సంతానం కోసం మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు....."
"మీ అమ్మ ఒప్పుకుందా ఆ పెళ్ళికి?" ఆత్రుతగా అడిగింది వెంకుమాంబ. కథకి యర్నింగ్ పాయింట్ ఏదో మిస్ అయినట్లు ముఖం పెట్టి.
"ఆ విషయం నాకు తెలియదండి, మా నాన్నగారు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ సంతానవతి కాకుండానే ఏడాది లోపల మరణించింది. అప్పటినుంచీ మాఅమ్మకి పిల్లలు పుట్టటం మొదలు పెట్టారు. వరసగా ఆరుసార్లు ఎబార్షన్లు, తొమ్మిదిసార్లు పిల్లలు పుట్టి పురిట్లోనే మరణించడం జరిగింది. చివరికి ఒక సాధూ మహరాజ్ దయవల్ల నేను పుట్టి బతికానుట. మా అమ్మ నలభై ఒక్క రోజులు సాధూ మహరాజ్ ని ఏక దీక్షతో రాత్రింబవళ్ళు సేవించిందట. ఆ సేవ ఫలితమే నా జన్మ. నాకు పేరు పెట్టిందికూడా సాధూ మహరాజేనట. అంతే నా తర్వాత మా అమ్మకి పిల్లలు పుట్టలేదు" అంటూ ఏకపాదం తన కథ వినిపించాడు.