Read more!
 Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 2


    అసలు అతను సైకిలు   త్రొక్కే పద్ధతి ,హైస్కూల్ కుర్రాడిలా పెడల్సు రయ్యి రయ్యిమని ఊపేస్తూ, వేగంగా పోయే అతని వాలకమూ చెడ్డచికాకుగా వుండేవి నాకు. ఒకసారి చీకట్లో ఆర్ట్సు కాలేజిప్రక్క నుండి నడిచివస్తున్నాను. నా వెనక  నుంచి వచ్చి, నన్ను దాటుకుంటూ  సైకిలు మీద స్పీడుగా వెళ్ళిపోతూన్న డాక్టర్ రామదాసు కనిపించాడు. ఇంతలో ఎదురుగా ఓ పోలీసు కానిస్టేబుల్ వస్తున్నాడు. డాక్టర్ రామదాసు సైకిల్ కు లైటులేదు. పోలీసును చూడగానే గబుక్కున సైకిలు దిగిపోయి ఏమీ తెలియని నంగనాచిలా  అటూ ఇటూ చూస్తూ అడుగులు వేసి, కానిస్టేబుల్ దాటిపోగానే మళ్ళీ ఒక్క ఉదుటున సైకిలెక్కి  రయ్యిమని  సాగిపోయాడు. సామాన్య పోలీసు కానిస్టేబుల్  ముందు  ఎం.డి. డాక్టరుగారు! ఈ సంఘటన చూసి నవ్వాపుకోలేకపోయాను.
   
    ఇంకా అయిదారుగురు  పేషెంట్లు వుండగా  "ఇంక  మేము వార్డుకి వెడతాముగానీ  మీరు పని పూర్తిచేసుకుని  వచ్చేయండి" అని వారిద్దరూ  లేచి చక్కా వెళ్ళిపోయారు.

    తర్వాత మరో యిద్దరు పేషెంట్లను  పంపించేశాను. ఇంతలో  "నమస్కారం డాక్టర్" అంది ఓ మధురమైన గొంతు, వినయంగా.

    తల ఎత్తి  చూశాను. పద్దెనిమిదేళ్ళ అమ్మాయి! పసుపురంగు  చీరె ధరించి, కాటుక పెట్టుకున్న  సోగ కళ్ళతో, అందంగా, అమాయకంగా వుంది.
   
    ఓ.పి. చీటి అందిస్తూ అమాయకంగా  నవ్వింది.

    ఓ.పి. చీటిమీద నా కళ్ళకు కె. తేజోమయి  అని కనిపించింది. "ఏమిటమ్మా ?" అన్నాను అప్రయత్నంగా.

    "తరుచు అరిచేతుల్లో చెమటలు  పోస్తుంటాయండీ. ఎప్పుడూ తడిగానే వుంటాయండీ  చేతులు. తర్వాత  యిక్కడేదో  చిన్న  వాపులా లేచిందండీ" అంటూ, చేత్తో వక్షస్థలం దగ్గర చెయ్యిపెట్టి ఎడమవైపు చూపించింది.

    "సిస్టర్ ! వీర్ని లోపలకు  తీసుకు వెళ్ళండి. ఎగ్జామిన్  చెయ్యాలి" అన్నాను.

    నేను లేచి  లోపలకు  వెళ్ళేసరికి  సిస్టర్   ఆమెను    బల్లమీద పడుకో పెట్టింది.

    "ఎక్కడమ్మా  వాపు ?" అని అడిగాను.

    ఆమె పమిట ప్రక్కకు  తొలగించి, జాకెట్ గుండీ వూడదీసి లోపల చూపించింది. చిన్న వాపు వున్న మాట నిజమే. పరీక్షచేసి చూసిన మీదట దానికంత  ప్రాముఖ్య మివ్వదగిందిగా నాకు కనిపించలేదు. కాకతాళీయంగా ఆమె కంఠంవైపు నా దృష్టి మరలేసరికి, ఏదో అనుమానం తోచి కూర్చోబెట్టి మెడ దగ్గర పాల్పేటుచేసి  చూశాను. చేతికి గ్లాండ్స్ తగిలాయి. ట్యూబర్ క్యులర్ గ్లాండ్స్ కాదు గదా  అనుకుంటూ, దగ్గు వస్తుందా, జ్వరం వస్తుందా, వస్తే సాయంత్రం వేళల ఎక్కువవుతూ  వుంటుందా మొదలైన  ప్రశ్నలడిగి, దిగి  యివతలకు రమ్మని, ఓ.పి. చీటి మీద టి.సి, డి.సి, ఇ.ఎస్.ఆర్. మొదలైన రక్తపు  పరీక్షలు  చేయించుకుని, శుక్రవారంనాడు  మళ్ళీ రమ్మని చెప్పాను.

    "నమస్కారమండీ, సెలవు" అని  వినయంగా  చేతులు  జోడించి వెళ్ళిపోయింది.

