Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 26


    చిత్రమైన మనిషి"
    "మాడర్న్ ఆర్ట్ అన్నా అర్ధం చేసుకోవచ్చు గాని.....యీ రామాదేవి మనస్తత్వం ఏమిటో అర్ధం కావడం లేదు."
    "దానికేముంది ! చేసేవి గంగా స్నానాలు.....అనే సామెత ఒకటుందిగా"
    "ఒరేయ్ స్వామీ, మరీ అంత అసహ్యంగా మాట్లాడకు, ఆమె ఎలాంటిదో , ఎందుకలా చేస్తుందో మనకేం తెలుసు?"
    "నాన్సెన్స్ ! ఇంతకన్నా యింకేం తెలియాలి? రోజూ చూడ్డం లేదా?"
    "నిన్నెప్పుడూ ఎక్కడికీ పిలవలేదనేనా యీ అభాండా లావిడ మీద?" యీసారి వుడికించడం వెంకట్రావు వంతయింది.
    "ఏడిశావ్! నాక్కావాలంటే ఊళ్ళో లక్షమంది ఉన్నారు. ఈ ముసిల్దాని వెనకాలబడాల్సిన ఖర్మేం పట్టలేదు."
    "ద్రాక్షపళ్ళు పుల్లగా వుంటాయట , అప్పుడప్పుడు" నవ్వాడు వెంకట్రావు.
    "ముసిల్దా . మహా వుంటే ముప్పై మూడో నాలుగో వుంటాయి. అంతే! ఆ అందం, చందం, నునుపు, చలాకీతనం పదహారేళ్ళ పిల్లకి కూడా వుండవు"
    "అసలు రోమాన్స్ అన్నది టీనేజ్ గరల్స్ కేం తెలుస్తుందోయ్. సిగ్గుతో మూడుచుకుపోతారు తప్ప శృంగారం కావాలంటే ప్రౌడలే బెస్టు అన్నాడు భార్త్రుహరో , మరోడో"
    "శృంగార పాఠాలు బాగానే వంటబట్టించినట్టుంది!"
    "వేళాకోళం గాదు గాని. నిజంగా ఆమెలో ఏదో బాధ అణిగివుందనిపిస్తుంది. ఆ బాధ మరచిపోవడానికి ఆమె అడ్డమైన వాళ్లతో విచ్చలవిడిగా తిరిగి కాలయాపన చేస్తుంది. కాని అలా తిరగడంలో ఆమెకు నిజమైన ఊరట కలగడం లేదు. ఆమెలో అశాంతి మరింత ఎక్కువవుతుంది. అన్నిట్నీ మరచిపోవాలని కఠోర సత్యాలనించి పారిపోవాలని ఆమె చేసే ప్రయత్నాలు నిజంగా ఆమెకి బాధనించి విముక్తి కలిగించడం అటుంచి ఆమెలో ఘర్షణ లేపుతుంది. దాని పరిణామమే ఆమె చేసే పూజలు పునస్కారాలు....." సారధి ఆమె మనస్తత్వాన్ని తనర్ధం చేసుకున్నంత వరకు మిగతా వాళ్ళకి వివరించబోయాడు.
    'చప్పట్లు కొట్టండోయ్.....కవి కుమారుడు. కధానాయిక శీల పరిశీలన చేస్తున్నాడు......"చప్పట్లు కొడుతూ అన్నాడు స్వామి వెంకట్రావు శర్మ నవ్వారు.
    "అవిడెం చేస్తే మన కెందుకురా! మనం బ్రహ్మచారులం! ఆవిడ మనలాగే వంటరిది. మన మామె స్నేహాన్ని వాంచించాం . ఆమె తనంతట తానుగా మనకి స్నేహితురాలైంది. హాయిగా కార్లో త్రిప్పుతుంది. శుభ్రంగా డిన్నర్లు, పార్టీలు యిస్తుంది. కాలక్షేపానికి లోటు లేదు. ఇంత కన్న యింకేం కావాలి? ఆవిడ గొడవలు మనమెందుకు పట్టించుకోవడం?" వెంకట్రావు.
