Previous Page Next Page 
వివాహం పేజి 28

   
    ఇంక తనతో స్నేహంగా వుండకుండా ఎవరడ్డమొస్తారు? ఇన్నాళ్ళూ తను రవణతో మాట్లాడ్డానికి ప్రయత్నించినట్టూ, ఆ యింటి వాళ్ళందరూ అభ్యంతరపెట్టినట్టూ తోచింది అతనికి. బండిలో కూచున్న రవణని కళ్ళెత్తి తనివి తీరా అప్పుడప్పుడు చూచి "ఇంత అందమయినదని ెన్నడూ అనుకోలేదే! నాకు నిజంగా యింత అందమయిన భార్య వుందా? నిజంగా నాదేనా ఆ సౌందర్యమంతా?" అనుకున్నాడు చాలా సార్లు.

    రైల్లో తనెక్కడ కూచుంటాడు? వెంకట్రావుగారూ, భార్యా సెకండు క్లాసులో వెడతారు. ఇదివరకు తనూ తల్లీ మూడోక్లాసులో వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు రవణకి కూడా మూడోక్లాసే కొంటారుగా! రవణని తమతో ఎక్కించుకోరు గద మూడోక్లాసు కిక్కిరిసి వుంటుందేమో? దగ్గిరగా కూచుంటుందా? రాత్రి ఎక్కడ నిద్రపోతుంది? తన తొడమీద తల పెట్టుకుంటే! ఒకవేళ ఆడవాళ్ళ పెట్టెలో ఎక్కిస్తారేమో!...... వెంకట్రావుగారు నాలుగు సెకండుక్లాసు టిక్కట్లు కొనమని డబ్బిస్తే గోపాల్రావుకేమీ సంతోషం కలగలేదు. తెలిసిన వాళ్ళిద్దరితోటీ కూచోవలసి వచ్చింది. ఇంక ఇంటికెళ్ళిం తరువాత ఎట్లానూ కనపడదు. రైల్లో నన్నా స్నేహం చేసుకోవాలంటే? రైలెక్కారు; పెట్టె అంతా వీళ్ళకే ఖాళి. ముందు మంగమ్మా, రవణా ఎక్కి ఒక పరుపు మీద కూచున్నారు. వెంకట్రావుగారు కూడా వాళ్ళ పక్కనే కూచున్నారు. గోపాలరావు ఎదురుగా ఎండలో కిటికీ దగ్గిరిగా కూచున్నాడు. వెంకట్రావుగారు కొంచెం సేపు కబుర్లు ఆడిన తరువాత చదువుకుంటున్నారు. మంగమ్మ కిటికీలోంచి చూస్తూ అప్పుడప్పుడూ రవణతో మాట్లాడుతోంది. గోపాలరావు వీలైనప్పుడల్లా రవణకేసి చూస్తున్నాడు. రెండు మూడు స్టేషనులైన తరువాత మంగమ్మ

    నడుం వాల్చుకుంటూ, "మీరు దాని మీదికి వెళ్ళండి" అంది వెంకట్రావుగారిని.

    ఆయన రవణతో "నువ్వు కూచో అమ్మా, అట్లా అతను ఒక్కడూ ఏం తోచక కూచున్నాడు. ముసలిదాని కబుర్లు ఎంతసేపని వింటావు?" అన్నాడు.

    రవణ సిగ్గుతో కదల్లేదు. గోపాలరావు గుండెలు కొట్టుకుంటున్నాయి. తనవంక ఒక్కసారీ చూడకుండా, తను లేనట్లే ప్రవర్తిస్తోన్న రవణమీద ఇందాకణ్నించీ రగుల్తోన్న కోపం చల్లారింది. కాని యిప్పుడైనా కదలదేం? మళ్ళా ఎవరూ మాట్టాడలేదు. వెంకట్రావుగారు మళ్ళీ చదులుకుంటున్నారు. ఆ మంగమ్మ నడుంనొప్పి మాయమయింది? మాట్లాడదేం? ముసలిది, ఆమెకెంత వోపికో! ఆయనకా మతిమరుపేమిటి? కొంచెం అటూ యిటూ కదిలాడు. తన నడుం కొంచెం చాచి మంగమ్మకి చెప్పి జ్ఞాపకం చేయాలని చూశాడు. లాభంలేక కొంతసేపున్న తరువాత వెంకట్రావుగారే పుస్తకంనించి కళ్ళెత్తి, ఇంకా వెళ్ళలేదూ" అని రవణ జబ్బ పట్టుకుని, తీసుకొచ్చి సిగ్గుతో కుంగిపోతున్న దాన్ని, గోపాల్రావు పక్కన కూచోపెట్టాడు. అమాంతం లేచి వెంకట్రావుగారిని కావలించుకొని కాళ్ళమీదపడి, ఆయనకి మహోపకారాలు చేసి ముసలితనంలో తనే పోషించి, యింకాయేమో చెయ్యాలనిపించింది గోపాల్రావుకి. కాని అట్లాంటి వేమీ ప్రస్తుతం మంచిది కాదని తోచినట్లుంది. అందుకని తలవొంచుకు కూచున్నాడు. వెంకట్రావుగారు చెయ్యి వదలగానే పరుపుకింద స్ప్రింగు తన్నినట్లు యెగిరి రవణ పరుపు చివర యెడంగా కూచుంది. మంగమ్మ కళ్ళు మూసుకుంది. వెంకట్రావుగారు పుస్తక ప్రపంచంలో పడ్డారు. అప్పుడైనా వాళ్ళకి తెలీకుండా రవణతో స్నేహ సంబంధం కొనసాగించే పద్ధతాలోచించాడు గోపాలరావు. వాళ్ళిద్దరివంకా చూస్తో బల్లకింద నించి కాలుజాచి రవణ కాలుకి తాకించాడు. కదలలేదు. బొటనవేలు గోరుతో మడమ గోకాడు. కాలు లాక్కుంది. కొంచెం ఆగి కిటికీ అవతలనించి తొంగి ఆమె మొహంకేసి చూశాడు. మొహం అటు తిప్పుకుంది, దగ్గాడు, లాభంలేదు.

 Previous Page Next Page