"రాజీ,
ఇంట్లో ఎవరూ లేని సమయంలో నీ ఉత్తరం నాకు అందింది. మా ఇంటిపక్కన ఓ పాప ఉందని చెప్పాను కదా! ఆ పాప నా పరిస్థితి అంతా గమనించి వాళ్ళింట్లో చెప్పినట్లుంది. ఆ పాప అన్నయ్య అత్తయ్యా వాళ్ళందరూ పెళ్ళికెళ్ళిన విషయం తెలుసుకుని నా దగ్గరకొచ్చాడు. "నేను మీ తమ్ముడిననుకోండి! మిమ్మల్ని ఆ రాక్షసులు పెడుతున్న బాధలన్నీ నాకు తెలుసు! మీకేమయినా సహాయం కావాలంటే నాకు చెప్పండి! రెండో కంటికి తెలీకుండా చేస్తాను" అని చెప్పాడు.
అంతటి సానుభూతి ముక్కూముఖం తెలీని వ్యక్తి నుంచి లభించేసరికి ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది.
"నాకేమీ అక్ఖర్లేదు. దయచేసి వెళ్ళిపోండి" అన్నాను. అతను వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే పోస్ట్ మెన్ నీ లెటర్ ఇచ్చాడు. నన్ను ఈ సంసారం వదిలి మనింటికి శాశ్వతంగా వచ్చేయమని రాశావు. కానీ అది అంత తేలికయిన పనా రాజీ? కష్టమో , నష్టమో భర్త దగ్గరపడి వుండే ఆడదానికే గౌరవం లభిస్తుందీ సమాజంలో. భర్తనొదిలిన ఆడదాని పరిస్థితి ఎలా వుంటుందో, ఆమెను ఎంత హీనంగా చూస్తారో నీకు తెలీదూ? మన చిన్నప్పుడు ఆచార్యులగారింట్లో వుండే సుందరి నీకు గుర్తుందా? ఆమె భర్తను వదిలేసిందనే అందరూ - అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళు వదినలు, మరదళ్ళు అడుగడుగుకీ అవమాన పరుస్తూండేవారు. నాకూ అలా జరుగుతుందని కాదు. మీరందరూ నన్ను ప్రేమగానే చూడవచ్చు. అయినా అది వాంఛనీయం కాదని అనిపిస్తోంది. ఇంకేం రాయను?"
"రాజీ,
నీ పెళ్ళి అయిపోయి ఇవాళ్టికి పదిరోజులయింది కదూ! నేనంత దురదృష్టవంతురాలినో చూడు! సొంత చేల్లిలి పెళ్ళికి రాలేకపోయాను. నన్ను పెళ్ళికి తీసుకెళ్ళడానికని నాన్న ఇక్కడి కొచ్చినప్పుడు మా వాళ్ళు చేసిన రభస అంతా నాన్న ద్వారా మీకు తెలిసే వుంటుంది.
ఇప్పుడు నా అవతారం ఎలా వుందో తెలుసా? నా ఫోటో ఒకటి తీసి పంపించాలని ఉంది. తలకి కట్టు, బొమికలు కనిపించే శరీరం, గుంటలు పడిపోయిన కళ్ళూ - రాజీ! నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా క్లాస్ పిల్లలతో ఎక్స్ కర్షన్ కి వెళ్లాను గుర్తుందా? అక్కడ నేనూ, అరుణా కలిసి ఓ ఫోటో దిగాము! అది మన ఆల్బమ్ లో ఉందనుకుంటాను. ఆ ఫోటో పక్కనే ఇప్పటి ఫోటో పెడితే భలే తమాషాగా ఉంటుందిలే! కానీ ఇప్పుడు నా ముఖానికి నన్నెవరు ఫోటో తీస్తారు?
మీ ఆయన గురించి అన్నీ తెలుసుకునే పెళ్ళి చేసుకుంటున్నానని ఉత్తరంలో రాశావు! నిజంగా ఎంత అదృష్టమే నీది! పోనీలే! నా జీవితం ఎలాగూ నాశనమయింది! కానీ నా జీవితం ఓ చక్కని నీతికథ నేర్పి నీ జీవితాన్ని బాగుచేసింది కదా! అంతేచాలు. నువ్వు రాసే ఉత్తరాలు నాకెలా అందుతున్నాయా అని ఆశ్చర్యంగా వుందికదూ? పాపం - ఆ పక్కింటి పాప వాళ్ళన్నయ్య - పోస్ట్ మన్ దగ్గర్నుంచి నా పేరున ఉన్న ఉత్తరం తీసుకుని పాపద్వారా నాకు చేరేలా చేస్తున్నాడు. నిజంగా ఇదెంత గొప్ప సహాయమో కదూ? నాకు జీవితంలో ఆసక్తి కలిగించే విషయాలు రెండే రెండు మిగిలాయ్! నీ ఉత్తరాలు చదవడం, నీకు ఉత్తరాలు రాయడం! ఈ రెండు కూడా దక్కకపోతే నేనేమయిపోతానో నాకే తెలీదు..."
