Previous Page Next Page 
పర్ణశాల పేజి 4


    సుబ్బయ్యవడిగా అటునడిచి ఫోటో చేతులలోకి తీసుకున్నాడు. కిరణ్మయి అది చూచి చప్పున  కదిలింది. కానీ ఆమె అతన్ని  వారించే లోపులోనే అతడు దాని బయటకు  విసిరేశాడు. బయట  నిలబడ్డ  గుంపు తలమీద నుంచి అది రోడ్ మధ్య పడి భళ్ళున బ్రద్ధలయింది.

    కోపంతోనూ, నిస్సహాయతతోనూ, రోషంతోనూ ఆమె విసురుగా గుమ్మంవేపు పరుగెత్తింది. వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో అదొకటే వున్నది.

    కిరణ్మయి బయటకొచ్చేసరికి ఎన్నో జతల కళ్ళు ఆమెను తినేసేటట్లు చూసేయి. నిజానికి అక్కడ వున్న  వాళ్ళందరూ- అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ బయటకు ఎప్పుడు  వస్తారా అని వేచి వున్నారు యింతసేపూ. అందులో ఆమెది అద్భుతమైన సౌందర్యం. బాగా తాగి, సగం స్పృహలో వున్న  వాళ్ళ మతులు ఆమె చూడటంతో పూర్తిగా పోయాయి. తమ చర్యని అడ్డుకొనే వాళ్ళెవరూ లేకపోవడంతో మరింత హుషారు వచ్చింది.

    కిరణ్మయి ఇదేమీ గమనించకుండా రోడ్ మీద పడివున్న ఫోటో దగ్గరికి వెళ్ళింది. అద్దం పగిలి, కాగితం బయటకొచ్చిన ఫోటోని చేతుల్లోకి తీసుకుంది.

    ఈలోపులో శారద కూడా బయటకొచ్చింది. అక్క ఫోటో తీసుకోవటంతో అంతమంది కళ్ళూ తమనే గమనిస్తూండటం చూసి లోపలికెళ్ళబోయింది. ట్రంకు  పెట్టెమీద  కూర్చున్న సురేష్ సర్దుకుని కూర్చుంటున్నట్లు కూర్చుంటూ కాలు  ముందుకు  చాపి  ద్వారానికి అడ్డుపెట్టాడు. ఆమె నిలబడిపోక తప్పలేదు. అంతలో జులపాల జుట్టువాడు ఆమె భుజంమీదుగా వంగుతూ "పాపం కాలు  తియ్యరా" అన్నాడు. వాసన గుప్పున కొట్టింది.

    కిరణ్మయి లోపలికి వెళ్ళటం కోసం మెట్లెక్కింది. ఈ లోపులో సుబ్బయ్య  లోపల్నుంచి బయటకొచ్చి ద్వారబంధానికి చేతులు అడ్డుపెట్టి నిలబడ్డాడు.

    "లోపల యిక మీ వస్తువులు ఏమీ  లేవు. చూసుకోనక్కరాలేదు" అన్నాడు.

    శారద పని కట్రాట అయింది. అంతమంది  మగవాళ్ళు ఆమె చుట్టూ  యమభటుల్లా కనబడుతున్నారు. కిటికీలోంచే హరికేన్ లాంతరు  వెలుతురు  మసగ్గా  బయటపడుతోంది. ఆమె జాలిగా అందరివేపూ  చూసింది. కంటివెంట నీరు ధారగా కారుతోంది. భూమి నిలువునా విచ్చుకుని అందులో కూరుకుపోతే బావుండునని మనసారా కోరుకుంటోంది. ఆమె సున్నితమయిన మనస్తత్వం ఇంత  ఘోరమయిన పరిస్థితిని ఇముడ్చుకోలేకపోతోంది. ఇంత హేయమైన స్థితిని ఆమెలలో కూడా వూహించలేదు. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయించాలి?

