"ఏమిటది?"
"నిక్షిప్తసంపత్తు ఎక్కడున్నదీ తెలుసుకున్నాక ఇంక ఉదయ చంద్రను నేలమాళిగలో బందీగ ఎందుకు వుంచవలసి వచ్చిందన్న ప్రశ్న ఉదయిస్తుంది."
"నిజమే!" సాలోచనగా అన్నాడు ఉదయ్ .
"ఉదయ్ తోట వదలివెళ్ళే లోపలే గుప్తసంపదను వశం చేసుకోవాలన్నదే వాళ్ళ ఉద్దేశ్యం. ఉదయ్ తోట విడిచి వెళ్ళేలోపలే వాళ్ళపని ముగించుకొని, ఎమీ ఎరగనట్టే గుర్తులన్నీ తుడిచిపారెయ్యాలన్నదే వాళ్ళ ప్రయత్నం.
"ట్రాన్స్ లో వున్న ఉదయ్ ద్వారా కావాల్సిన రహస్యాలన్నీ తెలుసుకొన్న తెల్లవారే, మానసి అతడ్ని నేలమాళిగలోకి తీసుకెళ్ళింది. బయటికివచ్చే మార్గాన్ని మూసివేసి బందీని చేశారు. ఆ రాత్రి తోటతో వున్న పనసచెట్లకింద త్రవ్వి గుప్తధనంకోసం వెదికారు. బావి దగ్గర వున్న పనసచెట్టు దగ్గర దొరకలేదు. అందుకే అక్కడున్న అన్ని పనస చెట్లక్రిందా త్రవ్వారు. అర్థరాత్రిదాకా ఈ పని నడిచివుండాలి. వారి కృషి ఫలించివుండాలి. అందుకే ఉదయ్ ను నేలమాళిగనుండి విముక్తిణ్ణి చేశారు. ఉదయ్ పూర్తిగా తెల్ల వారకముందే, ఇంకా చీకటి వుండగానే వెళ్ళిపోవడంవాళ్ళకు ఆనందాన్ని కలిగించి వుంటుంది. అయితే, ఉదయ్ వెళ్ళినటే వెళ్ళి తిరిగి తోటలోకి రహస్యంగా వచ్చి చూసిపోతాడని వాళ్ళు ఊహించి వుండరు."
"జస్ట్ ఏ మినిట్! జయంత్! నేను తిరిగితోటలోకి వెళ్ళినట్టు వాళ్ళకు తెలుసునంటావా?" సాలోచనగా అడిగాడు ఉదయ్.
"గోతులు తీసినవాళ్ళు పూడ్చకుండా వుంటారా? నువ్వెళ్ళిపోగానే గోతులు పూడ్చే కార్యక్రమం చేపట్టాలని వాళ్ళు నిర్ణయించుకొని వుంటారు. నువ్వు తిరిగిరావడం చూసి వాళ్ళు వెనక్కు తగ్గివుంటారు."
"యస్ . నీ అభిప్రాయం సరైనదే కావచ్చు" ఉదయ్ దూరంగా దేన్నో చూడడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.
దడాక్టర్ రావు అంతవరకూ రాసిన కాగితాలు, కలం టేబుల్ మీద పడేసి లేచినిల్చున్నాడు సిగరెట్ వెలిగించుకొన్నాడు.
"సో! ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?" గట్టిగా పొగపీల్చి వదులుతూ తనకు తనే ప్రశ్నంచుకుంటున్నాట్టుగా అన్నాడు జయంత్.
"ఇప్పుడేం చెయ్యాలి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేముందుమనం మరికొన్ని ప్రధానమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగి వుండాలి." ఆగి జయంత్ కేసి చూశాడు.
"చెప్పు ఏమిటా ప్రధానమైన ప్రశ్నలు?"
