Read more!
 Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 2


    పైప్ పీలుస్తూ గదికున్న అద్దాలలోంచి హాల్లోని ఉద్యోగస్తులనంతా అయిదునిముషాలు కలియజూశాడు. అంతా ఎవరిపనుల్లో వారు నిమగ్నమై వున్నారు. టైపిస్టు రాధారాణి చకచక టైపు చేసేస్తోంది. ఎకౌంటెంటు రంగారావు సీరియస్ గా ఫైళ్ళు తిరగేస్తున్నాడు. అసిస్టెంట్ మేనేజరు హరగోపాల్ తన ఛాంబరులోంచి ఒకసారి ఇవతలకు వచ్చి ఇద్దరుముగ్గురు క్లర్కులను కలుసుకుని, వాళ్ళకేదో పని పురమాయించి మళ్లీ లోపలకు వెళ్ళిపోయాడు.

 

    అతని రూంకి కుడివైపున వున్న చిన్నగదిలో అతని సెక్రటరీ విజయకుమారి కాగితాలమీద తలత్రిప్పకుండా ఏదో రాసేస్తోంది.

 

    ఎడమచేత్తో టేబిల్ మీది టెలిఫోన్ రిసీవర్ అందుకున్నాడు. టెలిఫోన్ ఆపరేటర్ కమ్ రిసెప్షనిస్ట్ కమలామణి పలికింది.

 

    "యస్ సర్."

 

    "ఈసారి టెలిఫోన్ బిల్లు చాలా ఎక్కువగా వచ్చింది. ఆఫీసులో ఎవరో ఎస్.టి.డి. కాల్స్ విరివిగా వాడుకుంటున్నారని నా నమ్మకం."

 

    "లేదు సర్, నేను చాలా జాగ్రత్తగా వుంటున్నాను."

 

    "ఎంత జాగ్రత్తగా వున్నా ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయని ఒప్పుకుంటావా?"

 

    కమలామణి జవాబు చెప్పలేదు.

 

    "ఏమిటి?"

 

    "అవకాశం ఉంది సర్."

 

    "ఒక్కొక్కసారి మన ఆబ్ సెన్స్ లోకూడా ఎస్.టి.డి.లు వెడుతూ ఉండవచ్చు కదూ!"

 

    కమలామణి గొంతు వణికింది "వెళ్లవచ్చు సర్.......కాని సర్..."

 

    "ఏమిటి?"

 

    "మనం ఈ మధ్య యితర రాష్ట్రాలలోని మెడికల్ కంపెనీల ఆర్డర్లు ఒప్పుకుని వాటి బ్యానర్ మీద టానిక్కులు తయారుచేసి సరఫరా చేస్తున్నాం కద సర్, ఆ పనిమీదకూడా కాల్స్ ఎక్కువగానే వెడుతున్నాయి."

 

    "కమలామణీ! నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళయింది?"

 

    "ఆరు నెలలయింది సర్."

 

    "ఆరు నెలల్లో నాకు పాఠాలు చెప్పగలంత అనుభవం సాధించావా?"

 

    ఆమె గొంతులో జీరవచ్చింది "నా ఉద్దేశం అదికాదు సర్!"

 

    "నా ఉద్దేశంకూడా అదికాదులే. ఈమధ్య నువ్వు బాంబే మాట్లాడావా లేదా?"

 

    కమలామణి నిరుత్తరురాలయిపోయింది.

 

    ఫోన్ లో అతని నవ్వు ఆమె శరీరాన్ని తూట్లుపొడుస్తున్నట్టు ప్రతిధ్వనించింది.

 

    "ఎలా తెలిసిందని ఆశ్చర్యపడుతున్నావా?"

 

    కల్నల్ మళ్ళీ నవ్వాడు. "నేను డాక్టర్ని. అంతేగాక సైంటిస్టుని. మన రీసెర్చి స్పెషలిస్టులు మైక్రోస్కోప్ లోని సూక్ష్మజీవులతో ఆడుకున్నట్లు, నేను భూమ్మీది మీలాంటి సూక్ష్మజీవులతో ఆడుకుంటాను. నీకు తెలుసో తెలియదో నేను ఆఫీసుగదిలో వున్నా, ఇంట్లో వున్నా మీ అందరినీ గమనిస్తూ ఉండగలను. మీ అందరిమాటలూ వింటూండగలను."

