ఇంతలో నా క్లాసు పిల్లలు కొంతమంది నా చుట్టూ చేరి " మా కొత్త టిచర్...కొత్త టిచర్ !" అంటూ వాళ్ళ అమ్మలకి చూపిస్తున్నారు.
"రేపుకూడా మీరే వస్తారా మిస్!" అంటూ వాళ్ళ లేత లేత చేతులతో తడుముతుంటే, నా బాధంతా ఎవరో ఇట్టే చేత్తో తీసేసినట్లుగా అనిపించింది.
'ఈ పాల మనసుల్లో, బెల కళ్ళల్లో కుత్సితం లేదు కదా భగవంతుడు మనసుల పరిణితిని ఇక్కడే ఆపేస్తే ఎంత బాగుండేది?' అనుకున్నాను.
స్కూల్ ఆవరణ దాటి రోడ్డుమీదకి వస్తూవుంటే 'నేనూ ఉద్యోగస్తురాలినయ్యానూ....' అని ఎవరి తోటైనా చెప్పుకోవాలనిపించింది.
ఎవరున్నారూ? విజయ తప్ప! వెంటనే ఆటో పిలిచి విజయ ఇంటికి బయల్దేరాను.
విజయ నే వెళ్ళేసరికి పైన ఆఫేస్ రూమ్ లో వుంది. దాని నవ్వు బయటికి వినిపిస్తోంది!
ఎవరో చక్కగా, నిట్ గా ముస్తాబై వున్న కుర్రవాడు , తియ్యని ఇంగ్లీషు ఉచ్చారణలో దానికేవో జోకులు చెప్తున్నాడు. విజయ తల ముందుకి, వెనక్కి వూపుతూ పడీ పడీ నవ్వుతోంది.
నన్ను గుమ్మందగ్గర చూడగానే, "హాయ్! వాటేసర్ ప్రైజ్ ! వన్ మినిట్ వెయిట్ చెయ్యి డియర్' అని రిక్వెస్టింగ్ గా చూసింది.
నేను పదినిమిషాలు పక్కగదిలో వెయిట్ చెయ్యాల్సొచ్చింది. ఈ లోగా ముప్పైమూడు సార్లు దాని క్లైంట్ నీ ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నాను.
విజయ అతన్ని పంపించాక నా దగ్గరికి వచ్చి "ఏవిటే విశేషం?" అంది.
నేను ఆత్రంగా "నాకు ఉద్యోగం వచ్చింది తెలుసా?" అన్నాను.
"తెలీదు! ఆయాసంవచ్చిందని తెలుసు ముందు మంచినీళ్ళు తాగు...." అంటూ జోక్చేసింది.
నేను బుంగమూతి పెట్టి చూశాను.
"ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నవే" అంది.
అలసటతో జిడ్డుకారుతున్న నన్ను వెక్కిరించడం లేదుకదా! అని అనుమానంగా చూశాను.
"నీకు ఆ రాళ్ళదుద్దుల కంటే ఈ చిన్న రింగులే బావున్నాయి! అలాగే ఇలాంటి నిండు ప్రింట్ చీరలే బాగా నప్పుతాయి. అచ్చం పెళ్ళికాని పిల్లలాకొబ్బరి ముక్కలావున్నావనుకో!" అని కన్నుకొట్టింది.
విజయ నన్ను కిందకి తీసుకొచ్చి బెడ్ రూమ్ లో వదిలి, కిచెన్ లోకి వెళ్ళింది.
నన్ను నేను అద్దంలో చూసుకోవాలనే కోరికని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నిజమే! విజయ అన్నట్లు నేనీరోజు చాలా అందంగా వున్నాను. అలసీ చిరుచెమట పట్టిన మొహంకూడా అందంగానే వుంటుందన్నమాట!
విజయ వస్తున్న అలికిడి కాగానే గబుక్కున వచ్చి మంచంమీద కూర్చున్నాను.
ఆరెంజ్ జ్యూస్ గ్లాసులు తీసుకొచ్చి ఒకటి అందిస్తూ "ఇప్పుడూగానీ నిన్ను వివేక్ చూస్తేనా!" అంది.
నేను చిరాగ్గా "అతనిలో నాకేంసంబంధం? నన్ను ఇంకెవ్వరూ చూడరనా నీ ఉద్దేశ్యం?" అన్నాను.
అది విజిల్ వేసి "ఏవిటి సంగతి? ఎవరైనా లైన్లో పడ్డారా? ఎవరే ఆ అదృష్టవంతుడూ?" అంది.
