భద్రాచలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం వెళ్ళే అడ్డదారిలో - గోదావరి పాయ పక్కగా చిట్టడివిలో చెక్కల్తో కట్టిన అయిదు బిల్డింగులు. వాటిని బిల్డింగులు అనాలో, పాకలు అనాలో నాకు సరీగ్గా తెలీదు. అవే మా నివాసం. దాదాపు నెల రోజుల్నుంచీ అక్కడేవుండి, ఆ పనిమీద మమ్మల్ని అక్కడ ఉంచినందుకు రోజు కొకసారైనా ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ గడుపుతున్నాం.
మరుసటిరోజు ఆదివారం అవటంవల్ల జీపు వేసుకొని మా వాళ్ళందరూ భద్రాచలంలో సెకండ్ షో సినిమా చూడటానికి వెళ్ళారు. అందరూ అంటే ఎంతో మంది కారు. ఆరుగురు. అంతే.
రామభద్రం మాత్రం వాడి డెన్ లో ఉండిపోయినట్టు వెలుగుతూన్న దీపం తెలుపుతూంది. వాడు స్వతహాగా బద్ధకస్తుడు. అదీగాక స్థూలకాయం. వాడు సినిమాకి వెళ్ళకపోవటానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. వాడి భార్య ఆ రోజే అక్కడికి పిక్నిక్ వచ్చింది. ఒకరోజు అడవి చూపి వెళ్లిపోతానందట.
మోటార్ సైకిల్ దూరంగా ఆపుచేసి, నేను వాడిఇంటి (?) వైపు నడిచాను. అప్పుడు రాత్రి పదయింది. వాడి భార్య అక్కడ ఉన్నదనీ, వాళ్ళని అంత రాత్రిపూట డిస్టర్బ్ చేయకూడదనీ నాకు తెలుసు. కాని, వాడి భార్యకు వాడి "భోజనం" విషయంలో ఉన్న శ్రద్ధ "ఇతర" విషయాల్లో ఉండదు. ఆ విషయాన్ని వాడు నా దగ్గిర చాలాసార్లు ప్రకటించాడు. అందువల్ల ధైర్యంగా అటు వెళ్ళగలిగాను. అదీగాక ఇంత అడవిలో ఆ జంట ధైర్యంగా ఉండగలదని అనుకోలేదు నేను. నేను వచ్చేశానని చెబితే వాళ్ళు నిశ్చింతగా కాలక్షేపం చేయగలరు గదా! అఫ్ కోర్సు. ఈ అడవిలో నక్కలూ, ఎలుగుబండ్ల భయం తప్ప ఇంకేమీ లేదనుకోండి.
చిన్న చిన్న స్థంభాలమీద చెక్క తలుపుల్తో కట్టిన ఇల్లు అది. లోపల రెండు గదులూ, బాత్ రూమ్, టాయిలెట్ ఉన్నాయి. ఒక్కోమెట్టూ లెక్కపెట్టుకుంటూ చీకట్లో జాగ్రత్తగా ఎక్కాను. ఎక్కువతక్కువలైతే బోర్లాపడే ప్రమాదం వుంది. సన్నటి బాల్కనీలోంచి నడిచి తలుపు తోశాను. నేను అనుకున్నట్లుగానే తలుపు గడియ వేయలేదు.
రామభద్రం పక్కమీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు. నల్లటిరగ్గు మెడవరకూ కప్పుకున్నాడు. కళ్ళు తెరచి పైకప్పుకేసి చూస్తున్నాడు.
కిర్రుమన్న చప్పుడుతో తలుపు తెరుచుకుంటున్నా అతడు తల తిప్పలేదు. అసలు అతడు పడుకున్న ఆ భంగిమలోనే ఏదో చిత్రం గోచరించింది నాకు. తల తిప్పకుండా కేవలం కనుగుడ్లు తిప్పి నా వైపు చూశాడు. చిన్న కాల్వలా నుదుటిమీద నుంచి చెంపమీదకు కారిన చెమట ధార లైటు వెలుగులో మెరుస్తూంది.