    ఈ లోపులో కిరణ్మయి అతడితో ప్రాధేయపూర్వకంగా "కనీసం యీ రాత్రికి ఉండనియ్యి. ప్రొద్దున్నే ఖాళీ చేస్తాం" అంటూ లోపలికి వెళ్ళబోయింది. సుబ్బయ్య చెయ్యి అడ్డుతీసి ఏదో చెప్పబోయే లోపులోనే ఆమె లోపలికి నిష్ర్కమించింది. శారద కూడా అక్కని అనుసరించబోయింది.

    వాళ్ళు తనమాట ఖాతరు చెయ్యకపోవటంతో సుబ్బయ్యకి రోషం వచ్చింది. లోపలికి పోబోతూన్న శారద మెడదగ్గర జాకెట్టుని వెనుకనించి పట్టుకున్నాడు. తాగిన విసురులో ఆమెని బయటికి లాగబోవటంతో అసలే పాతదయిన జాకెట్టు  సర్రున చిరిగిపోయింది.

    క్షణం అక్కడ సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం ఆవరించింది. కానీ అది క్షణంసేపే.

    ఎవరో సన్నగా విజిల్ వేశారు.

    "హాయ్" అన్నారెవరో.

    జరిగింది గ్రహించగానే  శారదకి స్పృహ తప్పినట్లయింది.

    సంస్కారమూ, సౌశీల్యమూ జీర్ణించుకున్న కుటుంబంలో పుట్టింది ఆమె. వాళ్ళ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవచ్చుగాక, కానీ బీదతనం ఇంత పచ్చిగా తమమీద కసి తీర్చుకుంటుందని ఆమె తలచలేదు. ఎన్నో  జతల  కళ్ళు నగ్నమైన భుజాల్ని చూస్తున్నాయని గ్రహించికూడా పైటన్నా కప్పుకోలేనంత నీరసం ఆమెని ఒక్కసారిగా ఆవరించింది. దగ్గిరకొచ్చిన అక్క భుజంమీద తలవాల్సి- అలాగే  నెమ్మదిగా కాళ్ళముందు కుప్పగా కూలిపోయింది.

    కిరణ్మయి నిప్పులు కక్కుతున్న కళ్ళతో  చేయిఎత్తి అతడ్ని  కొట్టబోయింది. అతడు ఆమె చేతిని మధ్యలోనే పట్టుకుని విసురుగా లాగాడు. ఆమె  అతడిమీదకు తూలగానే  భుజాలచుట్టూ చేయి వేశాడు. ఆమె అతడి  చేతుల మధ్య  గింజుకుంటూ "ఛీ, వదులు" అంది.

    అంత దగ్గరగా ఆమె అందాల్ని చూసేక అతడికి మతిపోయింది. చుట్టూ వున్న  పరిసరాల్నీ, మనుషుల్నీ కూడా మర్చిపోయి ముందుకు వంగేడు. స్నేహితుల దగ్గర్నుంచి వస్తున్న ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. ఆమెని బయటకు లాగుతున్నట్లు నటిస్తూనే దగ్గరగా హత్తుకోసాగాడు.

    ఇంతలో అతడి భుజంమీద చెయ్యిపడింది.

    సుబ్బయ్య వెనుదిరిగి చూసేడు.

    వెనక్కి తిరిగీ తిరగగానే  అతడి దవడ పేలిపోయింది. ఆ వూపుకి వెళ్ళి సింహద్వారం మీద  పడ్డాడు.

    ఊహించని ఈ పరిణామానికి క్షణం విస్తుబోయినా చటుక్కున లేచి నిలబడి "ఎవడ్రా నువ్వు?" అన్నాడు.

    ఆ యువకుడు అతడి మాటలు పట్టించుకోకుండా  శారద  దగ్గరగా  వెళ్ళి  మోకాళ్ళమీద కూర్చొని ఆమెని లేపేడు.

    "వచ్చేడండీ ఎవరో హీరో" అన్నాడు గుంపులోంచి.