నాకు వెంటనే నిన్న వివేక్ ఫ్రెండ్ సారథి నాతో ప్రవర్తించిన విధానం గుర్తొచ్చింది. దానికి అంతా చెప్తూ "నేను చాలా అందంగానూ, డిగ్రీ చదువుతున్న అమ్మాయిలనూ వున్నానన్నాడు. వివేక్ అదృష్టానికి ఈర్ష్యపడ్డాడు. ఎన్నడూ లేనిది తనతో రవీంద్రభారతికి రమ్మన్నాడు... ఎందుకంటవె?" అన్నాను.
"దాన్నే అంటారే తల్లీ...లైన్ వెయ్యడం అని! ఇంతకీ....ఎలా వుంటాడే? ఓ చీజ్ బడి మస్త్ ...మస్త్ హై అనిపిస్తాడా?" అంది.
నాకు నవ్వొచ్చింది కాలేజీరోజుల్లో ఎవరైనా అందంగా కనిపిస్తే 'ఒసే....నువ్వు కొడ్తావా? లేక నేను కొట్టనా కన్ను?' అనడం, సరదాగా కామెంట్స్ పాస్ చెయ్యడం మామూలే, ఇప్పటికీ విజయ సమక్షంలో అలాంటివి నాకు ఎబ్బెట్టుగా అనిపించవు! కానీ నాకెప్పుడూ థీయరీలో ఫస్ట్ మార్కులూ...ప్రాక్టికాల్స్ లో అత్తసరు మార్కులూనూ! అందుకేగా సైన్స్ గ్రూప్ నుండి ఆర్ట్స్ గ్రూపులో మార్చుకున్నదీ!
"ఏవిటే ఆ సిగ్గు? నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు నువ్వు" అంది విజయ.
నేను పెద్దగా నవ్వేసి "ఫరవాలేదు బాగానే వుంటాడు పాపం!" అన్నాను.
విజయ వెంటనే" అందంఅంటే, తెల్లగా, పొడవుగా, లావుగా వుండడం కాదే.... మగవాడి అందం తెలిసేదీ అతని మాటలలో, చేతుల్లో, తెలివితేటల్లో...." అంది.
నేను గురూపదేశం పొందుతున్న శిష్యురాల్లా దానివైపు చూస్తూ శ్రద్దగా వినసాగాను.
"నా దగ్గరికి ఇందాకా వచ్చినతన్ని చూశావుగా! సాదారణంగానే కనిపిస్తాడు. కానీ అతను మాట్లాడ్తూ వుంటే చాలా ఎట్రాక్టివ్ గా వుంటుంది. అసలు అబ్బాయి లంటే అలా వుండాలి....చాకులా!" అంటూ చేతిలోని క్యాడ్ బరీస్ కసిక్కున కొరికింది.
నేను దానిమాటలకు ఉలిక్కిపడ్డాను!
నిన్న మధ్యాహ్నం బొంగరం మావయ్యా, వివేక్ స్త్రీలు ఇలా మాట్లాడుకోగలరా?' అనుకున్నాను మాట్లాడుకోగలరు! ఇప్పుడే తెలిసింది.
"రాత్రుళ్ళు నిద్రపడ్తోందా? అలవాటైన పనులు సడెన్ గా మానెయ్యడం అంటే మాటలు కాదుగా!" విజయ కవ్విస్తున్నట్లుగా అడిగింది.
నేను ఠక్కున లేచి నిలబడ్డాను.
"ఓ....సారీ! ప్రాణస్నేహితురాలినిగా అందుకే కష్టం, సుఖం విచారించానే!" అంది.
నేను ఎర్రగా చూస్తూ "నాకు ఉద్యోగం వచ్చింది అని ఆనందంగా చెప్పడానికొచ్చాను. వున్ను ఆ విషయం ఒక్కమాటైనా అడిగావా? నువ్వేం స్నేహితురాలివే?" అన్నాను.
విజయ నాకు ఓ చాక్లెట్ అందిస్తూ
"ఏ ఉద్యోగం అయినా సరే నువ్వు ఓ నెల రోజులు నిలకడగా చేసి జీతం అందుకున్నాక అప్పుడు చెప్తాను కంగ్రాట్స్" అంది.
చాక్లెట్ అందుకుని నేను కోపంగా విసావిసా బయటకి నడిచాను.
* * *
ఇంటికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లగానే టీపాయ్ మీద వివేక్ పెట్టిన స్లిప్ కనిపించింది. 'తన్మయితో డిన్నర్ కి వెళ్తున్నాను.... నాకు వంట చెయ్యకు!' అని వ్రాసుంది.
నిన్నటి భార్యనన్న ఇంగితం కూడా లేకుండా తనప్రియురాలితో తిరుగుతున్న సంగతి ఎంత బహాటంగా చెప్పుకుంటున్నాడూ? ఛీ...ఛీ ఏం మనిషీ?