    "నేనూ అదే అనేది. ఆమె మనకన్నా పెద్దది! మన అంతస్తు కన్న పై అంతస్తుది! ఏదో బాధలో వున్నట్టు కనిపిస్తుంది. మనకు చాతనయితే సహాయం చెయ్యగలిగితే చెయ్యాలి. లేకపోతే వూరుకోవాలి. అంతేగాని యీ విమర్శలెందుకు?" శర్మ బుద్ధిమంతుడు.
    వాళ్ళ నలుగురి మనస్తత్వాలు వేరు, దృక్పదాలు వేరు. శర్మది ధార్మికదృష్టి అయితే, సారధిది కళాకారుడి దృష్టి! కుమారస్వామికి ఎలాగైనా ఆమె కావాలి! వెంకట్రావుకి దొరికితే అభ్యంతరం లేదు కాని దొరక్కపోయినా బాధలేదు.
    కాలం గడచినకొద్ది రమాదేవి వాళ్ళలో చిన్నచిన్న కలతలకి కూడా కారణమయ్యేది. స్వామి ఏవో మాటలు ఆమెని గురించి అనేవాడు. అది సారధికి , శర్మకి కోపం తెప్పించేవి. ముఖ్యంగా శర్మకి.
    కాని రమాదేవి అందరిని సమంగానే చూసేది! అందరితో చనువుగా మాట్లాడేది. అభిమానంగా టీలకి', కాఫీలకి , భోజనాలకి ఆహ్వానించేది! ఆమె ఎదుట అందరు సభ్య సంస్కారాలు మూర్తీభవించినట్లు నడుచు కుంటారు. మాట్లాడుతారు. అయితే కొందరిలో అది స్వభావికం. అయితే, కొందరిలో అది నటన మాత్రమే!

                                               *    *    *    *

    ఆరోజు ------
    రమాదేవి వంటరిగా కారులో వెడుతుంది. టాంక్ బండ్ మీద మెత్తగా మెల్లగా పాములాగా ప్రాకుతుంది కారు.
    ఆరోజు ఏం కాలక్షేపం కాలేదు రమాదేవికి. ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు. ఎవరింటికి వెళ్ళినా ఎవరూ కనపడలేదు. అలా ఎవరన్నా కనిపిస్తే బాగుండునన్నట్టు నెమ్మదిగా నడుపుతున్న రమాదేవికి టాంక్ బండ్ మీద నెమ్మదిగా నడిచి వస్తున్న కుమారస్వామి కనిపించాడు.
    "హలో! ఎటు వెడుతున్నారు?" కారు ప్రక్కకి తీసి అడిగింది.
    "ఎటూ లేదు, ఊరికే తోచక, అలా".....కాస్త గాభరాగా అన్నాడు స్వామి.
    "అయితే రా....అలా ఎటన్నా వెడదాం."
    కుమారస్వామి కారెక్కాడు , మహాభాగ్యం అన్నట్టు.
    "ఏమిటో యివాళ ఏం తోచడం లేదు, సమ్మె కట్టినట్టు ఎవరింటికి వెళ్ళినా యెవరూ లేరు. క్లబ్బుకి వెడదామంటే బుద్ది పుట్టడం లేదు. అలా దూరంగా ఎక్కడికో పారిపోవాలనిపిస్తుంది" అదోలా వుంది రమాదేవి స్వరం. ఆ నవ్వు పేలవంగా వుంది.
    తలత్రిప్పి రమాదేవి వైపు చూశాడు స్వామి. కళ్ళు కాస్త యెర్రగా ఉన్నాయి ---- నిద్ర చాలనట్తో, కాస్త నిషా ఎక్కువైనట్తో , కళ్ళు బరువుగా అలసటగా వున్నట్టనిపించింది. రాసుకున్న క్రీములు, పౌడర్లు, కళ్ళ క్రింద నల్లచారల్ని దాచలేక పోతున్నాయి.
