అవుట్
బస్ దిగి సూట్ కేస్ రిక్షాలో వేసుకొని ఇంటికి బయల్దేరాడు శోభనాచలం సంవత్సరం దాటిపోయింది కాకినాడ వదిలి.
అక్కడి రోడ్డూ హోటళ్ళూ అన్నీ పాతవే అయినా కొత్తగా కనబడుతున్నయ్. రిక్షావాడు గంట కొడుతూ జనం మధ్యనుంచి బులెట్ లాగా దూసుకెళ్తున్నాడు. మెయిన్ రోడ్ లోకి వచ్చేసింది రిక్షా. ఓల్గా హోటల్ సెంటర్ చాలా సందడిగా ఉంది ఎప్పటిలాగే.
"కొంచెం మెల్లగా తొక్కవోయ్..."
స్నేహితులెవరయినా కనబడతారేమోనని అటూ ఇటూ చూస్తూ అన్నాడు శోభనాచలం. మార్కెట్టంతా బాగా రద్దీతో నిండిపోయింది. సాధారణంగా ఫ్రెండ్సంతా అక్కడే నుంచుని ఉంటారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం అక్కడే కలుసుకొని బాతాఖానీ వేయటం ఆ ఊళ్ళో కుర్రాళ్ళందరికీ అలవాటు.
"అపవోయ్- ఒకసారి ఆపు..." రిక్షా ఆపించాడు శోభనాచలం.
ఛటుక్కున రిక్షాలోంచి దిగి "రామన్న దొరా!" అంటూ పిలిచాడతను.
కిళ్ళీకొట్టు ముందు నుంచుని సిగరెట్ వెలిగించుకొంటున్న రామన్న ఆశ్చర్యంగా శోభనాచలం వేపు చూశాడు.
"ఓరినీ.... ఎప్పుడ్రా రావడం?" ఉత్సాహంగా దగ్గరకొచ్చి అడిగాడు.
"ఇదే! ఇప్పుడే బస్ దిగాను...."
"ట్రైనింగ్ అయిపోయిందా?"
"ఓ పోస్టింగ్ కూడా అయిపోయింది?"
"ఎక్కడ వేశారు?"
"హైద్రాబాద్."
"వెరీగుడ్! పార్టీ ఇవ్వాలొరేయ్- ఎగ్గొడదామనుకుంటున్నావేమో-"
"ఇంకేమిటి విశేషాలు? మన బాచ్ లో ఎవరూ రాలేదా?"
ఇప్పుడే సుబ్రహణ్యం, రామచంద్రరావ్, బాబూరావ్ గాడూ వెళ్ళిపోయారు..."
"అప్పుడే ఇంటికెళ్ళిపోయారా?"
"ఇంటిక్కాదు. బాబూమోహన్, బ్రహ్మనందం షూటింగ్ కి వస్తున్నారంటే హోటల్ కెళ్ళారు చూడ్డానికి..."
"ఓహ్! అది సరేగాని- ఈ మధ్య ఎక్కడైనా టోర్నమెంట్స్ కెళ్ళారా?" కుతూహలంగా అడిగాడు.
"మొదట్లో వెళ్ళాంగాని- కాలేజీతోపాటు ఆ ఉత్సాహం కూడా పోయిందిరా! ఇప్పుడెక్కడికీ వెళ్ళటం లేదు... ఆడటం లేదు...."
శోభనాచలం పూర్తిగా నిరుత్సాహపడిపోయాడు.
"అదేమిటి?" అడిగాడు దెబ్బతిన్నట్లు.
"పోనీరా! కూటికా, గుడ్డకా- వెధవ గేమ్స్ దేముంది కానీ - నీకిహ ఇటువేపు ట్రాన్స్ ఫర్ కాదా?"
"ఎందుక్కాదు? రెండుమూడేళ్ళల్లో వచ్చేస్తాను-"
"సరే! ఇంటికెళ్ళు... సాయంత్రం కలుసుకొందాం మళ్ళీ..."
రిక్షాలో కూర్చున్నాడు శోభనాచలం. అతని మనస్సంతా పూర్తిగా పాడైపోయింది. రామన్న అలా మారిపోయాడేంటి? ఫుట్ బాలన్నా, క్రికెట్ అన్నా ఎంత ప్రాణంగా ఉండేవాడు. తన ఆట చూసి సంతోషంతో ఉప్పోంగి పోతూండేవాడు.
`"ఒరే చలం! ఎన్నేళ్ళయినాసరే! ప్రాక్టీస్ చేసి నీలాగా ఆడతాన్రా.." అంటూండేవాడు. పి.ఆర్. కాలేజీలో తను క్రికెట్ కెప్టెన్. వాడు ఫుట్ బాల్ కెప్టెన్. ఫుట్ బాల్ మాత్రం వాడు చాలా అమోఘంగా ఆడేవాడు.
తను ఎలాగోలా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని, ఒక క్రికెట్ క్లబ్ పెట్టి, తన బాచి వాళ్ళందరితోనూ టోర్నమెంట్స్ కెళ్లాలనీ, తామే స్వయంగా నిర్వహించాలనీ అనుకున్నాడు. కానీ, మరి వీడేంటి ఇలా తయారయ్యాడు. కాలేజీ వదిలేసినంత మాత్రాన ఆ ఉత్సాహం, ఆటల్లో ప్రావీణ్యం కూడా వదిలేయాల్సిందేనా?