"మొదటిప్రశ్న....నేను ఎవర్ని? ఆ తోటకూ నాకూ వున్న సంబంధం ఏమిటి? ఈ శివరామయ్య ఎవడు? ట్రాన్స్ లో బాల్యావస్థకు చేరిన ఉదయ్ చంద్ర, చంద్రకిరణ్ అయ్యాడు అంటే నాఅసలుపేరు చంద్రకిరణ్ అయింవుండాలి. చంద్రకిరణ్, ఉదాయచంద్రగా ఎలా మారిపోయాడు? ఎప్పుడు మారిపోయాడు? ఇలా నా పేరు మార్చిందెవరు? మా అమ్మగారు __అనసూయమ్మగారు....ఓ మైగాడ్! చంద్రకిరణ్ తల్లి చనిపోయింది. మెట్లమీద ఆమె హత్యచేయబడింది. మరి చంద్రకిరణ్ తండ్రి బ్రతికున్నాడు. మరి చంద్రకిరణ్ , ఉదయచంద్ర ఒక్కరేనని ఎలా అనుకోవడం? చంద్రకిరణ్ అనే మరో పర్సనాలిటీ.....మరోమూర్తి శైశవావస్థ నుండి నాలో ఇమిడివుందా? అలా మరో మూర్తి నా అథోచైతన్యంలో దాగివు డడానికి కారణమేమిటి? ఏ ఏ భౌతిక, సాంఘిక పరిస్థితులు అందుకు దారితీశాయి? వీటి సరైన సమాధానాలు దొరికేంతవరకూ ఈ జటిలమైన సమస్యకు పరిష్కారం సూచించడం అసాధ్యం. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు జయంత్" మునివేళ్ళతో నుదురు నొక్కిపట్టుకొని ఉదయ్, వేళ్ళమధ్య జయంత్ ను చూశాడు.
"అనసూయమ్మగారు మీ తల్లి గారేనా?"
తుపాకిదెబ్బ తిన్నవాడిలా అదిరిపడి లేచినిలబడ్డాడు ఉదయ్.
"జయంత్ నువ్వుంటున్నదేమిటి?" ఉద్రేకంతో అతడి కంఠం స్పందించింది.
"అవును! అనసూయమ్మగారు నిన్ను పెంచిన తల్లి కావచ్చు, నిన్ను కన్నతల్లి చనిపోయింది. లేక హత్య చేయబడింది. లేక హత్య చేయబడింది. నీ తండ్రి కూడా ప్రాణాలకు ముప్పువుందని గ్రహించాడు. ఉన్న నగా, నట్రా అంతా పెట్టెలో పెట్టి భూస్థాపితంచేసి, ఆ దుర్మార్గుల బారినుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోనే ఆయన మరణించి వుండవచ్చు. లేక మీ తండ్రిగారే నిన్ను అనసూయమ్మకు అప్పగించి వుండవచ్చు. ఉదయ్ నిన్ను మళ్ళీ ట్రాన్స్ లో పంపించి, బాల్య వస్థలోకి తీసుకెళ్ళి చంద్ర కిరణ్ తో మాట్లాడగలిగితే ఈ ప్రశ్నలకు కొంతవరకు సమాచారం దొరకవచ్చు.
"పనసచెట్టు క్రింద నగలపెట్టె దాచిపెట్టిన తర్వాత మీ తండ్రిగారు నిన్ను చెయ్యిపట్టుకొని నడిపించారు....ఆ తర్వాత ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు అందుకే ఆ తర్వాతవాళ్ళు నిన్నేమీ అడగలేదు."
"కావచ్చు!" తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు ఉదయ్.
"ఈ చిక్కుముడి విప్పాలంటే ఒకటే మార్గం."
"ఏమిటది?"