    సురేష్ ట్రంకు పెట్టె మీదనుంచి లేచి అతడి దగ్గరగా వెళ్ళి  కోటు  వెనుకనుంచి పట్టుకుని "మా వాణ్ణి కొట్టడానికి యెంత ధైర్యం నీకు!" అన్నాడు. చుట్టూ వున్న  మిత్రబృందాన్ని చూస్తూంటే ధైర్యం పొంగివస్తోంది. అందులోనూ  ప్రత్యర్థి  ఒక్కడే అని తెలియటంతో అది  మరింత ఎక్కువయింది. వెనక్కి తిరిగిన ఆ యువకుడి టై పట్టుకొని గుంజి, మా  ఇల్లు, మేం ఏమైనా చేసుకుంటాం నీకెందుకు?" అని ముందుకు తోసేడు.

    "చూస్తారేం  నాలుగు తన్నక?" అన్నారు ఎవరో.

    అతడు ఈ మాటలు లెక్కచెయ్యకుండా, తాపీగా ప్యాంటు జేబులోంచి కర్చీఫ్ తీసి కోటుమీద పడ్డ మరకల్ని  తుడుచుకొంటూ "యూసఫ్" అన్నాడు.

    కారు ఫ్రంటు డోరు తలుపు చప్పుడవటంతో అందరి కళ్ళూ అటు తిరిగేయి. డ్రైవర్ సీటులోంచి అరడుగుల వ్యక్తి దిగేడు. పుట్టినప్పటినుంచీ బీపూ వెన్నా తప్పా ఇంకొకటి తిన్నట్టు లేడు  అతడు .

    దగ్గరకొచ్చి, "సార్" అన్నాడు.

    "కొంచెం వీడి  సంగతి చూడు."

    నిజానికి ఆ డ్రైవర్ కేవలం యాజమాని ఆజ్ఞకోసం వేచి వున్నాడు అప్పటి వరకూ. అది లభించగానే సురేష్ రెండు భుజాలు పట్టుకుని బొమ్మని ఎత్తినట్టు  గాలిలోకి లేవదీశాడు.

    ఆ తరువాత అక్కడ వినిపించే "దబ్ దబ్" మన్న చప్పుళ్ళనీ, సన్ననీ మూలుగుల్నీ అతడు పట్టించుకోలేదు.

    అప్పుడే స్పృహలోకి వచ్చిన శారద జరుగుతున్నది అర్థంకాక చుట్టూ చూసింది. ఆమెకి చేయి అందిస్తూ కిరణ్మయివైపు తిరిగి "ఇక్కణ్ణుంచి తీసుకెళ్ళాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏమైనా వున్నాయా?" అని అడిగేడు.

    ఏదో లోకంలో వున్నట్లు  స్థాణువైన కిరణ్మయి అప్రయత్నంగానే తల అడ్డంగా తిప్పింది.

    "అయితే పదండి" అని, ఇక ఆమె జవాబుకోసం ఎదురు చూడకుండానే శారదని పొదివి పట్టుకుని కారు దగ్గరికి నడిచేడు.

    మసక వెన్నెల్లో నల్లటి హుందాగా నిలబడి వుంది.

    డోరు తెరచి ఆమెని లోపల  కూర్చోబెట్టాడు. చుట్టూ  తిరిగివచ్చి, ఇవతలి డోర్ తెరచి, "కూర్చోండి" అన్నాడు.

    కిరణ్మయికి ఏమీ అర్థం కావటంలేదు. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. అతడి కంఠంలో ఏదో ఆజ్ఞాపించే స్వరానికి బద్ధురాలై ఆమె కూడా  లోపలికి వెళ్ళింది. అతడు  కూర్చొని తలుపు బలంగా వేస్తూ "యూసఫ్" అన్నాడు.

    పని ముగించుకుని యూసఫ్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు  నెమ్మదిగా  కదిలింది.

    నిశ్చేష్టమైన గుంపులోంచి ముందుగా తేరుకున్నది సుబ్బయ్య. రక్తంలో జీర్ణించుకుపోయిన వ్యాపారనైజం అంత  గొడవలోనూ జరిగిన నష్టాన్ని హెచ్చరించింది. "నా డబ్బు" అని అడిగాడు.

    కదలబోయిన కారు వేగం తగ్గింది. వెనుక విండోలోంచి ఓ నోట్లకట్ట వచ్చి అతడి మొహానికి తగిలింది......

