"తప్పు! అలా అనకండి - కళ్ళుపోతాయి-" అనేసింది సుశీల అలవాటుగా.
"అలాగా, నీకెందుకు పోతాయి కళ్ళు మరి?" అనకుండా ఉండలేకపోయాడు భాస్కర్.
సుశీల ఏడ్చేసింది. "అనండి - అనండి. ఈ పరిస్థితులలో అనవలసిన మాటలేనా?" అంది.
నోరు జారినందుకు భాస్కర్ కూడా నొచ్చుకున్నాడు. ఎంత బ్రతిమాలుకున్నా భాస్కర్ రాకపోయేసరికి, సుబ్బలక్ష్మిని తీసుకుని పూజలు చేయించటానికి వెళ్ళిపోయింది సుశీల. ఏదో పుస్తకం చదువుకుంటూ కూచున్నాడు భాస్కర్.
"సుశీలగారు ఉన్నారా?" అంటూ వచ్చింది రేవతి.
సుశీల ఇంట్లో లేని విషయం రేవతికి తెలియదంటే నమ్మలేకపోయాడు భాస్కర్. ఆ నాలుగు వాటాలలో ఏం జరిగినా ముందు తెలిసేది రేవతీ ఐరావతమ్మలకే!
రేవతితో భాస్కర్ ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు. అందరిలాగే అతడూ ఆమె పురుషద్వేషిణీ అనీ, ఆ కారణంగానే పెళ్ళి చేసుకోవటం లేదనీ విన్నాడు.
ఆ పురుషద్వేషిణి తన దగ్గరకు ఎందుకు వచ్చిందో అర్థంకాక తెల్లబోయి చూస్తున్నంతలో వచ్చి కూచోమనకుండానే రేవతి వచ్చి కూచుంది.
"సుశీల లేదు. పూజలు చేయించటానికి వెళ్ళింది" అన్నాడు భాస్కర్.
"ఆవిడకు దైవభక్తి ఎక్కువ-" అంది రేవతి పై గొంతు.
"మూర్ఖురాలు. మంత్రాలకు చింతకాయలు రాల్తాయని అనుకొంటుంది. ఇలా పూజలు చేయిస్తే కళ్ళు వచ్చేస్తాయి కాబోలు-" అని గొణిగింది లోగొంతు.
"బహుశః సాయంత్రం వరకు రాదు."
అలాగా!" రేవతి పై గొంతు.
"అది తెలిసే వచ్చాను-" లోగొంతు.
రేవతి ఎందుకు వచ్చిందో అర్థంకావటంలేదు భాస్కర్ కి. ఆవిడలో లేనిపోని వెకిలివేషాలు కూడా అతనెప్పుడూ చూడలేదు.
"కాఫీ తీసుకుంటారా?" అన్నాడు మర్యాదకి.
"ఎందుకులెండి వద్దు. పాపం, మీరే చెయ్యాలి కదూ?" అంది పైగొంతు.
"కాఫీ కోసం లేవకండి. మీతో మాట్లాడటానికి ఇలాంటి అవకాశం మళ్ళీరాదు-" అంది లోపలిగొంతు.
రెండో గొంతు పైకి వినపడకపోయినా, ఆ రెండు గొంతుల సంఘర్షణ స్పష్టంగా కనిపించే ఆ ముఖంలోకి ఉదాసీనంగా చూస్తూ "ఫరవాలేదు లెండి! అవసరాన్ని బట్టి అన్ని పనులూ చెయ్యటం అలవాటయిపోయింది నాకు!" అన్నాడు.
అన్నాడే కాని లేవలేదు. ఈ రేవతి త్వరగా పోతే బాగుండునని అనుకుంటున్నాడు, భాస్కర్ మనసులో.
"పాపం! మీరెంత అవస్థపడుతున్నారు! నిజంగా గుడ్డిదానితో కాపురం చెయ్యటం ఎంత కష్టం!" రేవతి పై గొంతు.
"గుడ్డిదికాకపోయినా, ఆ సుశీలతో మీరు కనుక వేగగలుగుతున్నారు -" లోపలిగొంతు.
