జ్యోత్స్న! ఇటీవల పార్క్ లో నిన్ను కలుసుకోవటం లేదు. ఏ మనుకుంటున్నావు నన్ను గురించి? నేనేమనుకుంటున్నానో తెలుసా? నువ్వు ఎవరినయినా అనుకూలమయిన వాణ్ణి పెళ్ళిచేసుకుని సుఖంగా ఉంటే బాగుంటుందని.... ఈ భావన ఎంత తియ్యగా ఉందో అంత బాధగా ఉంది. నా స్వార్థం మీద నాకే కోపంగా ఉంది. నా నిగ్రహంలో నాకే నమ్మకం సడిలిపోతోంది. ఏ విధంగానూ నీ బ్రతుకు చక్కదిద్దలేని అసమర్థుణ్ణి, నీ మనసుతో ఆడుకోవటం అన్యాయం కదూ! అందుకే దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ దూరం శరీరానికి మాత్రమేనని అనుభవంమీద అర్థం చేసుకుంటున్నాను.
జ్యోత్స్నా! నీకు పునర్జన్మలో నమ్మకం ఉందా? నాకు ఒకప్పుడు ఉండేదికాదు. ఇప్పుడు నమ్ముతున్నాను, మళ్ళి జన్మలోనయినా నిన్ను చేరుకోగలనన్న ఆశకు ఊపిరి పోసుకోవటానికి....
"ఒక్క మాట! ఆ సుబ్బలక్ష్మి విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆవిడ మూర్ఖురాలే కాని, ప్రమాదకరమైన వ్యక్తి. నేను ఆవిడతో మాట్లాడిన మాటలు నీకు చెప్పి ఉంటుంది. బాధపడ్డావా? క్షమాపణ కోరుకోనక్కర్లేదులే! అలా ఎందుకు మాట్లాడానో, ఈపాటికి అర్థమయి ఉంటుంది.
ఉంటాను,
ఎలాంటి పరిస్థితుల్లోనయినా నీ వాడయిన
భాస్కర్...."
ఆ ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుకుంది జ్యోత్స్న.... ప్రతి అక్షరంలోనూ భాస్కర్ అనురాగమూర్తి ప్రత్యేక్షమవుతోన్న ఆ ఉత్తరాన్ని హృదయానికి హత్తుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంది. జ్యోత్స్న శరీరం అణువణువూ పులకించింది. అలాంటి పారవశ్యం అంతకుముందెన్నడూ అనుభవంలోకి రాలేదు జ్యోత్స్నకి.... ఒక చిన్న కాగితం ముక్క ఇంత అద్భుతమైన అనుభూతిని అందజేయగలుగుతోంది. లోకంలో మనసుకున్న శక్తి దేనికుంది?
అపూర్వమైన పెన్నిధిలా ఆ ఉత్తరాన్ని తనపెట్టెలో దాచుకుంది. పరీక్షకు కూచోగలుగుతున్న ఆనందంకంటె ఆ ఉత్తరం చదువుకోగలిగే ఆనందం పదిరెట్లు ఎక్కువగా ఉంది జ్యోత్స్నకి.... రోజు కొక్కసారైనా, ఏదో ఒక సమయంలో ఆ ఉత్తరం తీసి చదువుకోసాగింది.
జ్యోత్స్న చదువుకోవటం చూసి సుబ్బలక్ష్మి కుతూహలంగా పరీక్ష ఫీజ్ కట్టేశారా?" అని అడిగింది.
"ఆ! కట్టేశాను" అని చెప్పింది జ్యోత్స్న.
సుబ్బలక్ష్మి ఉత్సాహంతో "చివరకు నేను చెప్పినట్లే చేశారన్న మాట! ఎవరినడిగారు? మాజీ తహశీల్దారుగారినా! మచ్చల డాక్టర్నా?" అంది.
జ్యోత్స్న విసుగ్గా "ఎవరినో ఒకరిని. పోనిస్తూ...." అంది.
సుబ్బలక్ష్మి చిన్నబుచ్చుకుంది. అన్ని విషయాలూ ఆరా తియ్యటంలో సుబ్బలక్ష్మికున్న కుతూహలం ఇంతా అంతా కాదు. తనమీద విసుక్కొంటున్న జ్యోత్స్నను మళ్ళీ ప్రశ్నించే సాహసం లేక పోయింది.
కానీ, జ్యోత్స్నకి పరీక్షఫీజు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని మాత్రం తహతహలాడిపోసాగింది ఆ మూర్ఖురాలి మనసు. జ్యోత్స్న సరిగా సమాధానం చెప్పకుండా రహస్యంగా ఉంచే ప్రయత్నం చెయ్యటంతో ఆ కుతూహలం మరింత పెరిగింది.
14
తన దురదృష్టాన్ని క్రమ్ముకోవాలని సుశీల ఎంతగా ప్రయత్నించినా, సుశీల కళ్ళు బొత్తిగా కనిపించటం లేదనీ ఇకముందు కూడా చూపురాదనీ అందరికీ తెలిసిపోయింది.
భాస్కర్ తండ్రి కొడుక్కి ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో సారాంశం -
"చి|| సౌ|| కోడలికి కళ్ళు కనపడుట లేదని తెలిసినది. ఎంతో విచారించితిని. జరిగిపోయినదానికి ఏమియును చేయలేము, గుడ్డిదానితో కాపురము చేయుట కష్టము. మొన్ననే ఒక సంబంధం వచ్చినది - నీ ఉద్యోగము, మనస్థితి తెలిసికొని, పదివేలు కట్నమిచ్చెదననుచున్నారు. పిల్ల నలుపైనను లక్షణముగానే యున్నది...."
ఆ తరువాత ఆ ఉత్తరం చదవలేదు భాస్కర్. చింపి దూరంగా విసిరేశాడు. కన్న తల్లిదండ్రులే బిడ్డల బ్రతుకులకు శాపంగా పరిణమిస్తోంటే చెయ్యగలిగినదేముందీ? అంతులేని స్వార్థం దానికి అండగా ఎవరూ కరిగించలేని మూర్ఖత్వం....
తన తండ్రే అందరిలాగ తనమేలుకోరి చదువు చెప్పించి ఉంటే.... జరిగిపోయిన దానిని గురించి అలా కాక మరొకలా జరిగి ఉంటే, అనుకొని ప్రయోజనం లేదు.
ఎవరో స్వామివారు వచ్చారనీ, ఆయనను సేవించుకుని ఆయన చెప్పినట్లు పూజలు చేయిస్తే ఏ వైద్యులకూ లొంగని రోగాలు తగ్గిపోతాయనీ, ఎవరో చెప్పారు సుశీలకి - అలా రోగాలు తగ్గించుకొన్న చాలామందిని ఉదాహరణగా చూపించారు, వెంటనే ఆ స్వామిగారి దగ్గిరకు బయలుదేరింది. సుశీల భాస్కర్ ని తనతో రమ్మని ఎంతో బతిమాలింది.
"నాకు ఈ స్వామీజీలలో నమ్మకంలేదు. నేను రాను అన్నాడు భాస్కర్."