"నిన్ను మళ్ళీ ట్రన్స్ లోకి పంపించాలి. అది నావల్ల సాధ్యం అవుతుందనుకోను. అయినా ప్రయహ్ట్నం చెయ్యమంటేచేస్తాను. రెండు..... మీ అమ్మగారు అనసూయమ్మగారి సహాయం కావాలి. తను నీ సోంతతల్లి కాదనీ, పెంపుడు తల్లిననీ ఆమె ఒకపట్టాన అంగీకరించకపోవచ్చు దాదాపు ఇరవై ఐదేళ్ళుగా నిన్ను పెంచి పెద్దచేసింది. ఈ దేశంలోవుంటే నీ ప్రాణానికి కూడా భద్రత లేదనే ఉద్దేశ్యంతోనే నిన్ను తీసుకొని అమెరికా వెళ్ళివుంటుంది. అసలు నువ్వు బ్రతికి వున్నట్టు మీ కుటుంబ శతృవైన శివరామయ్యకు తెలియకూడదనే అమెరికాలో నిన్ను అనసూయమ్మగారు పెంచివుండాలి. నీ జన్మ రహస్య మేదో ఆమె తన గుండెల్లోనే దాచుకొని, నిన్ను తన కన్నబిడ్డలాగే చూసుకుంది. బయటి ప్రపంచానికికూడా అదే అభిప్రాయాన్ని కలుగజేసింది.
"నువ్వు తప్పుకుపోయినప్పట్నుంచీ శివరామయ్య నీ కొరకు వెదుకుతూనే వుండాలి. మీ నాన్నగారు నగలూ వగైరా ఎక్కడ దాచారో తెలుసుకోవడానికే కొంతకాలంగా వేచివున్నారు. శివరామయ్యకాక ఇంకెవరైనా కూడా వుంనారా? శివరంయ్యకూ, మీ కుటుంబానికీ ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ అనసూయమ్మగారు సహకరిస్తే....."
డాక్టర్ ఉదయ్ ముఖంలో వచ్చిన మార్పును గమనించి ఆగిపోయాడు జయంత్ రావు.
"ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. మా అమ్మగారికి ఈ దేశం రావడమే ఇష్టంలేదు. నా బలవంతంమీద ఎలాగో అయిష్టంగానే ఒప్పుకుంది. ఇప్పుడు, ఈ జరిగిందంతా వింటే, అమెరికాకు రేపే ప్రయాణం కట్టమంటుంది. ఇన్నేళ్ళుగా ఆమె భయపడుతున్నది ఇందుకేనని అర్థమవుతున్నది. అందుకేనేమో నన్ను ఒక్కరోజుకూడా విడిచి వుండలేదు. గత నాలుగు రోజుల్నుంచీ నన్ను చూడలేక ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. డాక్టర్ రామారావు కూడా అదే అన్నారు. ఇప్పుడిదంతా విని ఆమె తట్టుకొనే స్థితిలో లేదు. ఇలాంటిదే ఏదో జరుగుతుందనే భయం ఆమెను ప్రతి నిముషం వెంటాడుతునే వున్నట్టుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మరొకటుంది. ఆమె నా కన్నతల్లి కాదనే విషయం. ఒకవేళ అదే నిజం అయితే.....నాకు తెలిసిపోయిందని ఆమెకు తెలియకూడదు. ఆమె అది భరించలేదు!....అందుకే జయంత్, మా అమ్మగారిద్వారా నిజాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం మానెయ్యడం మంచిది. నాకేమైనా పర్వాలదు. హంతకులు తప్పించుకున్నా నాకు బాధలేదు. కాని మా అమ్మ గారికి మనస్తాపం కలిగించడం నాకు ఇష్టంలేదు" అన్నాడు డాక్టర్ ఉదయ్ చంద్ర.
"యూ ఆర్ టూ సెంటిమెంటర్ డాక్టర్. " ఉదయ్ ముఖంలోకి చూస్తూ అన్నాడు జయంత్.