రేవతి ధోరణికి తెల్లబోతున్నాడు భాస్కర్.
"ఏం చెయ్యగలం లెండి!" అన్నాడు.
"అలా అంటారేమిటండీ? ఈ రోజుల్లో విడాకులు తీసుకోవటం కొంత తేలికయిపోయిందిగా? మీరు విడాకులు తీసుకోవచ్చు-"
మతిపోయింది భాస్కర్ కి, అయినా రేవతి అంతర్యమేమిటో పూర్తిగా తెలుసుకోవాలని "విడాకులు తీసుకుని ఏం చెయ్యాలండీ!" అన్నాడు అమాయకంగా.
"ఏం మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు."
"చాల్లెండి? ఈ వయసులో నన్ను రెండోపెళ్ళి ఎవరు చేసుకుంటారు?"
"అలా నిరాశపడకండి- మీరు లీగల్ గా సుశీలకి విడాకులిస్తే నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను."
"నిజంగా నేను నమ్మలేను!" కావాలని ఆశ్చర్యం నటిస్తున్నాడు భాస్కర్.
"నిజమే చెపుతున్నానండీ! నాలాంటిది రెండో పెళ్ళికి ఒప్పుకోవటమేమిటని ఆశ్చర్యంగా ఉంది కదూ? మీ మంచితనం నాకు తెలుసు గనుక. మీ క్షోభ చూడలేక ఒప్పుకుంటున్నాను." రేవతి పై గొంతు.
"నా కర్మ నా రాతే బాగుంటే నీలాంటి రెండో పెళ్ళి వాణ్ణి. పెళ్ళాడి విడాకులిచ్చినవాణ్ణి, మామూలు ఉద్యోగస్థుణ్ణి చచ్చినా పెళ్లి చేసుకునేదాన్ని కాను. కానీ. ఏం చెయ్యను? అమ్మా నాన్నా సంబంధాలు చూస్తారన్న ఆశ సన్నగిల్లిపోయింది. నాకా వయసు మీరిపోతోంది. ఒంటరితనం, అశాంతి, నాలో నాకే అర్థంకాని ఏదో తిక్కను ప్రవేశపెడుతున్నాయి. అంచేతనే చచ్చినట్లు నీలాంటి రెండో పెళ్ళి వాణ్ణి చేసుకోవటానికి సిద్ధపడుతున్నాను." లోపలిగొంతు.
ఆ రెండు గొంతుల సంఘర్షణతో సతమతమయ్యే రేవతి ముఖంలోకి చూస్తూ వెటకారంగా నిరసనగా నవ్వాడు భాస్కర్.
"'నేను నమ్మలేను' అన్నది అందుకు కాదండీ! 'వుమన్ డే' అంటూ స్లోగన్లు దంచే మీరు కళ్ళు పోగానే భార్యకు విడాకులిచ్చెయ్యమని బోధిస్తున్నందుకు.... పురుషద్వేషిణినని చాటుకొంటూ ఆ కారణంగానే పెళ్లి చేసుకోనని చెప్పుకొంటూ ఏ ఆధారమూలేని అంధురాలికి విడాకులిచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవలసిందిగా కోరుతున్నందుకు! కానీ, అమ్మా! ఒక్క మనవి. నేను మీలా ఆధునిక భావాలు కలవాణ్ణి కాదు - మీ అంత సంస్కారం ఉన్నవాణ్ణి కాను - బాగా పాతకాలపు మనిషిని. మంచికో, చెడ్డకో ఒకసారి ఒకరిని పెళ్లి చేసుకున్నాక - కొన్ని సంవత్సరాలు ఇష్టంగానో, అయిష్టంగానో సంసారం చేశాక.... ఆ బంధం తెంచుకోగలిగే తెగింపు నాకు లేదు. నా భార్యని ఆవిడ కర్మానికి వదిలి నా సంతోషం నేను చూసుకోగలిగే కాఠిన్యమూ లేదు. నన్ను క్షమించి మీరిక్కడనుండి వెళ్లిపొండి."