Read more!
 Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 2


    ఒక రాత్రివేళ మెలకువవచ్చిన మాధవికి కల్యాణి కళ్ళు తెరుచుకుని పై కప్పుకేసి చూస్తూ వుండటం కనిపించింది.

 

    కొంచెం ప్రక్కకి జరిగి భుజంమీద చెయ్యి వేసింది.

 

    కల్యాణి ఉలిక్కిపడి తల త్రిప్పి చూసింది.

 

    "భయంగా వుందా?" జాలిగా అడిగింది.

 

    కల్యాణి బలవంతాన నవ్వు తెచ్చుకుని నెమ్మదిగా తల ఊపింది. ఇద్దరికీ ఒకటే వయసుంటుంది. అయినా మాధవి కొంచెం ఎత్తుకు ఎదిగి ఆమెను ఓదార్చింది.


                                                          * * *


    మధ్యలోవున్న గార్డెన్ లాంటి ప్రదేశాన్నిదాటి కొంచెం ముందుకు వెళ్ళేసరికి కొన్ని విపరీత దృశ్యాలు కనిపించాయి.

 

    కొంతమంది సీనియర్స్ అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన మొగపిల్లలైన జూనియర్స్ ని ఓ గుంపుగా నిలబెట్టారు. ఇంతలో ఓ సీనియర్ వచ్చి జూనియర్స్ అందరి బట్టలమీదా ఇంతరంగు జల్లాడు.

 

    జూనియర్సందర్నీ మోకాళ్ళమీద కూర్చోమని ఒక సీనియర్ ఆదేశించాడు. అందరూ అలా చేశారు.

 

    అందర్నీ మోకాళ్ళమీద ప్రాకమన్నాడు.

 

    అందరూ ప్రాకుతున్నారు.

 

    కొందరు సీనియర్స్ వాళ్ళ వెనక నిల్చుని చర్మాకోలుతో గుర్రాలను అదిలించినట్లు అదిలిస్తున్నారు.

 

    ఇంతలో ఒకతను పెద్ద సీసాతో ఆముదం తీసుకొచ్చాడు. అందర్నీ నోళ్ళు తెరవమని ఒక్కొక్కరి నోట్లో కాస్తకాస్త చొప్పున పోయసాగాడు. ఎవరూ ఎదురు చెప్పటంలేదు. ఆముదం నోట్లో పడగానే గుటుక్కుమని తాగేస్తున్నారు.

 

    కాసేపు ఆ వినోదం అయినాక సీనియర్సందరూ జట్లు జట్లుగా క్రింద కూర్చుని ఒక్కొక్క జూనియర్ నీ దగ్గరకు పిలవసాగారు. అలా వచ్చిన జూనియర్ జట్టులోని ఒకడు తమపేర్లు చెబుతాడు. ఆ పేర్లన్నీ తడుముకోకుండా వరుసగా క్లాక్ వైజ్ లో చెప్పాలి. మళ్ళీ వెంటనే యాంటీ క్లాక్ వైజ్ లో చెప్పాలి. తప్పు దొర్లిదంటే పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ రకరకాలుగా వుంటుంది. ఒక్కొక్కరు గుంజీలు తియ్యాలి. ఒక్కొక్కరు ఆయాసంవచ్చినా ఆపకుండా పరిగెత్తాలి. ఒకరేమో కాళ్ళుపట్టుకుని దణ్ణాలు పెట్టాలి. ఇంకొకరు కందిపోయేలా చెంపలు వేసుకోవాలి.

 

    అంతలో సీనియర్స్ దృష్టి గేటుదాటి అప్పుడే లోపలకు వస్తోన్న ఓ కుర్రాడిమీద పడింది.

 

    సీనియర్స్ లో ఒకతడు మరీ చలాకీగా, దుడుకుగా ఉన్నాడు. మిలమిల మెరిసే అతని కళ్ళలో చురుకుతనం, తెలివి తెచ్చిపెట్టుకున్న కఠినత్వం కాంతులీనుతున్నాయి. "ఇదిగో ఇలారా" అని పిలిచాడు లోపలకు వస్తోన్న కుర్రాడిని. అతను దగ్గరకు వచ్చాడు.

 

    "ఎవరు నువ్వు?"

 

    ఆ కుర్రాడు మొదట బెదిరినా, తర్వాత సర్దుకుని "మీలా స్టూడెంటునే" అన్నాడు.

 

    "మాలాగా? ఛీ ఛీ మాతో పోల్చుకుంటావేమిటి? నీ పేరు?"