    తర్వాత అయిదు నిమిషాల్లో  మిగతా  పేషెంట్లని పంపించేసి హడావుడి పడుతూ  లేచి నిల్చుని "వస్తాను సిస్టర్! పునర్దర్శనం  మళ్ళీ ఓ.పి. రోజునే _ అంటే శుక్రవారంనాడు" అని కదలబోయాను.

    సిస్టర్ మృదువుగా  నవ్వి, "అలాగా ? అంత తేలిగ్గా  తప్పించుకుందామనుకున్నారేం! మధ్యాహ్నం రిపీట్ ఓ.పి.కి రారేమిటి ? అంది. కళ్ళు గమ్మత్తుగా  ఎగరేసి.

    రిపీట్ ఓ.పి. వివరాలు  నిజంగా  నాకు తెలియవు. "అదేమిటి ? మధ్యాహ్నం వచ్చి ఏం చేయాలి ?"

    "పాత చీట్ల వాళ్ళందరూ  విరుచుకు పడతారు. స్లిప్స్ మీద సైన్ చేసి మందులు రిపీట్ చేసి పంపించాలి. మూడు గంటలనుంచీ  అయిదు గంటల వరకూ  వుంటుందా  భాగవతం.

    "సరే అయితే. తప్పేదేముంది ?" అని గుమ్మందాటి  బయటకు వచ్చి, హాలు కూడా దాటి వసారాలోకి వచ్చాను. 

    సిస్టర్  నా వెనకనే  నడిచి వచ్చింది. వొదిలిపెట్టకుండా. "అవును గాని, యీ వార్త విన్నారా ?" అనడిగింది, యధాలాపంగా అడిగినట్లు.

    "ఏమిటా వార్త ?"

    "తల త్రిప్పి బ్లాక్ బోర్డువంక  చూడండి ఒకసారి."

    తల త్రిప్పి చూసేసరికి  గోడకు తగిలించివున్న  బ్లాక్ బోర్డుమీద మెడికల్ అన్న హెడ్డింగ్ క్రింద  చాక్ పీస్ తో డి.ఏ.పి _డా: ఎస్. మధురరరావు అన్న అక్షరాలు  కనిపించాయి.

    నా గుండె గుభేలుమంది, "ఏమిటి ? యివాళ డ్యూటీ నాదా ? మొదటి రోజునే డ్యూటీ యేమిటి ? నాకేం తెలుస్తుంది ?" అన్నాను.

    "తెలియకపోయినా  చేయాల్సిందే. ఈ మొదటిరోజు అనేది ఎవరికో ఒకరికి తగలక తప్పదు కదా! మీరు అయినారు...."

    "నాకు యింటిమేట్  చేయకుండా  ఎలా వేశారు డ్యూటీ ?"

    "ఎందుకు  యింటిమేట్ చేయరు ? కాకపోతే అధికార వర్గాల పరాకువల్ల  కాస్త ఆలశ్యమై వుంటుంది. అదిగో కాయితం  పుచ్చుకుని బంట్రోతు వస్తున్నాడు చూడండి. బహుశా మీకోసమే అయివుంటుంది."

    ఆమె చెప్పింది నిజమే. ఆఫీస్ ఫ్యూన్  సిస్టర్  దగ్గరకు వెళ్ళి "వార్డుకి వెడితే  డ్యూటీ  హౌస్ సర్జన్ గారింకా  ఓ.పి. నుంచి రాలేదన్నారు డా: మధు...."

    అతని మాట పూర్తి కాకముందే  "అదిగో వారే డ్యూటీ  డాక్టరు గారు" అని నా వంక చూపించింది.

    అతను నా దగ్గరకు వచ్చి  కాగితం  అందించాక  చదువుకుని, నా పేరు ఎదురుగా సంతకం పెట్టి, సిస్టర్ కు మరోసారి  చెప్పి వార్డు వైపు దారి తీశాను.


                                *     *     *



    మా వార్డుకు నేను వెళ్ళేసరికి  సిస్టర్ తో ,స్తాఫ్స్ తో, ప్రక్క బెడ్ మీద వున్న పేషెంట్లతో వూసులాడుకుంటున్న  పేషెంట్లతో, బాధతో ఆర్తనాదాలు చేస్తూన్న  పేషెంట్లతో, సిస్టర్స్  రాకూడదని  హెచ్చరిస్తూన్నా, బ్రతిమాలో, బలవంతంగానో  లోపలకు  తోసుకువస్తూన్న బంధువులతో  హడావిడిగా వుంది వాతావరణం.

    నేను లోపలకు  వెళ్ళి ఒక్క నిముషం  ఏమి  చేయటానికి  తోచక తటపటాయిస్తూ  నిలబడ్డాను. ఒకరకం కొత్తదనం ,సంకోచం నన్నాక్రమించి  కాళ్ళ బంధాలు వేశాయి.

    అంతలో  నా దగ్గరకు ఓ సిస్టర్  చెమటలు  కారుతూన్న  ముఖంతో  గబగబా వచ్చి "ఈ వార్డు హౌస్ సర్జన్ మీరేనా ?" అంది.