"రాజీ,
నీ ఉత్తరం చూస్తే నాకు ఏడుపొచ్చింది. ఎందుకంత ప్రేమ నా మీద నీకు? నేను నీకోసం ఏం చేశాననీ? నా బాధలన్నీ వెళ్ళగక్కి నీ మనశ్శాంతి కరువు చేస్తున్న దానిని! నా తల బాండేజీ కథేముంది?! నా మీద అనుమానంగా ఉందిట ఆయనకు. అందుకని తల పగులగొట్టారు. "అనుమానం" అంటే అర్థమయింది కదూ! నా "శీలం" మీద అనుమానం అన్నమాట! పక్కింటిపాప వాళ్ళన్నయ్య పోస్ట్ మన్ దగ్గర తీసుకున్న ఉత్తరం పాపద్వారా నాకు పంపించటం అత్తయ్య చూసిందట! "వాడికీ నీకు సంబంధం ఉంది" అంటూ నానా గొడవ చేసింది. చీపురుతో కొట్టింది. అక్కడికీ కసితీరక ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక చెప్పింది. అక్కడి నుంచి రాత్రి పదింటివరకూ ఆయన చేతిలో గొడ్డులా దెబ్బలు తిన్నాను. రాత్రి పదింటికి "మీ ఇంటికి పో! ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో వుండటానికి వీల్లేదని" బయటకు గెంటారు. రాత్రంతా బయటే జాగారం చేశాను.
సరే ఆ గొడవంతా ఎందుకులే ఇప్పుడు!
నాకు మంచిరోజులు రాబోతున్నాయ్. ఆశ్చర్యపోతున్నావ్ కదూ? అబద్ధం కాదే! నిజమే! ఆయన వాళ్ళఫీసులోని అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నారు. వచ్చేవారమే పెళ్ళి అనుకుంటాను. నాకు పిల్లలు పుట్టకపోవడం వల్ల - మరో స్త్రీని వివాహం చేసుకోడానికి నేనే అనుమతి పత్రం రాసిచ్చాను. నాకు ఇంక పిల్లలు పుట్టరని డాక్టర్ సర్టిఫికెట్ రాసిచ్చాడట! నాలుగుసార్లు నేను గర్భవతినయితే ఎందుకు గర్భస్రావం చేయించారో ఇప్పుడు అర్థమైంది నాకు! ఇంక ఉంటాను- జ్వరం పూర్తిగా తగ్గడం లేదు...."
"రాజీ,
నువ్విచ్చిన కొత్త అడ్రస్ కే ఈ ఉత్తరం రాస్తున్నాను. కొత్త సంసారం ఎలా ఉంది? నాకు మంచిరోజులొచ్చాయని సంబరపడ్డాను కదా, అవి కాస్తా వెనక్కుపోయాయ్ మళ్ళీ! అవి కాస్తా వెనక్కు పోయాయ్! రాజీ - నువ్విచ్చిన కొత్త అడ్రస్ కే ఈ ఉత్తరం రాస్తున్నాను. కొత్త సంసారం ఎలా వుంది! కొత్త సంసారం ఎలావుంది! నువ్విచ్చిన కొత్త అడ్రస్ కె ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్విచ్చిన కొత్త అడ్రస్ కె ఈ ఉత్తరం రాస్తున్నాను. కొత్త సంసారం...
"రాజీ,
చాలా రోజులయింది నీకు లెటర్ రాసి! కవరు దొరకలేదు రాద్దా..
చాలా రోజులయింది నీకు లెటర్ రాసి! కవరు దొరకలేదు రాద్దామంటే! నన్ను పుట్టింటికి పొమ్మని రోజూ వేధిస్తున్నారు. కొడుతున్నారు. అయినా నేను మొండికేశాను. నా శరీరం నాది కాదనుకున్నాను. ఆయన వాళ్ళాఫీసు అమ్మాయిని చేసుకుందామనుకున్న పెళ్ళి కాన్సిలయింది. నాతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటేగాని పెళ్ళికి వప్పుకోనని ఆ అమ్మాయి చెప్పిందట! అందుకని నన్ను గెంటెయ్యాలని ప్రయత్నం! చూద్దాం! ఎవరు గెలుస్తారో! నేను చిన్నప్పుడు మా స్కూల్ గేమ్స్ లో అందరినీ ఓడించి ఫస్ట్ రాలేదూ? మన రేడియో మీద వాళ్ళిచ్చిన షీల్డ్ కూడా ఉంది కదా! మరిక్కడ మాత్రం గెలవలేనంటావా? రాజీ! వాళ్ళు కొట్టే దెబ్బలు లెఖ్ఖచేయడం ఏనాడో మానేశాను గానీ, అందరూ నేనో వ్యభిచారిణిని కాదని ఋజువు చేసుకోవాలన్న కోరిక రోజురోజుకీ పెరిగిపోతోంది! కానీ ఎలా? చుట్టుప్రక్కల వాళ్ళందరూ ఆ ప్రచారం నమ్మడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. ఆ కారణం చూపి - నన్ను వదిలించుకోవచ్చని లాయరు చెప్పాడట ఆయనకు..."
"రాజీ,
ఇది నా ఆఖరి ఉత్తరం! నా పరిస్థితి నాకే అసహ్యం కలిగిస్తోంది. ఈ జీవితం ఇంక గడపలేను. ఎదిరించి పోరాడనూలేను! అలుపు వచ్చేసింది. ఎందుకో తెలుసా? ఎన్నయినా సహించగలను! ఎలాంటి హింసనయినా భరించగలను. కాని నేను శీలవతిని కాదు అన్న ముద్రతో నన్ను ఇంటినుంచి గెంటబోతున్నారన్న విషయం నా మొండితనాన్ని పూర్తిగా హరించివేసింది. ఆడదానికి ఇంతకంటె అవమానం ఇంకేమయినా ఉంటుందా? ఇంతకంటె దురదృష్టం ఇంకేమయినా ఉంటుందా? అపనిందనుంచి బయటపడాలంటే ఒక ఒకే ఒక్క మార్గం మిగిలి ఉంది! ఇలాంటి పిరికిపని చేస్తున్నందుకు నువ్వు నన్ను హేళన చేయవచ్చు.