రవణ మొహంలో సంతోషమూ చప్పున దుఃఖమూ కనపడ్డాయి.
"అవును. అది మీ నాన్నగారి వూరు కదూ? ఆయన అక్కడే పనిచేశారు.
నేనొకసారి వచ్చి ఆయన్ని చూశాను. నీవు చిన్నపిల్లవి. నేను జ్ఞాపకం వుండి వుండను."
"నాన్నగారని చూడ్డానికి పై వాళ్ళు రోజూ నలుగురైదుగురు వొచ్చేవాళ్ళు. జ్ఞాపకం పెట్టుకునేదెట్లా? అయితే ఎవరూ నన్ను పలకరించకుండా వెళ్ళేవారు కాదు."
"అవును. అంత గొప్ప ఆదర్శాలూ, కార్యోత్సాహం, త్యాగం వున్న మనిషిని చూడలేదు నేను."
తన తండ్రి శ్లాఘనతో రవణ హృదయం వెంకట్రావు గారిదై పోయింది.
"ఇల్లారా. కూచో, యిక్కడ బావుందా నీకు?"
"ఆ"
ఆ రాత్రి వెంకన్నపంతులు చేసిన పనీ, గోపాల్రావు తిప్పలూ జ్ఞాపకం వొచ్చాయి.
"కాని...."
"చెప్పు"
"ఏం లేదు. బాగానే వుంది."
"గోపాలానికి బావుండలేదట."
"అవును"
"నువ్వు చూస్తున్నావు గద?"
"ఊఁ"
"మరి నేను అతన్ని తీసికెడితే యాడాద్దాకా కనపడడు"
దిగులుగా చిరునవ్వు చూసింది.
"పోనీ, నువ్వు కూడా వొస్తావా?"
సంతోషంతో కళ్ళు తళ తళ లాడాయి.
"కాని రానిస్తారా?"
"ఎందుకు రానియ్యరు?"
"పని?"
"ఏం పని? ఆ రావమ్మ యేం చేస్తుంది? ఎల్లకాలం నువ్వే చేసి పెడతావా?"
రవణ వెళ్ళడానికి వెంకన్న పంతులికేమాత్రం యిష్టంలేదు. కాని వొద్దనడానికి కారణ మేం చెబుతారు?
రెండురోజుల్లో ఒక మధ్యాహ్నం బయలుదేరారు. బండిలో రవమ మొహం కలకలలాడుతోంది. గోపాలరావుకి సంతోషం పొంగిపోతున్నది. ఈ రావమ్మా, కుర్రాళ్ళూ, చీకటి హాలూ, ఆ పాత మంచం అన్నీ. తామూ బయలుదేరుతామని కిందపడి దొర్లి యేడ్చే నారాయణా, నరుసూ అరిచే అరుపులూ, మంగళ వాద్యాలుగా వినపడుతున్నాయి అతనికి. కాని దయదలిచి వాళ్ళని కూడా రమ్మనరు కద అని భయమేసింది. "వస్తేనేం రానీ, బందరు సంగతి చూపిస్తాను" అనుకున్నాడు. ఒక మల్లుపంచకట్టి, మోకాళ్ళవరకూ వచ్చే నల్ల చారల కోటువేసి, పాత ఫెల్టుక్యాప్ నెత్తిమీద పెట్టి మరచెంబుతే నడుస్తున్నాడు బండి వెనక. బండిలో ఎక్కినప్పణ్నుంచి రవణ వాళ్ళలోంచి వొచ్చేసి తనదైపోయినట్లు కనపడ్డది.