ఆరోజు లభ్యమయిన అవకాశాన్ని జారవిడవద్దని అతని మనసు గట్టిగా హెచ్చరిస్తుంది. కాని ఏదో బెరుకు! ఏం చెయ్యాలీ, ఎలా మొదలు పెట్టాలీ తేల్చుకోలేని అయోమయంతో అతనికి చెమటలు పడుతున్నాయి. యింతకీ ఆమె మనసులో ఏముందో! అనవసరంగా తొందరపడితే, ఆమె ఉద్దేశం మరోటయితే అసలుకే మోసం రావచ్చు.
కానీ ఏకాంతం! సాన్నిహిత్యం! యింతకన్న యేది కావాలి! ఆమె ఎంత తెగించిందయినా చొరవగా ఎలా చెప్తుంది. ఇంతవారుండగా ఇలా తనమీద వ్రాలినట్టు ఎందుకు కూర్చుంటుంది! యింతకంటే స్పష్టంగా ఏం చెప్పాలి.
యాంత్రికంగా కారు నడుపుతున్న స్వామి మనసు, శరీరం ఆమె కోసమే పరితపిస్తున్నాయి. ఆమె మనసు ఏదన్నా సంకేతం ద్వారా తెలుసుకోవాలి! యెలా యెలా! స్వామి ఆలోచనలు కారు కన్నా వేగంగా పరిగెత్తుతున్నాయి.
రమాదేవి చల్లగాలి తగలగానే కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు అలసటగా వున్నా యిదివరకటి కంటే యిప్పుడు కాంతి పుంజుకున్నాయి అతని వంక నవ్వుతూ చూసింది.
"యిందాక ఏమిటో , కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్టు, తల తిరిగి పోతున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఫరవాలేదు. కాస్త చల్లగాలి తగలగానే హాయిగా వుంది. ఐ ఫీల్ బెటర్ నౌ" అంది.
"కాసేపు విశ్రాంతి తీసుకోండి. అలాగే పడుకుని" నవ్వి అన్నాడు స్వామి.
కొద్దిసేపు నిశ్శబ్దం! రమాదేవి బ్యాగు తెరచి రుమాలుతో మొహం తుడుచుకుంది. పౌడ రద్దుకుంది. ఎగిరిపోతున్న జుట్టుని స్కార్ఫ్ తో బంధించింది. ఎందుకో ఈ ముస్తాబని ఊహిస్తున్న కుమారస్వామిని ఏదో తీయని ఊహ, అంటీ అంటని ఆమె శరీరం లాగ పులకింపచేసింది.
ఎంతసేపు ఈ సస్పెన్సు! ఏదో జరగాల్సింది జరగకుండా, వృధా కాలయాపన చేస్తున్నట్లు బాధగా వుందతనికి. రమాదేవి దూరం, దగ్గరా కాని స్థితిలో కూర్చోక ఏదన్నా చొరవ చూపిస్తే ఎంత బాగుణ్ణు! కొద్దిపాటి ఆసరా కలిగిస్తే చాలు, యింక మిగతా బాధ్యత తనది! ఏదో చిరాకు కలగసాగింది. తనే ఆ చొరవ చూపిస్తే.....ఏం చేస్తుంది?....ఏం చెయ్యగలదు?
పరధ్యానంగా వున్న కుమారస్వామి ప్రక్క నించి అడ్డంగా గేద రావడం గమనించనే లేదు. గమనించిన రమాదేవి చివరి క్షణంలో 'కుమార్' అని గట్టిగా అరవడం మాత్రం చేయగల్గింది. స్వామి స్టీరింగ్ ప్రక్కకి త్రిప్పి సడన్ బ్రేక్ వేశాడు. కారు రోడ్డుకి అడ్డంగా తిరిగి ఒక్క కుదుపుతో ఆగింది, గాభరాపడిన గేదె ఒక్క గెంతు గెంతి కారుమడ్ గార్డుని వచ్చి డీ కొని అంతదూరం ఎగిరి దుమికింది. గేదె మాటేమైనా, రమాదేవి తల డాష్ బోర్డుకి తగిలి వెనక్కి పడ్డంలోఅతని వడిలోకి వాలింది.