పెదాలు కదిలీ కదల నివ్వకుండా గుసగుస లాడ్తున్నట్టు....."ఒరేయ్ శివా! ఇలారా" అన్నాడు అతడు ఒక్కొక్కపదమే తూచి తూచి అలా అనటంలో తొందరని గ్రహించి నేను వడివడిగా అతడి పక్క దగ్గరికి నడవబోయాను.
"ఆగు! అక్కడే వుండు శివా!" అని చప్పున అనేసి, మళ్ళీ తను గట్టిగా మాట్లాడేశానన్న భయంతో మరింత గొంతు తగ్గించి- "చెప్పులు అక్కడే వదలి....." అన్నాడు రహస్యం చెబుతున్నట్టు.
"అసలేమైందిరా భద్రం?"
"ష్.....!" అన్నాడు. "గట్టిగా మాట్లాడకు. నేను చెప్పినట్టు చెయ్యి. చప్పుడు చెయ్యకుండా ఇలా దగ్గిరకి రా."
చెప్పులు తీసేసి, కేవలం సాక్సుతో అతడి దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ అతడి పక్క దగ్గిరకి నడిచి, అతడి పక్కనే కూర్చోబోతూ "అసలే మైందిరా?" అని అడిగాను రహస్యంగానే.
బుల్లెట్ లా అతడి నోటివెంట "కూర్చోకు, కూర్చోకు" అన్నమాటలు వచ్చినయ్. చప్పున నిటారుగా నిలబడి అతడివైపు చూశాను. మెడవరకూ కంబళిలాంటి రగ్గు వుంది. మెడ దగ్గర లాల్చీ లేదు. అంటే ఉట్టి పైజామాతో పడుకున్నాడన్నమాట. నేను చూస్తున్నది అదికాదు. అంత చలిలో కూడా అతడి మొహంమీద పడ్తున్న చెమటని చూస్తున్నాను. అదిజారి, తలదిండుని తడిపేస్తూంది. చాలా సేపట్నుంచి తలని కదపలేదన్న విషయాన్ని ధ్రువపరుస్తూ అతడి తల చుట్టూ దిండుమీద వర్తులాకారంలో వున్న తడి సూచిస్తూంది. కడుపులో తుపాకీగుండు తగిలినవాడు స్పృహ లేకుండా పడుంటే తప్ప అంత నిశ్చలత సాధ్యంకాదు.
"ఏమైందిరా, భద్రం?"
చాలా హీనమైన స్వరంతో, ఎక్కడో నూతిలో నుండి మాట్లాడుతున్నట్టు అతను అన్నాడు....."మిన్నాగు!"
పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడ్డాను. "మిన్నాగా! యు మీన్ స్నేక్....... ఎక్కడ కరిచిందిరా? ఎప్పుడు కరిచింది?"
"షటప్" అని అరవబోయి, అతికష్టంమీద్ఫా నిగ్రహించుకున్నాడు.
పక్కమీదకు వంగి, "ఏ మాత్రం ఓపికున్నా లేవరా. మనం తొందరగా డాక్టరు దగ్గరికి వెళ్ళాలి.... తొందరగా" అన్నాను. మిన్నాగు కరిస్తే నిమిషాలమీద విషం వళ్ళంతా పాకిపోతుంది. అందులోనూ ఈ భద్రాచలం అడవుల్లో మిన్నాగంటే ప్రాణాలు తీసే విషానికి పెట్టింది పేరు. అసలీ స్థితిలో వీడ్ని మోటారు సైకిల్ మీద అంతదూరం తీసుకువెళ్ళటమే కష్టం. జీపు లేదు. ఈసారి చెమట పట్టడం నా వంతయింది.
కడుపుమీద పెద్ద బండరాయి వున్నట్టు నిశ్చలంగా వున్నాడు రామభద్రం- నాపైపే కన్నార్పకుండా చూస్తూ! నా వెన్ను అప్రయత్నంగా జలదరించింది. వణుకుతూన్న కంఠంతో-" ఎక్కడ వేసిందిరా కాటు" అని అడిగాను. నా గొంతు రుద్ధమైంది.
"కాటు వెయ్యలేదు" అన్నాడు భద్రం కసిగా,"......ఇంకా వెయ్యలేదురా శివా! నా కడుపుమీద ఉందది- బహుశా నిద్రలో."
అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాను.....అప్పటివరకూ అతడికి చాలా దగ్గిరగా వున్నవాడిని కొంచెం దూరంగా జరుగుతూ.
ముస్లిం సమాధిమీద కప్పే సిల్కుగుడ్డలా అతడిమీద బ్లాంకెట్ వుంది. సరీగ్గా కడుపు ప్రాంతంలో కొద్దిగా ఎత్తుగా ఒక పెన్సిల్ పెట్టినట్టు ముడతపడి వుంది.
"ఈ దుప్పటి క్రింద-నీ కడుపుమీద- ఓ మిన్నాగు వుందంటున్నావా నువ్వు?" చాలా వివరంగా తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్పమని అసెంబ్లీలో అడిగే ప్రతిపక్ష నాయకుడిలా నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కానట్టు అడిగాను.అతను మాట్లాడలేదు. అప్పటివరకూ ఎంతో బింకంగా ఓర్చుకున్నవాడు నన్ను చూచి, సత్తువ పూర్తిగా కోల్పోయినట్టు కళ్ళు మూసుకున్నాడు. అతడు ప్రాక్టికల్ జోక్ వేయటం లేదన్నది అతడిని చూస్తేనే తెలుస్తోంది. నిన్న ప్రొద్దున్నే రెండు మిన్నాగుల్ని మా పరిసరాల్లో చంపాం.
"అసలు అది అక్కడికి వచ్చి ఎలా చేరిందిరా?" అని అడిగాను. కానీ అదిగాక నేనెంత తెలివితక్కువ ప్రశ్న వేశానో తెలిసింది.
"నేను పుస్తకం చదువుకుంటున్నాను." చాలా నెమ్మదిగా అన్నాడు భద్రం. మాట్లాడుతున్నప్పుడు తన కడుపు తాలూకు కండరాలు కదిలి, మిన్నాగుకి నిద్రాభంగం కలిగించకుండా చాలా జాగ్రత్తపడుతున్నాడన్నా విషయం తెలుస్తోంది. ".... వెల్లకిలా పడుకుని చదువుకుంటూంటే భుజంమీద ఏదో పాకినట్టయింది. పుస్తకం వెనుకనుంచి తోక కనపడింది. తరువాత తల....నెమ్మదిగా అది మెడ పక్కనుంచి పాకి ఛాతీమీదకి వెళ్ళింది. అసలప్పుడే ప్రాణాలు పోవాల్సింది. ఊపిరి బిగపట్టి చూడసాగాను. ఏ మాత్రం విదిలించినా కాటు వేస్తుందని తెలుసు. అందులో మిన్నాగులంత చురుకైనవి ఇంకొకటి వుండవు. దాదాపు ఆరేడు అంగుళాలు ఉంటుందది. వ్రాసుకునే కలం అంత వుంది. పైనుంచి పక్కకి వెళ్ళిపోతుందనుకున్నాను. కానీ దుప్పటిలో దూరి కడుపు దగ్గిర ఆగిపోయింది. అప్పట్నుండీ ఏం చెయ్యాలో తోచలేదు. మా ఆవిడ అసిస్టెంటు ఇంజనీరు పెళ్ళాంతో కబుర్లు చెప్పడానికి వెళ్ళింది. అదృష్టవశాత్తు నువ్వొచ్చావు."
"ఎంత సేపయింది ఇది జరిగి?"
"దాదాపు గంట!"
గంటనుంచి కడుపుమీద విషపురుగునుంచుకొని ఎవరొస్తారా అని కదలకుండా చూస్తూ వుండటం నిజంగా ప్రత్యక్షనరకం. "ఇదిగో ఈ మడతలోంచే లోపలికి దూరింది. బహుశా అక్కడ వెచ్చగా వుండివుంటుంది. అక్కణ్ణుంచి కదలటంలేదు."
అదీ నిజమే. వంటిళ్ళల్లోనూ, వెచ్చగా వుండేచోట్లా ఈ పురుగులూ, పాములూ పడుకోవటం మా అనుభవంలో విషయమే, పోతే ఇంతవరకూ అది భాద్రాన్ని కాటు వెయ్యలేదంటే అది అదృష్టకరమైన విషయం.