"కావొచ్చు. అయినా నా నిర్ణయం మారదు. ఇరవైఏళ్ళగా, దేశం కాని దేశంలో, నా అన్నవాళ్ళు లేనిస్థితిలో ఒంటరిగా ఆమె నన్ను తన ఒడిలో పెట్టుకుని పెంచి పెద్దదాన్ని చేసింది. ఆ త్యాగమూర్తి మనసు క్షోభ పెట్టడం క్షమించలేని నేరం కాదా జయంత్. నువ్వే చెప్పు?" డాక్టర్ ఉదయ్ కళ్ళు ఆర్ద్రమైనాయి.
"అవును ఉదయ్ ! నేను అంతదూరం ఆలోచించలేదు. మనం ఏం చేసినా మీ అమ్మగారికి తెలియకుండానే చేయాలి."
"ఏం చేద్దామని నీ ఉద్దేశ్యం?" ఉదయ్ అడిగాడు.
"డియస్పీ విల్సన్ రావుతో మాట్లాడదాం. వెంటనే శివరామయ్యను అరెస్టు చేయిస్తే అన్ని విషయాలూ బయటపడ్తాయి ఏమంటావ్?"
"శివరంయ్యకు ఏ నేరం ఆపాదించి అరెస్టు చేస్తారు? అసలు మనం ఏమని కంప్లైంట్ చెయ్యగలం?" ఉదయ్ సూటిగా ప్రశ్నించాడు.
"వెరీ సింపుల్!"
"ఎలా?"
"ఒకటి నిన్ను మూడురోజులు నిర్భంధంలో వుంచాడు. రెండు....భూమిలో నిక్షిప్తమైవున్న సంపదను అపహరించాడు. ఈ రెండు నేరాలు చాలవా?"
"అవి నేరాలే! కాని నేరాలు అతడు చేసినట్టు ఆధారాలు ఉండాలిగా? మొదటిది....నేను వారింటికి నా ఇష్టంతో వెళ్ళాను. ఆ విషయం శివరామయ్య తేలిగ్గా రుజువు చేసుకోగలడు. అయితే అక్కడ నన్ను బంధి చినట్టు మన దగ్గిర రుజువులేదు. అన్నీ యాదృచ్చికంగా జరిగిన సంఘటనల్లాగా కన్పిస్తాయి. కావాలని చేసినా, అలాంటి పరిస్థితులు కల్పించి, అవన్నీ యాక్సిడెంట్సుగానూ, యాదృచ్చికంగా జరిగిన సంఘటనలగానూ, కన్పిస్తాయి. దయ్యాలూ భూతాలూ అంటూ భయం కలిగించే కథలు చెప్పారని కేసు పెట్టలేం....."
"అవుననుకో! కాని ఆ నిధి...."
జయంత్ మాటని మధ్యలో తుంచి అందుకొన్నాడు ఉదయ్.
"నిక్షిప్త సంపదను అతను చేజిక్కించుకొన్నాడని చెప్పడానికిరుజువేమిటి? సాక్ష్యాలేమిటి? తోటలో త్రవ్వినట్టు గుర్తుండవచ్చు. ఆనవాళ్ళు కన్పించవచ్చు. కానీ అది తన తోట. గోతులు తీస్తాడో పూడ్చుకుంటాడో అది అతడి ఇష్టం. అంతగా ప్రశ్నిస్తే చెట్లకుఎరువు వెయ్యడానికి త్రవ్వా నంటాడు. అందుకే బహుశా అన్ని పనసచెట్ల చుట్టూ తవ్వారేమో? అంటే వారు త్రవ్విన ఆఖరు చెట్టుక్రింద నిధి దొరికిందనుకోవాలి. ఇది కూడా మన ఊహ మాత్రమే. బావి దగ్గిరి చెట్టు దగ్గరే దొరికితే ఇతర్లకు అనుమానం రాకుండా వుండేందుకు అన్నిచెట్లక్రిందా త్రవ్వించివుండొచ్చు శివరామయ్య. అతడు ఏంచేసినా చాలా జాగ్రత్తగా చెయ్యగల మనిషి మరో సందేహం..."