    మౌనంగా డ్రైవ్ చేస్తుంది రమాదేవి.
    "వంట్లో బాగులేదా ,మీకు?" స్వామి అడిగాడు , ఆ నిశ్శబ్దాన్ని భరించలేక, ఏదో మాటలు కలపాలని.
    "వంట్లో ఏం లేదు, మనసే బాగులేదు"
    "ఏం?" అనడిగే చొరవ చేయలేకపోయాడు కుమారస్వామి. ఆమె ఏమన్న చెప్తుందని ఆశించాడు. కాని ఏం చెప్పలేదు ఆమె.
    ఆమె ధోరణి స్వామికి నిరుత్సాహం కల్గించింది. ఆ ధోరణిలో వున్న ఆమెకి కంపెనీ యివ్వడం స్వామికి ఇష్టం లేదు. అతని స్వభావానికి సెంటిమెంట్స్, మూడ్స్ కుదరవు, ఏ క్షణంలో ఏది వీలయితే అది అనుభవించు .....ఆనందించు అంతవరకే!
    కారు జోరుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ......రేస్ కోర్సు కూడా దాటిపోసాగింది.
    "పోనీ ఏదన్నా సినిమాకి పోదామా, టివోలీ లో మంచి పిక్చరుంది." అడిగాడు కుమారస్వామి.
    "అన్నీ చూడ్డం అయిపొయింది! సారీ.
    ఇంకేం అనాలో తోచక వూరుకున్నాడు స్వామి.
    కొంతదూరం పోయాక స్లో చేసి "తల తిరుగుతున్నట్లుంది అంటూ కళ్ళు మూసుకుని నుదురు రాసుకుంది రమాదేవి.
    "పోనీ నేను డ్రైవ్ చెయ్యనా?" అడిగాడు స్వామి.
    "ఇఫ్ యు డోంట్ మైండ్" ఆమె అంది. సైడికి తీసి కారాపింది. స్వామి దిగి అటునించి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. రమాదేవి కాస్త జరిగి తల వెనక్కి వాల్చింది.
    "ఎటు వెళ్దాం/ ఎక్కడికి?" స్వామి అడిగాడు స్టీరింగ్ పట్టుకుని.
    "ఎటో అటు ! ఎక్కడికైనా సరే! యిల్లు వాకిలి, ఈ మనుష్యులు ప్రపంచం అన్నీ వదిలి పారిపోవాలనుంది ఇవాళ నాకు " కళ్ళు మూసుకుంటూ అంది రమాదేవి.
    రమాదేవికి కుమారస్వామి మధ్య భేదం చాలా తక్కువగా వుంది. స్పీడు హెచ్చింది మలుపులు త్రిప్పి, బ్రేకు వేసి పోతుంటే ఆమె శరీరం అతనికి తగలసాగింది. మెత్తగా, మృదువుగా, ఆమె వాడే సబ్బెమిటో , ఆమె రాసుకునే ఖరీదయిన పౌడరేమిటో , పులుముకున్న విదేశీ సుగంధమేమిటో అన్నీ కలిసి రకరకాల పరిమళాలు స్వామికి మత్తెక్కిస్తున్నాయి. అతని మనసు స్వాధీనం తప్పుతున్నట్టనిపించింది. స్టీరింగు మీద చెయ్యి, యాక్సిలెటర్ మీద కాలు వణుకుతున్నాయి. మధ్యమధ్య కారు గమనం సాగక 'సారీ" చెప్పుకుంటున్నాడు. ఓరకంటితో ప్రక్కన వాలి ఉన్న ఆమె పసిమి శరీరం చూస్తుంటే పిచ్చెక్కుతుంది. స్లీవ్ లెస్ తాలూకు ఆ నున్నటి గులాబి రంగు భుజాలని చేతితో తాకాలన్న ఆవేశాన్ని కోరికని అదుపులో పెట్టుకోడం కష్టమవుతుంది.

 Previous Page Next Page