"హాయ్ చలం...."
ఉలిక్కిపడి అటువేపు చూశాడు శోభనాచలం.
'మనోరమ' హోటల్ కి పోయే సందు దగ్గర నుంచుని ఉన్నాడు రమణ.
"హాయ్ రమణా!" రిక్షాలోంచి దిగుతూ అన్నాడు.
"ఎప్పుడు, బాస్ రావటం?"
"ఇప్పుడే..."
రమణ తన జూనియర్. అతనికి తనే క్రికెట్ నేర్పాడు. తన తర్వాత కాలేజీలో రమణే మంచి బౌలర్. బాటింగ్ కూడా బాగానే చేసేవాడు .
"ఎలావుంది రమణా క్రికెట్- ఆడుతున్నావా?"
గట్టిగా నవ్వాడు రమణ.
"ఇంకేం క్రికెట్ బాస్! అన్నీ వదిలేశాం. జాబ్ కోసం చచ్చేట్లు తిరుగుతున్నాను ఈ క్రికెట్ ఎవడికి గుర్తుంటుంది? ఈ మద్యనో ఇంటర్వ్యూ కెళ్ళాలే! అక్కడ 'గేమ్స్' సర్టిఫికెట్స్ అన్నీ చూసి 'గెటవుట్' అన్నాడు.."
"అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు శోభనాచలం.
"ఖచ్చితంగా 'గెటవుట్' అన్లేదనుకో! వాడికసలు క్రికెట్ అంటే ఏమాత్రం పడదట- క్రికెట్ అంటే పనీ పాటా లేని వాళ్ళంతా ఉదయం నుంచీ సాయంత్రం వరకూ చేసే గాంబ్లింగ్ అన్నాడు. ఆ ఆటనీ, ఆడే వాళ్ళనీకూడా నేను ద్వేషిస్తానన్నాడు- థాంక్యూ- అనేసి బయట కొచ్చేశాను-" నవ్వుతూ అన్నాడు రమణ.
"ఇడియట్! ఎవడువాడు?" కోపంగా అన్నాడు శోభనాచలం.
"ఎవడో ప్రైవేట్ కంపెనీవాడులే! అది సరేగాని ఎన్నాళ్లుంటావ్ ఇక్కడ?"
"వారం రోజులు శెలవుపెట్టి వచ్చాను-"
"ఓకే! వెళ్ళుమరి- తరువాత కలుద్దాం-"
శోభనాచలం మళ్ళీ రిక్షాలో కూర్చున్నాడు.
ఈసారి అతనికి నిస్పృహతోపాటు ఆశ్చర్యం కూడా కలిగింది. రమణ ఇలా మారిపోయాడేమిటి? ఇదివరకు ఎప్పుడూ తనని వదలకుండా వెంటే తిరిగేవాడు. తనెక్కడికెళ్తే అక్కడి కొస్తూండేవాడు. క్రికెట్ గురించీ, పెద్ద పెద్ద ఆటగాళ్ళగురించీ, వాళ్ళ టెక్నిక్ గురించీ ఇరవై నాలుగ్గంటలూ మాట్లాడుతోండేవాడు.
ఇలాంటి ఉత్సాహం లేనివాళ్ళతో తనింక క్లబ్బేం పెట్టగలడు?
ఇల్లు చేరుకొన్నాడు శోభనాచలం. చెల్లాయిలూ తమ్ముళ్లూ అందరూ చుట్టుముట్టేశారు సంతోషంతో. రాత్రంతా తన ట్రైనింగ్ గురించీ ఉద్యోగం గురించీ వాళ్ళకు కబుర్లు చెప్తూనే ఉన్నాడు. కాని అతని మనసంతా జానకి మీదే ఉంది. నాలుగిళ్ళవతలే జానకి ఇల్లు. తనంటే ఎంత ఇష్టమని? తన ఆట చూసి ఉప్పొంగిపోతూండేది. బాటింగ్ చేస్తోంటే చాలా ప్రోత్సాహం యిస్తూ కేకలు వేసేది.
"అయ్ వాంట్ సిక్సర్- అయ్ వాంట్ సిక్సర్ - అయ్ వాంట్ సిక్సర్ చలం" అంటూ ఆమె గొంతు వినబడుతోంటే తనకూ ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చేది.
కారున్నా ఒకోరోజు కాలేజీకి తనతోపాటు నడిచి వచ్చేది.
"చలం! నిన్న ఎంత అద్భుతంగా ఉందో తెలుసా నీ బౌలింగ్- రియల్లీ- సింప్ లీ మార్వలెస్... అయ్ లైక్ యూ ఎండయ్ లవ్ యువర్ గేమ్!"
నువ్వు వచ్చింది శోభనాచలానికి. నిజంగా అవి- ఆ కాలేజీ రోజులు మనిషి జీవితంలో బంగారు కాలం కదూ- మొదటిసారి ఆమెని కలుసుకున్న రోజు తన కాలేజి టీమ్ కీ- ఇంజనీరింగ్ కాలేజ్ టీమ్ కి మాచ్ జరిగింది.
ఆట అయిపోయాక మామూలుగానే అంతా తనని చుట్టుముట్టేశారు. అందరూ ఎవరిదారిన వాళ్ళు పోయాక బెరుగ్గా తన దగ్గర కొచ్చింది జానకి.