 

    కమలామణికి ఏడుపు వస్తోంది. కష్టంమీద ఆపుకుంటోంది.  

 

    "అంతేకాదు మిస్ కమలామణీ! నిన్న టాబ్లెట్ సెక్షన్ లో వున్న ప్రతాపరావూ, లేబిల్ ప్రింటింగ్ సెక్షన్ లోవున్న వర్ధనీ అఫీషియల్ విషయాలు చర్చించుకున్నట్టు అయిదు నిముషాలు మాట్లాడుకున్నారు. అందులో నాలుగు నిముషాల చర్చ శృంగారంమీద నడిచింది. అది నువ్వు విన్నావు."

 

    అవతల నిస్సహాయత, నిర్ఘాంతతతో కూడిన నిశ్శబ్దం.

 

    "అవునా?"

 

    జవాబు చెప్పలేని నిశ్శబ్దం.

 

    ".......అవును సర్."

 

    "ఆ విషయం నాకు తెలియజెయ్యాలని నీకప్పగించబడిన విధులలో ఒకటి."

 

    ".........అవును సర్."

 

    "మరి ఎందుకు తెలియచెయ్యలేదు?"

 

    ఫెయింటు అయేముందు ఆవరించినంత బలహీనత.

 

    "వాళ్ళ ఉద్యోగాలు పోతాయని కదూ!"

 

    ".............."

 

    "కాని.....పోయాయి."

 

    "కంపెనీ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఊస్టింగ్ ఆర్డర్స్ జారీ చెయ్యబడినాయి. నా సెక్రటరీకి ఉత్తర్వులు నిన్ననే యివ్వబడినాయి. ఇదుగో యిదే క్షణాన వాళ్ళది అందుకుంటున్నారు."  

 

    ఫోన్ లో మాట్లాడుతూనే అద్దాల గోడలోంచి సెక్రటరీ గదివైపు చూశాడు. ప్రతాపరావు, వర్దనీ-సెక్రటరీ విజయకుమారి ముందు నల్లబడిన ముఖాలతో నిలబడివున్నారు. ఆమె వాళ్ళకి చెరో కవరూ అందజేస్తూ ఏదో చెబుతున్నది. కవర్లు విప్పి లోపల క్లుప్తంగా రాయబడివున్న కాగితాలు చదువుకున్నారు. వాళ్ళ పెదవులు కదుల్తున్నాయి. నిస్సహాయంగా ఏదో చెబుతున్నారు. సెక్రటరీ ముఖం కటువుగా వుంది. కాసేపటికి వాళ్ళు బరువుగా అక్కడ్నుంచి కదిలి వెళ్ళిపోయారు. అంతా సైలెంటు మూవీలా జరిగిపోయింది.

 

    కల్నల్ - గట్టిగా నవ్వాడు.

 

    ఆ దృశ్యం కమలామణి చూడలేదు కానీ ఊహించుకోగలదు. ఆ దృశ్యంతోబాటు ఇంట్లో పోలియోతో పోరాడుతున్న పెద్ద తమ్ముడూ, పక్షవాతంతో మంచాన్నే జీవితంగా చేసుకున్న తల్లి, పగలంతా చెడతిరిగి ఇంటికి పిండాకూడుకోసం మాత్రం వచ్చే తండ్రి, ఇవికూడా కళ్ళముందు కదలాడాయి.

 

    ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.

 

    "ఇప్పుడు నిన్ను ఏం చెయ్యొచ్చు?"

 

    "............."

 

    "కమలామణీ! జాగ్రత్త. ఈసారికి హెచ్చరికతో విడిచిపెడుతున్నాను. ఇలాంటిది యింకెప్పుడూ రిపీట్ కాకూడదు."

 

    ఫోన్ పెట్టేశాడు.

 

    హమ్మయ్య! ఎంత రిలీఫ్? అంత ఊరట ఆమెకు మునుపెన్నడూ కలిగివుండదు.

 

    కల్నల్ సంజీవరావు కాసేపు టేబిల్ మీది ఫైల్స్ చూసుకున్నాడు. సంతకాలు చెయ్యవలసిన చోట సంతకాలు చేస్తున్నాడు.

 Previous Page Next Page