మనసంతా చేదుగా మారింది. గుండెల్లో ఏదో ఆరని మంట! కళ్ళనుండి నా ప్రమేయం లేకుండానే ఆగకుండా నీరు కారసాగింది. ఇలాంటి బాధ అతనూ అనుభవించాలి! కానీ ఎలా? నేను అర్జెంటుగా ఓ బోయ్ ప్రెండ్ నీ చూసుకుంటేనో!
ఔను! అదే కరెక్ట్ ఆలోచన. అతనితో నేను వివేక్ కళ్ళముందే షికార్లు కొట్టాలి. ఈ నరకం ఎలా వుంటుందో చవి చూపించాలి.
కానీ ఎవరున్నారు? నాకు తెలిసిన మగాళ్లందరినీ గుర్తుచేసుకోసాగాను. పక్కింటి శ్యామలరావూ... ఎదురు మేడమీదుండే బ్రహ్మచారీ...ఛ! వాళ్లిద్దరికీ నేనంటే ఎంతో గౌరవం!
పోనీ సారథి అయితేనో...నో! అతను పక్కన కూర్చుంటేనే భరించలేకపోయాను. ప్రొద్దుట స్కూల్లో కలిసిన సార్.... నా ఆలోచనకి నాకే కంపరమేసింది. అతని దగ్గర్నుండి వచ్చిన జర్దాపాన్ నాసనా, చెమట కంపూ గుర్తొచ్చి కడుపులో తిప్పింది. నాకు తెలిసిన, పరిచయం వున్న మగాళ్ళందరినీ గుర్తుచేసుకున్నాను. ఎవరూ నచ్చలేదు!
కాలేజీ డేస్ లో చాలామంది మగ క్లాస్ మేట్స్ నా చుట్టూ తిరిగేవారు! వాళ్లంతా ఇప్పుడెక్కడున్నారో? ఒక్కడంటే ఒక్కడైనా కనిపించడేం? వివేక్ తిక్కకుదర్చడానికీ! ఆ రాత్రంతా కూడా ఇలాంటి ఆలోచనలతోటే జాగరణ చేశాను.
విచిత్రంగా మరునాడే వాళ్లందరినీ కలుసుకునే అవకాశం నన్ను వెతుక్కుంటూ వస్తుందని ఆ నిమిషంలో నేను అసలు ఊహించలేదు!
* * *
"మిసెస్ పట్నాయక్ ఫోన్ చేసింది. పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఏదో వుందిట. నిన్ను తీసుకురమ్మని చెప్పింది. లోకానికి ఇంకా తెలీదుగా మనం విడిపోయిన సంగతీ!" వివేక్ టీ తాగుతూ చెప్పాడు.
"ఇద్దరమేనా? మరి మీ గర్ల్ ఫ్రెండో?" మనసు ఊరుకోలేకపోయింది అడిగేశాను.
"ఎవరూ? తన్మయి గురించా? తనూ వస్తుంది" మామూలుగా అనేసి వెళ్ళిపోయాడు.
"నేను తప్పకుండా వెళ్తాను. అలాంటి చోట నాకో బోయ్ ఫ్రెండ్ దొరకచ్చు!" అక్కసుగా అరిచాను.
"విష్ యూ గుడ్ లక్!" అంటూ వివేక్ నుండి వెంటనే వచ్చింది సమాధానం.
సాయంత్రం కాస్త త్వరగా బయల్దేరి ఇంటికీ రావాలి. పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ కి తప్పకుండా హడావుడి పడినా ఐదునిమిషాలు లేట్ అయింది. గేట్లోనే పట్టుకుని సార్ నాకు పంక్చునాలిటీ గురించి లేక్చారిచ్చాడు. దాంతో అరగంట లేట్ అయింది! నేను క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టేసరికి క్లాసు సినిమా వదిలి పెట్టేసిన తర్వాత హల్లా వుంది!
చిన్నక్లాసుల్లో ఎలాగో మేనేజ్ చేసేశాను. కానీ పెద్దక్లాసుల్లో, అదీ ఎనిమిదీ, తొమ్మిదీ తరగతులకి వెళ్ళినప్పుడు నెర్వస్ గాఫీల్ అయ్యాను. అరచేతుల్లో చెమటపట్టి గొంతు వణికి, నాలిక తడారిపోయి. నేనేం చెప్తూన్నానో నాకే తెలీకుండా అయిపోయింది. ముఖ్యంగా మగపిల్లలతో చిక్కోచ్చింది అప్పుడప్పుడే మారుతున్న కంఠస్వరంతో, మామాగు మీసాలతో అదోలాంటి పోకిరీతనంతో ప్రవర్తించిన తీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టింది.