నీకో విషయం గుర్తుందా? నేనూ మన పక్కింటి సరస్వతీ చిన్నప్పుడు సరదాగా చింతచెట్టువరకూ పరుగుపందెం వేసుకున్నాం! పందెం ఆఖర్లో నాకు అలుపు వచ్చేసింది. పరుగు ఆపేసి ఒగరుస్తూ నడవడం మొదలెట్టాను. దాంతో సరస్వతి గెలిచింది. నేను నడుస్తూ రావడం చూసి నువ్వు "షేమ్, షేమ్" అంటూ అరిచావు. అవునా?
రాజీ! ఇప్పుడూ నేను చేస్తున్న పనికి అలాగే అరిచి హేళన చేయి! నీ అరుపు నాకు వినిపించకపోయినా ఫరవాలేదు. కానీ నువ్వు అరవాలి. నాలాగా అలసిపోయి జీవితం ముగించేవారికి నీ అరుపులు సిగ్గు కలిగించాలి. ఇంక వుంటానే! అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూచుకో! నా గురించి బాధపడకు..."
శాంతి ఉత్తరాలన్నీ ముక్కముక్కలై పోగుగా తయారయాయ్. చాలాసేపు ఆ ఉత్తరాలు చూస్తూ మౌనంగా రోధిస్తూండిపోయింది రాజి.
"అక్కా! ఎవరో నీచులు నిందించారని ఇంత దారుణానికి ఒడిగట్టావా? నిన్ను ఇన్ని హింసించిన ఆ దుర్మార్గుడినే అంటిపెట్టుకుని వుండే బదులు మనింటికి వచ్చేసి నీ జీవితం నువ్వు గడిపితే ఎంత బాగుండేది! నీకు చదువుంది. తెలివితేటలున్నాయ్! నీ పొట్ట నువ్వు పోషించుకునే ఆధారం నీకు దొరకకపోయేదా? ఎంత పిచ్చిపని చేశావక్కా..." కన్నీరు తుడుచుకుని పక్కనే వున్న అగ్గిపెట్టే తీసి ఆ ఉత్తరాల కుప్పకు నిప్పు అంటించబోయిందామె. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు ఆగి లేచి హాల్లోకెళ్ళి టీపాయ్ మీదున్న న్యూస్ పేపర్ తీసుకొచ్చి మధ్య పేజీ ఓసారి చూసింది మళ్ళీ.
శాంతి ఫోటో అందంగా, ఆకర్షణీయంగా, పెళ్ళి అలంకరణలో మెరిసిపోతోంది. దానికింద వాక్యాలు నల్లగా, శూలాల్లా గుచ్చుకుంటున్నాయ్.
"మమ్మల్ని దుఃఖసాగరంలో ముంచి భగవంతుని సన్నిధి చేరిన శాంతి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తూ విలపించే భర్త, అత్తగారు, ఆడపడుచులు..."
ఆ న్యూస్ పేపర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చించి ఉత్తరాల పోగుమీద వేసి నిప్పంటించిందామె.
మరుక్షణంలో కాగితం కాలే వాసన. నల్లని పొగ గదంతా నిండిపోయినయ్. రెండు నిమిషాల్లో కాగితాలు మసి అయిపోయాయ్.
"అరె! ఏమిటోయ్! ఏం జరుగుతోందీ?" అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భర్త గొంతు విని నెమ్మదిగా తల తిప్పి అతనివేపు చూసింది రాజి.
"పాత ఉత్తరాలు..." అంది క్లుప్తంగా.
"నీకు పిచ్చెక్కిందా ఏమిటి? కాగితాలు ఇంట్లో తగలేస్తారా ఎక్కడయినా?" ఆశ్చర్యంగా అన్నాడతను.
ఆమె ఏమీ మాట్లాడకుండా కాగితాల బూడిదంతా ఎత్తి బయటపారవేసి చేతులు కడుక్కుని వచ్చింది.
"ఇదిగో! ఊరంతా తిరిగి తిరిగి ఇవాళ ఓ బ్రహ్మాండమయిన పని చేశానోయ్. మన హాల్లో గోడకు పెట్టడానికని బ్రహ్మాండమయిన పెయింటింగ్ ఫ్రేమ్ కట్టించి తెచ్చేశాను చూస్తావా?"
పాకెట్ విప్పుతూ అన్నాడతను. చాలా పొడుగ్గా, వెడల్పుగా ఉందా ఫ్రేమ్.
అతను కాగితాలన్నీ లాగి దారాలు తెంచుతూంటే మౌనంగా, నిర్లిప్తంగా చూడసాగింది రాజి
"ఇది చూసి మా ఆఫీస్ వాళ్ళందరూ ఇలాంటి దానికోసమే ఎగబడి అర్డర్లిచ్చారు అందరికీ ఎంతో నచ్చిందట ఇది..."
ఆ పటం రెండు చేతులతో పట్టుకుని ఆమెకు చూపాడతను.
అభయహస్తం ఇస్తోన్న శ్రీరామచంద్రుడు, ఆయన పక్కనే అందంగా దిగులుగా కనబడుతోన్న సీత బొమ్మ.
బొమ్మకు కిందుగా ఓ పక్క సీత అందరి సమక్షంలో అగ్ని ప్రవేశం చేసే దృశ్యం! మరోపక్క లవకుశలను అడవిలో అక్కున చేర్చుకున్న దృశ్యం.
"చాలా అద్భుతంగా ఉంది కదూ! రోజూ కాసేపు దీనివంక చూస్తే చాలా మనక్కూడా పవిత్రత వస్తుంది" ఉత్సాహంగా చెప్తున్నాడతను. రాజీకి అతని మాటలు వినిపించటం లేదు! ఎదురుగ్గా అతను చూపుతూన్న సీతారాముల బొమ్మ కనిపించటం లేదు! రాములువారి స్థానంలో శాంతి భర్త కనబడుతున్నాడు. అగ్ని ప్రవేశం జేస్తున్న సీత స్థానంలో వంటిమీద కిరసనాయిల్ పోసుకుని నిప్పంటించుకున్న శాంతి కనబడుతోంది.
ఆకస్మాత్తుగా ఆమెలో ఆవేశం పొంగుకొచ్చింది.
ఎందుకో ఎవరిమీదో తెలీని కసి.
జాగాన్నే కదిలించి వేసేంత శక్తి ఆవహించిన దానిలా అతని చేతిలో పటాన్ని అమాంతం లాక్కుని విపరీతమయిన బలంతో నేలకేసి కొట్టింది. అది ఎంత శక్తివంతంగా నేలకు కొట్టుకుందంటే- అద్దంతో పాటు లోపలి పెయింటింగ్ కూడా ముక్కలయిపోయేంతగా. అతను నివ్వెరపోయి మాట లేకుండా ఆమె వంక చూస్తూండిపోయాడు.