"ఏమిటది?" ఉత్కంఠగా అడిగాడు జయంత్.
"ఇంతకూ ఆ శివరామయ్యకు నిక్షిప్త నిధి దొరికిందన్న నమ్మకం ఏమిటి? అందుకే అన్ని పనసచెట్ల క్రిందా త్రవ్వుతూపోయాడేమో? అయినా వారి ప్రయత్నం ఫలించదని ఖచ్చితంగా చెప్పలేము. మరి ఏ ఆధారంతో విల్సన్ రావుతో, శివరామయ్యను అరెస్టు చెయ్యమని చెప్తాము?
"పైగా మనంచెప్పే సైకాలజీ, సైకో అనాలిసిన్, అంతా వాళ్ళకు అభూతకల్పనగానూ,పిల్లల ఆటగానూ అన్పిస్తుంది. ఇంతకీ శివరామయ్య చేసిన నేరమేమిటి నేను నాలుగైదేళ్ళ వయస్సులో వున్నప్పుడు నా అదో చేతనంలో ఇమిడి, నిద్రాణామైవున్న ఒక సంఘటన తాలూకు శివరామయ్య నా నుంచి పొందగలిగాదు."
"మరి అది నేరం కాదా?"
"ఇదే నేరమయితే మనం సైకియాట్రిస్టులుగా కొన్ని వందల, వేళ, నేరాలు చేసినవాళ్ళమవుతాము. పైగా మనం మనసు డాక్టర్లమైవుండీ, మన మనసును శివరామయ్య లేక మరోకడో దోచుకున్నాడని, కంప్లైటు చేస్తే ఆ పోలీదయన, మనల్ని పిచ్చివాళ్ళకింద జమకడ్తాడు."
జయంత్ విరగబడి నవ్వాడు.
"అవును రావ్ . పిచ్చివాళ్ళకు వైద్యం చేసిచేసి మనం కూడా పిచ్చివాళ్ళం అయిపోయామనుకుంటాడు. అలా భావించడం సహజమే. నేరస్తులతో ఏళ్ళకొద్దీ మెలిగిన పోలీసులకు, నేరమనస్తత్వమూ, హింసా ప్రవృత్తి అబ్బిన ఉదంతాలు మనం సైకాలేజీలో చదువుకొన్నాం. ఈ పరిస్థితిలో మనం శివరామయ్యమీద కేసు ఏ రకంగానూ పెట్టలేము. అందుకు ఆధారాలే కాదు, సాక్షులుకూడా లేరు అవునా జయంత్!" ప్రశ్నార్థకంగా చూశాడు ఉదయ్.
"అవును ఉదయ్ ! నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. అతడ్ని మనం ఇప్పుడేమీ చెయ్యలేము. అయిహే ముఖ్యమైన సంగతి ఒకటుంది. మీ తల్లి గారి హత్యకూ, మీ తండ్రిగారి హత్యకూ, ఆ శివరామయ్యకూ ఉన్న సంబంధం ఏమిటి? ఈ శివరామయ్యకు మీ కుటుంబంతోవున్న అనుబంధం ఎలాంటిది? ఈ నగలకోసమే శివరామయ్య వాళ్ళను హత్యచేయించాడా? ఈ చీకటి కోణాలమీద కొంత వెలుగు ప్రసరించాలి. ఆ వెలుగు బాట ఏదో నీనుంచే తెలుసుకోవాలి. అసలు సమస్యకు పరిష్కారం నీ మస్తిష్కంలోనే వుంది" డాక్టర్ జయంత్ సీరియస్ గా అన్నాడు.
డాక్టర్ ఉదయ్ అతడ్ని చిరునవ్వుతో పరికించి చూశాడు.
మెల్లగా నవ్వాడు.
"నీకా నమ్మకంవుంటే ఐయామ్ రెడీ. నేను సిద్దంగానే వున్నాను. ప్రయత్నించు" ధృడంగా స్పష్టంగా అన్నాడు ఉదయ్.