    ......నెమ్మదిగా వస్తోన్న గాలి తెరలకి ఆ అభాగినుల మనసులు సేదతీరాయి. ముందుగా తెరుకొన్నది కిరణ్మయి. ఆ వచ్చిందెమెకు. ఆ పరిస్థితిలోంచి ఎలాగో  ఒకలా  బయటపడటం ఒక్కటే అప్పుడామెకు తెలిసింది. కానీ తీరా బయటకొచ్చేసరికి లక్ష అనుమానాలు ఆమెను  చుట్టుముట్టిన్నాయ్. అదీగాక పెట్టె, బట్టలు అక్కడే వుండిపోయినయ్.

    ఏమీ మాట్లాడకుండా కూర్చున్న అతడివైపు చూస్తూ..... మనం ఎక్కడికి వెళుతున్నాం?" అని అడిగింది.

    "మా ఇంటికి" అన్నాడు ముక్తసరిగా.

    "మీరెవరు?"

    జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించుకొంటూ "చైతన్య- కృష్ణ చైతన్య" అన్నాడు.

   
                                                                           3


    వాళ్ళిద్దరికీ జరిగినదంతా ఏదో కలగా వుంది.

    ఇంటికి రాగానే చైతన్య ఇంట్లో అందర్నీ పరిచయం చేశాడు. కాంతిమతి ......కౌసల్య .... రవీ....

    వాళ్ళ కళ్ళల్లో కదులుతున్న సంశయాన్ని ఇక ఎక్కువసేపు ఉంచదల్చుకోలేదు. తనకీ, మాస్టారికీ వున్న పరిచయాన్నీ, మాస్టారు అర్థరాత్రి తనింటికి రావటాన్నీ, ప్రొద్దునే ఆయన మరణించిన  సంగతి చెప్పేడు.

    ఆ విషయం  వినగానే శారద  కుప్పకూలిపోయి "నాన్నా-నాన్నా !" అని  రోదించసాగింది. కిరణ్మయి కూడా పైట  చెంగు నోట్లో  కుక్కుకొని మౌనంగా ఏడుపు బిగపట్టింది.

    చైతన్య నెమ్మదిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

    కాంతిమతి, కౌసల్య వాళ్ళని ఓదార్చసాగారు.

    తండ్రి మరణం శారదనే ఎక్కువ బాధపెట్టింది. ఆమె  తండ్రి ఆమెకు  రెండు పూటలా కనీసం తిండికూడా సరిగా  పెట్టి  వుండకపోయి వుండవచ్చుగాక .........కానీ ఆమె మనోవికాసానికీ, విజ్ఞానార్జనకీ అతను  తండ్రిగా ఎంతో  తోడ్పడ్డాడు. పన్నెండేళ్ళ వయసులోనే  ఆమె రామాయణ, భారతాల్ని ఆమూలాగ్రంగా కంఠతా పట్టింది. అంతేగాక ఆమె  వీణ వాయిస్తూ  వుంటే ఆయన గంటల తరబడి కళ్ళు  మూసుకుని  తన్మయత్వంతో వింటూ  వుండేవాడు. బీదతనమే గనక  మబ్బులాగా ఆమెని అడ్డుకొనకపోయి వుంటే ఆమె తారలా ప్రకాశించి వుండేది. అందులోనూ అక్క అంత అందంగా లేకపోవటం ఆమెలో అణుకువ, వినయాన్నీ నేర్పింది.

    వారిద్దరూ తండ్రి మరణం తాలూకు బాధనుంచి తేరుకోవటానికి రెండు  రోజులు పట్టింది. ఈ విషయంలో కౌసల్య చాలా శ్రమపడింది. ఇరవై నాలుగ్గంటలూ వాళ్ళతోనే వుంటూ వాళ్ళు నెమ్మదిగా మర్చిపోయేలా చేసింది. మొదటిరోజు కొంచెం రిజర్వ్ డ్ గా వున్నా తరువాత రవి కూడా  కలిసిపోయేడు. బాబు ముద్దు ముద్దు  పల్కులు, కాంతిమతి ఆప్యాయతా వాళ్ళ బిడియాన్ని కూడా పోగొట్టినయ్.

 Previous Page Next Page