 

    "సుబ్బారావు."

 

    "మొదటి రోజునే కాలేజీకి ఆలస్యంగా వస్తున్నావు. నీకేం బుద్ధిలేనట్లుందే?"

 

    ఆ కుర్రాడి ముఖం ఎర్రబడింది. బహుశ చాలా సంపన్న కుటుంబంలో నుండి వచ్చి వుంటాడు. కోపం ఆపుకోలేకపోయాడు. "బుద్ధిగిద్దీ అంటున్నారు. మర్యాదగా మాట్లాడలేరా?" అన్నాడు.

 

    ఇందాకటి సీనియర్ తన స్నేహితులవంక తిరిగాడు. "వీడు మనకి మర్యాద నేర్పుతున్నాడురోయ్ ఒకసారి అదెలా వుంటుందో చూపించండి."

 

    సీనియర్స్ లేచారు. ఒకతను సుబ్బారావు దగ్గరకు వెళ్ళి భుజంమీద చేయివేసి "బయటకురా" అన్నాడు.

 

    "నేను రాను" అన్నాడు సుబ్బారావు మొండిగా.

 

    అతని నోట్లోంచి మాట పూర్తిగా వచ్చేలోపలే పదిమంది కలిసి, అతన్ని బయటకు ఈడ్చుకుపోయారు. చూస్తూ వుండగానే అతని చొక్కా వొంటిమీద నుంచి మాయమైపోయింది. బనీను కూడా ఊడతీశారు. రోడ్డుప్రక్కనే చిన్న నీటిగుంట వుంది. నలుగురూ కలిసి అతన్ని అందులోపడేసి బురద ఒంటికి బాగా అంటేదాకా ఇష్టంవొచ్చినట్లు దొర్లించారు. తర్వాత బైటికి తీసుకొచ్చారు. ఒక సీనియర్ బొమికల దండనొకదాన్ని తీసుకొచ్చి అతని మెళ్ళో వేశాడు. ఇంకో ఇద్దరు ఎక్కడ్నుంచో ఒక గాడిదని సంపాదించి తీసుకొచ్చారు. అంతా కలసి అతన్నెత్తి కుదేసి గాడిదమీద కూర్చోపెట్టారు. అక్కడ్నుంచీ రోడ్డుమీద గాడిదని రెచ్చగొడ్తూ ఊరేగించారు. సుబ్బారావు బిక్కచచ్చిపోయి, వాళ్ళు చెయ్యమన్నట్లు చేస్తూ నిస్సహాయంగా ఉండిపోయాడు.

 

    అతన్ని గాడిద మీదనుంచి దించాక "పొగరణిగిందా?" అనడిగాడు మొదట్లో అతన్ని కవ్వించిన సీనియర్.

 

    సుబ్బారావు ఏమీ మాట్లాడలేదు. కళ్ళల్లోంచి ఉబుకుతోన్న నీటిని నిగ్రహించుకున్నాడు.

 

    "ఎక్కడ దిగావ్? హాస్టల్లోనా?"

 

    కాదన్నట్లు తలవూపాడు.

 

    "బ్రతికిపోయావు. లేకపోతే రాత్రికి క్యాబరే డాన్స్ చేసేవాడివి. సాయంత్రం మా అందర్నీ సినిమాకి తీసుకెళ్ళు. తెలిసిందా?"

 

    మళ్ళీ తల ఊపాడు.

 

    "ఇహ వెళ్ళు."

 

    బ్రతుకుజీవుడా అని సుబ్బారావు బట్టలుతీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. కాలేజీ వైపుకాదు. బహుశా బసచేసిన చోటుకు.

 

    చెట్లక్రింద నిలబడి ఆడపిల్లలంతా ఈ తతంగమంతా చూస్తున్నారు. వాళ్ళ గుండెలు గబగబ కొట్టుకుంటున్నాయి.

 

    సీనియర్స్ మళ్ళీ లోపలకు వచ్చారు.అందరిలోకీ డాషింగ్ గా కనబడుతూ ఇంచుమించు జట్టుకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థి కళ్ళు మాధవి మీదపడి ఒక్కక్షణం అలా నిలబడిపోయినాయి.

 

    "ఏయ్! ఇలారా దగ్గరకు" అన్నాడు.

 

    మాధవి అతని దగ్గరకు వెళ్ళింది.

 

    "నీ పేరేమిటి?"

 

    చెప్పి "మీ పేరేమిటి?" అనడిగింది.

 Previous Page Next Page