"యిక్కడ పడుకున్నావేం? అన్నాడు రహస్యంగా.
వెంకన్నపంతులుకి తెలుసు, రావమ్మ లేచి పిలుస్తే పలకడానికి దగ్గరగా వుండాలని రవణ అక్కడ పడుకుందని. రవణ లేచి కళ్ళు తెరిచిచూసి నుంచోబోతుంది. పంతులు చేతులు ముందుకు వస్తున్నాయి; వెనక్కు తగ్గుతున్నాయి. తను ఆమెని పట్టుకుందామనే అనుకుంటాడు, చేతులెత్తలేడు, యింకా కళ్ళు నలుముకుంటోనే వుంది. యామంటుంది! సిగ్గుకదూ? యెవరితో చెప్పుకుంటుంది? తన విషయమై నమ్ముతారా? ఐనా యెవరున్నారు చెప్పుకోడానికి? దాని మొహం! అదేం చేస్తుంది? వూరికే యెందుకు తిండిపెట్టాలి? నుంచుంటోంది. వీపు వెనక నించి చేతులేసి పట్టుకుని దగ్గిరికి లాక్కుంటున్నాడు. రవణకి అర్ధమైనట్టులేదు.
"ఎక్కడికి?" అంది.
నోరుమీద నోరుపెట్టాడు. యాలక్కాయల వాసన వేసింది. జుట్టు కొత్త శీకాయ వాసన వేసింది. రబ్బరుమల్లే నడుము, వెచ్చగా చెయ్యికింద సాగుతోంది. ఏ అర్ధరాత్రో ఎముకులకుప్పని, రావమ్మని కావలించుకోడానికి అలవాటుపడ్డ వెంకన్నపంతులు కది స్వర్గంలాగుంది. రవణ దూరం జరుగుతోంది, ఒదిలించుకుంటోంది. పట్టుకుని బలాత్కరించే ధైర్యంలేదు పంతులికి. రవణ వెళ్ళిపోయింది.
తెల్లవారి, రాత్రి జరిగింది నిజమా కలా అని యిద్దరికీ ఆశ్చర్యం వేసింది. యాభై ఏళ్ళ ముసలివాణ్ణి నాకట్లాంటి బుద్ధి యెట్లా పుట్టిందని అతనికీ, అతనంతపని చేసివుంటాడా, తన దురూహేమోనని రవణకీ అనిపించింది.
7
వెంకట్రావుగారు ఒస్తున్నారని ఆయన్ని చూడ్డానికి శలవలకి యింటికి వచ్చాడు గోపాల్రావు. లేకపోతే యామైనాసరే ఒచ్చేవాడు కాడు. వెంకట్రావుగారుండడం వల్ల గోపాల్రావుకి గౌరవ యెక్కువయింది. ఒకరోజు వెంకట్రావు గారితో గోపాల్రావు తనకు తటస్థించిన కష్టాలూ, అవమానాలూ చెప్పుకున్నాడు. ఆ యెండాకాలపు శలవలంతా గోపాల్రావుని తనతో తీసికెడతానన్నాడాయన.
ఒకరోజు మధ్యాహ్నం కాఫీయిస్తోండగా వెంకట్రావు రవణతో "ఏమమ్మాయ్, మీ ఆయన్ని నాతో తీసుకెడుతున్నాను" అన్నాడు.
రవణ చిరునవ్వు నవ్వింది.
"నా మీద కోపం లేదు కద?"
"ఏ వూరు వెడతారు."
"బందరు.