కుమారస్వామికి ఆ వొక్క క్షణంలో జరిగిందేమిటో అప్పటికీ అర్ధం కాలేదు.....కానీ, వొడిలో అదుటునపడ్డ రమాదేవి మాత్రమే ఆ క్షణంలో కంటికి, మనసుకి అనింది. నల్లటి చిన్న చిన్న ముంగురులు కప్పిన తెల్లటి మెడ, గులాబి రంగు నడుం అతన్ని కవ్వించాయి. ఆవేశంగా తల వంచి మెడ దగ్గిర ముద్దాడాడు. నడుం చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరగా అదుముకున్నాడు అంతా అరనిమిషం.
ఆ స్పర్శకి రమాదేవి చివుక్కున లేచి కూర్చుంది. అతనివంక అదోలా చూసింది. ఆమె పెదాలు అదిరాయి.
"యూ....యూ...." ఏదో అనాలని అనలేకపోయింది. కుమారస్వామి కెక్కడ లేని చొరవ, ధైర్యం వచ్చాయి. ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గిరగా లాక్కున్నాడు. అతని మొహంలోకి చూస్తూ ఆమె అచేతనంగా ఉండిపోయింది. కుమారస్వామి ఆమె చెంపల్ని చేత్తో మెల్లిగా రాశాడు బుజ్జగిస్తున్నట్టు.
మరు నిమిషంలో ఆమె అతని చేతుల్ని తీసి తన సీట్లో కూర్చుని రెండు చేతుల్తో మొగం కప్పుకుని ముందుకు వంగింది. ఆమె ఏడుస్తుందని వణికే తల సన్నని స్వరాలు తెలుపుతున్నాయి.
స్వామి చకితుడయ్యాడు! అతని ఉద్రేకం చల్లారి, ఆమెని గాయపరచానన్న ఆవేదన పట్టుకుంది. ఏం చెయ్యాలో, ఆమెని ఎమడగాలో ఎలా ఓదార్చాలో , ఏమనాలో, ఏమనగూడదో, క్షమార్పణ చెప్పుకోవాలో అక్కరలేదో -- అంతా అయోమయంగా వుందతనికి.
"రమాదేవిగారూ" మెల్లిగా పిల్చాడు.
ఆమె మాట్లాడలేదు.
"క్షమించండి.....నావల్ల పొరపాటు జరిగింది....ఎక్సుజ్ మీ..." వణికే గొంతుతో మెల్లిగా అన్నాడు.
ఆమె మాట్లాడకుండా లేచి తిన్నగా కూర్చుంది. రుమాల్తో కళ్ళు తుడుచుకుంది. అతని వంక వొక్క క్షణం చూసింది. అంతలోనే ఏం జరగనట్టు చిన్నగా నవ్వింది.
"అబ్బ! ఏం గాభరా పెట్టావు. యింకాస్త వుంటే యివాళ పెద్ద ఏక్సిడెంట్ అయి వుండేది. అంత పరధ్యానం అయితే ఎలా.....చూడు కాటుకేమన్నా అయిందేమో' ఇంతసేపూ ఆ ఏడుపు, దుఃఖం అంతా ఏక్సిడెంట్ గురించే అన్నంత మాములుగా మాట్లాడింది. స్వామి తెల్లపోయాడు. ఆవిడ అజ్ఞ శిరసావహించి దిగివెళ్ళి చూశాడు. గేదె తాకిడికి మిడ్ గార్డ్ కాస్త వంకరయి లోత్తపడింది. అదే చెప్పాడు. అదోరకంగా భయపడుతూ. ఖరీదయిన కారు తన ధర్మమా అని పాడయింది.
"ఊ.....కానీ, ఏం చేస్తాం.....యివాళ రోజు మంచిది కాదు! ఉదయం నించీ అన్నీ అస్తావిస్తంగానే జరుగుతున్నాయి.'