"గంట అంటే సుదీర్ఘమైన అరవై నిముషాలు అని ఇప్పుడే తెలిసింది. దీనికన్నామొదటి నిముషమే చచ్చిపోవటం సుఖం! ఇక కదలకుండా వుండటం అసాధ్యంరా శివా! అరగంటనుంచి మోకాలిదగ్గిర విపరీతంగా దురద పెడ్తుంది. ఒక్కసారి అయినా గుండెల్నిండుగా దగ్గాలనిపిస్తున్నది!"
భద్రంవైపు జాలిగా చూశాను. వాతావరణాన్ని తేలికపర్చటానికి అలా మాట్లాడుతున్నాడే తప్ప.....అతడు ఎంత టెన్షన్ తో వున్నదీ గ్రహించగలను.
"ఆల్ రైట్, భద్రం!" అన్నాను. ఇప్పుడు నేనుకూడా గొంతు తగ్గించి మాట్లాడసాగాను. "కొంచెంసేపు కదలకు! మరీ అవసరంవస్తే తప్ప మాట్లాడకు. బెదిరితే తప్ప అది కాటు వెయ్యదు. ఇంత సేపు ఓపికపట్టావు. ఇంకొంచెంసేపు నిగ్రహించుకో" అంటూ చప్పుడు చేయకుండా ఆ గదిలోనుంచి బయటకి నడిచాను.
రాత్రి పదింటివరకూ కబుర్లకోసం ఆ అడవిలో కూడా మరో మహిళా మండలి సభ్యురాల్ని చూసుకున్న అతడి భార్యకి ఈ విషయం చెప్పి పరిస్థితిని మరింత దిగజార్చటం నా కిష్టం లేకపోయింది.
నిశ్శబ్దంగా వంటింట్లోకి వెళ్ళి..... పళ్ళు కోసే కత్తిని తీసుకున్నాను. ఫస్ట్ ఎయిడ్ గురించి మాకు కొద్దిగా చెప్తారు. ఒకవేళ ఆ పామేగానీ కాటువేస్తే ముందు విషం లాగెయ్యటానికి ఈ కత్తి ఉపయోగపడుతుంది. దాన్ని పాంటుజేబులో పెట్టుకుని ముందు గదిలోకి వచ్చాను.
నేను గదిలోకి రాగానే భద్రం నావైపు చూశాడు. తల తిప్పకుండా కేవలం కళ్ళు వీలయినంత పక్కకి పెట్టి చూడటంతో భయంకొల్పేలా వున్నాడు. అతడెంత టెన్షన్ అనుభవిస్తున్నాడో ఆ భంగిమే చెబుతోంది. ఆ చూపుల్లో 'ఏదైనా మార్గం కనుక్కున్నావా?' అన్న ప్రశ్న వుంది.
అతడి తల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళమీద కూర్చుని చెవి దగ్గరగా మొహం పెట్టి, రహస్యంగా చెబుతున్నట్టూ "భద్రం" అన్నాను. ".....నాకు ఒకే ఒక మార్గం తోస్తూంది. ఈ బ్లాంకేట్ ని నెమ్మదిగా కొద్దికొద్దిగా వెనక్కి తీస్తాను. అసలా పాము ఏ పరిస్థితిలో వుందో ముందు చూడొచ్చు. దానికే మాత్రం తాకిడి తగలకుండా తియ్యగలననే అనుకుంటున్నాను. కనపడగానే కత్తితో ఒక పోటు పోడుస్తాను ఎలావుందీ ఆలోచన?"
"నా మొహంలా వుంది" విసుగ్గా అన్నాడు. ఆ విసుగు కంఠంలో కాకుండా మోహంలో కనబడింది. "దుప్పటికింద చీకటిగా ఉంటుంది. దాన్ని తియ్యగానే ఆ వెలుగులోకి ఒక పోటు పోడుస్తుంది"
"దీపం ఆర్పేస్తే?"
"అప్పుడు నీకు మాత్రం ఏం కనబడుతుంది?"
నాలుక్కర్చుకున్నాను. అసలా అనుమానం నాకే వచ్చి ఉండాల్సింది!" మరేం చేద్దాం" అని అడిగాను.
"ముందు నా పక్కనో డాక్టరు ఉంటే మంచిది."