Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 30


    రేవతి ముఖం పాలిపోయింది.
    "నేను మిమ్మల్ని పెళ్లిచేసుకుంటానని చెప్పలేదు! ఊరికే మాటవరస కన్నానంతే!" అంది పై గొంతు.
    "దుర్మార్గుడా! నువ్వైనా నన్ను చేసుకుంటావని ఆశపడితే ఇలా చిన్నబుచ్చి మాట్లాడుతావా? నీకు తగిన శాస్తి కావలసిందేలే ఆ గుడ్డి దానితో అలాగే ఏ సుఖమూ లేకుండా యాతనపడు-" అని శపించుకుంది లోపలిగొంతు.     
    రేవతిని చూస్తే జాలివేసింది భాస్కర్ కి.
    "అనవసరంగా ఆత్మవంచన చేసుకోకుండా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోండి! గట్టిగా ప్రయత్నిస్తే మీకు తగిన సంబంధం దొరక్కపోదు."   
    రేవతికి మండిపోయింది. ఈ లోకంలో ఎవరైనా, ఏదైనా సహించగలరు. కాని తమ మనసుల మారుమూలల్లో దాచుకున్న నిజాలు బయట పెడితే మాత్రం భరించలేరు.  
    "ఛా! ఛా! దరిద్రపు మొగజాతి. ఈ మొగవాళ్ళను ఏమి చేసినా పాపం లేదు-" అని పళ్ళు నూరుకుంటూ వెళ్లిపోయింది.
                                                                              15
    సుబ్బలక్ష్మి వచ్చేసరికి జ్యోత్స్న భాస్కర్ తనకు వ్రాసిన ఉత్తరం చదువుకుంటోంది. సుబ్బలక్ష్మిని చూసి ఉలికిపడి ఆ ఉత్తరం అప్పటికప్పుడు పెట్టెలో పెట్టలేక తలగడక్రింద పెట్టేసింది.
    సుబ్బలక్ష్మికి అక్కర్లేని విషయం లేదు. అన్ని విషయాలూ తను అడగకూడదనీ తెలియదు. అంచేత "ఆ ఉత్తరం ఏమిటి? ఎవరు వ్రాశారు!" అని అడిగింది.  
    జ్యోత్స్న కంగారుపడుతూ "ఏం లేదు - ఏం లేదు" అనేసింది సుబ్బలక్ష్మి మూర్ఖత్వాన్ని పాపం జ్యోత్స్న పూర్తిగా అంచనా వేసుకోలేదు. లేకపోతే ఏదో కల్పించి చేప్పేసేది.
    జ్యోత్స్న కంగారుపడటమూ, ఆ ఉత్తరాన్ని రహస్యంగా దాచాలని ప్రయత్నించటమూ, సుబ్బలక్ష్మిలో ఎలాగైనా ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఆరాటాన్ని ఎక్కువ చేశాయి.  
    అవతలివాళ్ళ మనోభావాలు ఏ మాత్రమూ గ్రహించకుండా మాట్లాడెయ్యగలిగే శక్తి ఆవిడకుంది.   
    "మీరా ఉత్తరం చదువుతూంటే చూశాను. మీ ముఖమంతా సిగ్గుతో ఎర్రబడిపోయింది. మీలో మీరు నవ్వుకుంటున్నారు కూడాను - మీ వాళ్ళెవరైనా పెళ్ళి సంబంధం చూసి ఆ విషయం వ్రాశారా?"    
    నిర్ఘాంతపోయింది జ్యోత్స్న. పట్టరాని కోపంతో "ఇంక ఆ ఉత్తరం సంగతి వదిలెయ్యి." అని కసిరింది.
    జ్యోత్స్న అలా కసురుకోవడంతో సుబ్బలక్ష్మిలో కసి పెరిగింది. జ్యోత్స్న ఏదో మిత్రద్రోహానికి తలపడినట్లు బాధపడింది.
    తను అంతగా కసిరినా సుబ్బలక్ష్మి అక్కడినుంచి కదలకపోవడంతో, ఇంకా ఏం వాగుతుందో అని చిరాకువేసి "నాకు పనుంది" అని వంట గదిలోకి వెళ్లిపోయింది జ్యోత్స్న.