కారు వెనక్కి తిరిగి బయలుదేరింది. యీసారి రామాదేవే స్టీరింగ్ ముందు కూర్చుంది. బాగా చీకటి పడింది. చాలా సీరియస్ గా ఏభై మైళ్ళ స్పీడ్ తో నడుపుతున్న రమాదేవిని పలకరించే సాహసం చెయ్యలేక పోయాడు కుమారస్వామి. చీకటిలో ఆమె మొహంలో హావభావాలు అర్ధమవడం లేదు.
అతనిలో రకరకాల ఆలోచనలు ముసురుతున్నాయి. ఆమె తన ప్రవర్తనకి బాధపడిందా! బాధపడితే తర్వాత మాములుగా నవ్వుతూ ఎందుకు మాట్లాడుతుంది! అసలు అంత ఇష్టం లేనిదయితే తనకంత దగ్గిరగా మీదపడినట్టు ఎందుకు కూర్చుంటుంది! ఆ యేడుపు ఎందుకు? తను ఆఖరి క్షణంలో వెనకాడ్డం వల్ల. ఆమె ఆలోచన కొనసాగక, పతివ్రతన్నట్టు తనకి భావం కలగజేయ్యాలని -----ప్రయత్నమా? ఆ కన్నీరు నటనా? లేక ఆ నవ్వు నటనా? ఎన్నో రకాల అనుమానాలు, ఆలోచనలు అతని మనసుని కలత బెట్టాయి.
ఊళ్ళోకి రాగానే నీలాన్ లైట్ల వెలుగులో దొంగతనంగా రామాదేవి మొగం పరిశీలించాడు. ఆమె ఎటూ చూడ్డం లేదు. ఎదుటి రోడ్డు కేసి స్థిరంగా దృష్టి నిల్పింది. మొహం నిశ్చలంగా వుంది. అది కఠినతా, కోపమా అన్న అనుమానం కుమారస్వామికి కలిగింది. తన ప్రవర్తనే ఆమె ఆవేశానికి కారణమా అన్న ఆలోచన అతన్ని కొద్దిగా కించపరచింది.
హటాత్తుగా కారాగింది. చూస్తె "ఇడీస్' బార్ ముందు ఆగింది కారు. రమాదేవి ఏం చెప్పకుండానే కారు దిగి లోపలికి వెళ్ళింది గబగబ. మరో రెండు నిముషాల లోపునే తిరిగి వచ్చింది. ఆమె వెనకే వొక వెయిటర్ ఏవో బాటిల్సు తెచ్చి వెనక సీట్లో పెట్టాడు.
యింటి ముందు కారగగానే డ్రైవరు ముందుకొచ్చి సెల్యూట్ చేసి తలుపు తెరిచాడు. ఆమె కారు దిగి తాళాలిచ్చింది.
"వెనక సీట్లో వున్నాయి. పైకి పట్టుకురా" అంటూ , కుమారస్వామి లేనట్టే గబగబ లోపలికి వెళ్ళిపోయింది. అవమానంతో తల కొట్టేసినట్లయింది స్వామికి. కనీసం 'గుడ్ నైట్' అన్నా చెప్పకుండా , పిలిచి కార్లో ఎక్కించుకుని త్రిప్పిన ఆమె అంత నిర్లక్ష్యంగా తను లేనట్టే వెళ్ళిపోతుందా? ఆ సాయంకాలం అతను జీవితంలో ఎన్నడూ మరిచిపోలేడు.
అనుకున్నది వొకటి . అయిందింకొకటి. తలక్రిందులయివ్యవహారం. యింక తనతో మాట్లాడాడు కాబోలు! తొందరపడ్డాడెమో! మిగతావాళ్ళతో కూడా ఆమె యింక మాట్లాడకపోతే ఆ ముగ్గురు తనవంక ద్రోహి అన్నట్టు చూస్తారు! రాసికత్వానికి పొతే ఉన్న స్నేహం పోయేట్టుంది."