    "అవు" నన్నాను.

    "ఇంతసేపటి కయిందా మీకు తీరిక ఓ.పి. నుండి ? సరే తవరగా రండి. అక్కడో పేషెంటు కండీషన్ బాగా లేదు" అంటూ చక చక నడవసాగింది.

    "కండిషన్ బాగులేదు." ఈ మాటల్ని  మననం  చేసుకుంటూ, అదురుతూన్న గుండెతో  ఆమెను వెన్నంటాను.

    సిస్టర్  నన్ను ఒక బెడ్ దగ్గరకు  తీసుకు వెళ్ళి, "ఇదిగో చూచి త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఇప్పుడే వస్తాను" అని వెళ్ళిపోయింది.
   
    ఆ బెడ్ మీద పడుకుని  వున్న  పేషెంటు  ఓ యిరవై యిరవై రెండేళ్ళ స్త్రీ బక్క చిక్కి శల్యావశిష్టంగా వుంది. స్పృహలో వున్నట్లు లేదు. కళ్ళు మూతలు పడి వుండగా  వక్షస్థలం  ఆయాసంతో ఎగిరెగిరి పడుతోంది. స్టెతస్కోప్ తగిలించుకుని దయాఫ్రం ఆమె గుండెపై పెట్టానో లేదో, బూజ్_బూజ్ మన్న మర్మర్  చెవుల్ని  అదరగొట్టింది. అసలు బీట్స్ వినపడటం లేదు. లబ్.డబ్ అనే శబ్దాలు  రెండింటినీ  బూజ్ మంటూన్న మర్మరే  ఆక్రమించివేసింది. మైట్రల్ స్టినోసిస్ విత్  రిగర్జిటేషన్  అనుకున్నాను.

    చేతికి నాలుగు వ్రేళ్ళ  లివర్ తగిలింది. కంఠంమీద రక్తనాళాలు ఉబ్బి వున్నాయి .హార్ట్ ఫెయిల్యూర్  కేసు.

    ఈ లోపల సిస్టర్ వచ్చింది.

    "ఆక్సిజన్  పెట్టండి .గ్లూకోజ్ డ్రిప్ స్టార్ట్ చెయ్యాలి. అందులో ఒక యాంప్యూల్  డిగాక్సిన్  కూడా కలపండి. ఈ లోపల కోరమిన్ యింజక్షన్  తీసుకురండి. నేను ఆక్సిజన్ పెట్టి, యీలోగా  సెలైన్ సెట్ రెడీ వేస్తాను" అంది.

    ఇంజక్షన్ తీసుకురమ్మని అడిగే  హక్కు మాకు లేదుకాబోలు  అనుకుంటూ డ్రగ్స్ ఉంటే రూమ్ కేసి నడిచాను.

    అక్కడ టేబిల్ ముందు  కూర్చుని  ఫైల్స్  చూసుకుంటూన్న  స్టాఫ్ "ఏం కావాలి డాక్టర్ ?" అనడిగింది, మర్యాదగానే.

    చెప్పాను.

    "మీరు యీ వార్డుకి  పోస్టు అయిన హౌస్ సర్జనా ?"

    అవునన్నాను.

    టేబిల్  సొరుగులోంచి  తాళం చెవులు తీసి  యిచ్చి  "అదిగో ఆ బీరువాలో ఎమర్జన్సీ  అని రాసివున్న  ట్రేలో వుంటుంది, తీసుకోండి. తర్వాత మీ ప్రిస్కిప్షన్ బుక్ లో నోట్ చెయ్యండి" అంది.

    నేను బీరువా  తెరచి, స్టెరిలైజర్ లోంచి  సిరంజి తీసుకుని  లోడ్ చేసి అక్కడెక్కడా స్పిరిట్  కనపడక  "స్టాఫ్, స్పిరిట్  ఎక్కడ  వుందో చెబుతారా ?" అనడిగాను.

    "స్పిరిటా ?" అని స్టాఫ్ నవ్వి, "కాటన్ స్టెరిలైజర్ లోని  హాట్ వాటర్ లో ముంచి అదే స్వాబ్ క్రింద వాడండి" అంది.

    "అదేమిటి ?స్పిరిట్ వుండదా ?" అని ఆశ్చర్యంగా అడిగాను.

    "ఎందుకుండదు ? కాని యిన్నివందలమందికి  యింజక్షన్  వాడటానికి  మాత్రం వుండదు. కొన్ని కొన్ని ముఖ్యమైన వాటికే  స్పిరిట్ వాడతాం. ముందు ముందు అన్నీ మీకే తెలుస్తాయి లెండి. ఒకటి రెండు రోజులంతా కొత్తగా వుంటుంది, తర్వాత మీరే  మాకు నేర్పుతారు" అంది స్టాఫ్ మళ్ళీ నవ్వుతూ.

    నేనూ నవ్వి సిరంజి తీసుకుని  రూమ్ బయటకు వచ్చి నా పేషెంటు దగ్గరకు నడిచాను.

 Previous Page Next Page