    జ్యోత్స్న అలా వెళ్ళగానే మంచీ, మర్యాదా ఆలోచించలేని సుబ్బలక్ష్మి తలగడక్రింద జ్యోత్స్న పెట్టిన ఉత్తరం అందుకుని జాకెట్ లో దాచుకుని పరుగుపెడుతున్నట్లు మెట్లుదిగి క్రిందకు వచ్చేసింది.  
    ఆ ఉత్తరం వెంటనే చదవాలి. ఎక్కడ చదవాలో అర్థం కాలేదు ఆవిడకి. అక్కడే మెట్ల దగ్గిరే చదివితే మధ్యలో జ్యోత్స్న. వస్తుందేమోనని భయపడింది. భాస్కర్ ఇంట్లోనే ఉన్నాడు. అంచేత రేవతి ఇంట్లో చేరింది.
    సుబ్బలక్ష్మి ఆయాసాన్ని- చెమటలు పట్టిన ఆ ముఖాన్ని చూసి "ఏమిటి?" అంది రేవతి.
    రేవతికి సుబ్బలక్ష్మి అంటే అభిమానమూ లేదు. గౌరవం అసలే లేదు. కానీ, సుబ్బలక్ష్మి చెప్పే కబుర్లు మాత్రం వింటుంది కాలక్షేపానికి....   
    సుబ్బలక్ష్మి జాకెట్ లోంచి ఉత్తరం తీసి "ఉత్తరం.... అంది.
    "ఉత్తరం ఏమిటి? ఎవరిది? నీ దగ్గిరెందుకుంది?"
    "జ్యోత్స్నది - రహస్యంగా చదువుతోంది. ఎవరు రాశారంటే చెప్పలేదు. తలగడ క్రింద దాచుకుంది. ఎత్తుకొచ్చేశా...." గొప్పగా నవ్వుతూ చెప్పింది సుబ్బలక్ష్మి.   
    రేవతి మనసులో సుబ్బలక్ష్మిని చీదరించుకుంది.
    రేవతి ఏమనుకుంటోందో లక్ష్యపెట్టకుండానే సుబ్బలక్ష్మి ఉత్తరం తెరిచి చదివేసి కెవ్వున కేక పెట్టింది.
    "ఏమిటీ?" అంది రేవతి చీదరగా, కోపంగా.
    "ఓయ్ దేవుడా! ఇది ప్రేమలేఖ. భాస్కర్ గారు జ్యోత్స్నకి రాశారు - చూశారా? దుర్మార్గుడు! 'సుబ్బలక్ష్మి విషయంలో జాగ్రత్త అని రాశాడు. ఛీ- ఛీ! ఇలాంటి పాపాత్ముణ్ణి నేనెక్కడా చూడలేదు.." కోపంతో ఒగరుస్తోంది సుబ్బలక్ష్మి.   
    భాస్కర్ జ్యోత్స్నకి వ్రాసిన ప్రేమలేఖ అనగానే విషయం తెలుసుకోవాలని ఆరాటంతో ఆ ఉత్తరం అందుకని చదివింది రేవతి.
    ఈర్ష్యతో ఆపాదమస్తకమూ భగ్గుమంది రేవతికి. ఎంత మధురంగా ఉంది ఆ ఉత్తరం? అలాంటి ఉత్తరం తన కింతవరకు ఎవరూ రాయలేదు. ఆ జ్యోత్స్నకి - ఆ బజారు మనిషికి - ఆ సిగ్గెగ్గులేనిదానికి వ్రాశాడు ఈ ఉత్తరం భాస్కర్. తన దగ్గిర ఏవో శ్రీరంగనీతులు వల్లించాడు? ఎలా పరాభవించాడు? తొందరపడి కాస్త తేలికయిపోయినందుకు చులకన చేసి అవమానించాడు! అందుకు బదులు తీర్చుకోవాలి. తానేదో పరమ పవిత్రుడయినట్లు కాదూ, ఈ ఫోజులు కొట్టాడు! ఆ బండారమేదో నలుగురిలో కడిగెయ్యాలి.

 Previous Page Next Page