"షల్ ఉయ్ స్టార్ నౌ?" ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు జయంత్.
డాక్టర్ ఉదయ్ చంద్రవంటి ప్రముఖ సైకియాట్రిస్టుని, హిప్నటైజ్ చేసి ట్రాన్స్ లో పంపించే అవకాశం లభించినందుకు ఆనందంతో అతడి మనసు ఉరకలు తీసింది.
ఆనందంతోపాటు అంతటివాడ్ని ట్రాన్స్ లోకి పంపించడం తనకు సాధ్యమయ్యే పనేనా అనే సందేహం కూడా జయంత్ మనసులో మెదిలింది.
డాక్టర్ ఉదయ్ చంద్రను, డాక్టర్ జయంత్ సైకో ఎనాలిసిస్ చేంబర్ లోకి తీసుకెళ్ళాడు.
ఉదయ్ రిక్లింయరింగ్ చైర్లో కూర్చున్నాడు.
సన్నని వెలుగునిచ్చే లైట్ ఆం చేసి, డాక్టర్ జయంత్ ఉదయ్ చంద్రను హిప్నటైజ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
మెల్లమెల్లగా, జాగ్రత్తగా, ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉదయ్ చంద్ర మనసును తన అధీనంలోకి తెచ్చుకోసాగాడు.
ఇంతలో టెలిఫోన్ రింగురింగుమంటూ, నిర్విరామంగా మోగ సాగింది.
జయంత్ తను చేసిన పొరపాటుకు చిరాకుపడ్డాడు. టెలిఫోన్ బయట పెట్టకుండా, కనీసం తీసైనా పక్కన పెట్టకుండా, హిప్నటైజ్ కార్యక్రమం సాగించడం ఎంత అవిలేకమో గుర్తించాడు.
"జయంత్! ముందా ఫోన్ సంగతేదో చూడు?"
ఉదయ్ గొంతు వింటూనే జయంత్ తృళ్ళిపడ్డాడు.
అంతవరకూ తను చేసిన ప్రయత్నం అంతా వ్యర్థం అయినందుకు బాధపడుతూ, వెళ్ళి రిసీవర్ ఎత్తాడు.
"ఎవరు కావాలి?"
జయంత్ లోని కసి అంతా గొంతులో పలికింది.
"డాక్టర్ ఉఅడి చంద్ర" అవతలిగొంతు ఎవరో పిసికేస్తున్నట్టుగా ధ్వనించింది.
"ఎవరు నువ్వు?" విసురుగా అరిచాడు జయంత్.
"మానసిని! ఉదయ్ చంద్రను త్వరగా పిలవండి" ఆమకంఠంలో వణుకు స్ఫురించింది.
"మానసి!" ఆశ్చర్యపోతూ అప్రయత్నంగానే అనేశాడు.
"ప్లీజ్ త్వరగా పిలవండి. వాడు...వాడు నన్ను వెంటాడుతున్నాడు. దయచేసి త్వరగా పిలవండి మీకు పుణ్యముంటుంది ప్లీజ్."
అప్పటికే ఫోన్ దగ్గిరకొచ్చి నిలబడ్డ ఉదయ్ రిసీవర్ అందుకున్నాడు.
"మానసీ!" నేను ఉదయ్ మాట్లాడుతున్నాను."
"వాళ్ళు నన్ను తరుముకొంటూవస్తున్నారు బస స్టాండు పబ్లిక్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. త్వరగా వచ్చేయ్యండి ప్లీజ్." ఎన్ క్వయిరీకౌంటర్ దగ్గరకొచ్చి నిలబడండి. నేను మిమ్మల్ని కలిసేదాకా అక్కడే వుండండి. వెళ్ళిపోవద్దు ప్లీజ్. త్వరగా రావాలి. వెంటనే బయలుదేరండి" అవతల ఫోన్ పెట్టేసే ధ్వని విన్పించింది."